Nov 12, 2018


ప్రజల నుంచి అవార్డులు రావాలి

వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమైన మంత్రులు ఫరూక్, శ్రావణ్
             
             సచివాలయం, నవంబర్ 12 : ప్రజల నుంచి అవార్డులు వచ్చేవిధంగా మన పనివిధానం ఉండాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల సిబ్బందిని మంత్రి ఫరూక్ ఆదేశించారు. సచివాలయం 5వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం వైద్యవిద్య, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ వైద్య సేవ, ఏపీ మెడ్ టెక్ జోన్, ఆహారభద్రత, మైనార్టీ సంక్షేమం, సాధికారత  శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ప్రాధమిక వైద్యం, కుటుంబ సంక్షేమ, ఏపీ వైద్యవిధాన పరిషత్, ఆయుష్, మందుల నియంత్రణ, గిరిజన సంక్షేమం, సాధికారిత శాఖల మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ లు ఆయా శాఖ సిబ్బందితో మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఇద్దరు మంత్రులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.  అధికారులు ముందుగా తమను పరిచయం చేసుకొని తమతమ విభాగాలలోని పరిస్థితులను మంత్రులకు వివరించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల వివరాలు, డయాలసిస్ సెంటర్లు,  అంటువ్యాధులు సోకకుండా తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ పథకాలు, స్వైన్ ఫ్లూ, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల సోకడానికి కారణాలు, నివారణకు తీసుకుంటున్న చర్యలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, గ్రామాలు, పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల వివరాలు తెలిపారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 19 గైనిక్ యూనిట్లు నెలకొల్పినట్లు చెప్పారు. వైద్యశాఖలోని పోస్టుల భర్తీ, కర్నూలులో కేన్సర్ సెంటర్ నిర్మాణం, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం గురించి వివరించారు. ఎన్టీఆర్ వైద్య సేవ, గిరిజన ప్రాంతాల్లో అందించే వైద్యసేవల గురించి తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిస్సా రాష్ట్రాల ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల ఆయా సరిహద్దు జిల్లాల్లో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకుతున్నట్లు వివరించారు.  
                  ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తాను గతంలో  వివిధ శాఖలకు మంత్రిగా ఉన్నానని, అయితే వైద్య ఆరోగ్య శాఖ తనకు కొత్తని చెప్పారు. ప్రజారోగ్యం పేదలకు అందుబాటులో ఉండాలని, అందరం కలసికట్టుగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకువద్దామన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు జాతీయ అవార్డు వచ్చిందని చెప్పినప్పుడు అధికారులను, సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రజల నుంచి అవార్డు పొందేవిధంగా పనిచేయాలన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖకు బడ్జెట్ కు కొదవలేదని, రూ.8వేల కోట్ల బడ్జెట్ ఉందని తెలిపారు. అంటువ్యాధులు సోకకుండా ఉండటానికి పారిశుధ్యం చాలా ముఖ్యమని చెప్పారు. మునిసిపల్ శాఖ సహకారంతో ప్రజలలో అవగాహన కలిగించి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చిన్న వయసులో పెద్ద బాధ్యతలు
             ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు చిన్న వయసులో పెద్ద బాధ్యతలు అప్పగించారని మంత్రి శ్రావణ్ కుమార్ చెప్పారు. తనకు తోడుగా అనుభవం ఉన్న సీనియర్ మంత్రి ఉన్నారన్నారు. శాఖలో సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తాము ప్రజలలోకి వెళ్లగానే ముందుగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల గురించి అడుగుతారన్నారు. వాటి నివారణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.  రెండు మూడు రోజులు జ్వరం ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలను కోరారు. మనందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలమేనని, ఆరోగ్య భద్రత కోసం అందరం కలసి పనిచేద్దామని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు మన రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్లు, అందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది పనితీరుని మంత్రి ప్రశంసించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...