Nov 14, 2018


పట్టణాలలో సామాజిక, ఆర్థికాభివృద్ధి
పట్టణ మౌలిక వసతుల కల్పన, నిర్వహణపై సీఎస్ సమీక్ష
              సచివాలయం, నవంబర్ 14: నగరాలు, పట్టణాలలో సామాజిక, ఆర్థికాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని మౌలిక వసతులను కల్పించి, నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ లోని తన చాంబర్ లో బుధవారం సాయంత్రం ఏపీ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్ మెంట్ చేపట్టిన పనుల ప్రగతిని ఆయన  సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మధ్యతరహా పట్టణాలు సమ్మిళిత అభివృద్ధి సాధించేవిధంగా ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోని లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్కుల వంటి వాటిని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేవిధంగా రోడ్లు, రవాణా సదుపాయాలు కల్పించాలన్నారు. విజయవాడ వంటి చోట్ల ప్రజలకు పార్కుల వంటివి లేవన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పార్కింగ్ సౌకర్యంలేదని చెప్పారు. వీటన్నిటిని దృష్టిలోపెట్టుకొని జనాభా ప్రాతిపదికన మౌలికసదుపాయాలు, వినోద ప్రదేశాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆటవిడుపుకు, వినోదానికి అనువైన విధంగా విస్తృతంగా పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. వాటి ద్వారా రోజువారీ ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పారు. కొన్ని చిన్నచిన్న అంశాల ద్వారా కూడా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు కూడా మెరుగై ప్రజల సామాజికాభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. 1985 ప్రాంతంలో విశాఖలోని బీచ్ వద్ద రాత్రి 7 గంటలు దాటితే పెద్దగా జనం తిరిగేవారు కాదని, అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో ఇప్పుడు రాత్రి 10 గంటలు దాటినా సందడిగా ఉంటుందని సీఎస్ చెప్పారు.
            అధికారులు వివిధ పట్టణాలలో చేపట్టిన పనులను సీఎస్ కు వివరించారు. జక్కంపూడి ప్రాజెక్ట్, పైప్ లైన్ల నిర్మాణం, ఒంగోలులో చేపట్టవలసిన పనులు, విశాఖ కార్పోరేషన్, మధురవాడలలో, శ్రీశైలంలో చేపట్టిన పనులు వివరించారు. కొన్ని ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని, మరికొన్ని టెండర్ల దశ పూర్తి అయిందని వివరించారు. శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం వంటి స్మార్ట్ సిటీలలో చేపట్టే పనుల గురించి వివరించారు. ఎస్ఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు రూ.12వేల కోట్ల పెట్టుబడులతో తిరుపతిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు.
              శ్రీకాకుళంలో రోడ్ల అభివృద్ధి, పట్టణాల సుందరీకరణ, ఆర్ఛిల నిర్మాణం, విజయవాడలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి, పార్కింగ్ సౌకర్యాలు, ఫుడ్ పార్కులు, కంపోస్టింగ్ ప్లాంట్స్ వంటి అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్, ఏపీ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ సీఈఓ ప్రకాష్ గౌర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...