Nov 30, 2018


వారం రోజుల్లో ఇళ్ల లబ్దిదారుల ఎంపిక
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
Ø అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
Ø లబ్దిదారుని ఇంటికే ఆదరణ పరికరాలు
Ø పథకాల యూనిట్లు మార్చుకునే అవకాశం

      సచివాలయం, నవంబర్ 30: ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నిర్మించే ఎన్టీఆర్ గృహ పథకం లబ్దిదారులను వారం రోజులలో ఎంపిక చేయాలని మంత్రులను, జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్ల సెంటర్ సమీపంలోని ప్రజావేదిక వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన 18వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. గృహనిర్మాణ పథకాల సమీక్ష సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాల కింద మొత్తం ఇళ్లు నిర్మాణ లక్ష్యం 19,57,429 కాగా, మంజూరైనవి 13,61,252, పనులు ప్రారంభమైనవి 11,51,465 అని,
పూర్తయినవి 7,20,113 అని గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇల్లు అనేది సెంటిమెంట్ గా  పేర్కొన్నారు. 20 లక్షల ఇళ్లు రూ.80వేల కోట్ల అంచనా వ్యయంతో  నిర్మించాలని చేపట్టిన అతి పెద్ద, చాలా మంచి ప్రాజెక్ట్ ఇదని ఆయన చెప్పారు. ఈ ఇళ్ల నిర్మాణం విషయంలో అధికార యంత్రాంగం బాధ్యత తీసుకోవాన్నారు.  తెలంగాణలో హామీ మేరకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించలేదని అక్కడ ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లను చాలా బాగా నిర్మించారని ఆ శాఖ అధికారులను కొనియాడారు.  ఇప్పటివరకు పూర్తి అయిన గృహ నిర్మాణాలకు సంబంధించి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన లబ్దిదారుల ఎంపిక, వారికి లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ఒక వారం రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లా స్థాయి ఎంపిక కమిటి ద్వారా లబ్దిదారుల ఎంపిక చేయాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్దిదారుల ఎంపికలో చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్లే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారని చెప్పారు. పట్టణ గృహ నిర్మాణంలో మెప్మా మహిళల సహకారం తీసుకుంటున్నారని, అలాగే గ్రామీణ గృహ నిర్మాణంలో సెర్ప్ మహిళల సేవలు వినియోగించుకోవాలన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా ఒకేవిధంగా ఇళ్లు నిర్మించాలని చెప్పారు. ఒకే విధమైన విధానాలను అనుసరించాలన్నారు.   అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించుకున్న అర్హులైన పేదలకు కూడా ప్రభుత్వ సాయం ఒక్కో ఇంటికి రూ. 60 వేలు చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో ప్రభుత్వ అనుమతితో ఇళ్లు నిర్మించుకున్నవారికి రూ. 70 వేలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయంలో  పశ్చిమగోదావరి జిల్లా నమూనాను మిగిలిన జిల్లాలు అనుసరించాలని సీఎం చెప్పారు.
       అధికారులు, సిబ్బంది ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సీఎం హెచ్చరించారు. ఎవరైనా డబ్బు తీసుకుంటే తిరిగి ఇవ్వవలసి ఉంటుదన్నారు. ఇళ్ల కేటాయింపు విషయంలో లబ్దిదారులను వేధిస్తే ఇల్లు తమకు కేటాయించారన్న ఆనందం పోతుందన్నారు. ఇల్లు పొందిన అనందం, సంతృప్తి వారిలో కనిపించాలని చెప్పారు. జాప్యం జరుగకుండా ముందస్తు ప్రణాళికలతో మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. రాజీవ్ స్వగృహ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేయాలని, నిర్మాణం చేపట్టని చోట్ల లబ్దిదారులు చెల్లించిన మొత్తాలను వారికి తిరిగి చెల్లించాలని చెప్పారు.
370 అన్న క్యాంటిన్లు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక్కటి చొప్పున 370 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయమని సీఎం అధికారులను ఆదేశించారు. 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 160 క్యాంటిన్ల ద్వారా  1,29,74,958 మంది లబ్దిపొందుతున్నట్లు పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబు చెప్పారు. అన్న క్యాంటిన్ల కోసం స్థలం ఎంపిక, నిర్మాణం, ఏజన్సీల ఎంపికలలో కూడా ఒకే విధానం అనుసరించాలని ఆదేశించారు. అన్న క్యాంటిన్ల నిర్వహణపై 80.67 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, సంతృప్తి స్థాయి ఇంకా పెరగాని చెప్పారు.

         ఎస్సీ,ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే జగ్జీవన్ జ్యోతి పథకం ద్వారా 4.67 లక్షల ఎస్సీ కుటుంబాలు రూ.38.65 కోట్లు,  50 వేల ఎస్టీ కుటుంబాలు రూ.5.78కోట్లు లబ్ది పొందినట్లు సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. ఈ పథకానికి సంబంధించి ప్రజల సంతృప్తి స్థాయి 67.40 శాతం మాత్రమే ఉందని, ఉచితంగా ఇచ్చే పథకానికి కూడా సంతృప్తి స్థాయి ఇంత తక్కువగా ఉంటే ఎలా అని సీఎం ప్రశ్నించారు. పథకానికి సంబంధించి ప్రచారం నిర్వహించాలని సూచించారు.
           వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సమీక్షలో తమ శాఖ ఆద్వర్యంలో 18 కార్యక్రమాలు చేపట్టినట్లు  ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వివరించారు. అంటువ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నట్లు, శిశు మరణాలు తగ్గినట్లు చెప్పారు. డయాబిటీస్ అదుపునకు ఇండియన్ డయాబెటీస్ అసోసియేషన్ సూచనల మేరకు ఆహారపు అలవాట్లలో మారపు తీసుకురావడానికి పౌరసరఫరాల శాఖతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య అసమానతల సబ్ కమిటీ సమావేశాలు 1403 కేంద్రాలలో మూడు నెలలకు ఒకసారి జరుగుతున్నట్లు చెప్పారు. డిజి అప్లికేషన్ లో ఏఎన్ఎంలకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఆస్పత్రులలో మానసిక వైద్యులను నియమించడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. డిసెంబర్ 1 నుంచి పలకరింపు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పేదలకు వైద్యసేవల్లో సంతృప్తిస్థాయి పెరగాలని, అన్ని జిల్లాలలో 85 శాతం సంతృప్తి రావాలని అన్నారు. 108సేవలు, ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలు,సంచార చికిత్స,తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్, అన్ని పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి పెరగాలని చెప్పారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రయాణంలో డ్రైవర్ల ప్రవర్తన బాగాలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, అది మంచి పద్ధతి కాదని, సిబ్బంది మర్యాదగా వ్యవహరించి, గౌరవంగా మెలగాలన్నారు. డాక్లర్లు అందుబాటులో లేరని, మందుల కొరత ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని, ఎప్పటికప్పుడు ఆర్టీజిఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నామని, వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బంది పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.  సర్వీస్ ప్రొవైడర్ల సేవలను నిశితంగా పర్యవేక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని, దశలవారీగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామన్నారు.  వైద్యశాఖ మౌలిక వసతుల సంస్థ ఆధ్వర్యంలో ఆసుపత్రులలో సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. న్యూట్రీ గార్డెన్లను అభివృద్ది చేసే బాధ్యతను అవుట్ సోర్సింగ్ ఇచ్చి పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీ ప్రత్యేకాధికారులకు అప్పగించాలని సీఎం చెప్పారు.
         అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటులో దేశంలో మన రాష్ట్రం కేరళ తరువాత 2వ స్థానంలో నిలించిదని, కేరళను కూడా మించిపోవాలన్నారు.  3035 డిజిటల్ క్లాస్ రూమ్ లు నిర్మించామని,  ఈ ఏడాది డిజిటల్ క్లాస్ రూముల లక్ష్యం 645 అని,  వచ్చే ఏడాది 1320 నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.  6,285 పాఠశాలల్లో ప్రహరీగోడలు నిర్మించవలసి ఉండగా, 2,414 పాఠశాలల్లో పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. విశాఖ, అనంతపురం, కడప జిల్లాల్లో  ప్రహరీగోడల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. చిత్తూరు, గోదావరి జిల్లాలలో 99 శాతం పాఠశాలల్లో టాయిలెట్స్ ఉన్నాయని, మిగిలిన జిల్లాలు కూడా కూడా త్వరగా పూర్తిచేయాలని సీఎం చెప్పారు. అంగన్ వాడీల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
లబ్దిదారుని ఇంటికే గౌరవంగా ఆదరణ పరికరాలు
ఆదరణ-2 పథకం కింద ఇచ్చే పరికరాలు లబ్దిదారుని ఇంటికే గౌరవంగా తీసుకువెళ్లి ఇవ్వాలని, అందుకు అయ్యే ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఈ  పథకాన్ని చేపట్టిందన్నారు. ఈ పథకంపై ప్రజల్లో  సంతృప్తి 54 శాతం మాత్రమే వుందని, దీనిని పెంచాలని చెప్పారు. రెవెన్యూ డివిజన్ల వారీగా గానీ, నియోజకవర్గాల వారీగా గానీ ఆయా జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు, కలెక్టర్లు కలసి నిర్ణయించుకొని పనిముట్లను లబ్దిదారులకు వెంటనే చేర్చాలని ఆదేశించారు.  
బ్యాంకులపై సామాజిక బాధ్యత
పేద వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల కింద రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు కూడా సామాజిక బాధ్యత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బ్యాంకులు ప్రభుత్వం మంజూరు చేసిన సబ్సిడీ మాత్రమే ఇస్తూ, రుణం ఇవ్వడం లేదని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తేగా ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాలకే కాదు, బ్యాంకు  కూడా సామాజిక బాధ్యత ఉందన్నారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించిన పథకాల విషయంలో యూనిట్లను మార్చుకునే వెసులు బాటు ఇవ్వమని ఆ శాఖ అధికారులకు, కలెక్టర్లకు సీఎం చెప్పారు.
గుంటూరు జిల్లాలో స్కాలర్ షిప్ దరకాస్తుల గడువు పెంపు
గుంటూరు జిల్లాలో కొన్ని ఇబ్బందుల కారణంగా కొంతమంది విద్యార్థులు స్కాలర్ షిప్ లకు దరకాస్తు చేసుకోలేకపోయారని, వారు దరకాస్తు చేసుకోవడానికి గడువు పెంచవలసిందిగా ఆ జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కోరగా, అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...