Sep 29, 2017

వ్యవసాయ రంగంలో గేట్స్ ఫౌండేషన్ సహకారం


వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన రెడ్డి
·       నవంబర్ 17న బిల్ గేట్స్ ఏపీకి రాక
·       విశాఖలో జాతీయ స్థాయి వ్యవసాయ సదస్సు
·       సదస్సులో ఏపీ- బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం
·       సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం

    సచివాలయం, సెప్టెంబర్ 29: రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన రెడ్డి చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరరంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఫౌండేషన్ ప్రతినిధులతో కలసి మీడియాతో మాట్లాడారు. నవంబర్ 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు విశాఖలో జాతీయ స్థాయి వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సు ముగింపు రోజు 17న బిల్ గేట్స్ వస్తారని చెప్పారు. 1996లో బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చారని, 21 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ ఏపీకి వస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగంలో పంటల సమాచార సేకరణ, భూసార పరిక్షల నిర్వహణ వంటి వాటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ రాష్ట్రం ముందుండి ఓ రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పారు. సాగు చేసే భూమిలో దాదాపు 95 శాతం భూసార పరిక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పరిశీలించి, టెక్నాలజీ వినియోగంలో ఏపీ ముందుందని చెప్పినట్లు పేర్కొన్నారు. విశాఖ సదస్సులో వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు, సాంకేతిక సంస్థల వారు పాల్గొంటారని చెప్పారు. ఈ సదస్సుకు ఏ రంగాల వారిని ఆహ్వానించాలన్న అంశాన్ని చర్చించడానికి వారు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరిగేందుకు సాంకేతికత, చిన్న, సన్నకారు రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసేందుకు కావలసిన సహకారం ఈ ఫౌండేషన్ అందిస్తుందని వివరించారు. సదస్సులో ఏపీ ప్రభుత్వం- ఫౌండేషన్ మధ్య ఒప్పందం జరుగుతుందన్నారు. ఈ ఫౌండేషన్ లాభాపేక్షకలిగిన వ్యాపార సంస్థ కాదని, స్వచ్చంద సంస్థని తెలిపారు. ఆఫ్రికాలో వ్యవసాయ రంగం అభివృద్ధిలో మంచి ఫలితాలు సాధించిన ఈ ఫౌండేషన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పట్ల ఆసక్తి చూపించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పరిశ్రమలు నెలకొల్పితే మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. విశాఖ సదస్సు ఇటు రైతులకు, అటు వ్యవసాయ అనుబంధ రంగాల పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోకరంగా ఉంటుందని మంత్రి అన్నారు.
వ్యవసాయ పరిశోధనా కేంద్రం వంటి ఏపీ
వివిధ వాతావరణ పరిస్థితులు, పలు రకాల పంటలు పండే ఆంధ్రప్రదేశ్ ఒక పరిశోధనా కేంద్రం వంటిదని ఫౌండేషన్ ఆసియా చీఫ్ డాక్టర్ పుర్వి మెహతా చెప్పారు. దేశంలోని ఒరిస్సా, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని అక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇక్కడ సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయ దిగుబడులు అధికంగా సాధించడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలు రావడానికి మార్కెటింగ్ లో మెళకువలు నేర్పే విషయంలో సహకరిస్తామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో భూసారం, వాతావరణం, మౌలిక వసతుల ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఙానం అందిస్తామని పుర్వి మెహతా చెప్పారు.
 సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించి సలహాలు అందించే అంతర్జాతీయ సంస్థ డాల్బెర్గ భాగస్వామి వరద్ పాండే మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి సంబంధించి పూర్తి సమాచార సేకరణ, సాంకేతిక వినియోగం, రైతులకు రుణ సౌకర్యం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఆల్ లైన్ మార్కెటింగ్ వంటి అంశాలలో తమ సహకారం అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిల్ గ్రేట్స్ ల అమూల్యమైన సలహాలతో తాము ముందుకు వెళతామన్నారు.
       ఈ ఫౌండేషన్ ఆఫ్రికా వంటి దేశంలో పరిశోధనలు చేసి ఫలితాలు సాధించిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ చెప్పారు. పంటలకు నేల లక్షణాలు ముఖ్యమని, ఆఫ్రికా సాయిల్ సంస్థలను నెలకొల్పి, అక్కడ వివిధ ప్రాంతాల్లో మట్టిని సేకరించి, పరీక్షించి భూసారాన్ని మెరుగుపరిచారని వివరించారు. ఆఫ్రికా వంటి దేశంలో ఫలితాలు సాధించడం గొప్ప విజయంగా వర్ణించారు.  మన రాష్ట్రంలో కూడా నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలు, లేని ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి తగిన సహాయం, సహకారాలు అందిస్తారని తెలిపారు. ప్రస్తుతం మనం అందించిన సాయిల్ హెల్త్ కార్డుల స్థానంలో డిజిటల్ సాయిల్ కార్డులు ఇస్తారన్నారు. అత్యాధునిక సాంకేతికత అందించడంతోపాటు వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి సహకారం అందించడంలో భాగంగా విశాఖలో సదస్సు నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు.

రైతు సంక్షేమానికే ప్రాధాన్యత


Ø ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యవసాయ ఋణ ఉపశమన పథకం – 2014 అమలు
Ø 2 విడతల్లో 57.27 లక్షల మంది రైతులకు రూ.11.84 వేల కోట్లు చెల్లింపు
Ø 10 శాతం వడ్డీతో రైతుల ఖాతాల్లో జమ
Ø 3వ విడత రూ.3,600 కోట్లు విడుదల

  రైతు సంక్షేమానికి ప్రధాన్యత ఇస్తూ  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు రుణ మాఫీపథకాన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రైతుల ఆర్ధిక ఇబ్బందులు, ఋణ భారం దృష్టిలో పెట్టుకొని రైతు సాధికార సంస్థ ద్వారా వ్యవసాయ ఋణ ఉపశమన పథకం- 2014 (ఏడీఆర్ఎస్)కు నిధులు విడుదల చేస్తోంది. ఒక్కో రైతుకు రూ.1.50లక్షల  వరకూ రుణమాఫీ చేస్తామని తొలుత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఋణ ఉపశమనానికి  10 శాతం వడ్డీతో కలుపుకొని దాదాపు 24,500 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో తొలిసారి 54.98 లక్షల రైతుల ఖాతాలకు రూ.7,564.69 కోట్లు జమ చేశారురెండో విడత రూ.3300 కోట్లు జమ చేశారు. ఆ తరువాత మళ్లీ రుణమాఫీకి అర్హత కలిగి రైతుల దరకాస్తులను పరిశీలించి, మరో 44  వేల మంది రైతులకు రూ.96.25 కోట్లు జమ చేశారు. ఇప్పటికి కూడా ఉపశమనం పొందని రైతుల  దరఖాస్తులు రైతు సాధికార సంస్థ స్వీకరించి అర్హత ఉన్న ఖాతాలకు ఉపశమనం కల్పిస్తునే ఉంది. బ్యాంకులో పంట ఋణం తీసుకొని చెల్లించకుండా ఉన్న  ప్రతి  అర్హత  ఉన్న  రైతుకు ఋణ ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో రైతు సాధికార సంస్థ 8.57 లక్షల రైతుల నుంచి ధరఖాస్తులను స్వీకరించిందివివిధ దశలలో అర్హులైన వారందరికీ ఋణ ఉపశమనం కల్పిస్తోంది.

రాష్ట్రం అనేక విధాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే వస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 57.27 లక్షల మంది రైతులకు  రెండు వాయిదాలలో 11 వేల 84 కోట్ల రూపాయలు విడుదల చేశారు.  ఇందులో గిరిజన సహకార సంఘాల ద్వారా రుణం పొందిన 2761 మంది గిరిజన రైతులకు కూడా రూ.1.88 కోట్లు విడుదల చేశారు. మూడవ విడత  మొత్తం రూ.3600 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనావేశారు.  ఇందులో తొలి దఫాగా రూ.1000 కోట్లను రైతుసాధికార సంస్థ పీడీ ఖాతాకు ఇప్పటికే జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని ఈ నెలాఖరులోపల మరో రెండు దఫాలుగా విడుదల చేస్తారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ  అవుతాయి. రూ.50 వేల లోపు బాకీ ఉన్న రైతులకు ఏక మొత్తంలో రుణ ఉపశమనం ద్వారా లబ్ది చేకూర్చారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) పరిధిలో భూ సమీకరణకు తోడ్పడిన రైతులకు, అదే విధంగా చనిపోయిన రైతు ఖాతాలకు రూ. 1.50 లక్షల లోపు బాకీ ఉన్నట్లయితే ఏక మొత్తంలో  ఋణ ఉపశమనం  ద్వారా లబ్ది కల్పించారు. ఆ విధంగా 23.76  లక్షల మంది రైతులు ఏక మొత్తం చెల్లింపు  ద్వారా లబ్ది పొందారు. వారికి ఖాతాలకు  రూ. 4493 కోట్లు జమ చేశారు. రైతు మిత్ర గ్రూపు (ఆర్ఎంజీ), ఉమ్మడి బాధ్యత గ్రూపు (జేఎల్జీ)కు చెందిన కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు. 72,966 మంది  కౌలు రైతులకు ఋణ ఉపశమనం  కింద రూ.144 .53  కోట్లు చెల్లించారు. ఈ రెండు విభాగాల్లో 1.43 లక్షల మంది రైతులకు  ఋణ ఉపశమనం  కింద రూ. 255.39  కోట్లు విడుదల చేశారు.

ఈ పథకం కింద ఉపశమనం పొందడానికి అర్హత ఉన్నవారికి ఋణ ఉపశమన అర్హత పత్రా(ఆర్ యుఏపీ) లు అందజేస్తున్నారురైతు కుటుంబ సభ్యుని పేరు, బ్యాంకు ఖాతా వివరాలతో సెక్యూర్డ్ బాండ్స్  రూపంలో 14 .80 లక్షల పత్రాలు పంపిణీ చేశారు. మూడవ వాయిదా విడుదలకు బడ్జెట్ (2017-18) లో ప్రతిపాదించిన విధంగా  రూ.3,600 కోట్ల రూపాయిలు వచ్చే నెలలో రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయనుంది. ఉద్యాన పంటలు ఉపశమనం ముందుగా ప్రకటించిన ప్రకారం ఉద్యాన రైతులకు  ఏక మొత్త ఋణ విమోచన ప్రయోజనం కల్పించడానికి ఎకరానికి రూ. 10 వేల  చొప్పున ఒక్కో రైతుకు రూ. 50,000  వరకు, అలాగే కుటుంబ పరిమితికి లోబడి  మొత్తం రూ.1.5 లక్షల వరకు ఇచ్చారు. 2.23 లక్షల మంది ఉద్యానవన రైతుల ఖాతాలకు రూ.384 కోట్లు జమ చేశారు.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్.

Sep 27, 2017

అక్టోబర్ లో ‘అమరావతి ప్రకటన’


స్పీకర్ కోడెల అధ్యక్షతన నిర్ణయం
§  విజయవాడ ఏ-వన్ కన్వెన్షన్ లో వినూత్నంగా సభ
§  రాజకీయాలకు అతీతంగా కార్యక్రమ నిర్వహణ
§  అన్ని రంగాల వారికి ఆహ్వానం
§  మహిళా పార్లమెంట్ ముఖ్య ఘట్టాలతో వీడియో ప్రదర్శన

          సచివాలయం, సెప్టెంబర్ 27: మహిళా సాధికారతకు సంబంధించి ‘అమరావతి ప్రకటన’ను అక్టోబర్ లో విడుదల చేయాలని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వెలగపూడి శాసనసభా భవనంలోని సమావేశం మందిరంలో  బుధవారం ఉదయం ‘అమరావతి ప్రకటన’ విడుదల తేదీ, సభ ఏర్పాట్లు, నిర్వహణ, ముఖ్య అతిధులుగా ఎవరిని ఆహ్వానించాలి.... తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విజయవాడలోని ఏ-వన్ కన్వెన్షన్ లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు 3 గంటల పాటు  నిర్వహించే ఈ సభా కార్యక్రమం వినూత్న తరహాలో నిర్వహించాలని స్పీకర్ చెప్పారు.  ఇది రాజకీయ కార్యక్రమంగా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒక వారంలో ‘అమరావతి ప్రకటన’ ముద్రణ పూర్తి అవుతుందన్నారు. ప్రకటన ప్రాధాన్యతను దృష్టిలోపెట్టుకొని కార్యక్రమం రూపొందించాలన్నారు. అక్టోబర్ మొదటి వారంలో అయితే సెలవులు ఉన్నందున రెండవ వారంలో 10 తేదీ నుంచి 14వ తేదీ లోపల నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు నలుగురు ముఖ్య అతిధులు ప్రసంగించే విధంగా కార్యక్రమం రూపొందిద్దామని స్పీకర్ అన్నారు. ప్రకటన రూపొందించిన నేపధ్యం, ఏఏ అంశాలను ఎంత సుదీర్ఘంగా, ఎంత లోతుగా చర్చించించింది సభలో ఒకరు విశ్లేషిస్తారని చెప్పారు.
                ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరాని, బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, అపోలో హాస్పటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, నీతు అంబానీ, ఎస్ బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్ లలో వారి వారి అవకాశాలను బట్టి ముగ్గురిని గానీ నలుగురిని గానీ ముఖ్య అతిధులుగా ఆహ్వానించాలని తీర్మానించారు. ముఖ్య అతిధులు అందరూ ఇంగ్లీషు, హిందీలో మాట్లాడేవారు కాకుండా కొందరు తెలుగులో మాట్లాడేవారు ఉంటే మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తమయింది. అందుకు స్పీకర్ అంగీకరించారు. విజయవాడకు సమీపంలో కృష్ణా-గోదావరి నదుల  పవిత్ర సంగమ ప్రాంతంలో 2017 ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  జాతీయ మహిళాపార్లమెంట్ సదస్సుకు సంబంధించిన ముఖ్య ఘట్టాలు, ప్రముఖుల ప్రసంగాలతో ఓ వీడియోను రూపొందించారు. ప్రకటన విడుదల సందర్భంగా ప్రదర్శించే ఈ వీడియోని సమావేశంలో అందరూ తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, రాజకీయ, పారిశ్రామిక రంగాలు, స్వచ్ఛంద సంస్థలు, ఏఎన్ఎంలు, అంగన్ వాడీ, డ్వాక్రా గ్రూపులకు చెందిన వారితోపాటు ఇతర రంగాల ముఖ్యులను సభకు ఆహ్వానించాలని, కార్యక్రమ నిర్వహణ మొత్తం ఒక సంస్థకు అప్పగించాలని, ఆ రోజు డ్వాక్రా బజార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్వహణా బాధ్యతలు ప్రైవేటు సంస్థకు అప్పగించినప్పటికీ సీనియర్ అధికారులు పర్యవేక్షించాలని స్పీకర్ చెప్పారు. అలాగే కార్యక్రమం ఏ విధంగా జరగాలో నిర్ణయించడం, ఆహ్వానాలు, ఇతర నిర్వహణా వ్యవహారాల బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమిత దావ్రా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునిత, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ, టెక్నికల్ కన్సల్టెంట్ చావా లక్ష్మిసుధ, ఇవి స్వర్ణలత, వి.వల్లి కుమారి, టీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శాసనసభలో దుర్గా పూజ
సమావేశానికి ముందు శాసనసభ భవనంలో దుర్గామాత విగ్రహానికి పూజలు చేశారు. స్పీకర్ డాక్టర్ కోడెల దుర్గామాతకు నమస్కరించి తీర్ధ, ప్రసాదాలు స్వీకరించారు.

Sep 26, 2017

అక్టోబర్ 2న లక్ష గృహప్రవేశాలు


గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు
9,835 గ్రామాలు, 884 వార్డుల్లో ప్రారంభోత్సవాలు
2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం
గ్రామగ్రామాన పండుగ వాతావరణం
లబ్దిదారులందరి వివరాలు వెబ్ సైట్ లో నమోదు
మొత్తం ఇళ్ల ఫొటోలు అప్ లోడ్
రూ.16వేల కోట్లతో 10 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం లక్ష్యం


సచివాలయం, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో అక్బోబర్ 2న ప్రపంచ ఆవాస దినం, గాంధీ జయంతి సందర్భంగా  ప్రభుత్వ సహాయంతో పేదక కోసం నిర్మించిన లక్ష ఇళ్లను ప్రారంభోత్సవం చేయనున్నట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్ ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.16వేల కోట్లతో 10 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. పూర్తి పాదర్శకంగా ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అక్బోబర్ 2, సంక్రాంతి, జూన్ 8న మూడుసార్లు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయనున్నట్లు వివరించారు.  ప్రస్తుతం ఒకేసారి సామూహికంగా లక్ష ఇళ్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 5 స్థాయిల్లో జియో ట్యాగింగ్ చేసి నిర్మాణం పూర్తి అయినట్లు నిర్ధారణ చేసుకున్న తరువాతే గృహప్రవేశం చేయిస్తున్నట్లు మంత్రి వివరించారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా గ్రామగ్రామాన పండుగ వాతావరణ నెలకొనే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. లక్ష గృహ ప్రవేశాల సందర్భంగా ప్రతి ఇంటి వద్ద రెండు మొక్కల చొప్పున రెండు లక్షల మొక్కలు నాటే ఏర్పాటు చేయాలన్నారు. అబ్దిదారులు కోరిన మొక్కలు ఇవ్వమని చెప్పారు. లక్ష మంది లబ్దిదారుల వివరాలు వెబ్ సైట్ లో నమోదు చేయాలని, జియోటాగ్ ఫొటోలను కూడా అప్ లోడ్ చేయాలని ఆదేశించారుఇళ్ల ప్రారంభోత్సవం తరువాత ఆ ఫొటోలను ప్రపంచంలో అందరూ చూసేవిధంగా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలన్నారు.
      11 వందలకు పైగా గ్రామ పంచాయతీలకు, 30 మునిసిపాల్టీలలోని వార్డులకు మొదటి దశలో ఇళ్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 9,835 గ్రామ పంచాయితీలలో, 884 వార్డులలో లక్షకు పైగా గృహాల నిర్మాణం పూర్తి అయినట్లు వివరించారు. లబ్దిదారుల పేర్లతో సహా మండల, జిల్లా స్థాయిల్లో పూర్తి వివరాలు ఈ నెల 27వ తేదీ సాయంత్రానికి ఏపీ హౌసింగ్ వెబ్ సైట్ (https://apgovhousing.apcfss.in) లో నమోదు చేసి అందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ప్రతి గ్రామంలో గృహ ప్రవేశాలు అయిన వెంటనే ఆయా ప్రాంతాల ఏఈలు ఫొటోలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారని చెప్పారు. ఇళ్ల వద్ద నాటే మొక్కలను అటవీ శాఖ వారు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ గుడిసె లేని సమాజం ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇంటింటికి మొక్కలు సరఫరా చేసే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇళ్ల ప్రారంభోత్సవాల సందర్భంగా పండుగ వాతావరణ నెలకొనేవిధంగా మామిడి ఆకుల తోరణాలు కట్టించడంతోపాటు అందుబాటులో ఉన్నచోట అరటి బాదులు ఏర్పాటు చేయాలన్నారు. ఏఈల ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ గృహ ప్రవేశ ఫొటోలు అప్ లోడ్ చేయించాలన్నారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...