Sep 27, 2017

అక్టోబర్ లో ‘అమరావతి ప్రకటన’


స్పీకర్ కోడెల అధ్యక్షతన నిర్ణయం
§  విజయవాడ ఏ-వన్ కన్వెన్షన్ లో వినూత్నంగా సభ
§  రాజకీయాలకు అతీతంగా కార్యక్రమ నిర్వహణ
§  అన్ని రంగాల వారికి ఆహ్వానం
§  మహిళా పార్లమెంట్ ముఖ్య ఘట్టాలతో వీడియో ప్రదర్శన

          సచివాలయం, సెప్టెంబర్ 27: మహిళా సాధికారతకు సంబంధించి ‘అమరావతి ప్రకటన’ను అక్టోబర్ లో విడుదల చేయాలని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వెలగపూడి శాసనసభా భవనంలోని సమావేశం మందిరంలో  బుధవారం ఉదయం ‘అమరావతి ప్రకటన’ విడుదల తేదీ, సభ ఏర్పాట్లు, నిర్వహణ, ముఖ్య అతిధులుగా ఎవరిని ఆహ్వానించాలి.... తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విజయవాడలోని ఏ-వన్ కన్వెన్షన్ లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు 3 గంటల పాటు  నిర్వహించే ఈ సభా కార్యక్రమం వినూత్న తరహాలో నిర్వహించాలని స్పీకర్ చెప్పారు.  ఇది రాజకీయ కార్యక్రమంగా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒక వారంలో ‘అమరావతి ప్రకటన’ ముద్రణ పూర్తి అవుతుందన్నారు. ప్రకటన ప్రాధాన్యతను దృష్టిలోపెట్టుకొని కార్యక్రమం రూపొందించాలన్నారు. అక్టోబర్ మొదటి వారంలో అయితే సెలవులు ఉన్నందున రెండవ వారంలో 10 తేదీ నుంచి 14వ తేదీ లోపల నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు నలుగురు ముఖ్య అతిధులు ప్రసంగించే విధంగా కార్యక్రమం రూపొందిద్దామని స్పీకర్ అన్నారు. ప్రకటన రూపొందించిన నేపధ్యం, ఏఏ అంశాలను ఎంత సుదీర్ఘంగా, ఎంత లోతుగా చర్చించించింది సభలో ఒకరు విశ్లేషిస్తారని చెప్పారు.
                ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరాని, బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, అపోలో హాస్పటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, నీతు అంబానీ, ఎస్ బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్ లలో వారి వారి అవకాశాలను బట్టి ముగ్గురిని గానీ నలుగురిని గానీ ముఖ్య అతిధులుగా ఆహ్వానించాలని తీర్మానించారు. ముఖ్య అతిధులు అందరూ ఇంగ్లీషు, హిందీలో మాట్లాడేవారు కాకుండా కొందరు తెలుగులో మాట్లాడేవారు ఉంటే మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తమయింది. అందుకు స్పీకర్ అంగీకరించారు. విజయవాడకు సమీపంలో కృష్ణా-గోదావరి నదుల  పవిత్ర సంగమ ప్రాంతంలో 2017 ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  జాతీయ మహిళాపార్లమెంట్ సదస్సుకు సంబంధించిన ముఖ్య ఘట్టాలు, ప్రముఖుల ప్రసంగాలతో ఓ వీడియోను రూపొందించారు. ప్రకటన విడుదల సందర్భంగా ప్రదర్శించే ఈ వీడియోని సమావేశంలో అందరూ తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, రాజకీయ, పారిశ్రామిక రంగాలు, స్వచ్ఛంద సంస్థలు, ఏఎన్ఎంలు, అంగన్ వాడీ, డ్వాక్రా గ్రూపులకు చెందిన వారితోపాటు ఇతర రంగాల ముఖ్యులను సభకు ఆహ్వానించాలని, కార్యక్రమ నిర్వహణ మొత్తం ఒక సంస్థకు అప్పగించాలని, ఆ రోజు డ్వాక్రా బజార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిర్వహణా బాధ్యతలు ప్రైవేటు సంస్థకు అప్పగించినప్పటికీ సీనియర్ అధికారులు పర్యవేక్షించాలని స్పీకర్ చెప్పారు. అలాగే కార్యక్రమం ఏ విధంగా జరగాలో నిర్ణయించడం, ఆహ్వానాలు, ఇతర నిర్వహణా వ్యవహారాల బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సుమిత దావ్రా, హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునిత, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ, టెక్నికల్ కన్సల్టెంట్ చావా లక్ష్మిసుధ, ఇవి స్వర్ణలత, వి.వల్లి కుమారి, టీవీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
శాసనసభలో దుర్గా పూజ
సమావేశానికి ముందు శాసనసభ భవనంలో దుర్గామాత విగ్రహానికి పూజలు చేశారు. స్పీకర్ డాక్టర్ కోడెల దుర్గామాతకు నమస్కరించి తీర్ధ, ప్రసాదాలు స్వీకరించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...