Sep 26, 2017

భారత్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి


         
 భారత దేశం మొదటి నుంచి శాస్త్ర సాంకేతిక అంశాలలో ప్రపంచంతో పోటీపడుతూనే ఉంది. ఇక్కడ నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు అంతర్జాతీయ స్థాయి పరిశోధకులుగా ఎదిగారు. శాస్త్ర సంపదకు కానీ, నిష్ణాతులైన శాస్త్రవేత్తలకు కానీ మన దేశంలో కొదవలేదు. శుశ్రుతుడు, చరకుడు, కణాదుడు, ఆర్యభట, భాస్కర, శ్రీనివాస రామానుజం, సి.వి.రామన్, జహంగీర్ బాబా, జగదీస్ చంద్రబోస్, విక్రమ్ సారా బాయ్, సూరి భగవంతం, హరగోవింద్ ఖొరానా, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, అరవింద్ భట్నాగర్, .పి.జె. అబ్దుల్ కలామ్, ఉప్పుగుండూరి అశ్వథనారాయణ,ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ వైవీఎన్ కృష్ణమూర్తి వంటి మహామహులు ఎందరో మన శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎంతో సుసంపన్నం చేశారు. భారతీయ అంతరిక్ష పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. దేశ, విదేశాల్లో ఎంతో ఖ్యాతిని గడించింది. గొప్ప, గొప్ప దేశాలు సైతం మనకు సాటిరాలేని స్థితికి దేశంలో ఖగోళ శాస్త్ర విజ్ఙానం చేరింది. దేశం ఎన్నోరంగాల్లో అంతరిక్ష పరిజ్ఞానాన్ని వినియోగించి అద్భుత ఫలితాలు సాధిస్తోంది.   1946 లోనే భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నత స్థాయి కమిటీ దేశంలో సాంకేతిక విద్యను అభివృద్ధి చేయడానికి నాలుగు ఉన్నత టెక్నాలజీ సంస్థలను నెలకొల్పాలని ప్రతిపాదించింది. 1958లో జాతీయ సైన్స్ విధానం ప్రకటించి సైన్స్ విద్యను ప్రోత్సహిస్తోంది.
జాతీయ సైన్స్ విధానం -1958
       దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే శాస్త్ర, సాంకేతిక రంగాల పురోగతి ఎంతో అవసరం. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1958లో జాతీయ సైన్స్ విధాన తీర్మానాన్ని(సైంటిఫిక్ పాలసీ రిజోల్యూషన్ ఆఫ్ 1958) ప్రకటించింది. సైన్స్ విద్యను ప్రోత్సహించింది. ఉన్నత ప్రమాణాలు గల శాస్త్రవేత్తలు, పరిశోధకులకు అనేక అవకాశాలు కల్పించింది. అత్యాధునిక సాంకేతిక అంశాలలో మానవ వనరులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. వ్యవసాయ సంరక్షణకు నడుం బిగించింది. దేశాభివృద్ధికి అనేక లక్ష్యాలను నిర్ధేశించుకొని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించింది. పారిశ్రామిక రంగం అభివృద్ధి ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. హరిత విప్లవం ద్వారా ఆహార భద్రత పెరిగింది. అయితే వర్షాధార ప్రాంతాలలో విద్యుత్ శక్తి ఆవస్యకతను ప్రభుత్వం గుర్తించింది. దాంతో పునర్వినియోగ వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టింది. ఇదే క్రమంలో అనేక సవాళ్లను ఎదుర్కొటూ పర్యావరణ పరిరక్షణ చర్యలు మొదలు పెట్టింది. ఆ తరువాత కాల క్రమంలో అవసరానికి అనుగుణంగా, శాస్త్ర, సాంకేతిక అంశాలలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని అనేక మార్పులు చేశారు. 1961లో భారత పార్లమెంటు ఐఐటీ(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లను ముఖ్యమైన జాతీయ సంస్థలుగా గుర్తించింది.
1983 -  టెక్నాలజీ పాలసీ స్టేట్ మెంట్
జాతీయ వనరులు, ప్రాధాన్యతలకు తగిన విధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని,  సంప్రదాయ విజ్ఙానాన్ని, దేశీయ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో 1983 జనవరిలో కొత్తగా టెక్నాలజీ పాలసీ స్టేట్ మెంట్ ను ప్రకటించింది. తక్కువ పెట్టుబడితో అధిక అభివృద్ధిని సాధించే టెక్నాలజీ రూపొందడానికి రూపకల్పన జరిగింది. పర్యావరణ పరిరక్షణ, పునర్వినియోగ శక్తి వనరుల అభివృద్ధికి అనేక ప్రణాళికలు రూపొందించి, అమలు చేశారు. ఇన్ శాట్(ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్), ఐఆర్ ఎస్(ఇండియన్ రిమోట్ సెన్సింగ్) వ్యవస్థలను అభివృద్ధి పరిచారు. కరువు నివారణ, పర్యావరణ పరిరక్షణకు చట్టాలు రూపొందించారు.
టెక్నాలజీ మిషన్ -1986
.       సాంకేతికాభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలని, దేశంలోని అన్ని ప్రాంతాలు సాంకేతికంగా అభివృద్ధి చెందాలని భారత ప్రభుత్వం 1986లో టెక్నాలజీ మిషన్ ని రూపొందించింది. అప్పటి నుంచి దీనిని సమర్థవంతంగా అమలు చేస్తోందికాలక్రమంలో వచ్చిన మార్పులను, సవాళ్లను ఎదుర్కొంటూ టెక్నాలజీ మిషన్ లో ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్ధేశిస్తోంది. అత్యాధునిక ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నత సాంకేతిక విద్యా ప్రమాణాలు రూపొందించింది.
టెక్నాలజీ మిషన్ ప్రధాన లక్ష్యాలు:
·        నానో టెక్నాలజీ పరిశోధనలను ప్రోత్సహించడం
·        నిర్మాణం, విద్యుత్ శక్తి రంగాలలో అత్యాధునిక టెక్నాలజీ గల పరికరాలను అందుబాటులోకి తీసురావడం
·        దేశవ్యాప్తంగా అక్షరాశ్యత శాతం పెంచడం
·        దేశలో నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం
·        వ్యవసాయ రంగంలో ఆధునిక సేద్యపు పద్దతులతో, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం
·        అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను వృద్ధి చేయడం
·        కూరగాయలు, ఫలాలు, పువ్వుల ఉత్పత్తిని పెంచి ఉద్యానవన రంగాన్ని అభివృద్ధి చేయడం
·        ఐటీ రంగంలో విద్యాప్రమాణాలు, శిక్షణా సౌకర్యాల పెంపు
·        గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం
·        గ్రామీణ ప్రాంత ఆరోత్య భద్రత పెంపొందించడం. ఇందు కోసం ప్రాథమిక వైద్య కేంద్రాలు, వైద్య వాలంటీర్లు, మొబైల్ మెడికల్ యూనిట్స్, టీకాలు, శిశు వైద్యం వంటివి గ్రామీణ ప్రాంతాలకు త్వరితగతిన విస్తరింపజేయడం.
·        విద్యుత్ శక్తి యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం పెంపొందించడం. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం. సౌరవిద్యుత్ ని అభివృద్ధి చేయడం.
·        శీతోష్ణస్థితి మార్పుల వల్ల తలెత్తే వ్యవసాయ, తాగునీటి, ఆరోగ్య రంగ సవాళ్లకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించి, అమలు చేయడం.
సైన్స్ విధానం-2003
మేథోసంపత్తి హక్కుల ప్రాధాన్యతను కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2003లో కొత్త సైన్స్ విధానాన్ని ప్రకటించింది. సామాజిక, ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే సైన్స్ విధానాల రూపకల్పనలో దేశంలోని ప్రధాన పరిశోధనా సంస్థలను, కేంద్రాలకు భాగస్వామ్యం కల్పించాలన్నది ఈ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే శాస్త్ర,సాంకేతిక రంగాల అభివృద్ధికి రూపొందించే ప్రణాళికల రూపకల్పనలో శాస్త్రవేత్తలను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. వివిధ ప్రాంతాలలో సమస్యలను పరిష్కరించడానికి పలు కార్యక్రమాలు రూపొందించారు. విశ్వవిద్యాలయాలు, ఆర్ అండ్ డీ(రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్) యూనిట్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలను పూర్తి స్థాయిలో బలోపేతం చేసి, వాటికి స్వయంప్రతిపత్తిని కల్పించాలని నిర్ధేశించారుఈ రంగంలో వస్తున్న మార్పులకు, అవకాశాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తగిన విధానాలను రూపొందించాలని నిర్ణయించారు. సైన్స్ ఆధారిత విభాగాలన్ని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే ఏర్పాట్లు చేశారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సాంకేతిక సలహా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ రంగం అభివృద్ధికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయిస్తున్నారు. పారిశ్రామిక రంగం కూడా ఆర్ అండ్ డీ విభాగంలో పెట్టుబడులు పెంచే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
నానో మిషన్ - 2007
 దేశాఅభివృద్ధికి అన్ని విధాల ఉపయోగపడే నానో టెక్నాలజీ అభివృద్ధిని కూడా ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా 2007 మే నెలలో కేంద్ర ప్రభుత్వం నానో-సైన్స్, టెక్నాలజీ మిషన్ ను ప్రారంభించింది.
నానో మిషన్ ప్రధాన లక్ష్యాలు:
·        నానో టెక్నాలజీ నిపుణులను అందుబాటులోకి తేవడం
·        నానో టెక్నాలజీ అభివృద్ధికి పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్-భాగస్వామ్యం) పద్దతిని ప్రోత్సహించడం
·        పదార్ధాన్ని ప్రాథమిక స్థాయిలో అర్థం చేసుకొని నానో మీటర్ స్థాయిలో దాన్ని వినియోగించేందుకు కృషి చేయడం
·        నానో టెక్నాలజీకి కావలసిన ట్రాన్స్ మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్(టీఈఎం), స్కానింగ్ ప్రోబ్ మైక్రోస్కోప్(ఎస్.పీ.ఎం.), ఆప్టిమల్ ట్వీజర్ వంటి పరికరాలను అభివృద్ధి చేయడం.
·        నానో క్రిస్టల్, నానో ట్యూబ్స్ ని అభివృద్ధి పరచడం.
నానో టెక్నాలజీ అభివృద్ధిలో ఎన్ఎస్ఏజీ(నానో సైన్స్, టెక్నాలజీ అడ్వయిజరీ గ్రూప్), ఎన్ఏటీఏజీ(నానో అప్లికేషన్స్ అండ్ టెక్నాలజీ అడ్వయిజరీ గ్రూప్)లు కీలక పాత్ర వహిస్తున్నాయి. చెన్నైలో ఎన్ఎఫ్ఎంటీసీ(నానో ఫంక్షనల్ మెటీరియల్ టెక్నాలజీ సెంటర్) ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా, మొహాలిలలో ఐఎన్ఎస్ టీ(ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ)లను స్థాపించారు.  నానో టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించి రష్యా, అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి ముఖ్యమైన దేశాలతో సహకార కార్యక్రమాలు ప్రారంభించారు. సెరామిక్స్ ఉత్పాదనలో ఉపయోగించే నానో క్రిస్టలైన్ ఆక్సైడ్ పౌడర్, కార్బన్ నానో ట్యూబ్స్ ను అభివృద్ధి చేశారు. టైర్ ఇంజనీరింగ్ లో ఉపయోగపడే హైపర్ ఫార్మేన్స్ రబ్బర్ నానో కాంపోజిట్స్ ని అభివృద్ధి చేశారు.
2013-ఎస్ టీఐ
అన్ని అంశాలలో శాస్త్రవేత్తలను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 2013లో సైన్స్, టెక్నాలజీ, ఇన్నొవేషన్(ఎస్.టీ..) విధాన్ని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా టెక్నాలజీ ఇన్నొవేషన్ విధానానికి ఇదే ప్రేరణ. అయిదేళ్ల కాలంలో దేశంలోని శాస్త్రవేత్తలను 66 శాతానికి పెంచాలన్నది ఎస్టీఐ ప్రధాన లక్ష్యం. ప్రపంచ శాస్త్ర, సాంకేతిక రంగాలలో 2020 నాటికి తొలి అయిదు దేశాలలో ఒకటిగా భారత్ ని నిటబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ-గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్)లో పరిశోధనల అభివృద్ధి వ్యయాలన్ని రెండు శాతానికి పెంచారు.
జాతీయ డిజిటల్ లిటరసీ మిషన్ - 2014
        దేశవ్యాప్తంగా డిజిటల్ అక్షరాశ్యత సాధించాలన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్ట్ 21న డిజిటల్ సాక్షరత అభియాన్(డీఐఎస్ హెచ్ఏ) పేరుతో జాతీయ డిజిటల్ లిటరసీ మిషన్ ను ప్రారంభించారు. సమాచార, సాంకేతిక విప్లవం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ అక్షరాశ్యతను విస్తరింపజేయడం, గ్రామాల్లో సాధికారత సాధించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఇందు కోసం అంగన్ వాడీ, ఆశా వాలంటీర్లు, రేషన్ డీలర్లతోపాటు 52.5 లక్షల మందికి ఐటీలో శిక్షణ ఇప్పించే ఏర్పాట్లు చేశారు. దేశ వ్యాప్తంగా 14 నుంచి 60 సంవత్సరాల లోపు డిజిటల్ నిరక్షరాశ్యులు ఈ కార్యక్రమం కింద శిక్షణ పొందే అవకాశం కల్పించారు. డిజిటల్ లిటరసీ మిషన్ లో అందించే శిక్షణకు కావలసిన శిక్షణ సామాగ్రిని  నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సెర్వీసెస్ కంపెనీస్) అభివృద్ధి చేసింది. ఈ శిక్షణలో ఇంటర్నెట్, పవర్ ఇన్ యువర్ హ్యాండ్స్, -మెయిల్, సోషల్ మీడియా, ప్రభుత్వం, -కామర్స్, ఐటీ సెక్యూరిటీ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, కాగ్రిజెంట్ వంటి సంస్థలు సహకారం అందిస్తున్నాయి.

-        శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...