Sep 7, 2017

పచ్చదనం–జల కళ


ఏపీలో మొక్కల పెంపకం, జల సంరక్షణకు అత్యంత  ప్రాధాన్యత

           ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదులు అనుసందానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీరు పారించడంతోపాటు  మొక్కలకు రక్షణ కల్పించి పచ్చదనం నింపాలన్న లక్ష్యంతో ఉంది.  పచ్చదనం – జల కళకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులోభాగంగానే నీరు-చెట్టు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ,  నదులు, చెరువులు, భూగర్భ జలాల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇప్పుడు జలసిరికి జల హారతికార్యక్రమం చేపట్టింది.  భావితరాలకు నీటివనరుల పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలందరిని ఇందులో భాగస్వాములను చేస్తోంది. నీటిసమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో మరింతగా చైతన్య కార్యక్రమాలను చేపట్టనుంది. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తోంది.  జలసంరక్షణతో కరవును తరిమికొట్టడానికి ప్రయత్నింస్తోంది. ఇందుకోసం  ప్రాథమిక మిషన్‌కు ఉప మిషన్‌గా  ప్రవేశపెట్టిననీరు-చెట్టు కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది.     ఇందులో  భాగంగా ప్రతిగ్రామంలో కనీసం ఒక కిలోమీటర్ దూరం వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్‌లను, కార్యదర్శులను భాగస్వాములను చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం పచ్చదనం నింపాలన్న  తాజా లక్ష్యంతో 63 వేల 500 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలను నాటే కార్యక్రాన్ని ప్రభుత్వం చేపట్టింది. జల సంరక్షణతో ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టి సంరక్షిస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంకింద ప్రభుత్వం గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేస్తోంది.   గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 10 వేల కి.మీ. మేర ఎవెన్యూ ప్లాంటేషన్‌కు ప్రణాళికలు రూపొందించింది. నీరు-చెట్టుకార్యక్రమంపై అవగాహన కోసం క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారోద్యమం చేపట్టి  ఇంకుడు గుంతలు, పంట కుంటలు, చెక్‌డ్యాములు తదితర నిర్మాణాలతో జలసంరక్షణకు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల చెక్ డ్యాముల నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) నీరు-చెట్టు కార్యక్రమం కింద  రూ.4244.55 కోట్ల వ్యయంతో అనేక పనులు చేపట్టారు. చెరువుల్లో 25.046 క్యూబిక్ మీటర్ల పూడిక తీశారు. 3,585 చెక్ డ్యాములు మరమ్మతులు చేశారు.  
దాదాపు 4 లక్షల పంటకుంటలు తీశారు. 3,24,567 ఇతర జలసంరక్షణ నిర్మాణాలు చేపట్టారు. 135 ఎత్తిపోతల పథకాలు పూర్తి చేశారు.  3,16,424 ఎకరాల ఆయకట్టును నూతనంగా స్థిరీకరించారు.  1043 గొలుసుకట్టు చెరువులు, సెలయేళ్లను అభివృద్ధి చేసారు.  ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో వ్యవసాయ అనుబంధ మత్స్య రంగం బాగా అభివృద్ధి చెందింది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్-1 గా ఉంది. దేశంలో  ఉత్పత్తి అయ్యే   రొయ్యలలో 70 శాతం రొయ్యలను ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తోంది. ఈ క్రమంలో మన రాష్ట్రాన్ని ప్రపంచ ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.
ఉద్యానరంగంలో కూడా రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. రాష్ట్రాన్ని ఉద్యానపంటల కేంద్రం (హార్టికల్చర్ హబ్) గా మార్చాలన్న ధ్యేయంతో ప్రభుత్వం ఉంది.  ఉమ్మడి రాష్ట్రంలో 1982లో ఉన్న ఉద్యాన పంటల విస్తీర్ణం కేవలం 3.70 లక్షల హెక్టార్లు మాత్రమే.  రాష్ట్ర విభజన తర్వాత 2016-17లో నవ్యాంధ్రలో ఉద్యానపంటల విస్తీర్ణం 15.41 లక్షల హెక్టార్లకు విస్తరించింది.  ఈ విస్తీర్ణంలో 202.50 లక్షల మెట్రిక్ టన్నుల పంటలు  ఉత్పత్తి అయ్యాయి.  మామిడి, అరటి, నిమ్మ, బత్తాయి, ఆయాల్ పామ్, కొబ్బరి, ఉల్లి, మిరప, పసుపు, ధనియాలు తదితర పంటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి.
2015-16 ఆర్ధిక సంవత్సరంలో స్థూల ఆదాయ విలువలో 9.95శాతంగా ఉన్న ఉద్యాన రంగ వాటా 2016-17 సంవత్సరం ప్రథమార్ధానికి 18.33 శాతంగా నమోదైంది. ప్రాథమిక రంగం రెండంకెల వృద్ధిరేటు సాధనకు ప్రభుత్వం ఉద్యాన రంగాన్ని అభివృద్ధికారకం(గ్రోత్ ఇంజన్‌)గా గుర్తించింది.  ఆంధ్రప్రదేశ్ ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, మిరప పంటల సాగులో దేశంలో నెంబర్ వన్‌గా నిలిచింది. మామిడి, టొమాటో ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రానిది రెండో స్థానం. జలవనరుల సంరక్షణతో రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన పంటల అభివృద్ధితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం నింపాలన్న ధ్యేయంతో ప్రభుత్వం కృషి చేస్తోంది.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...