Sep 21, 2017

ముస్లిం సమరయోధుల త్యాగాలకు అక్షర రూపం


స్వాతంత్ర్యసంగ్రామంలో ముస్లింల పాత్రపై పరిశోధనలు
ఏకైక తెలుగువాడు సయ్యద్ నశీర్ అహమ్మద్
              రచనావ్యాసంగంలో ఇతరులు స్పృచించని కోణంలో కొత్త అంశాలను ఎన్నుకొని, తనదైన తరహాలో నిజాయితీగా శ్రమిస్తూ సయ్యద్ నశీర్ అహమ్మద్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిఘడించారు. నశీర్ విద్యాసంపన్నుడు, బహుముఖ ప్రజ్ఙాశాలి. కామర్స్ లో మాస్టర్ డిగ్రీతోపాటు లా డిగ్రీ, సాహిత్య రత్న, జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగం, న్యాయవాది, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్ట్, చిత్రకారుడు, వ్యంగ్య చిత్రకారుడు, రచయిత, చరిత్రకారుడు, ప్రచురణకర్త, పరిశోధకుడు, పర్యాటకుడు, విశ్లేషకుడు, వక్తగా... ఇలా అనేక రంగాలలో ప్రావీణ్యత సాధించారు. స్వాతంత్ర్యసంగ్రామంలో ముస్లింల పాత్రపై దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సమాచార సేకరణ, అధ్యయనం, పరిశోధనాత్మక గ్రంథాల రచన, ప్రచురణ చేస్తున్న దేశంలోని ఏకైక చరిత్రకారుడు నశీర్. ఆయన తెలుగువాడు కావడం విశేషం.
            నెల్లూరు జిల్లా పురిణి గ్రామంలో పుట్టి, ఆ గ్రామంతోపాటు గుంటూరు జిల్లా నరసరావుపేటలో పెరిగారు. పురిణి, కావలి, నరసరావుపేట, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గం, గుంటూరులలో విద్యాభ్యాసం పూర్తి చేసిన నశీర్ కొంత కాలం ప్రభుత్వం ఉద్యోగం చేసి, ఆ తరువాత న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 1986లో ఉదయం దినపత్రికలో విలేకరిగా జర్నలిజం వృత్తి ప్రారంభించారు. జర్నలిస్ట్ గా వివిధ పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కీలక బాధ్యతలు నిర్వహించారు. దీంతోపాటు వ్యంగ్య చిత్రకారునిగా కూడా ఎదిగి పలువురి ప్రశంసలు అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన చిత్రకళా ప్రదర్శనలు కూడా నిర్వహించారు.  దాదాపు 30 ఏళ్లపాటు తెలుగు దినపత్రికలన్నింటిలో పలు అంశాలపై వందలాది వ్యాసాలు, కవితలు, కథానికలు, గేయాలు, సమీక్షలు రాశారు. ఆయన రాసిన చరిత్రకు సంబంధించిన పలు వ్యాసాలు ఆంగ్లంలోకి అనువదించారు.
                చాలా కాలం నరసరావుపేటలో ఉన్న నశీర్ ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ లో ఉంటూ 2005 నుంచి పూర్తి కాలం రచనా వ్యాసంగం, ప్రచురణలపై దృష్టిపెట్టారు. స్వాతంత్రోద్యమంలో మరుగునపడిన సంఘటనలను, జీవిత చరిత్రలను వెలుగులోకి తేవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా జాతీయోధ్యమంలో ముస్లింల పాత్ర, మరిముఖ్యంగా ముస్లిం మహిళల త్యాగాలను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చారు.  దాదాపు 20 ఏళ్లుగా ఒకే అంశంపై నిర్మిరామంగా పరిశోధనలు కొనసాగిస్తున్న ఏకైక చరిత్రకారుడు  తెలుగువాడు కావడం మనం గర్వించతగ్గ విషయం. తెలుగులో రచనలు చేసే 333 మంది ముస్లిం రచయితలను పరిచయం చేస్తూ అక్షర శిల్పులు అనే పుస్తకం రాశారు.   దేశమంతటా పర్యటిస్తూ సరిశోధన, సమాచార సేకరణ మొదలుపెట్టారు. సేకరించిన సంఘటన సమాచారం విశ్లేషిస్తూ రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారు. అలాగే దేశవిశాల్లో పర్యటిస్తూ చారిత్రక అంశాలను తెలియజేస్తూ వక్తగా ప్రశిద్ధిగాంచారు. కేవలం తన కోసంమే కాకుండా పది మంది కోసం జీవిస్తే జీవితం సార్థకమవుతుందని తన కుటుంబం నుంచి నేర్చుకున్నారు నశీర్. ఆ తరువాత భార్య షేక్ రమీజా భాను, కుమార్తె సయ్యద్ జాస్మిన్ అహ్మద్ ల సహకారం కూడా లభించడంతో తన ఆలోచనలనకు పదునుపెట్టి పరిశోధనలను పుస్తకరూపంలో తీసుకువస్తూ అటు చరిత్రకు, ఇటు సమాజానికి ఎనలేని సేవచేస్తున్నారు. తొలి నుంచి అక్షరం ప్రయోజనం తెలిసిన వ్యక్తి కావడంతో అందరికీ అర్థమైయ్యే రీతిలో తన చారిత్రక రచనలలో నూతన వరవడిని కొనసాగించారు. ఆయన రచనలు హిందీ, ఆంగ్లం, ఉర్దు, తమిళం, కన్నడ, గుజరాతీ, మరాఠి భాషలలోకి అనువందించారు. కొన్ని పుస్తకాలు పలుసార్లు పునర్ముద్రితం కూడా అయ్యాయి. భారత స్వాతంత్ర్యోద్యమం: ముస్లిం మహిళలు, భారత స్వాతంత్ర్యోద్యమం: ముస్లింలు, భారత స్వాతంత్ర్యోద్యమం: ఆంధ్రప్రదేశ్ ముస్లింలు, మైసూరు పులి : టిప్పు సుల్తాన్, షహీద్ యే ఆజం అష్ఫాఖుల్లా ఖాన్, భారత స్వాతంత్ర్యోద్యమం: ముస్లిం ప్రజాపోరాటాలు, భారత స్వాతంత్ర్య సంగ్రామం: ముస్లిం యోధులు (ప్రధమ భాగం), చిరస్మరణీయులు, 1857: ముస్లింలు, అక్షర శిల్పులు, చరితార్ధులు (ఆల్బం), కువైట్ కబుర్లు, బిస్మిల్-అష్ఫాఖ్ పుస్తకాలు రచించారు. అంతేకాకుండా పలు సందర్భాలలో చిన్నచిన్న పుస్తకాలు కూడా ప్రచురించారు. చరితార్ధులు గ్రంథంలో 155 మంది స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలు, వారి వివరాలు పొందుపరిచారు. ఆ పుస్తకం ద్వారా ఆయన అంతర్జాతీయంగా పలువురి ప్రశంసలు అందుకున్నారు. దానిని పలు భాషలలోకి అనువదించి ప్రచురించారుఆయన రచనల ద్వారా మరుగునపడిపోయిన అనేక మంది త్యాగధనుల చరిత్ర వెలుగులోకి వచ్చింది. విశ్వవిద్యాలయాలు, చారిత్రక పరిశోధకులు చేయవలసిన పనిని నశీర్ ఒక్కరే చేయడం పట్ల అనేక మంది ఆయనను అభినందించారు. ఇంకా ఆయన రచనలు అనేకం ముద్రించలసినవి ఉన్నాయి. రచనలతోపాటు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై జర్నలిజం, చరిత్ర, సామాజిక, ఆర్థిక అంశాలపై వందలాది ప్రసంగాలు చేశారు. బహుముఖంగా ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా విఆర్ నార్ల విశిష్ట జర్నలిస్ట్ అవార్డ్, అధికార భాషా సంఘం వారి తెలుగు భాషా పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డ్, షహీద్ అష్ఫాఖుల్లా ఖాన్ ఎక్స్ లెన్సీ అవార్డు, విశాల సాహితీ పురస్కారం, కవికోకిల లక్ష్మీ చిన్న సుబ్బన్న స్మారక ఆత్మీయ పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం....వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. అభ్యుదయ భావాలున్న నశీర్ లో ఉన్న మరో విశేష గుణం ఏమిటంటే తన రచనలలోని అంశాలు అందరికీ తెలియాలని వాటిని ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉండేవిధంగా syednaseerahamed.weebly.comలో ఉంచారు. ఈ వెబ్ సైట్ నుంచి ఒక్క చరితార్థులు పుస్తకం తప్ప అన్నింటినీ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...