Feb 5, 2013

హిందూ దేవుళ్లంటే ఎందుకు అంత అలుసు?



                ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు హిందూ దేవతల బొమ్మలను వాడుకోవడం అలవాటైపోయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా దేవతల బొమ్మలు వినియోగిస్తున్నారు. బికినీలపైన, లోదుస్తులపైన, చివరకు చెప్పులపైన కూడా హిందూ దేవతల బొమ్మలను ముద్రిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఒక మతంవారి మనోభావాలను దెబ్బతీయకూడదన్న కనీస ధర్మాన్ని వారు ఎందుకు పాటించరు? వాటిని రూపొందించేవారికి ఈ విషయం తెలియదా? దీనికి సంబంధించి వారికి ఎవరూ సలహాలు ఇవ్వరా? సలహాలు ఇచ్చినా వారు పాటించరా? ప్రపంచంలో ప్రధానమై క్రైస్తవ, ముస్లిం మతాలకు సంబంధించిన గుర్తులను, బొమ్మలను ఎందుకు వాడరు? కేవలం హిందూ దేవతల బొమ్మలనే ఎందుకు ఇలా కించపరుస్తున్నారు? కనీస మర్యాద పాటించడం వారికి తెలియదనుకోవాలా? అంతర్జాతీయంగా ఏదైన కుట్ర దాగి ఉందా? తగిన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం వల్లే ఇలా జరుగుతుందనుకోవాలా? ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన అంశమే కాదు. ఒక జాతికి, సంస్కృతికి ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన అంశం ఇది.

                  విదేశాలతోపాటు మన దేశంలో కూడా ఇటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. వివాదాలకు దారి తీస్తున్నాయి. హిందూ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఆందోళనులు చేస్తున్నాయి. అయిన్పటికీ దేవతల బొమ్మలను మళ్లీమళ్లీ కించపరిచే విధంగా వినియోగిస్తూనే ఉన్నారు. ఇతర మతస్తులే కాకుండా, హిందువులు కూడా దేవతల బొమ్మలను అవమానకరమైన రీతిలో ఉపయోగిస్తున్నారు. అపచారానికి పాల్పడుతున్నారు. ఆస్ట్రేలియాలోని రోస్ మౌంట్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో లిసా బ్లూ అనే ఫ్యాషన్ డిజైనర్ హిందువుల ఆరాధ్య దేవత లక్ష్మీదేవి బొమ్మతో బికినీని రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను కించపరిచారని అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా విశాఖపట్నంలో కింగ్‑ఫిషర్ ఫ్యాషన్‑షోలో కూడా ఇది పునరావృతమైంది. ఈ షో రెండు రకాలుగా వివాదాలకు దారి తీసింది. స్త్రీని వ్యాపార వస్తువుగా చూపడాన్ని వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. కింగ్‑ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఆటలు విశాఖపట్నంలో సాగనివ్వమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. షో పోస్టర్‑లో మహిళలను కించ పరుస్తూ చూపారని మండిపడ్డారు. ఇటువంటి షోలకు అనుమతి ఇవ్వవద్దని వారు డిమాండ్‌ చేశారు. మహిళా సంఘాలు ఒక పక్క ఆందోళన చేస్తున్నప్పటికీ విశాఖ సాగర తీరంలో ఫ్యాషన్‑షో ప్రారంభించారు. హిందూ దేవతల చిత్రాలతో రూపొందించినదుస్తులను మోడల్స్ ధరించడంతో మరో వివాదం రేగింది.

                ఆధునిక వాణిజ్యం సామ్రాజ్యంలో ఆడవారిని ఒక వస్తువుగా వాడుకోవడం ఎక్కువైపోయింది. దానిని సమర్ధించేవారు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నారు. వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్‑షోల పేరిట ఆడవారి అందాలను, అంగాలను ప్రదర్శిస్తారు. దానికి తోడు వెర్రివేషాలు కూడా వేస్తుంటారు. అర్ధనగ్నం, కాదు ముప్పాతిక నగ్నంగా, అవకాశం ఉంటే ఇంకా ఎక్కువగా యువతులు తమ అంగాంగాలను ప్రదర్శిస్తారు. అంగ సౌష్టవాన్ని బట్టి కొందరు సెక్సీగా కనిపించడం సహజం. కానీ మగవారు ఆ దృష్టితో చూడకూడదంటారు. మహిళలు తమ ఇష్టమొచ్చిన రీతిలో దుస్తులు వేసుకుంటారని, మగవారు చూసే దృష్టిలో, ఆలోచనలో మార్పు రావాలని వారు వాదిస్తున్నారు. వారు ఇష్టపడి ఫ్యాషన్‑షోలలో తమ అందాలను ప్రదర్శిస్తుంటే మీరెవరు అడగటానికి, అడ్డుకోవడానికి? అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యాషన్‑షోలనేవి వ్యాపార అవకాశాలు కల్పించడానికి, కొత్త ముఖాలను పరిచయం చేయడానికి ఉపయోగపడతాయని చెబుతారు. కానీ ఇక్కడ మహిళలే బలైపోతున్నారని షోలను వ్యతిరేకించేవారి వాదన. ఆ విధంగా దుస్తులు వేసుకోవడం మన సంప్రదాయం కాదని చెబుతారు. స్త్రీలు సెక్సీగా దుస్తులు వేసుకోవడం వల్ల అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయని కొందరు మహిళా సంఘాల నేతలు వాదిస్తున్నారు. సెక్సీగా కనిపించని చిన్న పిల్లలపైన, వృద్దులపైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయని ష్యాషన్ షోలకు మద్దతు పలికేవారి వాదన. కురచదుస్తుల వల్ల జరిగే అనర్ధాలను వారు అంగీకరించరు. యువతులు తమ ఇష్టమొచ్చిన వృత్తిని ఎన్నుకుంటారని, తమ ఇష్టమొచ్చిన విధంగా దుస్తులు ధరిస్తారని వాదిస్తారు. వారికి వచ్చే కొత్తకొత్త అవకాశాలను అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నిస్తారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఫ్యాషన్‑షోలను అడ్డుకోవడాన్ని మహిళల స్వేచ్ఛను హరించడంగా భావిస్తారు. ప్రస్తుతానికి ఈ అంశాన్ని పక్కన పెడదాం. హిందూ దేవతల బొమ్మలతో రూపొందించిన దుస్తులను ఫ్యాషన్‑షోలో యువతులు ధరించినందుకు ఈ విషయం ఇక్కడ ప్రస్తావించవలసి వచ్చింది.

మహిళలు మూడు రోజులు ఆందోళన చేసిన్నప్పటికీ లెక్కచేయకుండా కింగ్‑ఫిషర్‑ ఫ్యాషన్‑షోను ప్రారంభించారు. రెండు రోజులు నిర్వహించారు. పలువురు సినీ నటీనటులు, దేశం నలుమూలల నుంచి దాదాపు 40 మంది మోడల్స్ పాల్గొన్నారు. ‑‑షోలో శుక్రవారం వినాయకుడు బొమ్మ చిత్రించిన దుస్తులను మోడల్స్ ధరించి ర్యాంప్‑పై నడిచారు. విఘ్నేశ్వరుడి బొమ్మ ఒక మోడల్ ఉదరంపైన, తొడలపైన కనిపించింది. మరో మోడల్ గుండెలపైన కనిపించింది. దానికి తోడు వారు ఆ దుస్తులు వేసుకొని క్యాట్ వాక్ చేసే సమయంలో విఘ్నేశ్వర స్తోత్రం వినిపించారు. దాంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, తాము నిత్యం ఆరాదించే దైవాన్ని కించపరిచారని హిందూ సంఘాలు మండిపడ్దాయి. మన సంస్కృతిని మనమే కించపరుచుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జివిఎంసి) ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం ఉదయం మహిళా, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మహిళలను అసభ్యంగా చూపించడం పైన, హిందూ దేవతలను కురచ దుస్తులపైన ముద్రించడంపైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లంటే అన్య మతస్తులకు చిన్న చూపని, ఇవే దుస్తులపై వేరే మతస్తుల చిత్రాలను వేసి ష్యాషన్ షోలో ప్రదర్శించగలరా? అని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ప్రశ్నించారు. హిందూ దేశంలో దేవుళ్లకు అపచారం జరుగుతున్నా హిందువులు స్పందించకపోవడం దురదృష్టకరమని విశ్వ హిందూ పరిషత్ నేతలు అన్నారు. ఫ్యాషన్ షో నిర్వాహకులకు ప్రభుత్వ మద్దతు ఉన్నందువల్ల ఇటువంటి అపచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల్లో స్పందన రావల్సిన అవసరం ఉందన్నారు. విశ్వహిందూ పరిషత్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

                ఒక పక్క మహిళా హక్కుల సంఘాల వారు, మరో పక్క హిందూ సంఘాల వారు ఆందోళకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తలకు దారితీస్తుందని భావించి పోలీసులు షోని రద్దు చేశారు. నిర్వాహకులపై 295(ఏ)సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. షోని వ్యతిరేకించినవారు విజయం సాధించారు. ఒక మతానికి సంబంధించిన దేవతలను కించపరిచే సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా హిందూ దేవతల బొమ్మలను ఈ విధమైన కురచ దుస్తులపైన ముద్రించడాన్ని నిరోధించవలసి ఉంది.
                                          February 5, 2013 by Siramdasu Nagarjuna

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...