Aug 31, 2017

ఏపీ 3 ఏళ్ల బేబి


శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల
Ø స్పీకర్ ని కలసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ
Ø రాష్ట్రం ఇన్వెస్టర్స్ పేరడైజ్
Ø టాయిలెట్ల నిర్మాణంలో ఏపీ నెంబర్ 1
Ø త్వరలో అమరావతి ప్రకటన

సచివాలయం, ఆగస్ట్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడేళ్ల బేబీ అని, అయినా అభివృద్ధిలో ముందుందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బుధవారం ఉదయం శాసనసభ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్ లో ఆయనను గౌరవపూర్వకంగా కలిశారు. శాసనసభ లోపలి భాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర పనులలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తమ సత్తెనపల్లి శాసనసభా నియోజకవర్గంలో 120 రోజుల్లో 20వేల టాయిలెట్లు నిర్మించినట్లు తెలిపారు. మహిళల ఆత్మగౌరవం, అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. స్వచ్ఛాంధ్ర గురించి తక్కువ సమయంలో ఎక్కువగా  ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అలాగే శ్మశానవాటికలను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. తమ నియోజకవర్గంలో 400 శ్మశానవాటికలను ఆధునీకరించినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యావరణం, నీటిపారుదల, పరిశ్రమలు, విద్య, వైద్యం, విద్యుత్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఇన్వెస్టర్స్ పేరడైజ్ గా స్పీకర్ అభివర్ణించారు. ఆ సందర్భంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయాన్ని ఆండ్రూ ప్రస్తావించారు. నదులు అనుసంధానంలో భాగంగా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానించినట్లు, 24 గంటలు నిరంతరం విద్యుత్ అందిస్తున్నట్లు స్పీకర్ వివరించారు. 190 రోజుల్లో శాసనసభ భవన సముదాయాల నిర్మాణం పూర్తీ చేసినట్లు తెలిపారు. ఇండియా-యూకె భాగస్వామ్యంతో అమరావతిలో ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. నూతన రాజధాని అమరావతిలో పరిపాలన, న్యాయ నగరాల డిజైనింగ్ బ్రిటన్ కు చెందిన నార్మన్ ఫాస్టర్ సంస్థ అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, వారు స్వయంప్రతిపత్తి సాధించడానికి స్వయంసేవక బృందాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పవిత్ర సంగమం వద్ద  జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహించిన విషయాన్ని ఆండ్రూ గుర్తు చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి సదస్సు నిర్వహించినట్లు స్పీకర్ తెలిపారు. మూడు రోజులు జరిగిన ఆ సదస్సుకు దేశవిదేశాల్లోని వివిధ రంగాలకు చెందిన 25వేల మంది మహిళలు హాజరైనట్లు చెప్పారు. అక్కడ ప్రసంగించిన మహిళలు, విద్యార్థినుల ప్రసంగాలు, అనుభవాలు, ఆలోచనలు, సిఫారసులు ఆధారంగా అమరావతి డిక్లరేషన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. మహిళా సాధికారితకు సంబంధించి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అందరూ మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, వారి పట్ల నడుచుకోవలసిన విధానం గురించి ఆ ప్రకటనలో పేర్కొననున్నట్లు తెలిపారు. త్వరలో అమరావతి ప్రకటన విడుదల చేస్తామని స్పీకర్ చెప్పారు. వారి మధ్య చర్చలు ముగిసిన అనంతరం స్పీకర్ డాక్టర్ కోడెల జాతీయ మహిళా పార్లమెంట్ లో ప్రసంగాల పుస్తకాన్ని, గౌతమబుద్ధుని చిత్రపటాన్ని ఆండ్రూకు అందజేశారు. అనంతరం ఆండ్రూ శాసనసభను సందర్శించారు. లోపల స్పీకర్ తో కలసి ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో శాసన సభ  స్పెషల్ సెక్రటరీ పీపీకె రామాచార్యులు, పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పలు రంగాల్లో కలసి పని చేయడానికి సుముఖత
అనంతరం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తో జరిగిన చర్చల్లో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. సామాజిక, ఆర్థిక, సేవా రంగాల్లో కలసి పనిచేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ఆయనకు వివరించినట్లు తెలిపారు.

అసెంబ్లీ కమిటీ సభ్యులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం


శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల
సచివాలయం, ఆగస్ట్ 30: శాసనసభ కమిటీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. శాసనసభ భవనం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ), పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ (పీయుసీ),  ఎస్టిమేట్స్ కమిటీల తొలి సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఆయా కమిటీల చైర్మన్లు, సభ్యులు సమస్యలు, సౌకర్యాలతోపాటు పలు అంశాలను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. స్పీకర్ కంటే ముందు తాను శాసనసభ్యుడినని, కమిటీ సభ్యులకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. సభ్యుల మనోభావాలను గౌరవిస్తానని చెప్పారు. శాసనసభ కమిటీలు 19 వరకు ఉన్నాయని, వాటిలో దేని ప్రాధాన్యత దానిదేనని, అయితే ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన ఈ మూడు కమిటీలు కీలకమైనవని అన్నారు. సభ్యులలో కొంతమంది పాతవారితోపాటు కొత్తవారు కూడా ఉన్నారు. కమిటీలు పని చేసే విధానం, నియమ నిబంధనలు వివరించారు.  ఈ కమిటీల సభ్యులు ఎవరూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే అవకాశం లేదని చెప్పారు.  కమిటీ సభ్యులు ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు, ఖర్చు చేసే నిధులు, అక్కడ జరిగే పనులను పరిశీలించి నివేదికలు ఇవ్వాలని తెలిపారు. అన్ని అంశాలలో కమిటీ సభ్యులకు తాను పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.  కమిటీలకు రూమ్ లు కేటాయించడానికి తగిన స్థలం లేదని, పక్కన కొత్తగా నిర్మించే భవనంలో రూమ్ లు కేటాయించడానికి ప్రయత్నిస్తానని స్పీకర్ చెప్పారు.  కమిటీ సభ్యులు ఏదైనా పర్యటనకు వెళ్లడానికి 15 రోజులు ముందు చెబితే సౌకర్యాలు కల్పించడానికి వీలవుతుందని శాసన సభ  స్పెషల్ సెక్రటరీ పీపీకె రామాచార్యులు చెప్పారు.
సమావేశంలో పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ కాగిత వెంకటరావు, మూడు కమిటీల సభ్యులు,  పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Aug 28, 2017

‘కన్యాశుల్కం’ ప్రదర్శనకు 125 ఏళ్లు


§  26,27 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ ఉత్సవాలు
§  విశాఖపట్నంలో సదస్సు నిర్వహణ
§  25న గురజాడ నివాసంలో రజత ఫలకం ఏర్పాటు
      తెలుగు సాహిత్యంలో అగ్రభాగాన నిలిచేది కన్యాశుల్కంనాటకం. అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు రచనకన్యాశుల్కంనాటక ప్రదర్శన 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించే  ఈ ఉత్సవాలకు విశాఖపట్నం వేదిక కానుంది. ఈ నాటికను తొలిసారి విజయనగరంలో 1892 ఆగస్ట్ 13 ప్రదర్శించారు. ఈ ఏడాదికి సరిగ్గా 125 ఏళ్లు పూర్తి చేసుకుంది. కన్యాశుల్కం ఉత్సవాలకు భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందిస్తుండగా మొజాయిక్ సాహిత్య సంస్థ సమన్వయం చేయనుంది. కన్యాశుల్కం జాతీయ ఉత్సవాల ప్రారంభానికి ముందురోజు  25న విజయనగరంలోని గురజాడ నివాసంలో రజత ఫలకం ఏర్పాటు చేస్తారు. ఉత్సవాలు జరిగే రెండు రోజులు విశాఖపట్నంలో సదస్సు నిర్వహిస్తారు. సదస్సులలో ఒడిషా, బెంగాల్, అసోం నుంచి వక్తలు ఆయా భాషల్లో కన్యాశుల్కంసమకాలీన రచనలపై ప్రసంగిస్తారు. తెలుగు సాహితీ ప్రముఖులతో కలిసి ఒకే వేదికను పంచుకుంటారు.
ఈ నాటకం, అందులోని పాత్రల గురించి ప్రతి ఒక్క తెలుగువారికి  తెలుసు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ ఉండదనుకుంటాను.  స్తీవిద్య ఆవశ్యకతను వివరిస్తూ, బాల్యవివాహాలను నిరసిస్తూ గురజాడ తన పదునైన కలాన్ని ఆనాడే ఎక్కుపెట్టారు. అప్పటి సాంఘిక దురాచారాలను తరిమికొట్టేందుకు రచనలనే ఆయుధంగా చేసుకుని నవ చైతన్యాన్ని తీసుకు వచ్చారు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఇందులో తెలుగు వాతావరణ, మానవ స్వభావాలు, ముఖ్యంగా తెలుగు జీవితం ఉంది. విలువలకు భ్రష్టుపట్టిన తీరును చక్కగా ఆవిష్కరించారు. నాటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న కన్యాశుల్కం అంశం లోతులను సృచించిన నాటకం ఇది. హేయమైన మానవ నైజాలూ-వేశ్యల జీవితాలు న్యాయవాదుల వ్యవహార శైలి - కుహనా మేధావులు గిరీశం లాంటి మోసగాళ్లు- చిన్న పిల్లను ముసలివారికి ఇచ్చి పెళ్ల చేయడంతో కొద్ది రోజులు, నెలలకే వారు చనిపోవడంతో జీవచ్ఛవాల్లా జీవించే బాలవితంతువుల బతుకు చిత్రం, అప్పటి సమాజిక స్థితిగతులకు దర్పణం ఇది. ఇందులోని పాత్రలు ఇప్పటికీ ప్రతినిత్యం మనకి తారసపడేవే. కథలోని వస్తువు, పాత్రల చిత్రీకరణ, భాష, సంభాషణా చాతుర్యం వల్ల ఇది ఆధునిక నాటక సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆలోచనలు రేకెత్తించే ఈ నాటకం  రంగస్థలం బతికున్నంతకాలం సజీవంగా నిలుస్తుంది. ఈ నాటకానికి
అంతటి శక్తి ఉంది. రైతుల కడగండ్లను చిత్రిస్తూ దీనబంధు మిత్రా బెంగాలీలో రాసిన నీల్ దర్పణ్ ఆధునిక భారతీయ నాటకాల్లో తొలి నాటకం కాగా, రెండో ఆధునిక నాటకం కన్యాశుల్కం. సమాజం నుంచి కన్యాశుల్కం దురాచారం పోయినా ఆ పేరుతో గురజాడ వారి  నాటకం మిగిలింది. ఆ పాత్రలు తెలుగువారు మరచిపోలేనివి.  భారతీయ నాటకరంగంలో ఇన్నేళ్లు మనుగడ సాగించిన నాటకం ఇది ఒక్కటే.  125 ఏళ్లు చరిత్ర కలిగిన ఏకైక నాటకం కన్యాశుల్కం  కావడం తెలుగువారిగా మనం గర్వించదగిన అంశం.  సాధారణంగా తొమ్మిది గంటల నిడివి గల కన్యాశుల్కం నాటక రూపకాన్ని మూడున్నర గంటలకు సంక్షిప్తం చేసి తొలిసారిగా విశాఖ వుడా ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. కన్యాశుల్కం సావనీర్‌ను ప్రచురిస్తారు. అలాగే ఈ ఉత్సవాలలో లఘు సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు సాహిత్య, నాటకరంగ కృషీవలురకు గౌరవ సన్మానాలు చేస్తారు.
శిరందాసు నాగార్జున


Aug 24, 2017

26న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పౌరసన్మానం

గృహ నిర్మాణ పథకం పైలాన్‌ ఆవిష్కరణ

సచివాలయం, ఆగస్ట్ 23: ఈ నెల 26వ తేదీ శనివారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఘనంగా పౌరసన్మానం చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి పర్యటన వివరాలు తెలిపారు. 26వ తేదీ ఉదయం 9.10 గంటలకు ఉప రాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు. గవర్నర్ నరశింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు ఆయనకు స్వాగతం పలుకుతారని తెలిపారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నందున ఓపెన్ టాప్ జీపులో వెలగపూడిలోని శాసనసభ, సచివాలయ భవనాల వద్దకు 10.40 గంటలకు చేరుకుంటారన్నారు.  జీపులో ఆయన వెంట గవర్నర్, సీఎం ఉంటారని చెప్పారు. వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి  ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథకం కింద 2.25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ  చివరి సంతకం చేశారని తెలిపారు.  సచివాలయం వద్ద ఇళ్ల పథకం పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారని చెప్పారు. ఆ తరువాత 11 గంటకు ఉప రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిపారు.  
వెలగపూడిలో తన పర్యటన ముగించుకొని సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఉపరాష్ట్రపతి  తెనాలి వెళతారని చెప్పారు. అక్కడ ఆలపాటి వెంకట్రామయ్య శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని, వెంకట్రామయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. తెనాలిలో తల్లి, బిడ్డల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఆ కార్యక్రమాలకు ఉప రాష్ట్రపతి వెంట మంత్రి నక్కా ఆనందబాబు ఉంటారని తెలిపారు.
 సాయంత్రం 4.30 గంటలకు ఉప రాష్ట్రపతి పర్యటన ముగించుకొని గన్నవరం వద్ద ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్ట్ కు వెళతారు. ఆదివారం ఉదయం 9 గంటలకు స్వర్ణభారతి ట్రస్టు లో ఏర్పాటు చేసే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఆ వైద్య శిబిరంలో హైదరాబాద్ నుంచి, మణిపాల్ ఆస్పత్రి నుంచి డాక్టర్లు వస్తారని తెలిపారు. అనంతరం 10.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఉప రాష్ట్రపతి ఢిల్లీ బయలుదేరతారని మంత్రి కామినేని చెప్పారు.

ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తాం

కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్ధులకు న్యాయం చేస్తామని మంత్రి కామినేని చెప్పారు. ప్రభుత్వం తరపున కోర్టులో గౌరవ బెనర్జీ అనే న్యాయవాది వాదిస్తున్నట్లు తెలిపారు. ఆ విద్యార్థులను ప్రభుత్వ కాలేజీలలో సర్ధుబాటు చేయమని కోర్టు చెబితే ఆ విధంగా చేస్తామన్నారు. 108 సేవలకు సంబంధించి కోర్టు తీర్పు  ప్రభుత్వానికి అనూకూలంగా వచ్చినట్లు తెలిపారు.  త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. 108 వాహనంలో రోగిని ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు సంబంధిత డాక్టర్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా నూతన యాప్ ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఎంఆర్ వ్యాక్సిన్ 9 రోజుల్లో 90 లక్షల మందికి వేసినట్లు తెలిపారు. మిగిలినవారికి కూడా వ్యాక్సిన్ వేస్తామన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు చట్టపరమైన హక్కులు కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు తెలిపారు. ఎయిమ్స్ (ఏఐఐఎంఎస్- ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరగతులు 2018-19లో ప్రారంభమవుతాయని చెప్పారు. మంగళగిరి వద్ద భవన నిర్మాణం పూర్తి అయ్యే లోపు విజయవాడలో క్లాసులు నిర్వహిస్తారని మంత్రి కామినేని తెలిపారు. మీడియా సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు కూడా పాల్గొన్నారు.

Aug 22, 2017

న్యాయ శాస్త్ర పుస్తక ప్రచురణకు ఆర్థిక సాయం

సచివాలయం, ఆగస్ట్ 21: రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పేర్కొన్న హిందీ, ఇతర ప్రాంతీయ భాషలలో న్యాయ శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను ప్రచురించే స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందించే పథకాన్ని  కేంద్ర న్యాయశాఖలోని అధికార భాషల విభాగం ప్రకటించింది. చట్టాలు, న్యాయ శాస్త్ర పుస్తకాల ప్రచురణ, ప్రామాణిక చట్టాలకు సంబంధించిన పుస్తకాలను అనువదించడం, న్యాయ పదకోశం, న్యాయశాస్త్ర జర్నల్స్ ప్రచురణవివిధ రాష్ట్రాల్లో  న్యాయ సంబంధంమైన అంశాలు, చట్టాలకు ప్రాచుర్యం కల్పించడానికి ఉద్దేశించిన ప్రచురణలకు ఈ ఆర్థిక సాయం అందిస్తారు. స్వచ్ఛంద సంస్థలు దరకాస్తులు పంపడానికి చివరి తేదీ ఆగస్ట్ 31గా కేంద్ర న్యాయశాఖ అధికార భాషల విభాగం జాయింట్ సెక్రటరీ రామ్ ధన్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు.  దరకాస్తు, ఈ పథకం వివరాలు శాఖ వెబ్ సైట్ WWW.lawmin.nic.in/olwing లో ఉంటాయని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు తమ బ్యాంకు ఖాతా నెంబరు, చిరునామాతో దరకాస్తులను ఆయా రాష్ట్రాల న్యాయ శాఖ ద్వారా గానీ, జిల్లా కలెక్టర్ ద్వారా గాని పంపించాలని ఆ ప్రకటనలో వివరించారు. అర్హత గల సంస్థలకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సహాయం అందజేస్తారని ఏపీ న్యాయశాఖ కార్యదర్శి తెలిపారు.  

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...