Aug 16, 2017

రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ: స్పీకర్ కోడెల


శాసనసభ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవాలు
సచివాలయం, ఆగస్ట్ 15: రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో మంగళవారం ఉదయం స్వాతంత్ర్య దినోత్సవంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్మా, టూరిజం, విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నట్లు తెలిపారు. 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎందగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆ దిశగానే దేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారుదేశంలోని యువశక్తిని, ఇతర మానవ వనరులను సరైన రీతిలో వినియోగించుకొని ప్రజల భాగస్వామ్యంతో దేశం అద్వితీయమైన శక్తిగా ఎదగాలన్నారు. గడచిన మూడేళ్లలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి-సంక్షేమం రెండిటి మధ్య సమతౌల్యం ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నూతన శాసనసభ భవనాల ఆకృతులు, మౌలికసదుపాయాల కల్పన వంటి అంశాలకు సంబంధించి సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ), లండన్ కు చెందిన నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులతో జరిగిన చర్చలలో తాను పాల్గొని అభిప్రాయాలు తెలియజేసినట్లు చెప్పారు. దీర్ఘకాల అనుభవం కలిగిన శాసనసభ, మండలి సిబ్బందితో కూడా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు, సలహాలు,సూచనలు కూడా తెలుసుకోవలసిందిగా అధికారులను ఆదేశించామన్నారుత్వరలోనే శాసనసభ భవనాల  నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని స్పీకర్ తెలిపారు
శరవేగంతో ఏపీ అభివృద్ధి: కౌన్సిల్ వైస్ చైర్మన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నట్లు శాసన మండలి వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు. మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్య లభించినట్లు గుర్తు చేశారు. ప్రతి పౌరుడు ఈ దేశానికి మనమేమైనా చేస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. స్వాతంత్ర్య లభించి ఏడు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలిపారు. మండలి భవనంపై జాతీయ జెండా ఎగువేసే అరుదైన అవకాశం తనకు లభించినందుకు ఆనందం వ్యక్తం చేశారుగ్రామాభ్యుదయమే దేశాభివృద్ధి అన్న పూజ్య బాపూజీ వ్యాక్యలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధిపరుస్తున్న ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. పవిత్రమైన విద్యాలయాలు ఉన్న ప్రాంతాలే అభివృద్ధి చెందుతాయని, అందువల్ల విద్యపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. మీడియా సమావేశంలో శాసన మండలి సభ్యులు గాదే శ్రీనివాసులు నాయుడు కూడా మాట్లాడారు. శాసన సభ  స్పెషల్ సెక్రటరీ పీపీకె రామాచార్యులు, పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శాసనసభలో జాతీయ జెండా ఆవిష్కరించిన స్పీకర్
సచివాలయం, ఆగస్ట్ 15: రాష్ట్ర రాజధాని అమరావతిలో వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రాంగణంలో మంగళవారం ఉదయం ఘనంగా 71వ స్వాతంత్ర్య దిన వేడుకలు నిర్వహించారు. శాసన సభ భవనంపైన ఉదయం 8.15 గంటలకు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ  స్పెషల్ సెక్రటరీ పీపీకె రామాచార్యులు, పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
శాసనమండలిలో జాతీయ జెండా ఆవిష్కరణ
సచివాలయం, ఆగస్ట్ 15: రాష్ట్ర రాజధాని అమరావతిలో వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రాంగణంలో మంగళవారం ఉదయం ఘనంగా 71వ స్వాతంత్ర్య దిన వేడుకలు నిర్వహించారు. శాసన మండలి భవనంపైన ఉదయం 7.45 గంటలకు మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు గాదే శ్రీనివాసులు నాయుడు, శాసనసభ పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి
ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రహి
సచివాలయం, ఆగస్ట్ 15: ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని  ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రహి కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్  సచివాలయ ప్రాంగణంలో మంగళవారం ఉదయం ఘనంగా 71వ స్వాతంత్ర్య దిన వేడుకలు నిర్వహించారు. సచివాలయం 1వ బ్లాక్ ముందు ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జాతీయ జెండాను అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయంలో రెండవసారి జాతీయ జెండాను ఆవిష్కరించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఙతలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో ఏడాది రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో కర్నూలు, అనంతపురం, విశాపట్నంలలో నిర్వహించారని, ఈ ఏడాది తిరుపతిలో జరుగుతున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...