Aug 19, 2017

అవకాశాలు అందిపుచ్చుకునేలా మహిళలకు శిక్షణ

Ø డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం
Ø 90.81 లక్షల మందికి నైపుణ్య శిక్షణ
Ø రూ.4,585.36 కోట్లు పొదుపు
Ø కుటుంబానికి రూ.10 వేల ఆదాయం లక్ష్యం
Ø కుటుంబ సభ్యుల వివరాల సేకరణ
Ø ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉంది. ఇందు కోసం స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 5 వేల మంది ఉద్యోగులు మహిళా సంఘాల నాయకులు, ముఖ్య సభ్యులతో సమావేశమై వారి ఆదాయం పెంచే మార్గాలపై సమగ్ర కార్య ప్రణాళికల రూపొందిస్తున్నారు. మరో పక్క డ్వాక్రా మహిళలందరికీ వెంటనే నైపుణ్య శిక్షణ, కనీస విద్య అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కుటుంబం నెలకు రూ.10 వేల ఆదాయం సంపాదించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ ఆదాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాలలోని సభ్యుల విద్యార్హతలు,  కుటుంబ సభ్యులపై ఆధారపడ్డ వారెందరు, వారికి వున్న నైపుణ్యాలు ఏమిటి, ఎటువంటి అవకాశాలు వారికి కల్పించవచ్చు, మార్కెట్ వసతులు ఎలా వున్నాయి మొదలైన సమాచారం మొత్తం సేకరించి, వారికి ఏ ఏ రంగాలలో చేయూతను అందించాలో సమగ్ర కార్య ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్రతి సభ్యురాలి పూర్తి సమాచారం తీసుకుని వారికి తగిన అవకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మరుగుదొడ్ల నిర్మాణం, మధ్యాహ్న భోజన పథకం, వర్మి కంపోస్ట్, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి సెంట్రింగ్ పనులు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఏఏ వృత్తులలో ఎంతమంది వున్నారో సెర్ప్(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఒక సర్వే నిర్వహించింది. సుమారు 50 లక్షల మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో వున్నట్లు తేలింది. వ్యవసాయ రంగంలో వున్న మహిళల ఆదాయం పెంచేందుకు భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ (బీఏఐఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ప్రతి మండలంలో రిటైల్ రంగంలో వున్న మహిళల కోసం పతంజలి లాంటి ఏజెన్సీల ద్వారా ఫ్రాంఛైజీలు పెట్టించే ఏర్పాటు చేయడమే కాకుండా హస్తకళల వస్తువులను విక్రయించేందుకు ఇ-మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాల ఉత్పత్తులు, పశు సంవర్ధక రంగాలలో ఆదాయ ఆర్జనకు మార్గాలు విస్తృతంగా వున్నాయి.  ఆయా రంగాలలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించేవీలుంటుందని ప్రభుత్వం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ వున్న టెక్స్‌ టైల్ రంగంలో రాణించేందుకు, తయారీరంగంలో వున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా డ్వాక్రా మహిళలకు తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.

డ్వాక్రా సంఘాల మహిళల విజయగాధలు ఒకప్పుడు దేశానికే స్ఫూర్తివంతంగా నిలిచాయి. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఏపీ మహిళా సాధికార సంస్థ ద్వారా మళ్లీ ఆ సంఘాలకు పూర్తి జవసత్వాలు కల్పించడానికి ప్రభుత్వం పూనుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,01,567 స్వయం సహాయక బృందాల(సెల్ఫహెల్ప గ్రూపులు)లో 90.81 లక్షల మంది సభ్యులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 7.11 లక్షల గ్రూపుల్లో 71.75 లక్షల మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 1.91 లక్షల గ్రూపుల్లో 19.06 లక్షల మంది ఉన్నారు. ఈ గ్రూపుల్లో అట్టడుగు వర్గాలకు చెందిన చెంచు, యానాది వంటి కులాలకు చెందిన మహిళలు కూడా ఉన్నారు.  పట్టణ ప్రాంతాల్లోని గ్రూపుల కార్పస్ రూ.1,162.62 కోట్లు, గ్రామీణ ప్రాంత గ్రూపుల కార్పస్ రూ. 6,627.95 కోట్లతోపాటు సభ్యులు రూ.4,585.36 కోట్లు పొదుపు చేశారు. 99.47 శాతం మంది అంటే 90,33,342 మంది సభ్యుల ఆధార్ సమాచారాన్ని అనుసందానం చేశారు. ఈ గ్రూపులను బ్యాంకులతో జతపరచడంతో మహిళలు స్వయం ఉపాధి ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నారు.  గత ఏడాది(2016-17) 4,59,815 గ్రూపులు లక్ష్యానికి మించి రూ.14,271 కోట్లు తీసుకున్నాయి. ఈ ఏడాది జూన్ వరకు 26,276 గ్రూపులు రూ. 674.76 కోట్లు తీసుకున్నాయి. చంద్రన్న చేయూత మూలధన పెట్టుబడి పథకం కింద ఒక్కో సభ్యురాలికి రూ.10,000 చొప్పున మొత్తం  పది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 8.2 లక్షల గ్రూపులకు పెట్టుబడి నిధి కింద రెండు విడతలుగా రూ. 4,972 కోట్లు ఇచ్చారు. అంతేకాకుండా 2014 ఫిబ్రవరి నుంచి 2015 ఏప్రిల్ వరకు గ్రూపులకు వడ్డీ రాయితీ కింద రూ.1842 కోట్లు విడుదల చేశారు. 2015-16 సంవత్సరానికి సంబంధించి రూ. 700 కోట్ల మేర వడ్డీ రాయితీని గ్రామీణ, పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు విడుదల చేయనున్నారు.  ఈ నిధుల విడుదలతో రాష్ట్రంలోని 7 లక్షల స్వయం సహాయక సంఘాలకు లబ్ది చేకూరుతుంది. మహిళా సంఘాల ద్వారా అమలు అవుతున్న ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, పండ్లతోటలు, ఎవెన్యూ ప్లాంటేషన్ తదితర  కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. వీటన్నిటికీ తోడు స్త్రీనిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ద్వారా వివిధ పథకాల కింద పేద మహిళా గ్రూపులకు రుణాలు అందజేస్తున్నారు. స్త్రీనిధి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ 30 వరకు 22,271 గ్రూపులకు చెందిన 99,126 మందికి రూ.213.84 కోట్ల రుణాలు అందజేశారు. స్త్రీనిధి ద్వారా రుణాలు పొందేవారికి జీవిత బీమా కూడా ఉంటుంది. ఈ ఫెడరేషన్ ద్వారా రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లించినవారికి వడ్డీలేని రుణాలు కూడా అందజేస్తారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటులో భాగంగా రాష్ట్రంలో 42,883 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది.  ఆరున్నర లక్షల పశువులకు గ్రాసం కోసం 65 వేల ఎకరాల్లో పశుక్షేత్రాల ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.  ప్రతి పంచాయతీకి పశుమిత్రలుగా డ్వాక్రా సభ్యులను నియమించి వారికి నెలకు రూ. 2,500 ఆదాయం వచ్చే ఏర్పాటు చేయనుంది. రహదారులకు ఇరువైపులా మొక్కల పెంపకం చేపట్టడంతో పాటు నర్సరీలు ఏర్పాటు చేసే బాధ్యతను కూడా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించనున్నారు. ఈ  విధంగా అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో మహిళల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి  పేదరిక నిర్మూలన దశ దాటి ముందుకెళ్లి కుటుంబానికి నెలకు కనీసం రూ.10 వేల ఆదాయం అందించే స్థాయికి తీసుకువెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  ఇటువంటి లక్ష్యాలు పెట్టుకుని పని చేస్తున్న ప్రభుత్వం దేశం మొత్తం మీద ఏపీ ఒక్కటే.


-         శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్, 9440222914.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...