Aug 10, 2017

ప్రజల సంతృప్తే ముఖ్యం

మునిసిపల్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు



Ø బాధ్యతగల పౌరులకు గుర్తింపు
Ø ఆన్ లైన్ సేవల ద్వారా తగ్గిన వృధా వ్యయం
Ø అన్ని బ్లాక్ స్పాట్ లు గ్రీన్ స్పాట్ లుగా మార్పు
Ø ప్రజల భాగస్వామ్యంతో స్మార్ట్ పట్టణాలు

సచివాలయం, ఆగస్ట్ 10: ప్రభుత్వ పాలనకు సంబంధించి ఏ పనికైనా ప్రజల సంతృప్తి ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయం 2వ బ్లాక్ లో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమాండ్ కమ్యునికేషన్ సెంటర్ (సీసీసీ)ను గురువారం ఉదయం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆ తరువాత ఆ శాఖ  పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కమ్యునికేషన్ సెంటర్ నిర్వహణ, వారు అనుసరిస్తున్న విధానాలు, కొన్ని మున్సిపాలిటీలలో జరుగుతున్న పనులను లైవ్ లో పరిశీలించి ఆ శాఖ ఉద్యోగులను, అక్కడ జరుగుతున్న పనితీరును ప్రశంసించారు. నగరాలు, పట్టణాలలో జీవించే ప్రతి పౌరుడు ఆ నగరం, ఆ పట్టణం తనదిగా భావించి, గర్వంగా చెప్పుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని, ఆ విధంగా పారిశుధ్యంలో వారిని కూడా భాగస్వాములను చేయాలని అన్నారు. పారిశుధ్యం, ఇతర విషయాలలో అత్యంత బాధ్యతగా వ్యవహరించే పౌరులకు పన్నుల్లో రాయితీలు ఇవ్వడం, వారిని గుర్తించి, ప్రోత్సహించే విధంగా బిరుదులు ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. మూడు నెలల్లో మునిసిపల్ పనితీరుపట్ల ప్రజల్లో 80 శాతానికి మించి సంతృప్తి కనిపించాలని, ఆ తరువాత అది వంద శాతానికి చేరేవిధంగా పనులు చేయించాలన్నారు. ఇందులో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలని, అలాగే వారి ఆలోచనలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ను కూడా పొందాలని సూచించారు. ఏజన్సీలు పారిశుధ్య పనులను సక్రమంగా చేయకపోతే వారికి ఇచ్చే డబ్బుకు కోత విధించడం, ఇతర రకాల చర్యలు తీసుకోవడం, అవసరమైతే ఏజన్సీని రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పనులను సమయానికి చక్కగా చేసేవారికి ప్రోత్సహకాలు ఇచ్చే అంశం ఆలోచించమని చెప్పారు.  కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తెలుసుకునే విషయాలను ప్రజలు కూడా తెలుసుకునే విధంగా వారికి అందుబాటులోకి తేవాలని చెప్పారు. మీరు చేసే పనుల వల్ల ప్రజలు ఎంత సంతృప్తి చెందుతున్నారోముఖ్యంగా మీరు ఎక్కడ ఉన్నారో ముందు తెలసుకోవాలన్నారు. ఆ తరువాత 3వ పార్టీతో కూడా సర్వే చేయిస్తామని చెప్పారు. ఆన్ లైన్ వినియోగంలో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముందుండటం పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ముఖ్యమైన శాఖలు ఇదేమాదిరి కమాండ్ కంట్రోల్ సెంటర్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రాధాన్యత తక్కువగా ఉన్న శాఖలు రెండు, మూడు కలసి ఒక సీసీసీలను ఏర్పాటు చేసుకోవచ్చని సీఎం సలహా ఇచ్చారు.

               రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలలో పారిశుధ్యం, కమ్యునిటీ, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, శుభ్రత, మురుగు నీటి పారుదల, మంచినీరు సరఫరా, రోడ్లు, గృహనిర్మాణం... అన్ని విషయాలను కమాండ్ కమ్యునికేషన్ సెంటర్  నుంచి పర్యవేక్షిస్తున్నట్లు మునిసిపల్ పరిపాలనా విభాగం డైరెక్టర్ కె.కన్నబాబు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో 18,500 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించామాని, ప్రతి రోజు అక్కడ జరిగే పారిశుధ్య కార్యక్రమాలను సమయంతో సహా లైవ్ లో పరిశీలిస్తారని తెలిపారు. శుభ్రత ఏ స్థాయిలో జరిగిందో కూడా తెలుసుకుంటారని చెప్పారు. అన్ని బ్లాక్ స్పాట్లు గ్రీన్ బ్లాక్ స్పాట్ లుగా మార్పుచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారువరుసగా ఏడు రోజుల పాటు ప్రామాణికంగా శుభ్రతను పాటిస్తే దానిని గ్రీన్ బ్లాక్ గా ప్రకటిస్తామని చెప్పారు. ప్రతిరోజూ పారిశుధ్యాన్ని పరిశీలించేవారు కాకుండా, గ్రీన్ బ్లాక్ ను గుర్తించడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ఈ పనులను పర్యవేక్షించడానికి స్మార్ట్ పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా 850 మందికి శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశ్యుధ్య పనులను, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ నిర్మాణాలు, మోడల్ ఇళ్ల నిర్మాణాలను సీఎంకు లైవ్ లో చూపించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్,  ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.కరికాల వళవన్, రియల్ టైమ్ గవర్నెన్స్ సీఈఓ .బాబు, విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఆన్ లైన్ ద్వారా తగ్గిన వృధా వ్యయం

       సమీక్షా సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందించే సేవలన్నీ ఆన్ లైన్ లో జరుగుతుండటంతో వృధా వ్యయం, సమయం తగ్గడంతోపాటు అనివీతి కూడా తగ్గుతుందన్నారు. ప్రతి మునిసిపాలీటీని స్మార్ట్ మునిసిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రజలను కూడా భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడు తాను నివశించే నగరం, పట్టణం తనదిగా గర్వంగా చెప్పుకునే విధంగా వ్యవహరించేవిధంగా వారిలో అవగాహన కల్పిస్తామన్నారు. అన్ని పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బ్లాక్ స్పాట్ లను గ్రీన్ స్పాట్ లుగా మారుస్తున్నట్లు చెప్పారు.  ప్రతి పట్టణంలో పార్కులు, గ్రీనరీ, డివైడర్లు, పారిశుధ్యం, శాంతిభద్రతలను పరిరక్షిస్తూ పౌరులు వంద శాతం సంతృప్తి చెందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. జిల్లా కేంద్రాల్లో కూడా కమాండ్ కమ్యునికేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఇక్కడి సెంటర్ కు అనుసంధానం చేస్తామన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...