Aug 31, 2017

ఏపీ 3 ఏళ్ల బేబి


శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల
Ø స్పీకర్ ని కలసిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ
Ø రాష్ట్రం ఇన్వెస్టర్స్ పేరడైజ్
Ø టాయిలెట్ల నిర్మాణంలో ఏపీ నెంబర్ 1
Ø త్వరలో అమరావతి ప్రకటన

సచివాలయం, ఆగస్ట్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడేళ్ల బేబీ అని, అయినా అభివృద్ధిలో ముందుందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బుధవారం ఉదయం శాసనసభ ప్రాంగణంలోని స్పీకర్ చాంబర్ లో ఆయనను గౌరవపూర్వకంగా కలిశారు. శాసనసభ లోపలి భాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర పనులలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తమ సత్తెనపల్లి శాసనసభా నియోజకవర్గంలో 120 రోజుల్లో 20వేల టాయిలెట్లు నిర్మించినట్లు తెలిపారు. మహిళల ఆత్మగౌరవం, అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో టాయిలెట్ల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. స్వచ్ఛాంధ్ర గురించి తక్కువ సమయంలో ఎక్కువగా  ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. అలాగే శ్మశానవాటికలను ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. తమ నియోజకవర్గంలో 400 శ్మశానవాటికలను ఆధునీకరించినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యావరణం, నీటిపారుదల, పరిశ్రమలు, విద్య, వైద్యం, విద్యుత్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఇన్వెస్టర్స్ పేరడైజ్ గా స్పీకర్ అభివర్ణించారు. ఆ సందర్భంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయాన్ని ఆండ్రూ ప్రస్తావించారు. నదులు అనుసంధానంలో భాగంగా కృష్ణా-గోదావరి నదులను అనుసంధానించినట్లు, 24 గంటలు నిరంతరం విద్యుత్ అందిస్తున్నట్లు స్పీకర్ వివరించారు. 190 రోజుల్లో శాసనసభ భవన సముదాయాల నిర్మాణం పూర్తీ చేసినట్లు తెలిపారు. ఇండియా-యూకె భాగస్వామ్యంతో అమరావతిలో ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. నూతన రాజధాని అమరావతిలో పరిపాలన, న్యాయ నగరాల డిజైనింగ్ బ్రిటన్ కు చెందిన నార్మన్ ఫాస్టర్ సంస్థ అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్న మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, వారు స్వయంప్రతిపత్తి సాధించడానికి స్వయంసేవక బృందాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పవిత్ర సంగమం వద్ద  జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహించిన విషయాన్ని ఆండ్రూ గుర్తు చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి సదస్సు నిర్వహించినట్లు స్పీకర్ తెలిపారు. మూడు రోజులు జరిగిన ఆ సదస్సుకు దేశవిదేశాల్లోని వివిధ రంగాలకు చెందిన 25వేల మంది మహిళలు హాజరైనట్లు చెప్పారు. అక్కడ ప్రసంగించిన మహిళలు, విద్యార్థినుల ప్రసంగాలు, అనుభవాలు, ఆలోచనలు, సిఫారసులు ఆధారంగా అమరావతి డిక్లరేషన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. మహిళా సాధికారితకు సంబంధించి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అందరూ మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, వారి పట్ల నడుచుకోవలసిన విధానం గురించి ఆ ప్రకటనలో పేర్కొననున్నట్లు తెలిపారు. త్వరలో అమరావతి ప్రకటన విడుదల చేస్తామని స్పీకర్ చెప్పారు. వారి మధ్య చర్చలు ముగిసిన అనంతరం స్పీకర్ డాక్టర్ కోడెల జాతీయ మహిళా పార్లమెంట్ లో ప్రసంగాల పుస్తకాన్ని, గౌతమబుద్ధుని చిత్రపటాన్ని ఆండ్రూకు అందజేశారు. అనంతరం ఆండ్రూ శాసనసభను సందర్శించారు. లోపల స్పీకర్ తో కలసి ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో శాసన సభ  స్పెషల్ సెక్రటరీ పీపీకె రామాచార్యులు, పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పలు రంగాల్లో కలసి పని చేయడానికి సుముఖత
అనంతరం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తో జరిగిన చర్చల్లో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. సామాజిక, ఆర్థిక, సేవా రంగాల్లో కలసి పనిచేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ఆయనకు వివరించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...