Aug 1, 2017

ఆనందనిలయంగా అమరావతి


      ప్రజారాజధానిని అత్యాధునికంగా సకల సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడంతోపాటు ఆనందనిలయంగా రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) చర్యలు చేపట్టింది. ముఖ్యంగా శాఖమూరు గ్రామంలో నెలకొల్పే ఉద్యానవనాన్ని అన్ని వయసులవారికి వినోదం కలిగించే విధంగా, ఆరోగ్యకరమైన జీవన విధానానికి అనువైన ఆటవిడుపుయ కేంద్రంగా, మన సంస్కృతి, వారసత్వానికి చిహ్నంగా, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేవిధంగా రూపొందించనున్నారు. దీనికి ‘గాంధీ మెమోరియల్’ అన్న పేరు పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పచ్చదనం-జలకళ ఉట్టిపడే నగర నిర్మాణంలో భాగంగా వృక్ష పరిశోధన- అభివృద్ధి కేంద్రం, వివిధ రకాల మేలు జాతి మొక్కల పెంపకం కోసం దానికి అనుబంధంగా ఒక నర్సరీని కూడా ఏర్పాటు చేయనున్నారు.  నాలుగు జోన్లుగా రూపొందించే ఉద్యానవనం కోసం 241 ఎకరాలు కేటాయించారు. అందులో మొదటి జోన్ కు 85 ఎకరాలు, 2వ జోన్ కు 34 ఎకరాలు, 3వ జోన్ కు 49 ఎకరాలు, అంబేద్కర్ పార్కు ఏర్పాటు చేసే 4వ జోన్ కు 73 ఎకరాలు కేటాయించారు. మొదటి జోన్ లో 46 ఎకరాల్లో ఎమ్యూజ్ మెంట్ పార్క్, పది ఎకరాల్లో క్రాఫ్ట్ బజార్, ఆరు ఎకరాల్లో ఈవెంట ఎరీనా, యాంఫీ థియేటర్, 23 ఎకరాల్లో రిసార్ట్స్ నిర్మిస్తారు. అంతే కాకుండా ఈ జోన్ లో మ్యూజికల్ ఫౌంటెన్లు, లేజర్ షోలు ఏర్పాటు చేస్తారు. క్రాఫ్ట్ బజార్ లో రాష్ట్రంలోని అన్ని రకాల హస్తకళలకు స్థానం కల్పిస్తారు.  2వ జోన్ ని పూర్తిగా పిల్లలకు కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల కోసం అత్యంత ఉత్తమమైన పార్కులుగా పేరుగాంచిన వాటిలో ఉండే అన్ని రకాల ఆకర్షణీయమైనవన్నీ ఇక్కడ ఉంచుతారు. 27 ఎకరాల్లో బాలల సాహస పార్కు, ఒక ఎకరంలో అవుట్ డోర్ జిమ్ము ఏర్పాటు చేస్తారు. 3వ జోన్ లో నక్షత్ర, చరక్, రాశి, పుష్ప వనాలు ఉంటాయి. 5 ఎకరాల్లో చరక్ వనం, రాశి వనం, 2 ఎకరాల్లో పుష్ప, కాక్టస్ వనాలు, 3.6 ఎకరాల్లో డంక్ పాండ్ ఏర్పాటు చేస్తారు. ఇందులో కొంత భాగం వన్య ప్రాణులకు కేటాయించారు. వన్య జీవులకు ఇబ్బందిలేకుండా నైట్ సఫారీల కోసం జురాంగ్ పార్కు తరహాలో ప్రత్యేక పార్కుని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఏడీసీ(అమరావతి అభివృద్ధి సంస్థ) ఉంది. ఇంకా ఇక్కడ పాదచారుల కోసం ఆకర్షణీయమైన వంతెన నిర్మించడంతోపాటు యోగ, ధ్యాన కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. 4వ జోన్ లో 5 స్టార్ హోటళ్లు, ఇండోర్ అథ్లెటిక్ ఎరీనా, క్లబ్ హౌస్, ఆర్టిస్ట్ ప్లాజా, శిల్ప కళా కేంద్రం, ఈవెంట లాన్, ప్రదర్శన శాలలు ఉంటాయి. సాంస్కృతిక పురావస్తు శాల, ప్రదర్శన శాలకు 12 ఎకరాలు, ఆర్టిస్ట్ ప్లాజా, శిల్పకళా కేంద్రంకు 14.6 ఎకరాలు, ఈవెంట్, ఫెయిర్ గ్రౌండ్ కు 12 ఎకరాలు, స్పోర్ట్స్ క్లబ్, కమ్యూనిటీ ఫిట్ నెస్ సెంటర్ కు మరో 12 ఎకరాలు, ఇండోర్ అథ్లెటిక్ సెంటర్ కు 1.5 ఎకరాలు, 5స్టార్ హోటల్ కు 7 ఎకరాలు కేటాయించారు. దీనిని ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత పెద్దదైన ఎమ్యూజ్ మెంట్ పార్కుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో సీఆర్డీఏ ఉంది. ప్రతి రోజూ ఇక్కడ జాతీయ స్థాయిలో ఏదో ఒక కార్యక్రమం జరిగేవిధంగా ఏర్పాట్లు చేస్తారు.  ఈ ఉద్యానవనం మొత్తంలో 2, 3 స్టార్ హోటళ్లతోపాటు లేక్ వ్యూ కాటేజీలు, ఫారెస్ట్ కాటేజీలు కూడా ఉంటాయి. పర్యాటకులను ఆకర్షించేవిధంగా నోరూరించే అన్ని రకాల, అన్ని ప్రాంతాల ఆహార పదార్థాలు లభించేలా ఫుడ్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. జల కేంద్రాలకు ఆనుకొని స్టార్ హోటళ్లు నిర్మిస్తారు. పర్యాటకులను ఆకర్షించేవిధంగా పూల వనాలు, కొల్లేరు, పులికాట్ వంటి విహంగ విడిది కేంద్రాలకు ధీటుగా ఇక్కడ పక్షుల ఆవాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. అలాగే అన్ని పార్కింగ్ ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్ ని నిర్మిస్తారు. విజయదశమికి నిర్మాణ పనులు ప్రారంభించి 2019 మార్చి 31 నాటికి రాజధానిలో పాలనా నగరాన్ని సిద్ధం చేయాలన్న కృతనిశ్ఛయంతో సీఆర్డీఏ ఉంది. లండన్ కు చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ ఆగస్టు 15 నాటికి శాసనసభ, 30 నాటికి హైకోర్టు భవంతుల తుది ఆకృతులను అందజేస్తుంది.  ఈ అంశాలను దృష్టిలోపెట్టుకొని సీఆర్డీఏ కార్య ప్రణాళికను సిద్ధం చేసింది. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీ దాదాపు పూర్తి అయింది. ప్లాట్ల హద్దుల్లో రాళ్లు కూడా పాతుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన రెండేళ్లలో పూర్తి అయ్యేవిధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నగరంలో అంతర్గతంగా 7 ప్రధాన రోడ్లు, పలు ప్రైవేటు భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో అమరావతి, దాని చుట్టుపక్కల స్తబ్ధత నెలకొన్న రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.

           జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగఢించిన దాదాపు 25 ప్రముఖ విద్యాసంస్థలు అమరావతికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయి.  వాటిలో 14 సంస్థలు ఇటీవల సీఆర్డీఏ నిర్వహించిన వర్క్ షాపులో కూడా పాల్గొన్నాయి. వ్యాలీ స్కూల్, కెఎఫ్ఐ, చిరెక్, ఆర్ఎన్ పోడార్ స్కూల్, నలందా, చిన్మయా విద్యాలయ, రామకృష్ణ మిషన్ స్కూల్, గ్లిండన్, పొదార్ ఇంటర్నేషనల్, రయాన్ గ్లోబల్ స్కూల్ వంటి సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో కూడిన పాఠశాల విద్య కోసం దేశం మొత్తం అమరావతి వైపు చూసేలా ప్రఖ్యాత విద్యా సంస్థలను ఇక్కడికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు కావలసిన  భూమిని అవసరమైతే ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ధీరూభాయ్ అంబానీ ట్రస్టు తమ విద్యా సంస్థను అమరావతిలో నెలకొల్పుతామని హామీ ఇచ్చింది. రాజధాని ప్రస్తుత అవసరాల కోసం కనీసం 20 వేల హోటల్ గదులు ఉండాలి. అయితే  ప్రస్తుతం  2500 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.   ఈ నేపద్యంలో అమరావతిలో స్టార్ హోటళ్లు నెలకొల్పడానికి రాడిసన్, లీలా, తాజ్, జీఆర్టీ, పార్క్, నోవాటెల్ వంటి 16 బ్రాండ్లు ఆసక్తి కనబర్చాయి. హోటళ్లతోపాటు కన్వెన్షన్ సెంటర్లను కూడా నిర్మిస్తారు. అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ నగరంగా రూపొందించే క్రమంలో  మెట్రో రైలును మించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత వేగంతో కూడిన రవాణా వ్యవస్థ (హైపర్ లూప్ ) ఏర్పాటు చేయడానికి సీఆర్డీఏ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఏర్పడితే అమరావతి నుంచి తిరుపతికి 25 నిమిషాల్లో, విశాఖకు 23 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. నూతన రాజధానికి అన్ని రకాలుగా ఆధునిక హంగులు సమకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...