Aug 28, 2017

‘కన్యాశుల్కం’ ప్రదర్శనకు 125 ఏళ్లు


§  26,27 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ ఉత్సవాలు
§  విశాఖపట్నంలో సదస్సు నిర్వహణ
§  25న గురజాడ నివాసంలో రజత ఫలకం ఏర్పాటు
      తెలుగు సాహిత్యంలో అగ్రభాగాన నిలిచేది కన్యాశుల్కంనాటకం. అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు రచనకన్యాశుల్కంనాటక ప్రదర్శన 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించే  ఈ ఉత్సవాలకు విశాఖపట్నం వేదిక కానుంది. ఈ నాటికను తొలిసారి విజయనగరంలో 1892 ఆగస్ట్ 13 ప్రదర్శించారు. ఈ ఏడాదికి సరిగ్గా 125 ఏళ్లు పూర్తి చేసుకుంది. కన్యాశుల్కం ఉత్సవాలకు భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందిస్తుండగా మొజాయిక్ సాహిత్య సంస్థ సమన్వయం చేయనుంది. కన్యాశుల్కం జాతీయ ఉత్సవాల ప్రారంభానికి ముందురోజు  25న విజయనగరంలోని గురజాడ నివాసంలో రజత ఫలకం ఏర్పాటు చేస్తారు. ఉత్సవాలు జరిగే రెండు రోజులు విశాఖపట్నంలో సదస్సు నిర్వహిస్తారు. సదస్సులలో ఒడిషా, బెంగాల్, అసోం నుంచి వక్తలు ఆయా భాషల్లో కన్యాశుల్కంసమకాలీన రచనలపై ప్రసంగిస్తారు. తెలుగు సాహితీ ప్రముఖులతో కలిసి ఒకే వేదికను పంచుకుంటారు.
ఈ నాటకం, అందులోని పాత్రల గురించి ప్రతి ఒక్క తెలుగువారికి  తెలుసు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ ఉండదనుకుంటాను.  స్తీవిద్య ఆవశ్యకతను వివరిస్తూ, బాల్యవివాహాలను నిరసిస్తూ గురజాడ తన పదునైన కలాన్ని ఆనాడే ఎక్కుపెట్టారు. అప్పటి సాంఘిక దురాచారాలను తరిమికొట్టేందుకు రచనలనే ఆయుధంగా చేసుకుని నవ చైతన్యాన్ని తీసుకు వచ్చారు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఇందులో తెలుగు వాతావరణ, మానవ స్వభావాలు, ముఖ్యంగా తెలుగు జీవితం ఉంది. విలువలకు భ్రష్టుపట్టిన తీరును చక్కగా ఆవిష్కరించారు. నాటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న కన్యాశుల్కం అంశం లోతులను సృచించిన నాటకం ఇది. హేయమైన మానవ నైజాలూ-వేశ్యల జీవితాలు న్యాయవాదుల వ్యవహార శైలి - కుహనా మేధావులు గిరీశం లాంటి మోసగాళ్లు- చిన్న పిల్లను ముసలివారికి ఇచ్చి పెళ్ల చేయడంతో కొద్ది రోజులు, నెలలకే వారు చనిపోవడంతో జీవచ్ఛవాల్లా జీవించే బాలవితంతువుల బతుకు చిత్రం, అప్పటి సమాజిక స్థితిగతులకు దర్పణం ఇది. ఇందులోని పాత్రలు ఇప్పటికీ ప్రతినిత్యం మనకి తారసపడేవే. కథలోని వస్తువు, పాత్రల చిత్రీకరణ, భాష, సంభాషణా చాతుర్యం వల్ల ఇది ఆధునిక నాటక సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆలోచనలు రేకెత్తించే ఈ నాటకం  రంగస్థలం బతికున్నంతకాలం సజీవంగా నిలుస్తుంది. ఈ నాటకానికి
అంతటి శక్తి ఉంది. రైతుల కడగండ్లను చిత్రిస్తూ దీనబంధు మిత్రా బెంగాలీలో రాసిన నీల్ దర్పణ్ ఆధునిక భారతీయ నాటకాల్లో తొలి నాటకం కాగా, రెండో ఆధునిక నాటకం కన్యాశుల్కం. సమాజం నుంచి కన్యాశుల్కం దురాచారం పోయినా ఆ పేరుతో గురజాడ వారి  నాటకం మిగిలింది. ఆ పాత్రలు తెలుగువారు మరచిపోలేనివి.  భారతీయ నాటకరంగంలో ఇన్నేళ్లు మనుగడ సాగించిన నాటకం ఇది ఒక్కటే.  125 ఏళ్లు చరిత్ర కలిగిన ఏకైక నాటకం కన్యాశుల్కం  కావడం తెలుగువారిగా మనం గర్వించదగిన అంశం.  సాధారణంగా తొమ్మిది గంటల నిడివి గల కన్యాశుల్కం నాటక రూపకాన్ని మూడున్నర గంటలకు సంక్షిప్తం చేసి తొలిసారిగా విశాఖ వుడా ఆడిటోరియంలో ప్రదర్శించనున్నారు. కన్యాశుల్కం సావనీర్‌ను ప్రచురిస్తారు. అలాగే ఈ ఉత్సవాలలో లఘు సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు సాహిత్య, నాటకరంగ కృషీవలురకు గౌరవ సన్మానాలు చేస్తారు.
శిరందాసు నాగార్జున


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...