Aug 24, 2017

26న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పౌరసన్మానం

గృహ నిర్మాణ పథకం పైలాన్‌ ఆవిష్కరణ

సచివాలయం, ఆగస్ట్ 23: ఈ నెల 26వ తేదీ శనివారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ఘనంగా పౌరసన్మానం చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి పర్యటన వివరాలు తెలిపారు. 26వ తేదీ ఉదయం 9.10 గంటలకు ఉప రాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు. గవర్నర్ నరశింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు ఆయనకు స్వాగతం పలుకుతారని తెలిపారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నందున ఓపెన్ టాప్ జీపులో వెలగపూడిలోని శాసనసభ, సచివాలయ భవనాల వద్దకు 10.40 గంటలకు చేరుకుంటారన్నారు.  జీపులో ఆయన వెంట గవర్నర్, సీఎం ఉంటారని చెప్పారు. వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి  ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) పథకం కింద 2.25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తూ  చివరి సంతకం చేశారని తెలిపారు.  సచివాలయం వద్ద ఇళ్ల పథకం పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారని చెప్పారు. ఆ తరువాత 11 గంటకు ఉప రాష్ట్రపతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులను ఆహ్వానించినట్లు తెలిపారు.  
వెలగపూడిలో తన పర్యటన ముగించుకొని సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఉపరాష్ట్రపతి  తెనాలి వెళతారని చెప్పారు. అక్కడ ఆలపాటి వెంకట్రామయ్య శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని, వెంకట్రామయ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. తెనాలిలో తల్లి, బిడ్డల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఆ కార్యక్రమాలకు ఉప రాష్ట్రపతి వెంట మంత్రి నక్కా ఆనందబాబు ఉంటారని తెలిపారు.
 సాయంత్రం 4.30 గంటలకు ఉప రాష్ట్రపతి పర్యటన ముగించుకొని గన్నవరం వద్ద ఆత్కూరులో స్వర్ణభారతి ట్రస్ట్ కు వెళతారు. ఆదివారం ఉదయం 9 గంటలకు స్వర్ణభారతి ట్రస్టు లో ఏర్పాటు చేసే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఆ వైద్య శిబిరంలో హైదరాబాద్ నుంచి, మణిపాల్ ఆస్పత్రి నుంచి డాక్టర్లు వస్తారని తెలిపారు. అనంతరం 10.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఉప రాష్ట్రపతి ఢిల్లీ బయలుదేరతారని మంత్రి కామినేని చెప్పారు.

ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తాం

కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్ధులకు న్యాయం చేస్తామని మంత్రి కామినేని చెప్పారు. ప్రభుత్వం తరపున కోర్టులో గౌరవ బెనర్జీ అనే న్యాయవాది వాదిస్తున్నట్లు తెలిపారు. ఆ విద్యార్థులను ప్రభుత్వ కాలేజీలలో సర్ధుబాటు చేయమని కోర్టు చెబితే ఆ విధంగా చేస్తామన్నారు. 108 సేవలకు సంబంధించి కోర్టు తీర్పు  ప్రభుత్వానికి అనూకూలంగా వచ్చినట్లు తెలిపారు.  త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. 108 వాహనంలో రోగిని ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపు సంబంధిత డాక్టర్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా నూతన యాప్ ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఎంఆర్ వ్యాక్సిన్ 9 రోజుల్లో 90 లక్షల మందికి వేసినట్లు తెలిపారు. మిగిలినవారికి కూడా వ్యాక్సిన్ వేస్తామన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు చట్టపరమైన హక్కులు కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం జీఓ జారీ చేసినట్లు తెలిపారు. ఎయిమ్స్ (ఏఐఐఎంఎస్- ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరగతులు 2018-19లో ప్రారంభమవుతాయని చెప్పారు. మంగళగిరి వద్ద భవన నిర్మాణం పూర్తి అయ్యే లోపు విజయవాడలో క్లాసులు నిర్వహిస్తారని మంత్రి కామినేని తెలిపారు. మీడియా సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...