Aug 5, 2017

ఉపాధి కల్పనలో నెంబర్ 1 ఏపీ


గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా-ఎంజీఎన్ఆర్ఈజీఎస్- మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్) కింద పని దినాలు కల్పించడంలో  ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. పేదవారికి ఒకొక్కరికి ఏడాదికి కనీసం 100 రోజులు, కరువు సమయంలో 150 రోజుల పనిదినాలు తగ్గకుండా ఉపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి, ఉపాధి హామీకి ఈ పథకం  అత్యంత ఉపయోగకరంగా ఉంది.   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెద్దఎత్తున ఏర్పాటు చేయడం, స్థిర ఆస్తులు సమకూర్చడం, పేదలకు మెరుగైన జీవన వనరులు సమకూర్చడం, పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు నరేగా నిధులతో సాధ్యమవుతోంది. ఈ నిధులతో గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజి, తాగునీరు, అంగన్‌వాడి భవనాల నిర్మాణం... వంటి మౌలిక వసతుల కల్పన పెద్దఎత్తున జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే చెరువులు, పంటసంజీవని కుంటల తవ్వకం, చిన్నచిన్న కాలువలు, చెరువుల్లో పూడిక తీయడం, అడవుల పెంపకం, మొక్కలు నాటటం, గ్రామీణ రహదారుల నిర్మాణం, గ్రామాల్లో సామాజిక అవసరాలకు ఉపయోగపడేవిధంగా పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలకు శాశ్విత భవనాలు నిర్మించడం  వంటి  పనులు చేపడతున్నారు153 రకాల కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఉన్న ఈ నిధుల వినియోగానికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించేందుకు  త్వరలో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని  ప్రభుత్వం నిర్ణయించిందిరాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామీ పనులకు కేంద్రం నుంచి ఈ ఏడాది ఇంకా రూ.1,365 కోట్లు రావాల్సి ఉందిఈ ఏడాది మెటిరియల్ కాంపోనెంట్ కింద ఇంకా రూ.800 కోట్లు వినియోగించుకోవాలి. 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.800 కోట్లు నెల రోజుల్లో రానున్నట్లుగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మొత్తం నిధులు రూ.3 వేల కోట్లతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయనుననారుఈ ఆర్థిక సంవత్సరం(2017-18) నరేగా  పథకం కింద రూ.5,279.60 కోట్లతో 18.08 కోట్ల పనిదినాలు కల్పించాలన్నది లక్ష్యం. ఇందులో మెటీరియల్ కు రూ.2,111.8 కోట్లు, వేతనాలకు రూ.3,167.8 కోట్లు ఖర్చు చేయాలి. ఈ నెల 31 వరకు వేతనాలకు 3,065.32 కోట్లు, మెటీరియల్ కు రూ.2,043.49 కోట్లు మొత్తం రూ.5,108.81 కోట్లు ఖర్చుచేసి 15.56 కోట్ల పని దినాలు కల్పించాలన్నది లక్ష్యం కాగా, ఈ నెల 13 తేదీ వరకు వేతనాలకు రూ. 1,943.65 కోట్లు, మెటీరియల్ కు రూ. 433.18 కోట్లు మొత్తం రూ. 2443.35 కోట్లు ఖర్చు చేసి 14.04 కోట్ల పనిదినాలు కల్పించారు. ఈ ఏడాది లక్ష్యంలో ఇప్పటికే 87.31 శాతం పనిదినాలు కల్పించారు. 14.04 కోట్ల పని దినాలతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా 10.74 కోట్లతో రాజస్థాన్ రెండవ స్థానంలో, 9.42 కోట్ల పని దినాలతో తమిళనాడు మూడవ స్థానంలో ఉన్నాయి.  మన రాష్ట్రంలో జిల్లాల వారీగా చూస్తే ప్రకాశం జిల్లా లక్ష్యానికి మించి 101.14 శాతం పనులు కల్పించి మొదటి స్థానంలో, తూర్పుగోదావరి జిల్లా  99.43 శాతంతో రెండవ స్థానంలో, పశ్చిమగోదావరి జిల్లా 98.84 శాతం పని దినాలు కల్పించి మూడవ స్థానంలో నిలిచాయి. శ్రీకాకుళం, అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 90 శాతం పైగా, విశాఖపట్నం, గుంటూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 80శాతంపైగా పని దినాలు కల్పించారు.
జూలై 13వ తేదీ నాటికి 63,972  పంట కుంటలు పూర్తి చేసి దేశంలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 55,562 పంట కుంటలు పూర్తి చేసి జార్ఖండ్ రెండవ స్థానంలో, 11,924 పంట కుంటలు పూర్తి చేసి పశ్చిమ బెంగాల్ మూడవ స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో 1,37,060 పంట కుంటలు నిర్మాణ దశలో ఉన్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు(ఐహెచ్ హెచ్ఎల్-ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్ లిట్రిన్స్) 43,489 పూర్తి చేసి దేశంలో రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచింది. 1,04,304 వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసి చత్తీస్ గఢ్ మొదటి స్థానంలో, 47,701 పూర్తి చేసి తమిళనాడు రెండవ స్థానంలో నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18,459 వెర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి దేశంలో ఏపీ రెండవ స్థానం అక్రమించింది. 28,274 వెర్మీ కంపోస్ట్ యూనిట్లతో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా, 3,287 యూనిట్లతో ఉత్తరాఖండ్ మూడవ స్థానంలో ఉంది. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 13 జిల్లాల్లో ఆరు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాలన్నది లక్ష్యం కాగా, ఈ నెల 12వ తేదీ నాటికి 1005 కిలో మీటర్ల నిర్మాణం పూర్తి చేశారు. మిగిలిన పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. 673 అంగన్ వాడీ కేంద్రాలు నిర్మించి రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. 652 కేంద్రాలతో ఒడిసా రెండవ స్థానంలో, 328 కేంద్రాలతో ఛత్తిస్ గఢ్ మూడవ స్థానంలో ఉన్నాయి. ఈ ఏడాది 500 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 87 భవనాలు నిర్మించారు. అలాగే మండల భవనాలు 34 నిర్మించాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటికే 15 భవనాల నిర్మాణం పూర్తి చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పనులను ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి  నరేగా నిధుల ఏకీకరణ(కన్వర్జన్స్)కు ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...