Oct 31, 2020

సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకోవాలి

బోంబే ఐఐటి విద్యార్ధులతో   చంద్రబాబు 

‘‘గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్’’ ఆన్ లైన్ సమావేశంలో శనివారం మధ్యాహ్నం బోంబే ఐఐటి విద్యార్ధులను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సామర్ధ్యం బైటపడుతుంది. సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకుంటే ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలుస్తారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొన్న తీరుతెన్నులను బట్టే రాబోయే రోజుల్లో వివిధ దేశాలు ముందంజ వేస్తాయి.  ఎవరైతే కరోనాను సమర్ధంగా ఎదుర్కొన్నారో వారికి నష్టాలు తగ్గాయి, ఎదుర్కోలేనివాళ్లు అనేక ఇబ్బందులకు గురయ్యారు.  కరోనా కారణంగా ఆర్ధిక సమస్యలు పెరిగాయి, ఆత్మహత్యలకు పాల్పడ్డారు,మానసిక శారీరక ఇబ్బందులు పడ్డారు. కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో మా వంతు బాధ్యతగా ప్రతివారం కేంద్రానికి నివేదికలు పంపాం. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు దోహదం చేశాం. కరోనాపై తొలిరోజునుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాను. జనవరిలోనే అప్రమత్తం చేశాను. కరోనా విజృంభిస్తే సమాజానికి వాటిల్లే కష్టనష్టాలను వివరించాం. డిజిటల్ వర్కింగ్ ను ప్రోత్సహించాం, మాస్క్ విధిగా ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రజలను చైతన్యపరిచాం. 


మా తరం దేశ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పుట్టినవాళ్లం. మీ యువతరం ఆర్ధిక సంస్కరణల ముందు, తర్వాత పుట్టినవాళ్లు.  1991లో టైమ్స్ మ్యాగజైన్ లో ‘‘ప్రపంచ ఆర్ధిక సవాళ్లను భారతదేశం ఎదుర్కోగలదా’’ అనే వ్యాసం  మమ్మల్నెంతో అసంతృప్తికి గురిచేసింది. దానినొక సవాల్ గా తీసుకునేలా చేసింది. ఆర్ధిక సంస్కరణలకు ముందు మనదేశంలో ఏకపార్టీ పాలన ఉండేది. తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల పాలన వచ్చింది. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టినప్పుడు పెట్రోల్ డీజిల్ దిగుమతులకు కూడా ఆర్ధిక కటకట. బంగారం కూడా కుదవబెట్టిన పరిస్థితులు. ఆ స్థితినుంచి ఇప్పుడు ఈ స్థాయికి చేరాం, భవిష్యత్తులో ప్రపంచంలోనే తొలిరెండు స్థానాల్లో భారతదేశం చేరనుంది. 

     1991లో ఆర్ధిక సంస్కరణలు, 1995లో తాను సీఎం కావడం, 1996లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు, ఏపిలో సెకండ్ జనరేషన్ రిఫామ్స్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. తొలిసారి సీఎం కాగానే విజన్ 2020 రూపొందించానని, 20ఏళ్ల ముందు ఆలోచనలు చేయడం ఏమిటనే కొందరి సందేహాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా చేసిన కృషి వివరించారు.  హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్ సిటి ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు తేగా, సైబర్ టవర్స్ ఐటి అభివృద్దికే నమూనా అయ్యింది. ఆర్ధికంగా ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి దోహదం చేసింది. సియాటెల్ తర్వాత రెండవ బేస్ గా హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈవో ఆంధ్రప్రదేశ్ నుంచే, గూగల్ సిఈవో ఇండియా నుంచే, అనేక సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అంతా మనదేశం నుంచే కావడం విశేషం. హైదరాబాద్ లో అప్పుడు అభివృద్ది చేసిన బయో టెక్నాలజీ పార్క్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా ముందంజలో ఉండటం, 8లేన్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు,  దేశానికే 4% జిడిపి ఇచ్చే స్థాయికి హైదరాబాద్ చేరేందుకు ఇవన్నీ దోహదపడ్డాయి.రాష్ట్ర విభజన తర్వాత 13జిల్లాల ఏపికి ఆర్ధిక కష్టాలు..రాజధాని లేదు, బస్సులోనుంచే పరిపాలన.. పట్టుదలతో పనిచేసి 10.5% వృద్దిరేటు సాధించాం, జాతీయ వృద్దిరేటు 7.3% ఉంటే దానికన్నా మూడు నాలుగు రెట్లు ముందున్నాం. వరుసగా 4ఏళ్లు రెండంకెల వృద్ది సాధించాం. వ్యవసాయం అనుబంధ రంగాల్లో 17% వృద్ది సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 4ఏళ్లు నెంబర్ వన్ గా నిలబడ్డాం. రూ 15.48లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబట్టాం, దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డిఐ కియా ఏపికి తెచ్చాం. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం, పట్టుదలగా పనిచేయడం ద్వారానే పురోగతిని సాధించాం. గత 30ఏళ్లలో సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రాబోయే 30ఏళ్ల అభివృద్ధి వైపు మనందరి దృష్టి ఉండాలి. 2050నాటికి ఎలా ఉండాలన్న ఆలోచన చేయాలి. 

గతంలో ‘‘ప్రి రిఫామ్స్, పోస్ట్ రిఫామ్స్’’ గా అభివృద్ది చరిత్ర రాసినట్లే, ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్’’ గా అభివృద్ది చరిత్ర తిరగరాసే పరిస్థితులు ఉన్నాయి. కోవిడ్ తెచ్చిన మార్పులను అందిపుచ్చుకోవాలి. మన విజన్ ఎప్పుడూ దూరదృష్టితో ఉండాలి. మరో 30ఏళ్ల ముందు ఆలోచనలు చేయాలి. 30ఏళ్ల తర్వాత నువ్వెలా ఉంటావు, దేశం ఎలా ఉంటుంది, మన విజన్ ఎలా ఉండాలి, అది సాధించడానికి నువ్వేం చేయాలి, దేశానికేం ఇవ్వాలి, సమాజానికేం ఇవ్వాలి అనేదానిపై మన ఆలోచనలు, కార్యాచరణ ఉండాలి. మనం ఏది సాధించాలని అనుకున్నా దానికో విజన్ ఉండాలి. ప్రతి విజయానికి ఒక విజన్ ఉంటుంది.  మీ అందరికీ ‘‘మెగా మైండ్ సెట్’’ ఉండాలి. భారతదేశం మెగా సూపర్ పవర్ గా ఎదిగేలా మీరంతా మెగా సూపర్ పవర్ గా ఎదగాలి.. ఇప్పుడు నడుస్తోన్న పారిశ్రామిక విప్లవం 4.0లో మీ భాగస్వామ్యంపై ఆలోచన చేయాలి. దీనికంటె ముందు 4 పారిశ్రామిక విప్లవాల వృద్ది పరిణామ క్రమం చూడాలి. 4వ పారిశ్రామిక విప్లవంలో అనూహ్య మార్పులు వచ్చాయి. మిషన్ టూల్స్, డేటా సెంటర్ వచ్చాయి. 

పర్యావరణ హిత వాతావరణం, ఆటోమోటెడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వృద్ది నేపథ్యంలో కాలుష్య రహిత సమాజం కోసం మీరంతా దృష్టి పెట్టాలి.  4.0పారిశ్రామిక విప్లవంలో సాంకేతికత, టూల్స్ వినియోగం అందిపుచ్చుకోవాలి. ఇంటర్నెట్ రాకముందు అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం పంపాలంటే 3, 4రోజులు పట్టేది. ఫోన్ లో మాట్లాడాలంటే వందల రూపాయల ఖర్చయ్యేది. అలాంటిది ఇంటర్నెట్ అభివృద్ది చెందాక ప్రపంచమే గ్లోబల్ విలేజిగా మారింది. గతంలో ఉపాధ్యాయులనుంచి పాఠాలు నేర్చుకునేవాళ్లం. ఇప్పుడు అధ్యాపకులకే పాఠాలు చెప్పే పరిస్థితిలో విద్యార్ధులు ఉన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులుగా ఉండే వర్గీకరణ ఇప్పుడు ఐటి లిటరేట్, ఐటి ఇల్లిటరేట్ గా మారింది.  ఒకప్పుడు రూ 14 ఉండే సోలార్ పవర్ యూనిట్ తర్వాత రూ 7కు, ఇప్పుడు  రూ 2.50కు వచ్చింది. భవిష్యత్తులో సోలార్ పవర్ యూనిట్ రూపాయి, రూపాయిన్నరకే వచ్చే అవకాశం. ప్రకృతే సహజ ఇంధన ఉత్పాదన వనరు..

సమాజంలో ఏవిధంగా వినూత్న మార్పులు వస్తున్నాయో ఇవే ప్రబల సాక్ష్యాలు. జలవిద్యుత్ సీజనల్ కాబట్టి, థర్మల్ పవర్ తప్ప మార్గాంతరం లేదని గతంలో భావించారు. ఇప్పుడు సోలార్ పవర్, విండ్ పవర్, సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరులు వచ్చాక థర్మల్ పవర్ తెరమరుగు అవుతోంది.

పర్యావరణహితంగా సమాజంలో వచ్చే మార్పులను స్వాగతించాలి, అనుసరించాలి.


ప్రతి రైతు ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదకుడిగా మారే పరిస్థితి.. వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ సెట్ నుంచి తమ పంటలకు కరెంటు పొందడమే కాకుండా గ్రిడ్ కు కూడా అమ్మే పరిస్థితి. ఉచిత విద్యుత్ తాను పొందడమే కాకుండా ఉత్పత్తి చేసిన విద్యుత్ ద్వారా రాబడి రైతు పొందే స్థితి. ఇకపై విద్యుత్ సరఫరా, పంపిణీ(టిఅండ్ డి) నష్టాలకు కాలం చెల్లే పరిస్థితి. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు కరెంటు ద్వారా నడిపే పరిస్థితి. విశాఖ విషయం చూడండి. ప్రి- హుద్ హుద్, పోస్ట్- హుద్ హుద్ గా విశాఖ అభివృద్ది ముఖచిత్రం మారిపోయింది. హుద్ హుద్ సృష్టించిన బీభత్సం తెలిసిందే. విపత్తులను మనం ఆపలేం గాని, మానవ ప్రయత్నంతో విపత్తు నష్టాలను తగ్గించగలం. 8రోజులు విశాఖలోనే మకాం వేసి పరిస్థితులను చక్కదిద్దాం. 

హైదరాబాద్, సికింద్రాబాద్ కు ధీటుగా సైబరాబాద్ నిర్మాణం చేశాం. హైదరాబాద్ లో 30ఇంజనీరింగ్ కళాశాలలను 300 చేశాం. ఇంజనీరింగ్ కాగానే వాళ్ల ఉపాధిపై దృష్టి పెట్టాం. అందుకే ఐటి అభివృద్దికి నాందిపలికాం. నాతో సమావేశానికి నిరాకరించిన బిల్ గేట్స్ 40నిముషాలు నాతో చర్చలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ బేస్ పెట్టాలనేది తప్ప మరొకటి కోరలేదు. ఇప్పుడదే మైక్రోసాఫ్ట్ కు సిఈవో ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడు కావడం విశేషం.  హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మించాలన్న ఆలోచన రాగానే, దేశవిదేశాల్లో 20ఎయిర్ పోర్టులు పరిశీలించాం, 20నమూనాలు రూపొందించాం. ఆ తర్వాతే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టాం.  అదే స్ఫూర్తితో అమరావతి అభివృద్దికి శ్రీకారం చుట్టాం. గ్యాస్, పవర్, ఫోన్, కేబుల్ కు ఐసిటి డక్ట్స్..సీవరేజ్ వాటర్ అండర్ గ్రవుండ్ పైపులైన్లతో రాజధాని నగర నిర్మాణానికి నాంది పలికాం. నదుల అనుసందానం కల నిజం చేశాం. కృష్ణా గోదావరి నదుల అనుసందానం చేశాం. గోదావరి పెన్నా అనుసందానికి నాంది పలికాం. పంచనదుల అనుసందానమే లక్ష్యంగా పెట్టుకున్నాం. జీరో బడ్జెట్ ఫార్మింగ్ ను ప్రోత్సహించాం. రసాయన ఎరువులు లేని సేంద్రియ పంట ఉత్పత్తుల వైపు రైతులను మళ్లించాం. సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పాదన వల్ల మన జీవన ఆయుర్దాయం మరింత మెరుగవుతుంది.సమాజంలో వచ్చే మార్పులకు మీరే చోదకుల్లాగా ఉండాలి. అందుకు తగిన నాయకత్వ సామర్ధ్యాన్ని పెంచుకోవాలి.ఆలోచన ఉండాలి, విజన్ ఉండాలి, కార్యాచరణ అనేది అతి ముఖ్యం.‘‘2050నాటికి భారతదేశంలో చోటుచేసుకున మార్పుకు నేను ఏవిధంగా దోహద పడగలను అనేది’’ ప్రతిరోజూ నిద్రించే ముందు ఒక నిముషం ఆలోచించాలి. ఆ విధమైన నిద్రలేని రాత్రులే మిమ్మల్ని ఈ మార్పుకు నాయకుడిగా తీర్చిదిద్దుతాయి.

ఓటమి భయం ఉండకూడదు.  రిస్క్ లను ముందే ఊహించి ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యం చేరాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ మానవీయ విలువలను కోల్పోరాదు. ఎప్పటికప్పుడు ప్రతిఒక్కరూ అప్ గ్రేడ్ కావాలి. మీ మైండ్ సెట్ ను మార్చుకోవాలి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, పరికరాల వినియోగంపై పట్టు సాధించాలి. సాంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించాలి, దానిని ప్రోత్సహించాలి, పోటీతత్వంతో, నైపుణ్యాభివృద్దితో ముందడుగు వేయాలి. సరైన విజన్ ఉన్నప్పుడే మన లక్ష్యసాధన, దిశానిర్దేశం ఉంటుంది. మన జీవితానికి దిక్సూచి, లక్ష్య సాధన ద్వారా మన కలల సాఫల్యానికి శక్తి మన విజన్.  

మన కలలు నెరవేర్చే విజన్ ఉండాలి, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో అద్భుత నాయకుడిగా ఎదగగలరు.  తద్వారా మీ సాధికారతతోపాటు దేశ సాధికారత సాధ్యమయ్యేలా ఉభయతారకంగా మీ అందరి ఎదుగుదల ఉండాలి. మీ ఎదుగుదల కోసం ఒక విజన్ రూపొందించుకోండి. మెగా మైండ్ సెట్ ద్వారా దానిని చేరుకోండి. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్ చేయండి, స్థూలంగా కార్యాచరణ చేయండి. అప్పుడే మీరు మీమీ రంగాల్లో అద్భుత నాయకుల్లాగా ఎదుగుతారు.

2050 వైపు మీ ప్రయాణంలో ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే,  ‘‘నేను కాలాన్ని మార్చగలనా, లేక కాలమే నన్ను మార్చుతుందా..?’’ అని...

ఇరవై ముప్పై ఇళ్లు ఉండే కుగ్రామంలో నేను పుట్టాను. రోడ్డు, కరెంటు వసతులు లేని పల్లె నుంచి నేను వచ్చా. మనం ఎక్కడనుంచి వచ్చినా, ఏ స్థాయికి చేరామన్నది మన కృషిని ప్రతిబింబిస్తుంది. 

సామాన్యుడైన అబ్దుల్ కలామ్ అసామాన్యుడిగా ఎదిగారు, దేశానికే స్ఫూర్తిదాయకుడు అయ్యారంటే అదే..

నాకే అన్నీ తెలుసు అనుకోరాదు. ప్రతి రోజూ నేను నేర్చుకుంటున్నా అనే భావంతో ముందుకెళ్లాలి.  పంపు సెట్ దగ్గరకు రైతు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటినుండే రైతు ఆపరేట్ చేసే స్థితి..

రాబోయే కాలంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు, పరికరాలు, ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే మన సామర్ధ్యం, ఎదుగుదల ఆధారపడి ఉంటాయి.

డబ్బులేదనే చింత ఉండకూడదు. విజ్ఞానమే ధనం కన్నా మిన్న..100ఎకరాల భూమి ఇచ్చినా బిడ్డ అసమర్ధుడైతే నిలబెట్టుకోలేడు. అదే బిడ్డ విజ్ఞానవంతుడిని చేస్తే అతనికన్నా ధనికుడు ఉండరు.

ఏ కష్టానికి భయపడరాదు. సంక్షోభాన్ని అధిగమించడంలోనే సామర్ధ్యం. మీ అందరినీ ఉజ్వల భవిష్యత్తులో చూడాలన్నదే నా ఆకాంక్ష.మీ వ్యక్తిత్వం, మీ ఉద్యోగం, మీ విజ్ఞానం మీ ఎదుగుదలకే కాదు, సమాజాభివృద్దికి, దేశ ప్రగతికి దోహదం చేస్తుంది.యువ జనాభా అధికంగా ఉండటం, సాంకేతికతను అందిపుచ్చుకునే పరిజ్ఞానం పుష్కలంగా ఉండటం, గణితం, ఆంగ్లంలో అభినివేశం భారతదేశానికి ఎనలేని సానుకూలతలు..పోస్ట్ కోవిడ్ సానుకూలతలను భారతదేశం సద్వినియోగం చేసుకుంటుంది. 

ఏ రంగంలోనైనా నాయకులకు దీర్ఘదృష్టి ఉండాలి. భవిష్యత్ లో వచ్చే మార్పులను ఊహించగలగాలి.  రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలపై ఆలోచనలు చేయాలి. స్ఫూర్తిదాయక సమయంలో మనం ఉన్నాం. అభివృద్దే మనందరికి స్ఫూర్తి.తమ ప్రతిభా ఉత్పత్తులలో యువతరం మంచిపేరు పొందాలి. మన గొప్ప వారసత్వ సంపద నిలబెట్టాలని’’ చంద్రబాబు ఆకాంక్షించారు. 


వెబినార్ లో విద్యార్ధుల పలు ప్రశ్నలకు చంద్రబాబు జవాబిచ్చారు. ‘‘ సోషల్ మీడియా వచ్చాక ఫేక్ న్యూస్(అసత్య వార్తలు, తప్పుడు కథనాలు) పెరగడం ఆందోళనకరం. వాస్తవిక అభివృద్దిని ఇవి కొద్దికాలమే కనుమరుగు చేయవచ్చు. కానీ అభివృద్దిని ఎవరూ దాచిపెట్టలేరని’’ అన్నారు.

ప్రశ్నించిన విద్యార్ధి మురళి చింతమనేని స్వగ్రామం వాయల్పాడు నీటి కొరత గురించి చంద్రబాబు గుర్తు చేశారు.

‘‘అనంతపురంలో నీటి సమస్య గురించి కియా వాళ్లు ప్రస్తావించారు. నీళ్లు ఇచ్చాకే ఫ్యాక్టరీ పెట్టమన్నాను..కొద్దిరోజుల్లోనే గండికోట నుంచి నీళ్లిచ్చి చూపించాం, ఆ తర్వాతే కియా నెలకొల్పారు. ఇప్పుడు కియా కార్లు రోడ్లపై తిరుగుతుంటే ఆ సంతృప్తి వేరని’’  చంద్రబాబు పేర్కొన్నారు.

Oct 26, 2020

భార్య లేని భర్త పరిస్థితి

 భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు. అలుగుతారు. తిడతారు. కొందరు ప్రబుద్ధులైతే నానా ర‌కాలుగా చిత్ర‌హింస‌లు పెడ‌తారు.  అన్నింటినీ భరించే భార్యను ‘టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’గా తీసుకుంటారు!! ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం.. తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు! ‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం!! అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు.. ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.. అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు!!        

                                                                                                                                                     ‘‘నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు. ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని. ‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా?’ అనుకోకు. వుంటారు. నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం. ఉరిమితే భయం. మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు?’’...ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది!                                                 

   నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక  కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.                                                                                                                                                  ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం.. భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.                                                                                                                                                                                                        దాంపత్యం అంటే.:- రెండు మనసుల కలయిక. మరణం ఆ బంధాన్ని వేరు చేస్తే.. ఓ భాగస్వామి దూరమైతే.. మిగిలి ఉన్నవారి మనసు కకావికలమవుతుంది. స్త్రీ, పురుషులెవరికైనా ఆ బాధ ఒకటే. కానీ శేషజీవితాన్ని గడపడంలో మాత్రం తేడాలు కనపడతాయి. భర్త దూరమైనా భార్య తట్టుకుని జీవించగలదు. కానీ.. పురుషులు కుటుంబ సభ్యులతో కలిసిపోలేరు. మానసికంగా ఒంటరులైపోతారు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.   

కావాల్సింది సహకారం.. వ్యాపకం:- కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే భార్య గతించి ఏళ్లు గడిచినా ఉత్సాహంగా ఉన్నవారు ఉన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే.. ‘నా వయసు 90 ఏళ్లు. నా భార్య ఎన్నో ఏళ్ల క్రితమే మరణించింది. కొడుకు, కూతురు రమ్మన్నారు. కానీ, వెళ్లాలని అనిపించలేదు. అందుకే మా వూరిలో ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నా. ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతున్నాను. ఇప్పుడు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండటంతో అమ్మాయి ఇంటికి వచ్చేశా. ఆ భగవంతుడి పిలుపుకోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ఓ పెద్దాయన చెప్పుకొచ్చారు. 

‘నా వయసు 92 ఏళ్లు. భార్య పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి నా కోడలు నన్ను కన్న తండ్రిలా సాకుతోంది. సాయంత్రంపూట గుడికి వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తాను. ఖాళీగా ఉండకుండా పుస్తకాలు చదవుతుంటాను, రాస్తుంటాను’ అని చెప్పుకొచ్చారు రఘురామ్‌ అనే మరో వృద్ధుడు.                           

  అధ్యయనంలోనూ అదే తేలింది:-  2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. అదేంటంటే.. భర్తను కోల్పోయిన మహిళలతో పోలిస్తే, భార్యను కోల్పోయిన పురుషులు త్వరగా చనిపోయే అవకాశం 30 శాతం ఎక్కువని! భర్త చనిపోతే బాధ ఉంటుంది గానీ.. దాన్ని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం మహిళలకు ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు.  

ఇలా చేస్తే కొంత బెటర్‌:-

1.చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. వారి ఆటపాటలు.. చిలిపి చేష్టలు వయసు మళ్లిన వారికి ఆనందాన్ని కలిగించటమే కాదు.. తమ చిన్న తనం నాటి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చి మరింత హుషారుగా మార్చేస్తాయి.

 2. వయసు పెరుగుతున్న కొద్దీ తమకంటూ ఒక ప్రపంచం ఉండాలి. ఎందుకంటే ఓ వయసు వచ్చిన తరువాత బయట సంబంధాలు తగ్గిపోతాయి. కుటుంబంలో కూడా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఆఖరికి మనవళ్లు, మనవరాళ్లు కూడా వారి ప్రపంచంలో వారుంటున్నారు. అందుకే తమ దైన ప్రపంచం సృష్టించుకోవాలి. అది తమ అభిరుచులకు తగినట్లుగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన హాబీ ఉండి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల ఆ హాబీని మూలన పడేసి ఉండొచ్చు. దాన్ని పైకి తీస్తే కాలక్షేపం అవుతుంది. 

3. లాఫింగ్‌ క్లబ్‌ లాంటి వాటిలో చేరటం లేదా సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఫలితం ఉంటుంది. 

4. స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. కొత్త స్నేహాలకు చేయిచాచాలి. ఇలాంటి వాటివల్ల కాస్తంత ఉపశమనం కలిగి బాధ నుంచి తేరుకునే శక్తి వస్తుంది.       

ఆధారపడడమే కారణం:- సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని.. తాను తప్ప ఆమెకు దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భార్య దగ్గర ఉన్న స్వతంత్రం కొడుకు, కోడళ్ల వద్ద ఉండదు. దానికి తోడు వయోభారం. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అన్నీ కలిసి కుంగుబాటుకు దారితీస్తాయి. నాణేనికి మరోవైపు చూస్తే.. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తగ్గించుకోవడం కారణంగా ఆరోగ్యంగా పూర్తి జీవితాన్ని గడపగలుగుతారని విశాఖ జీజీహెచ్‌ మానసిక వైద్యులు మురళీ కృష్ణ విశ్లేషించారు.                                                            

మహిళలే స్వతంత్రులు:- స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురుచూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే... భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.- ప్రొఫెసర్‌ రాజు, ఏయూ, సైకాలజీ     

 భావోద్వేగ బలం ఆమెదే:- పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్త్రీ భావోద్వేగాలప రంగా  బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది.

Oct 23, 2020

ప్ర‌సిద్ధిగాంచిన ప‌దప‌ల్ల‌వాలు

తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలు- అవి రాసిన ర‌చ‌యిత‌లు


"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".(శ్రీకృష్ణదేవరాయలు)


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు 

నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

దేవులపల్లి కృష్ణ శాస్త్రి


2. ‘‘కప్పివుంచితే కవిత్వం 

విప్పి చెబితే విమర్శ’’

డా.సి.నారాయణరెడ్డి


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ 

ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

కాళోజి


4. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’ 

నన్నయ


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

సుబ్బారావు పాణిగ్రాహి


6. ‘‘రాజే కింకరుడగు 

కింకరుడే రాజగు’’ 

బలిజేపల్లి లక్ష్మీకాంతం


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న 

వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

బసవరాజు అప్పారావు


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

గుర్రం జాషువా


9. ‘‘అత్తవారిచ్చిన నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

కాళ్ళకూరినారాయణరావు


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

దాశరధి


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

నార్ల వెంకటేశ్వర రావు


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

తిరుపతి వెంకట కవులు


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

గురజాడ


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

గరిమెళ్ళ సత్యనారాయణ


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

శ్రీనాథుడు


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

పోతన


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

గద్దర్


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

శ్రీ శ్రీ


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 వెన్నలకంటి


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

కొనకళ్ల వెంకటరత్నం


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

అల్లసాని పెద్దన

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

చేమకూరి వేంకటకవి


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

త్యాగయ్య


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

ధూర్జటి


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు’’ 

బద్దెన


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

వేమన


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

కంచర్ల గోపన్న


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

సుద్దాల హనుమంతు


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

ఆరుద్ర


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

వేముల శ్రీ కృష్ణ


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

త్రిపురనేని రామస్వామి


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

బాలాంత్రపు రజనీ కాంతరావు


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

అడవి బాపిరాజు


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

కరుణశ్రీ

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

గుడ అంజయ్య


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

అలిసెట్టి ప్రభాకర్


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

సావిత్రి


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

ఖాదర్ మొహియుద్దీన్


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

బాలగంగాధర తిలక్


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

అన్నమయ్య


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

ఏనుగు లక్ష్మణ కవి


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

పాలగుమ్మి విశ్వనాథం


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

చలం


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

విమల

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

నండూరి సుబ్బారావు


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

అందెశ్రీ


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

చెరబండరాజు

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

కందుకూరి రామభద్రరావు


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

నందిని సిధారెడ్డి


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

మిట్టపల్లి సురేందర్



Oct 20, 2020

దసరా పాట

ఇది ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు..కానీ వెనకటి తరానికి ఒక మధురానుభూతి.


దసరా వచ్చేసింది కదండి.

నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట.

 దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారి వెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే ఈ మన పాట ఆనాటివారికి గుర్తుకు రావలసినదే...

ఇదే ఆ దసరా పాట

పల్లవి-

1

ఏదయా మీదయ మామీద లేదు!

ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!

దసరాకు వస్తిమని విసవిసల బడక!

చేతిలో లేదనక  ఇవ్వలేమనక !

ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!

రేపురా మాపురా మళ్ళి రమ్మనక!

శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

2

పావలా బేడైతె పట్టేది లేదు!

అర్థరూపాయైతె అంటేది లేదు!

ముప్పావలైతేను ముట్టేది లేదు!

రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!

హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

3

అయ్యవారికి చాలు ఐదు వరహాలు!

పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!

మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!

శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

దసరా పండుగను గిలకల పండగంటారు. చక్కగా కొత్త దుస్తులు ధరించి  వెదురుతో చేసిన విల్లం బులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ కొందరైతే పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.

పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుస ల్లో పాడుతూ ప్రతి వాకిటా ఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైనఆచార మిది.

లోగుట్టు

ఒక వ్యక్తి అభివృద్ధి గాని కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.  ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు. వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతక డానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు. దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు. పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు. ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు  విద్యార్ధులకు  ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో. దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు. ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే.అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు. ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది.

టీడీపీ నూతన కమిటీలు

తెలుగుదేశం పార్టీ  కొత్త కమిటీలను   ఆ పార్టీ  అధినేత చంద్రబాబు  ప్రకటించారు. ఏపీ టిడిపి నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకమయ్యారు. తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 25 మందితో పోలిట్ బ్యూరో, 27 మందితో కేంద్ర కమిటీ నియామకం  చేశారు. 

టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు:

ప్రతిభా భారతి

గల్లా అరుణ కుమారి

డీకే సత్యప్రభ

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

మెచ్చా నాగేశ్వరరావు

చిలువేరు కాశినాథ్

 టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శులు: 

నారా లోకేష్

వర్ల రామయ్య

రామ్మోహన్ నాయుడు

నిమ్మల రామానాయుడు

బీద రవిచంద్ర

కొత్తకోట దయాకర్ రెడ్డి

బిక్కని నర్సింహులు

కంభంపాటి రామ్మోహన్

 టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు: 

యనమల రామకృష్ణుడు

అశోక గజపతిరాజు

అయ్యన్నపాత్రుడు

కేఈ కృష్ణమూర్తి

చినరాజప్ప

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కాల్వ శ్రీనివాసులు

నందమూరి బాలకృష్ణ

వర్ల రామయ్య

కళా వెంకట్రావు

నక్కా ఆనందబాబు

బుచ్చయ్య చౌదరి

బోండా ఉమ

ఎన్ ఎండి ఫరూక్

గల్లా జయదేవ్

ఆర్ శ్రీనివాస్ రెడ్డి

పితాని సత్యనారాయణ

కొల్లు రవీంద్ర

వంగలపూడి అనిత

గుమ్మడి సంధ్యారాణి

రావుల చంద్రశేఖర్ రెడ్డి

అరవింద్ కుమార్ గౌడ్

Oct 18, 2020

56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్ పర్సన్ల ప్రకటన

బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు వెల్లడించా. మొత్తం 139 బీసీ కులాలకు  ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో కార్పొరేషన్  చైర్మన్ లేక చైర్ పర్సన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించారు.

కార్పొరేషన్‌ల పాలక మండళ్ల ప్రకటన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్‌ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు పథకాలు వేగంగా అందించేందుకు ఈ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. గతకొంతకాలంగా దీనిపై కసరత్తు చేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


బీసీ కార్పొరేషన్ల  ఛైర్మన్లు


పద్మశాలీ: విజయలక్ష్మి (కడప)

దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం)

తొగట కార్పొరేషన్‌: గడ్డం సునీత (అనంతపురం)

రజక కార్పొరేషన్‌: రంగన్న (అనంతపురం)

కురుబ కార్పొరేషన్‌: కోటి సూర్యప్రకాశ్‌ బాబు (అనంతపురం)

కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం)

వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు)

పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు)

ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు)

ఈడిగ : కె.శాంతి (చిత్తూరు)

గాండ్ల : భవాణీ ప్రియ (తూ.గో)

పెరిక : పురుషోత్తం గంగాభవానీ (తూ.గో)

అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూ.గో)

అయ్యారక: రాజేశ్వరం (తూ.గో)

షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు)

వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు)

కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు)

కృష్ణ బలిజ/పూసల: కోలా భవాణీ (గుంటూరు)

యాదవ: హరీష్‌కుమార్ (కడప)

నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప)

నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్‌బి (కడప)

సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప)

విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా)

గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)

వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా)

భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా)

వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు)

కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు)

వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు)

ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు)

జంగం: ప్రసన్న (నెల్లూరు)

బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు)

ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు)

చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్ (ప్రకాశం)

ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం)

మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం)

కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం)

కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం)

రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం)

పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం)

కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం)

శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం)

మత్స్యకార : కోలా గురువులు (విశాఖ)

గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ)

నగరాల: పిల్లా సుజాత (విశాఖ)

యాత: పి.సుజాత (విశాఖ)

నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)

తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం)

కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం)

శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం)

దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం)

సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో)

శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో)

అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (ప.గో)

అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌రావు(ప.గో)


Oct 15, 2020

ఇంగ్లీషు కంప్యూటర్ భాష కి తెలుగు భాషానువాదం

1. అంతర్జాలం = internet

2. ముఖ గ్రంథం = Facebook

3. ఏమిటది = whatsapp

4. దరఖాస్తు = app

5. అన్వేషిక = Google

6. క్రీడా సంగ్రహణము= Play store

7. మీ ఆజ్ఞ నాళం = YouTube

8. వితరిణి = share it

9. జాబితా = file

10. తపాల కట్ట = G-mail 

11. గణన యంత్రం = computer

12. 4వ తరం = 4G

13. కీలక ఫలకం = keyboard

14. చలన భాషిణి = Mobile phone

15. నిస్తంత్రి భాషాంత్రర్జాల యంత్రం = WiFi

16. ధర్శన చెలికాడు = vidmate

17. విస్తరణ క్షేత్రం = website

18. సమాచార దూత = messenger

19. సల్లాపములు = chatting

20. ప్రతిబింబం = image

21. శ్రవణ సంబంథి = audio

22. దృశ్య సంబంథి =  video

23. సమాచార నిమ్న బదిలి  = download

24. సమాచార ఊర్ద్వ బదిలి = upload

25. మృదు సామగ్రి = software

26. ఘన సామగ్రి = hardware

27. బంధన = link

28. ముద్ర లేఖనం = typing

29. అద్దకం = Printing

30. స్పర్శ తెర=Touch screen

31. చాతుర్య చలన భాషిణి= smart phone

32. దృశ్య పిలుపు= Video call

33. శబ్ధ పిలుపు = audio call

34. సమాచార బంధక క్రిమి = VIRUS

35. జ్ఞప్తిక ఘన పత్రం = Memory card

36. ధ్వని ముద్రీకరణ = audio Recording

37. అంకాత్మక కటకము = digital camera

38. ముఖ చిత్రపటం= Profile pictur.


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...