Sep 3, 2020

ననుగన్న నా తల్లి నా విశాలాంధ్ర

తాడి ప్రకాష్

THE ETERNAL SONG OF ELURU ROAD

-------------------------------------------------------------------

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నించి

కృష్ణా జిల్లా, విజయవాడ, ఏలూరురోడ్డు మీదికి...

సరిగ్గా యాభై సంవత్సరాల క్రితం...

సుబ్బమ్మదేవి హైస్కూల్ల్లో పదోతరగతి ముగించి, పరీక్షలు రాసి, కొన్నాళ్లు ఏలూరు లోనే వున్నాక, 1971 జూన్ లో విజయవాడ ప్రయాణం.

ఏలూరు నుంచి కేవలం 40 కి.మీ. దూరం.

అప్పుడు రైలు చార్జీ రెండు రూపాయలు!

పవర్ పేట స్టేషన్లో రైలెక్కితే, ఏ మాస్కోకో వెళుతున్నట్టు సుదీర్ఘంగా అనిపించిందా ప్రయాణం.

విజయవాడ చుట్టుగుంటలో మాది చిన్నఇల్లు.

నేను బాగా సన్నగా, నల్లగా, unimpressive గా ఏలూరు కలుగులోంచి బెజవాడ రోడ్ల మీదకొచ్చిన ఎలుకలా వుండేవాణ్ణి. చుట్టుగుంట చౌరస్తా పక్కన వున్న ఖాళీ స్థలంలో రోజంతా జీడిపిక్కలు కాలుస్తూ వుండేవాళ్ళు. కాల్చిన జీడీ వాసన తోడురాగా రెండు నిమిషాలు నడిస్తే విశాలాంధ్ర దినపత్రిక ఆఫీసు. ఎప్పుడు తీరిక వుంటే అపుడు విశాలాంధ్రకి వెళ్లడమే నా పని. అలా అయిదు సంవత్సరాలు – ఇంటర్, డిగ్రీ అయిపోయేదాకా– రెగ్యులర్ గా విశాలాంధ్రకి వెళ్ళాను. ఎప్పుడూ నడిచివెళ్లడమే. విశాలాంధ్ర విలేకరులు సైకిళ్ళమీద తిరుగుతుండే వాళ్ళు. అప్పట్లో ఈ దిగువ మధ్యతరగతి ఉద్యోగులకి స్కూటర్ ఒక లగ్జరీ! చుట్టుగుంట సెంటర్ నించి

లెఫ్ట్ కి తిరిగి విశాలాంద్ర వీధిలోకి వెళ్ళాలి.

అది చాలా కీలకమైన రోడ్డు.

*

15 ఏళ్ల వయసున్న నేను, లలలా అని పాడుకుంటూ వెళుతుంటే, మడత నలగని ఇస్త్రీ పంచె, తెల్లని చొక్కాతో, మెరుస్తున్న బట్టతలతో తుమ్మల వెంకట్రామయ్యగారు నడుస్తూ వుండేవారు.

“ఎగరాలి... ఎగరాలి మన ఎర్ర జెండా అదురు బెదురూ లేక అడ్డేదియును లేక... ధనికస్వామ్యమ్మింక దగ్ధమై పోవాలి...” అని రాసింది ఈ సామాన్యుడూ, నోరెత్తి ఎవర్నీ ఒక్క మాట అనని గొప్ప సంస్కారి, యీ పెద్దాయనేనా అనిపించేది.

*

మరోరోజు వేములపల్లి శ్రీకృష్ణ...

తెల్లపంచె.. మోచేతులదాకా మడిచిన తెల్ల గ్లాస్కో చొక్కా, కళ్ళజోడు లోంచి ఒక

brilliant intellectual lookతో ...

వీరరక్తపుధార వారబోసిన సీమ

పలనాడు నీదెరా వెలనాడు నీదెరా

బాలచంద్రుడు చూడ ఎవడోయి

తాండ్రపాపయకూడ నీవోడోయ్

చెయ్యైత్తిజైకొట్టు తెలుగోడా...

అని అంత force తో రాసింది ఈ బక్క పల్చని సున్నితమైన అందమైన శ్రీకృష్ణ గారేనా అని నాకు ఒకటే ఆశ్చర్యం!

*

కవిత్వం లో 'ఎర్రజెండాలు' ఎగరేసిన గంగినేని వెంకటేశ్వర్రావ్ వినుకొండనుంచి వచ్చివెళుతుండేవారు.

*

వర్ణధర్మాలన్న ఉక్కు చట్రముపగిలి

మాలకన్నమదాసు మనసైన సుతుడుగా

వీరవైష్ణవమొచ్చెనూ... పలనాట

బ్రహ్మన్న కలిగీతలో

పలనాడు వెలలేని మాగాణి రా...

అనిరాసిన లెజండరీ కామ్రేడ్ పులుపుల వెంకటశివయ్య నెమ్మదిగా విశాలాంధ్ర మెట్లుఎక్కుతూఉండేవారు.

*

రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి వచ్చి జోషి గారితో మాట్లాడి వెళ్లేవారు. అప్పటికి ఆమె నవల 'మరీచిక' నిషేధించారో లేదో మరి.

*

కవయిత్రి మందరపుహైమవతి మోహన్ ని కలిసి మాట్లాడుతుండేది.

*

'మృత్యుంజయుడు' నవలతో పేరుపొందిన బొల్లిముంత శివరామకృష్ణ 'ప్రగతి' వారపత్రిక కు ఎడిటర్ గా ఉండేవారు. జర్నలిస్టు గుఱ్ఱంకొండశ్రీకాంత్ ఆయనకి అసిస్టెంట్. మనుషులుమారాలి సినిమా మాటలరచయితగా బొల్లిముంత ప్రసిద్ధులు.

*

విశాఖ నుంచి వచ్చే చందుసుబ్బారావు, లేత మేకమాంసంలాంటి కవులు ఖాదర్, గులాం గౌస్ ల రూంలో దిగేవాడు. చందుఅంటే nonstop కబుర్లు, కవిత్వం, మిమిక్రీ. శ్రీకృష్ణార్జున యుధ్ధం సంక్షిప్తశబ్ధచిత్రం అరగంటలో వేసి చందు తెగనవ్వించేవాడు.

*

మాస్కోలో బ్రెజ్నేవ్ తో చర్చించి, ఢిల్లీ లో ఇందిరాగాంధీ తో మాట్లాడి, నేరుగా విశాలాంధ్రకి వచ్చేవాడు చండ్ర రాజేశ్వరరావు. మోహన్ పలకరిస్తే, నాన్న ఎలా ఉన్నాడు అని అడిగే వారాయన.

*

కమాండర్ ఇన్ ఛీఫ్ రావినారాయణ రెడ్డి దగ్గర నించి ఎద్దుల ఈశ్వర్ రెడ్డి దాకా, ఆరుద్ర నించి కొల్లాయి గట్టితేనేమి మహీధర రామ్మోహనరావు దాకా... అందరూ విశాలాంధ్ర కు వచ్చేవాళ్ళే.

*

ఇంకోరోజు, టక్ చేసుకుని, హుషారుగా వుండే రాంభట్ల కృష్ణమూర్తి, పిచ్చి సిగరెట్ కాలుస్తూ...

అదే అదే పతాక జైత్రయాత్ర సాగుతోందిరా...

పదే పదే రణానికై నగార మోగుతోందిరా!

మార్చింగ్ సాంగ్ రాసినవాడు.

పంచచామరం అంటే రాంభట్లకి పంచప్రాణాలని

నాకు తర్వాత రోజుల్లో తెలిసింది.

*

ఒక లెదర్ బ్యాగ్ పట్టుకుని గంభీరంగా, ఓ పెద్ద మనషి నడిచి వస్తుండేవాడు. నిండైన విగ్రహం.

హృదయంతో నవ్వి పలకరించే నాయకుడు...

నీలం రాజశేఖర్ రెడ్డి. పొలిటికల్ క్లాస్ చెబుతుంటే చూడాలి... The British is - maritime imperialism.. అని మొదలుపెట్టి మెస్మరైజ్ చేసేవాడు.

*

సంపాదకుడు రాఘవాచారి సరే సరి... తెల్లచొక్కా తెల్లఫ్యాంట్ ట్రేడ్ మార్క్. బట్టతల, ఎడం చేతి వేళ్ళ మధ్య కాలుతున్న సిగరెట్, అందమైన మనిషి ఇంటిపేరు చక్రవర్తుల అనీ, ఆయన తెలంగాణా జనగామ వాడనీ నాకు అప్పటికి తెలీదు.

*

బురదలోన కెందామర పుట్టినట్టు ఈ కుళ్లిన సంఘం గర్భం చీల్చుకు సమధర్మం ప్రభవించును...

అని ఆశ పెట్టిన గజ్జెల మల్లారెడ్డి హుందాగా నడుస్తూ, ఏం కామ్రేడ్ అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు.

*

అప్పట్లో విశాలాంధ్రకి వచ్చివెళ్లే యంగ్ అండ్ బ్యూటిఫుల్ నాయకుల్లో బాగా ఆకర్షించినవాడు సురవరం సుధాకర్ రెడ్డి, వెరీ కర్టీయస్, ఛార్మింగ్, అయస్కాంతం చిరునవ్వు... కమ్యూనిస్ట్ నాయకుడిలా కాకుండా ఓ పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ సి‌ఈ‌ఓలా గ్లామరస్ గా ఉండే వాడాయన.

సుధాకర రెడ్డి గారు మోహన్ కి మంచి ఫ్రెండ్.

ఆయన కబుర్లు, కంపెనీ లైవ్లీ గా ఉండేవి.

*

రామచంద్రపురం నుంచి కవి అదృష్ట దీపక్ వచ్చేవాడు. గలగలా గంగమ్మ కదిలి పోతుంటే.... మిలమిలా నీ మేను మెరిసిపోతుంటే...

రెప్పావాల్చక నేను నిన్నే సూత్తంటే...

యేరే సొర్గం ఇంకా ఎక్కడున్నాదే....

ఎక్కాడున్నాదే...

అంటూ కవ్వించే జనపదాలు పాడేవాడు.

*

నర్సాపురం నుంచి రచయిత ఎం‌జి రామారావు, దర్శకుడు ధవళసత్యం వచ్చేవాళ్లు...

ఓ ఓ ఓ... లగిజిగి లగిజిగి లంబాడీ తకిట తకిట తక తాళం వేస్తు తిరగబడర అన్నా,

ఓ.. ఓ... తిరగబడర అన్న అంటూ

దుమ్మురేపుతూ పాడి వూగించేవాడు ధవళ.

*

ఇలా ఆ రోడ్డు మీద ‘విశాలాంధ్ర’ కి వెళ్ళే కవులు

రచయితలు, నాయకులు, గాయకులు, ప్రజా నాట్యమండలి ఆర్టిస్ట్ లు, మహిళా ఉద్యమకారులు... ఇలా ఎంతమంది... ఎంత కోలాహలం!

*

ఒక ఊపు, ఒక ఉత్తేజం, ఒక విశ్వాసం, ఆశల జెండాల రెపరెపల ఉద్వేగంతో నడిచే వందల వేల ఉద్విగ్న హృదయాల ఊరేగింపు.


అది కేవలం ఒక దిన పత్రిక కార్యాలయం కాదు. కమ్యూనిస్టు పార్టీ headquarters.


కొత్త ఆలోచనలను యిచ్చి ఉద్యమాలని నిర్మించే కర్మాగారం. పోరాటాలను తయారు చేసే ఫ్యాక్టరీ.

*

జనం కోసం నిర్విరామంగా మోగే ఒక నగారా.

*

పార్టీ, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, కర్షక సంఘాల్ని, ప్రజానాట్యమండలి కళాకారుల్ని, వేలమందిని ఊగించే గాయకుల్ని తన చుట్టూ తిప్పుకునే కేంద్రబిందువు!

*

అప్పట్లో ‘విశాలాంద్ర’ అంటే ఒక విద్యుదావేశం!

*

తాడి అప్పల స్వామి అబ్బాయి గా, ఆర్టిస్ట్ మోహన్ తమ్ముడుగా, ‘విశాలాంధ్ర’ లోపల స్వేచ్చగా తిరగడానికి నాకు లైసెన్స్ వుండేది. విశాలాంధ్ర గేట్ మాన్ నించి, ప్రొడక్షన్ ఇంచార్జి, ఎడిటర్, జనరల్ మేనేజర్ అందరికీ నేను తెలుసు. కేవలం కమ్యూనిస్టు ప్రాపగాండా కరపత్రం అయిన విశాలాంధ్రకి మరో ప్రత్యేకత వుండేది.

*

అది పరీక్షా ఫలితాలు, ముఖ్యంగా tenth results,

*

అప్పట్లో, ఆంధ్రజ్యోతి, పత్రిక, ప్రభ, విశాలాంధ్ర ఈవినింగ్ ఎడిషన్లు వచ్చేవి. అంటే సాయంకాలమ్ అయిదింటి లోపులోనే విజయవాడలోని ముఖ్యమైన అన్ని సెంటర్లో ఆ రోజు వార్తలతో దినపత్రికలు వేడి వేడి పకోడీల్లా అమ్ముడుపోయేవి!

బిసెంటు రోడ్డు, లక్ష్మి టాకీస్ సెంటర్, అలంకార్,

న్యూ ఇండియా హోటల్ సెంటర్లో వందల

మంది టీ తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ, ఆత్రంగా దినపత్రికలు చదువుతూండే వాళ్ళు.

*

టెన్త్ క్లాస్ రిజల్ట్స్... ఒక మేజర్ ఈవెంట్.

*

విశాలాంధ్ర గేట్ల ముందు కొన్ని వందలమంది విద్యార్థులు... ఎవరూ లోపలికి వెళ్లడానికి వీల్లేదు.

ఠంచనుగా ఉదయం 11 గంటలకి ఆ కుర్రాళ్లనందరిని పక్కకి వుండమని చెబుతూ, దర్జాగా లోపలికి వెళ్ళేవాణ్ణి. వాళ్ళు యిచ్చిన కొన్ని డజన్ల చీటీలు

నా చేతిలో ఉండేవి. ఎడిటోరియల్ సెక్షన్లో పార్ధసారధి, బాబురావు, నళినిరంజన్, యోగయ్య, జనార్ధనరెడ్డి... ఎవర్ని అడిగినా ఫలితాల రఫ్ కాపీ ఒకటి నా మొహాన పడేసేవారు. జాగ్రత్తగా results చూసి, ఒక కాగితం మీద నోట్ చేసి, మెట్లుదిగి కిందికి వచ్చేవాణ్ణి. దూరం నుంచి, “అరేయ్, వచ్చాడ్రా" అనుకుంటూ కుర్రాళ్ళు excite అయ్యేవాళ్లు.

అపుడు నేనో చిన్న జానపద హీరోని.

గేట్ దగ్గరకొచ్చి, ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ల నెంబర్లు పైకి చదివి చెప్పేవాణ్ణి.

“మా నెంబర్లు, మా నెంబర్లేవి” అంటూ చాలా గొంతులు అడిగేవి! ఫేయిల్ అయిన

వాళ్ళ నంబర్లు చెప్పేవాణ్ణి కాదు.

ఆ నంబర్లు ఇంకా చూడలేదని, అరగంటాగి చెబుతానని అనేవాణ్ణి. టెన్త్ క్లాస్ అంటే మరీ కుర్ర సన్నాసులు కదా! ఫెయిల్ అయ్యారని చెబితే ఆత్మహత్య చేసుకుంటారేమోనని ఆ జాగ్రత్త!

అలా విశాలాంధ్ర ఈవినింగ్ ఎడిషన్ బైటికి వచ్చే దాకా, అటు యిటూ తిరుగుతూ రిజల్ట్స్ చెబుతూనే వుండేవాణ్ణి. తర్వాత... ఇంటర్ రిజల్ట్స్...

వాళ్లూ అదే హడావిడి.

*

ఆనక, కొన్నేళ్ళకి, ఏలూరు రోడ్డు మీద నడిచి వెళుతుంటే, ఓ అపరిచితుడు పలకరించేవాడు.

1973లో నేను టెన్త్ ఫస్ట్ క్లాస్ల్ లో పాసయ్యానని మీరే చెప్పారు సార్” అనేవాడు కృతజ్ఞతతో.

“నేనెప్పుడూ అంతే" అన్నట్టు భుజాలు ఎగరేసి నవ్వేసేవాణ్ణి. చెయ్యి గట్టిగా నొక్కి వెళ్లిపోయేవాడు. అయిదు సంవత్సరాల పాటు సొంత బాధ్యతలాగా ఆ పని చేశాను.

*

‘విశాలాంధ్ర’లో ముందు ఎడిటోరియల్ సెక్షన్... ఏటుకూరి బలరామమూర్తి, నిడమర్తి ఉమరాజ్, నరేంద్రదేవ్, పరకాల పట్టాభి తదితర పెద్దలంతా కూర్చొని వుండే లోపలి గదీ, ఒకపక్క విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సూపర్ బాస్ పి.సి.జోషి గారు... అదొక అధ్యయన కేంద్రంలాగా వుండేది.

*

బ్రహ్మం అని ఒక అటెండర్ వుండేవాడు. పెద్దాయన. ఖాకీ నిక్కరు, చొక్కా, కళ్ళజోడుతో వొద్దికగా వుండే ఆయన్ని అందరూ బ్రహ్మంగారు అని పిలిచేవాళ్లు. ఆఫీసు బోయ్ లా ట్రీట్ చేసేవాళ్ళు కాదు.

ఫిలాసఫీ మాస్టారు ఏటుకూరి బలరామమూర్తి పేపరో పుస్తకమో చదవడంలో నిమగ్నం అయి వుండేవారు. బ్రహ్మం టీ గ్లాసు పెట్టిన చప్పుడు అవగానే, జేబులోంచి ఒక పావలా తీసి టేబుల్ మీద పెట్టేవాడు. ఓ రోజు ఇంట్లో బలరామమూర్తి గారి భార్య టీ ఇవ్వగానే, ఆయన జేబులోంచి పావలా తీసి ముందున్న కుర్చీ మీద పెట్టారు. “హయ్యో! ఎంత అదృష్టం చేసుకున్నానో...” అని నాలుగు నిఖార్సైన బ్రాహ్మణ తిట్లు తిట్టిందట ఆమె.

బలరామమూర్తి గారి గురించి యిలాంటి

జోకులు చాలా చెప్పుకునే వాళ్ళం.

*

‘విశాలాంద్ర’ స్టార్ ప్రూఫ్ రీడర్ కె.రాజేశ్వర రావు.

కవి, బాగా చదువుకున్నవాడు. మంచి అందగాడు. దురుసు మనిషి. రెచ్చిపోతూ ఉండేవాడు, ఒక “రైటియస్ ఇండిగ్నేషన్’ తో. నాకు కవిత్వమూ మాత్రలు, నడక, ఛందస్సు... రోజూ చెప్పేవాడు. మోహన్, రాజేశ్వర రావు టీ, సిగరెట్ మిత్రులు, రారా, చేరా లాగా అతను ‘కెరా’ అని రాసుకునేవాడు. ఒక సాయంకాలం నేను విశాలాంధ్రకి వెళ్ళేసరికి, రష్యన్ కవి రసూల్ గమ్జ్ తోవ్ ప్రేమ కవితలు చదువుతున్నాడు. నాకు కొన్ని వినిపించాడు ఇంగ్లిష్ లో. చాలా బావున్నాయి. “అరేయ్ నేను వీటిని ట్రాన్స్ లేట్ చేస్తాను. గమ్జతోవ్ లమ్జా కొడుకు భలే రాశాడు” అన్నాడు రాజేశ్వర రావు.

నవ్వుకుంటూ చాయ్ తాగాం.

*

పార్టీ అగ్ర నాయకుడు శ్రీపాద అమృత డాంగేకి 75 ఏళ్ళు వచ్చిన సందర్భంగా, నాటి సోవియెట్ ప్రభుత్వం ఆయనకి ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ అవార్డ్ ప్రకటించింది. దానిమీద కవిత్వం చెప్పు అన్నాడు కె.రా. నా వల్ల కాదన్నాను. చాలా ఈజీ...

“ఆర్డరాఫ్ లెనిన్ అవార్డు పొందావని తెలిసి నేను ఆశ్చర్యంపొందలేదు, విభ్రమమూ చెందలేదు...” అంటూ రాజేశ్వర రావే ఎనిమిది లైనులు రెండు నిమిషాల్లో రాసేశాడు. మర్నాడు విశాలాంధ్ర ఆదివారం సంచికలో ఆ పొట్టి కవిత నా పేరుతో అచ్చయింది. రాజేశ్వరరావు అలా చేశాడని నాకు తెలీదు. మా యింట్లో, ఉదయం టంచనుగా పేపర్లన్ని చదివే మా నాన్న, కాఫి అందుకుంటూ మన చిన్నాడు కవిత్వం రాశాడు ‘విశాలాంధ్ర’ లో అని అమ్మతో చెప్పాడు. చటుక్కున నా చెయ్యి మణికట్టుని Firm గా పట్టుకొని మా అమ్మ గబగబా వంటింట్లోకి లాక్కెళ్లింది. ‘కూర్చోరా’ అంది.

“వాడా బొమ్మలేసి చెడిపోయాడు, నువ్విలాంటి పిచ్చిరాతలురాసి పాడైపోకురా” అని ఎంతో concern తో చెప్పింది. “రాయనే రాయనమ్మా” అన్నాను. “అలాక్కాదు, నా చేతిలో చెయ్యివెయ్యి. వొట్టు వెయ్యి” అంది. అలాగే చేశాను. “మంచివాడివిరా నువ్వు’ అని అద్దిరిపోయే

ఫిల్టర్ కాఫి ఇచ్చింది.

బొమ్మలు గీసుకునే నాయాళ్ళూ, కవిత్వాలు రాసుకునే సోదిగాళ్ళు ఎందుకూ కొరగారని సభ్యసమాజం ఆనాడే కనిపెట్టిందని యిందు మూలముగా తెలియజేయడమైనది.

*

‘ఉదయం’ దినపత్రిక వచ్చిన ఒక్క సంవత్సరంలోనే మోహన్ పేరు రాష్ట్రమంతా మోగిపోయింది.

ప్రతి రోజూ పొలిటికల్ కార్టూన్, శివాజితో కలిసివేసిన దిబ్బరాజ్యం స్క్రిప్ట్ కార్టూన్, ఆదివారం ఇంటర్వ్యూ లు, పతంజలి వేట కథల బొమ్మలు, ఇంకా పోర్ట్ రెయిట్లు, కేరికేచర్లు జనానికి తెగనచ్చాయి.

“అమ్మా, నీ పెద్దకొడుకు సూపర్ స్టార్ కార్టూనిస్ట్, ఆంధ్రదేశం గర్వించదగిన ఆర్టిస్టు అయ్యాడమ్మా”

అని చెప్పాలని 1986లో ఎంత ఆరాటపడ్డానో.

*

35ఏళ్ల వయసుకే ఎనిమిదిమంది పిల్లల్నికని, కనీసం 35 సంవత్సరాలు నాన్ స్టాప్ వంటలు, ఇంటెడు చాకిరీ చేసి చేసీ, పిల్లలు, ఫీజులూ, అద్దెలూ అంటూ ఆరాటపడి అలిసిపోయిన అమ్మ 1980లోనే విజయవాడలో గుండెపోటుతో చనిపోయింది. అప్పటికి మా అమ్మ సూర్యావతి వయస్సు

55 సంవత్సరాలు మాత్రమే.

మండుతున్న చితిముందు, కన్నీళ్లతో నించొని వున్నప్పుడు, ఇంతమందిమి వుండి, ‘నువ్వు ఇష్టపడే ఒక మంచి బంగారం గొలుసు కొని యివ్వలేకపోయాం’ అన్న వేదన కలిచి వేసింది.

అది నన్నిప్పటికి వెన్నాడుతూనే వుంటుంది.

*

ఏలూరు రోడ్డులో విశాలాంద్ర బుక్ హౌస్ పెద్దది వుండేది. ఆ భవనంపైన చెక్కమెట్లు ఎక్కి వెళితే ఒక చిన్నగది. అక్కడ అభ్యుదయ రచయితల సంఘం సమావేశాలు జరిగేవి. ఓ సారి గుంటూరు శేషేంద్ర శర్మా, ఇందిరా దేవి ధనరాజ్ గిరి వచ్చారు.

ఆ రోజు ఆమె స్టార్ అట్రాక్షన్. పెదవులూ, బుగ్గలూ, నుదురూ, చెవుల దగ్గర రకరకాల రంగుల స్ప్రెలు, గలగలలాడుతుందని పించే నీలం పూల షీఫాన్ చీర. స్లీవ్ లెస్ బ్లౌస్. రాజస్తాన్ రాజుల అంత:పురాలనించి దిగివచ్చినట్టే వుంది. అవాక్కయిన కవులూ, రచయితలూ అంతా ఆవిణ్ణే చూస్తున్నారు.

ఆ ఇరుకుగదిలో గాలి సరిగా లేకపోవడం వల్ల ఆమె వ్యానిటి బాగ్ లోంచి, రకరకాల కర్చీఫ్ లు తీస్తూ,

ఓ సారి బుగ్గలూ, మరోసారి నుదురు, ఇంకోసారి పెదవులూ అద్దుకుంటోంది. ఆ దృశ్యాన్ని క్లోజప్ లో చూస్తున్న ఒన్ బై టూ చాయి, ఛార్మినార్ సిగరెట్ గాళ్ళంతా జన్మ ధన్యమైందని మురిసిపోతున్నారు. ఈ దేవత కొద్దిసేపట్లో వెళ్లిపోతుంది కదాని దిగులుపడిపోతున్నారు.


శేషేంద్ర శర్మా యేమీ తక్కువ తినలేదు. వొంపుతిరిగిన అందమైన ముక్కు, సమ్మోహన పరిచే చిరునవ్వు, బంగారు మేనిచాయతో కాంతులీనుతున్నాడు.

కవి అంటే యిలా వుండాలి అన్నట్టుగా వున్నాడు. వీళ్ళంతా ఇందిరాదేవిని చూసి విలవిల తన్నుకుంటున్నారని తెలిసిన జ్ఞానిలా వెలిగిపోతున్నాడు. కొంత కవిత్వం, కబుర్లు... సభ ముగిసింది. అందరం కిందికి దిగివచ్చాం. బుక్ హౌస్ ముందు ఏలూరు రోడ్డు మీద నుంచున్నాం.

శేషంద్ర, ఆమె అందరికీ నమస్కారం పెట్టి, వీడ్కోలు చెప్పారు. మేం ఇంటివైపు బయల్దేరామ్. ముందు మోహన్, జర్నలిస్ట్ రచయిత సోదుం రామ్మోహన్ నడుస్తున్నారు. “మోహన్, ఇందిరా దేవి యింట్లో అంట్లు తోమే పని ఏమైనా వుంటే, కుదురుకుందామని ఉందినాకు” అన్నారు సోదుం. “నాకు అలానే అనిపిస్తోంది” అన్నాడు మోహన్.

*

వెనక నాతో నడుస్తున్న కె. రాజేశ్వర రావు "ఈ ఇందిరా దేవి ధన్ రాజ్ గిరి ముందు ముఖ్దూం కవిత్వాన్ని, తర్వాత ముఖ్దూం మొహియుద్దీన్నీ ప్రేమించింది. ఎప్పుడూ ఉద్యమాలు, అరెస్టులూ, అండర్ గ్రౌండ్ అంటూ క్షణం తీరికలేని ముఖ్దూంని చూసి జడుసుకున్నట్టుంది. ఆనక అందగాడైన శేషేంద్ర శర్మకి వల విసిరింది" అని చెప్పాడు.

"ఈ అందాల రాజహంసకి శేషేంద్రే వల విసిరి వుండొచ్చుగా" అన్నాను.

"ఏమైనా, నష్టపోయింది అసలైన ప్రేమికుడు మన ముఖ్దూం కదా" అని ఓ పంచ్ విసిరాడు కె. రాజేశ్వర రావు.

*

ఇందిర దూరం అయిపోయిందన్న వేదనతో

ముఖ్దూం రాసిన పోయమ్ వినిపించాడు.

"ఆత్మను తాకట్టుపెట్టి, ప్రాణాలను పణంవొడ్డి

పద బాధల రాకాశశి ఉదయించే వేళయింది. చేసేదేముంది శశిని చషకంగా చేసి కళ్ళు మూసి తాగు వేదనలను..." అనే కవిత అంతా వినిపించాడు కెరా.

ఇందిరా దేవిని, 'ఆ వన్నెల విసనకర్ర' అన్నారు ముఖ్దూం ఆ పోయంలో.

నాంపల్లి జ్ఞాన్ బాగ్ పేలెస్ లో శేషేంద్ర, ఇందిర ల ఆతిథ్యం స్వీకరిస్తూ... మహా కవి శ్రీ శ్రీ

ఇందిర... ఇందిరా... ఎంచక్కని విందురా

ఇంకెక్కడ కందురా...

నీది మంచి పద్యమా... లేక

ఫ్రెంచి మద్యమా... అని అన్నారు.


పదపదవే గీతమా... పదవే నా ప్రాణమా

SONG OF ELURU ROAD - PART 2

---------------------------------------------------

అదొక మంచికాలం. పాటలు పాడుతూ, గొంతెత్తి నినాదాలు యిస్తూ, జెండాలు మోస్తూ... వందలమందిలో కలిసి నడుస్తూ...

వాళ్ళెవరో? పేరూ,వూరూ తెలీదు. కులం ప్రసక్తే లేదు. చిరునవ్వుతో కామ్రేడ్‌ అనే పలకరింపు, ఎండలో, వూరేగింపులో, చెమటతో నడక... వాళ్ళు..చిల్లుల బనియన్ల వాళ్ళు, ముతక చీరలవాళ్ళు, తెగిన చెప్పులవాళ్ళు.. ఒక్క టీ యిప్పిస్తే కృతజ్ఞతతో మెరిసే కళ్ళతో చూసేవాళ్లు.


పార్టీ పిలుపు యిస్తే చాలు ఎక్కడెక్కడి నించో బిలబిలమంటూ వచ్చేవాళ్లు. ఆడవాళ్ళ చంకల్లో బిడ్డలు, మగవాళ్ళ భుజమ్మీద బిడ్డలు, ఇల్లూ, భూమీ, ఆస్తీ, చదువూ...ఏమీలేనివాళ్ళు. "సదూకుంటున్నావా నాయినా, యేవూరు మీది?" ఎంత బాగా పలకరించేవాళ్ళో.

16 ఏళ్ళ కుర్రాణ్ణి నేను ఏం చేయగలను వాళ్ళ కోసం? కలిసి నడవడం తప్ప ! ఏమైనా, వాళ్ళు ధైర్యం గల మనుషులు. రోజంతా పనిచేయగల శక్తిమంతులు. నిత్యజీవన వాస్తవంతో, విషాదంతో ప్రతిదినమూ పోరాటం చేస్తూ బతికే నిజమైన జనం.

చేతిలో చిల్లిగవ్వలేని పేద జనం.

ఈ దేశంలో ప్రతిరోజూ, ప్రతి నిమిషం, ప్రతిక్షణం మోసగించబడే, అవమానించబడే, వంచిచంబడే కోట్లాది సామాన్య జనానికి విషాదాశ్రువుల్లాంటి ప్రతినిధులు వాళ్ళు. ఎవరు ఎందుకు మోసం చేస్తున్నారో తెలియని, ఆకలి మాత్రమే తెలిసిన అమాయక జనం !

విశాలాంధ్ర నుంచి దగ్గర నుంచి, ఏలూరు రోడ్డుమీదుగా మా వూరేగింపు పిడబ్ల్యూడి గ్రౌండ్స్‌కో, గాంధీ మున్సిపల్‌ హై స్కూల్ ఆవరణలోకో, సామారంగం చౌక్‌ కో చేరేది. వేదిక మీదికి ఒక యువకుడు వచ్చేవాడు.

ఆకలి మంటతో మలమలలాడే అనాథులంతా లేవండోయ్‌ అంటూ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ పాడేవాడు.

*

పుల్లారెడ్డి భార్య గాయని శారద వచ్చేది.


కులం కులం అనీ కుత్సితాలు పెంచుకోకు...

కూటికి లేనివాడా...

ఎంత బాగా పాడేదో.

*

అదృష్ట దీపక్‌ రంగంలోకి దిగేవాడు.

మా కండలుపిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు... మా మొగాలకీ కన్నీరా. మీ మొగాలకా పన్నీరూ... అని ఎఫెక్టివ్‌గా పాడేవాడు.


బాబుగారి పాకీ దొడ్లో పట్టపగలు ఎలక్ట్రీసిటి

పేదవాని పూరి గుడిసెలో కార్మబ్బుల కటిక చీకటి

మా కండలు పిండిన నెత్తురు...

ఈ పాట రాసింది జంధ్యాల పాపయ్య శాస్త్రి

(కరుణ శ్రీ)

*

నందిగామనించి వచ్చే అబ్దుల్‌గని అందుకునే వాడు. రారపోర అన్న పిలుపు మనకలవాటులే, లాలిపాటలే..అమ్మా అయ్యలేని వారలం మేమనాథలం..బాంచెన్‌..

అనాథ పిల్లల గురించిన ఆ పాట అయ్యేసరికి

కళ్ళునీళ్లతో నిండిపోయేవి.

*

ప్రజా నాట్య మండలి పరవళ్లు తొక్కుతున్న కాలం

పట్టణ,జిల్లా మహాసభలు, ప్రజానాట్యమండలి శిక్షణా శిబిరాలు జరిగేవి. పాటలు ప్రవహించేవి.

మారువాడి అప్పుకన్న మాయదారి బతుకు కన్న బరువా యింతోటి పెద్ద బండరాయి బాబయ్య... లాగరో హైలెస్సో, లాగరో హైలెస్స

లాగర హైలెస్స.. లాగరా హైలెస్స...

అంటూ రోడ్డు కూలీల పాట పాడేవాళ్ళు.

హైలెస్స ...అంటూ కుర్రాళ్ళం అంతా కోరస్‌ అందుకునేవాళ్ళం. పాటలో 'లాగరా' అనే మాటని నాలుగైదు రకాలుగా అంటారు. వినేవాళ్ళకి, బరువైన రోడ్డు రోలర్‌ లాగుతున్న ఫీల్ వస్తుంది. ఈ పాట రాసింది కొనకళ్ళ వెంకటరత్నం.

*

గజ్జెల మల్లారెడ్డి గీతం...

యువతరం శివమెత్తితే, నవతరం గళమెత్తితే లోకమేమారిపోదా. ఈ చీకటే పారిపోదా.... అని శారద హై పిచ్‌లో పాడి ఆశ్చర్యపరిచేది.

*

1972-73లో తాడేపల్లి గూడెంలో పొలిటికల్‌ క్లాసులు జరిగాయి. 800 మంది వచ్చారు. ఈడ్పుగంటి నాగేశ్వరరావు మరి కొందరు పెద్దలు అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, రష్యన్‌ విప్లవం, భారత స్వాతంత్ర్య పోరాటం, చైనా విప్లవం గురించి క్లాసులు చెప్పేవాళ్ళు. బ్రేక్‌ టైమ్‌లో పాటలు.

అప్పటికి 18 ఏళ్ళ వయసుండే ప్రేమ పావని,

అంతే నాకు చాలు, తమలపాకు తొడిమే పదివేలు పట్టె మంచం, పరుపూ లేక మనసూ చిన్నా బోయినాది, నా మనసూ చిన్నబోయీనాది...

అని పాడిన జానపదగీతం సూపర్‌ హిట్టు.

కొత్తగా పెళ్లయిన పల్లెటూరి పిల్ల ఖరీదైన కోర్కెలు కోరుతూ, తెలివిగా, 'అంతే నాకు చాలు' అంటూ ఆమె కోర్కెల లిస్టంతా చెబుతుంది పాటలో.

*

కవి అదృష్టదీపక్‌ చాలా అందగాడు. విప్లవం,ప్రేమ, జానపదాలు...ఎన్నో వెరైటీ పాటల్తో ఊపేసేవాడు, ముఖ్యంగా మఖ్దూం మొహియుద్దీన్ పాట..

నెమ్మోమన కళల్లేవు, కమ్మిన ముంగురులు లేవూ..

అణువణువున నిర్వేదం ఆవహించుకున్నదే. విషవాయు ప్రసరణమ్ముల విశ్వము దుర్గంధమే పదపదవే గీతమా, పదవే నా ప్రాణమా....

గజ్జెల మల్లారెడ్డి అనువాదం చేసిన

యీ వేదనా గీతాన్ని....

గుడిమూపున మతమౌఢ్యపు గోపురాలు నిలిచెనే కార్మిక రక్త స్రవంతి కట్టలు తెగిపారెనే...

పంజరాన పక్షులుగా బతికిరి నీ సహచరులే పదపదవే గీతమా...

అంటూ దీపక్‌ పాడుతుంటే మనసు

వికలం అయిపోయేది.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన హిస్టరీ లెక్చరర్‌ అదృష్టదీపక్, రెడ్డి అని తెలియడానికి నాకు పాతికేళ్లు పట్టింది. అంత స్పృహలేకుండా, ఇన్నోసెంట్‌గా, హేపీగా బతికాం. మీ కులం ఏంటని మోహన్నిగానీ, నన్నుగానీ ఎన్నడూ అడిగిన

పాపాన పోలేదు దీపక్‌

*

సి.పి.ఐ ప్రజానాట్యమండలికి మోహన్‌దాస్ అనే మంచి సంగీతదర్శకుడు... నల్లగా పొడవుగా, తెల్లని లాల్చీ పైజామాతో, సింపుల్‌గా వుండేవారు. బుగ్గన ఒక పాన్‌ పెట్టుకుని హర్మొనియం ముందు కూర్చున్నాడో, మేజిక్ చేసేవాడు.

రాగాల్ని పరుగులు పెట్టించేవాడు. ఈ విప్లవ, విషాద, ఆకలి పాటలు ఎప్పుడూ వుండేవే కదా...

చక్కని ప్రేమ గీతాలూ, పల్లెటూరి పాటలూ ట్యూన్‌ చేసేవాడు. అంలాంటి ఒక పాట నార్ల చిరంజీవి రాసింది.

వెళ్లకోయి...వెళ్లకోయి.. వెళ్లకోయి ఓ సఖా

వెళ్లకోయి నా సఖా... పందిరిని లేమల్లె

పరిమళించిన దోయి... మంచు సోనలు కురిసీ..మత్తిల్లినదీ రేయి...వెళ్లకోయి...

1976లో ఉండ్రాజవరం శిక్షణా శిబిరంలో ధవళసత్యం అప్ కమింగ్‌ సింగర్స్‌కి యీ పాట నేర్పాడు.

అప్పుడు మా ఆవిడ నళిని నేర్చుకుంది.

బాగా పాడేది. 20 ఏళ్ళ తర్వాత 1995-96లో సికింద్రాబాద్ లోని మా యింట్లో ఒక సంగీత కచేరీ పెట్టుకున్నాం. లెల్లే సురేష్‌, శ్రీరాం, పైడి తెరేష్‌ బాబు, సత్తూరు శ్రీనివాస్, మోహన్, నేనూ, నళిని మరికొందరు...రోజంతా పాటలే.

వెళ్ళకోయి.. పాట నళిని పాడితే, తెరేష్‌ బాబూ కలిసి పాడాడు. ఈ పాట తనకి చాలా యిష్టం అని చెప్పాడు. ఈ పాట ట్యూన్‌కి దగ్గరగా వుండే తన సొంత పాట తెరేష్‌ వినిపించాడు.

నీ ప్రేమలేఖ చూశా.... నే గాయపడిన చోట

ఒక దీప కళిక చూశా..నే శలభమైన చోట..అని హృదయాల్ని కదిలించేలా పాడాడు.

ఈ రెండూభీం పలాస్ రాగం అని చెప్పాడు.

నల్లగా, బండగా, పొట్టతో, అన్ ఇంప్రెసివ్‌గా వుండే పైడి తెరేష్‌బాబు, ఈ రెండు పాటలూ పాడినాక, నాకు ఒక మెహదీహసన్‌లా, ఒక గులాం అలీలా కనిపించాడు. ఒక ఆత్మసౌందర్యాన్ని నేను దర్శించుకోగలిగాను.

*

1963లో వచ్చిన ' తోబుట్టువులు' సినిమాకి సి.మోహన్‌దాస్‌ సంగీత దర్శకుడు.

ఆచిత్రంలో గొప్ప పాటలున్నాయి.

"సాగేను జీవిత నావ. తెరచాటు లేక యీ తోవ"

పాట ఆ సినిమాలోదే. సావిత్రి, జమున, శారద, కాంతారావు నటించారు.

మధురమైన రేయిలో, మరుపురానిహాయిలో

పండు వెన్నెలే... నేడు పాడెనేలనో.. అనే సుతిమెత్తని పాట మోహన్ దాస్‌ ట్యూన్‌ చేసిందే.

*

అద్దంలో సూత్తంటె అదియేటొ వోలమ్మి

వొట్టమ్మి వొల్లంత ఉలికులికి పడతాది

సన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు

మొన్న తిరిగొస్తనన్నాడే ..

అని నండూరి సుబ్బారావు గారి పాట పాడుతుంటే ఆ పల్లె టూరి ప్రియురాలి లాగే

పులకరించిపోయేవాళ్ళం.

*

దాశరథి కృష్ణమాచార్య కలాన్ని నెత్తుటిలో ముంచి రాసిన అపురూపమైన గీతం...

ఆ చల్లని సముద్ర గర్భం, దాచిన బడబానలమెంతో

ఆ చీకటి ఆకాశంలో, కనిపించని భాస్కరులెందరో..

అని గాయకులు గుండెలోతుల్లోంచి పాడుతుంటే,

వినీలాకాశం అంత విజువల్‌ ఒకటి

కళ్ళముందు సాక్షాత్కరించేది.

నవయవ్వన ఉద్వేగానికో అర్ధాన్నిచ్చేది.

*

సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావుల మా భూమి, గెరిల్లా నాటకాలు అప్పట్లో బాగా పాపులర్‌. అన్ని జిల్లాల్లో ఆడేవాళ్ళు. జనం వెర్రెత్తి నట్టుగా చూడ్డం నాకొక మంచి జ్ఞాపకం. విజయవాడ ప్రజా నాట్యమండలి హీరో రెడపొంగు పిచ్చయ్య, విశాలాంధ్ర టెలిఫోన్‌ ఆపరేటర్‌, మంచి గాయని సుమిత్ర పాటలు నేను ఎప్పటికీ మరిచిపోలేను.

*

ఏలూరునించి ఎప్పడన్నా, ఆర్టిస్టు కాళ్ళ సత్యనారాయణ వచ్చేవాడు. మనిషే ఒక పాటలా వుండేవాడు. 'ఏకవీర' సినిమాలో సి.నారాయణరెడ్డి పాట...

ఎంత దూరమూ, ఇది ఎంత దూరమూ

ఉదయించే కిరణాలకు, ఉప్పొంగే కెరటాలకు కలలుగనే చెలునికీ, కలతపడే చెలియకూ

ఎంత చేరువో...అది అంత దూరమూ..

కవి ఎంత రసభరితంగా రాశాడో, బాలు సుశీల ఎంత మధురంగా పాడారో, కాళ్ళ అంత అందంగా పాడేవాడు. తోటలోనా రాజు-తొంగి చూసెను నేడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు... కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలా పాడే వాడు కాళ్ళ.

*

పాటల కార్యక్రమం మొదలయ్యే ముందు, వినాయకుణ్ణి ప్రార్థించడం సంప్రదాయం, నాటకం ప్రారంభించే ముందు పరాబ్రమ్మ, పరామేశ్వర, పురుషోత్తమ, సదానంద..అని పాడటం ఆనవాయితీ. మరి కమ్యూనిస్టులు యివి పాడకూడదు. ఎలా? దానికో పద్యం కనిపెట్టాలి. రాంభట్ల కృష్ణమూర్తి ఆ పనిచేశారు.

గంజి వీరాంజనేయులు అని విశాలాంధ్ర సినిమా ఎడిటర్‌ వుండేవాడు. ప్రజానాట్యమండలిని సింగిల్‌ హేండ్‌తో నడిపించాడు. నాటకాలంటే ప్రాణం. విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్‌లోనో, హనుమంతరాయ గ్రంథాలయంలోనో నాటకానికి రంగం సిద్ధం అయ్యేది. మేం అంతా ఎంతో ఆసక్తితో కూర్చుని వుండేవాళ్ళం. తెర నెమ్మదిగా తీయగానే సన్నని ఉదయపు వెలుతురు లాంటి లైటింగ్‌ వేసేవారు. నేపథ్యంలో రాంభట్ల పద్యం

రుగ్వీధిని మహారుషులు వేడుకున్న ఉషస్సు

ఉదాత్త స్వరితప్లుతాల పాడుకున్న యశస్సు

మానవాళి రుగ్గీతుల మలచిన ఎర్రని ఉషస్సు

మనిషి కన్న కలల్నుంచి

మనిషెత్తిన గళం నుంచి

నరునికంటి కొనల్నుంచి

బిగిసిన పిడికిళ్ల నుంచి,

ఎగసిన కొడవళ్ళ నుంచి

అవధరించు.. అవధరించు..

అని ఆరున్నొక్కరాగంలో ఉద్వేగంతో విప్లవాన్ని పిలిచేవాళ్ళు. తర్వాత వీరాంజనేయులు (వీరా) వ్యాఖ్యానం..అప్పుడు నాటకం మొదలయ్యేది.

*

మొదట్లో పినిశెట్టి శ్రీరామ్మూర్తి రాసిన

ప్రజా నాట్యమండలి గీతం...


నవ్యయుగోదయ దివ్యకాంతులు

నాటక కళలో పొంగిపొరలినవి

చీకటి తెరలను చీల్చుకపోయి

దాస్యభావవమును దూరము చేసి

మారుమూలల అణిగిపోయిన

మానవత్వమును మేలు కొల్పగా - పాడేవారు

*

పార్టీ రాజకీయ పాఠశాలల్లో, గురజాడ

దేశమును ప్రేమించుమన్నా మస్ట్‌గా వుండేది.

*

అలాగే వజ్రాయుధం ఆవంత్స సోమసుందర్‌ సమరగీతం, evergreen...


ఖబడ్డార్‌ ! ఖబడ్డార్‌ !

ఒక వీరుడు మరణిసత్ఏ వేలకొలది ప్రభవింతురు. బాగా పాపులర్‌ "

*

విశాలాంధ్ర journalist కవి మల్లిక్ రాసిన

ప్రజా నాట్యమండలీ, ప్రతి గుండె ప్రతిధ్వని

జనజీవన సమరాలకు శృతి చేసిన రసధుని... అనే సిగ్నేచర్‌ పాట అందరం కలిసి పాడేవాళ్ళం.

*

శ్రీశ్రీ కొంతమంది కుర్రవాళ్ళు.. పాట ఆల్‌టైమ్ హిట్

కొంత మంది యువకులు రాబోయు యుగం దూతలు

పావననవ జీవన బృందావన నిర్మాతలు

లాస్ట్‌ పంచ్‌ లైన్‌ : వారికి మా ఆహ్వానం, వారికి మా శాల్యూట్‌ అని రెండు సార్లు హై పిచ్‌లో అంటే హాలు చప్పట్లతో మోగిపోయేది.

*

1974లో కవి కె. రాజేశ్వరరావు, 'జనశ్రేణి కదిలింది' అని ఓ నృత్యరూపకం రాశాడు. ఒక పల్లెలో రైతులు పండించిన పంటని భూస్వామి పట్టుకుపోవడం థీమ్‌. చివర్లో రైతులు తిరగబడుట..' జనశ్రేణి కదిలింది'.. రణ శంఖం మోగింది' అంటూ క్లయిమాక్స్‌పాట. రూపకంలో పంటకి సింబల్‌గా హీరోయిన్‌ ధాన్యలక్ష్మి ఆమెనే భూస్వామిచివరి లో తీసుకు పోబోతాడు. విశాలాంధ్ర ఆవరణలో రిహార్సల్స్‌ వేసేవాళ్ళు. మా చెల్లాయి శకుంతల ఆకుపచ్చని చీర కట్టుకుని, పెద్ద జుట్టంతా వెనక్కి లూజుగా వదిలేసి, ధాన్యలక్ష్మిలాగే వుండేది. నాట్లు, పంట పండటం అంతా పాటలే. నూర్పిళ్ళు నూర్చేటి తరుణ మొచ్చిందిరో...అనగానే, మేమంతా ఉత్సాహంగా, సందమావా, హోయ్‌ సందామామ అని కోరస్‌యిచ్చేవాళ్లం. ఇంకో చోట, వోయి బావన్నెలాలో బావన్నెలాలో సందామా అని పాడేవాళ్ళం. అలా అందరం కలిసి అనడంతో ఒక లయ, తూగు, ఒక తియ్యని స్నేహభావం మనసుని చుట్టుకునేవి. శకుంతల instant గా జనశ్రేణి స్టార్ ఐయిపోయింది.

*

1975 రానే వచ్చింది. జనవరిలో సి.పిఐ జాతీయ మహాసభ, విజయవాడ PWD గ్రౌండ్స్‌లో , ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు జనంతో కిటకిటలాడిపోయాయి. THE MOST EXPENSIVE NATIONAL CONFERENCE. రోజూ కొన్ని వందల మందికి టిఫిన్లూ, భోజనాలు... డాంగే, చండ్ర రాజేశ్వరరావు ప్రధాన ఆకర్షణ. గదర్‌ వీరుడు సోహన్‌ సింగ్‌ జోష్‌ని అప్పుడే చూశాను. తెల్లని పెద్ద తలపాగా, నెరసిన గడ్డంతో ఆరడగుల మనిషి,

గురు గోవింద్‌ సింగ్‌ బామ్మర్దిలా వున్నాడు.


ఓ రోజు సభా ప్రాంగణంలో ఇద్దరు పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళి "కామ్రేడ్స్‌ నా పేరు ప్రకాష్‌, స్టూడెంట్‌ని" అని పరిచయం చేసుకున్నా. వాళ్ళు నాకు షేక్‌ హ్యాండిచ్చి

" నా పేరు గంగాధర్‌ అధికారి, నా పేరు సర్దేశాయ్‌ " అని చెప్పారు. విన్న పేర్లే , వాళ్ళ యింపార్టెన్స్‌

మాత్రం నాకు అప్పటికి తెలీదు.

మహాసభ మొదటి రోజు, వేలమంది కార్యకర్తలు నించుని వుండగా రాంభట్ల పాట...

మృతవీరులారా లాల్ సలామ్‌,

దరి లేని బానిస చాకిరి నర హంతకుల గూండా గిరి, ఇక వద్దని, ఇక రద్దనీ పోరాడి నేలకు వొరిగినా...

రణశూరులారా లాల్‌ సలామ్‌ !లాల్‌ సలామ్‌ !

చిర శాంతి భువినిండాలని, నర జాతి కల పండాలని, యుగ స్రష్టలై... కమ్యూనిస్టులై

పోరాడి నేలకు ఒరిగినా

ధృవతారలారా లాల్ సలాం !

నలుగురో, ఆరుగురో చాలా ఎమోషనల్‌గా పాడారు. తర్వాత డాంగే ఎర్రజెండా ఆవిష్కరించారు.

అప్పుడు గజ్జెల మల్లారెడ్డి పాట...

ఎత్తరామన ఎర్రజెండా....

ఎర్రకాంతులు దిశలనిండా

ఎత్తరా సంఘర్షకీలల..

ఉద్భవించిన ఎర్రజెండా..ఎత్తరా !

గుత్తపెత్తందారి దోపిడి,

వర్గదుర్గాల్‌ దద్దరిల్లగా...ఎత్తరా !


ఇది పల్లవి. చరణాలు గుర్తులేవు. పాట వింటుంటే పూనకం వచ్చినట్టే వుండేది.

అంత ఫోర్స్‌తో పాడేవాళ్ళు...

*

ఏ సభ అయినా ముగిసేసరికి రాత్రి తొమ్మిది దాటిపోయేది. ఇంటికి వెళ్ళాలంటే అందరం కలిసి, నల్లని పొడవాటి తార్రోడ్డు, ఏలూరు రోడ్డుమీద నడక వెన్నెల కురుస్తుండేది. రోడ్డుకి అటూ యిటూ పెద్ద పెద్ద చెట్లు... ట్రాఫిక్కూ నియాన్‌ లైట్లూ లేని కాలం.


ఈ పాటలు పాడుకుంటూ, రోడ్డుమీద పరుచుకున్న చెట్ల వెన్నెల నీడల్లో నడక.... సీతారాంపురం, చుట్టుగుంట, మారుతీనగర్‌, పడవలరేవు దాకా నడుస్తూ వెళ్ళేవాళ్లం. అదో సరదా. మాతో నడిచివచ్చే డిగ్రీ చదువుకుంటున్న ఆడ పిల్లల్ని యిళ్ళ దగ్గర దిగబెట్టేవాళ్ళం.

అవన్నీ స్వచ్ఛమైన స్నేహాలు.

*

అప్పటికి మా తరం CORRUPT కాలేదు. డబ్బులు పోగేయ్యాలని, భూములు కొనుక్కోవాలనీ తెలీదు. బంజారాహిల్స్‌లో FLAT లేకపోయినా, బిడ్డల్ని అమెరికా పంపకపోయినా, నిన్నెవరూ మనిషిగా గుర్తించరనీ తెలీదు.

కానీ...నేను ఇంత చెడిపోతాననీ,

ఇంత CORRUPT అయిపోతాననీ,

ఈ కళ్ళతోనే సర్వ నాశనాన్ని చూస్తాననీ అనుకోలేదు

కలలో కూడా.


*

FUN FACT : వేయిపడగల విశ్వనాథ సత్యనారాయణ గారు ఎర్రజెండా పాట రాశారని మీకు తెలుసా ? ఎవరి దగ్గరైనా ఆ పాట వుందా?

దేవులపల్లి, మహాకవి కృష్ణశాస్త్రి అరుణ పతాకం పాట రాశారని తెలుసా ?

ఇది ఎవరి దగ్గరన్నా వుందా ?

*

Taadi Prakash 970 454 1559

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...