Dec 31, 2018


ఓటర్ ఐడీతో మొబైల్ నెంబర్ అనుసంధానం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా

v దేశంలో ఈ విధానం ప్రారంభించిన తొలి రాష్ట్రం
v 2019 ఎన్నికల కమిషన్ క్యాలండర్ విడుదల
v కొత్త ఓటర్లకు సన్మానం
v ఓటర్లకు సౌలభ్యంగా ఏర్పాట్లు
v ఇంటి నుంచి పోలింగ్ బూత్ కు మార్గం
v అత్యాధునిక టెక్నాలజీ వినియోగం
v అత్యధిక మంది ఓటింగ్ లో పాల్గొనేలా ప్రయత్నాలు
v నామినేషన్ చివరి తేదీ వరకు ఓటర్ పేరు నమోదు
v టోల్ ఫ్రీ నెంబర్ 1950

                     సచివాలయం, డిసెంబర్ 31: ఓటర్ ఐడీ(ఎలక్టొరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్)తో ఓటర్ సెల్ నెంబర్ అనుసంధానం చేసే ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా చెప్పారు. దేశంలో ఈ విధంగా అనుసందానం చేస్తున్న మొదటి రాష్ట్రం మనదేనన్నారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం  కొత్తగా ఓటర్లుగా చేరిన పది మందిని సన్మానించి, వారికి టాబ్ లు అందజేశారు. 2019 ఎన్నికలకు కమిషన్ క్యాలండర్ ను సిసోడియా విడుదల చేసి కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.లక్ష్మీకాంతంకు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యు.మురళీ కృష్ణ, సంఘం మహిళా నాయకురాళ్లకు అందజేశారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ రాష్ట్రంలో 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. దాదాపు అందరు ఓటర్లకు సెల్ ఫోన్లు, అధిక మందికి స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం ఉందన్నారు. ఈ విధంగా అనుసంధానం చేయడం ద్వారా ఎన్నికల సంఘం ఓటర్ కు ఎస్ఎంఎస్ ల ద్వారా నేరుగా సమాచారం పంపించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. మధ్యలో మరొకరి అవసరం ఉండదని చెప్పారు. వెబ్ సైట్ లో ఓటర్ ఐడీ, సెల్ నెంబర్ అనుసంధానం చేసే ప్రక్రియ  ఒక వారంలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అలాగే ఓటర్ కూడా మెసేజ్ లు పంపి  తనకు కావలసిన సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ఓటర్ మెసేజ్ పంపిన నెంబర్ ఆధారంగా అతని పేరు, తండ్రి పేరు, ఊరు పేరు, పోలింగ్ కేంద్రం అడ్రస్, పోస్టల్ పిన్ కోడ్... వంటి విషయాలన్నీ మాకు తెలిసిపోతాయని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఓటర్ కు ఓటు వేయవలసిన పోలింగ్ స్టేషన్ తోపాటు ఇంటి నుంచి అక్కడకు ఏ మార్గంలో వెళ్లాలో చూపించే  మ్యాప్ కూడా పంపుతామని చెప్పారు.  రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉత్తమ పాలన కోసం ఓటు హక్కు ప్రాధాన్యతను వివిధ సమాచార మాధ్యమాల ద్వారా ఓటర్లకు తెలియజేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పోలైన ఓటింగ్ శాతం బాగానే ఉంటుందని, పట్టణ ప్రాంతాలలో తక్కువగా ఉంటుందని, దానిని పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పట్టణ ప్రాంతాలలో ఓటర్లు ఎక్కువ మంది ఓటు వేసేవిధంగా వారిలో చైతన్యం కలిగిస్తామని చెప్పారు. అవకాశం ఉంటే వారు ఓటు వేసే పోలింగ్ బూత్ వద్ద ఏ సమయంలో ఎంత మంది బారులు తీరి ఉన్నారో కూడా తెలియడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా చేరడానికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఓటర్లుగా చేరే యువతీ, యువకులను, దివ్యాంగులను రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల, గ్రామ స్థాయిలో సన్మానిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ కొత్త ఓటర్లను సన్మానించి, ట్యాబ్ లు అందజేసినట్లు చెప్పారు. ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జనవరి 11న ఓటర్ల జాబితా విడుదల చేస్తామని, అందులో తమ పేరు ఉందో లేదో అందరూ చూసుకొని లేని వారు తమ పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసే చివరి రోజు వరకు ఓటర్లుగా నమోదు చేయించుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ తరువాత తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఎవరికైనా ఏవైనా అనుమానాలు ఉంటే ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ 1950కి పోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఓటు హక్కుకు సంబంధించి ఓటర్లను చైతన్య పరచడానికి సామాజిక మాధ్యమాన్ని కూడా విస్తృతంగా ఉపయోగించుకున్నట్లు సిసోడియా చెప్పారు. జనవరి 26న ఓటర్స్ డే సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించి అధిక మందిని ఓటర్లుగా చేర్చడానికి ప్రయత్నిస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ కేలండర్ లో కూడా ఓటర్ కు కావలసిన సమాచారం అంతా పొందుపరిచినట్లు తెలిపారు.

అవకతవకలకు తావులేకుండా 4 ఐఏఎస్ అధికారు పర్యవేక్షణ
                      ఓటర్ల జాబితాలలో ఎక్కడా ఎటువంటి అవకతవకలకు తావులేకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో నలుగురు  ఐఏఎస్ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తుంటారని, తాను కూడా వివిధ ప్రాంతాలలో పరిశీలిస్తుంటానని సిసోడియా చెప్పారు. 85 ఏళ్లు దాటిన వృద్ధుల జాబితా ప్రత్యేకంగా తయారు చేసినట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న బోగస్ ఓటర్ల విషయం ఒక విలేకరి ప్రస్తావించగా, అన్నిటినీ పరిశీలిస్తున్నామని, రెండుమూడు చోట్ల నమోదైన వాటిని తొలగిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల వారు 58 లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్లు ఒక జాబితా ఇచ్చారని తెలిపారు. వాటిలో రెండు మూడు చోట్ల నమోదైన 27 లక్షల పేర్లను తొలగించామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపగా పేర్లు తప్పుగా నమోదు కావడం, భర్త పేరు బదులు భార్య పేరు, భార్య పేరు బదులు భర్త పేరు, తండ్రి పేరు, ఇంటి నెంబర్.... ఇలా వివిధ రకాలుగా తప్పుగా నమోదైన 3 లక్షల 50 వేల పేర్లను తొలగించినట్లు తెలిపారు. అనుమానాస్సదంగా ఉన్న మరో లక్షా 30 వేల పేర్లను కూడా తొలగించినట్లు చెప్పారు. ఓటర్ల నమోదులో ఎవరికీ అనుకూలత గానీ, భయపడేదిగానీ లేదని, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా చూస్తామన్నారు. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని, ఎన్నికలు విజయవంతంగా జరగాలని సిసోడియా ఆకాంక్షించారు.

Dec 29, 2018


ఇల్లులేని ప్రతి ఒక్కరికి ఇల్లు
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రకటించిన సీఎం చంద్రబాబు
              సచివాలయం, డిసెంబర్ 29: రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉండవల్లి సెంటర్ సమీపంలోని ప్రజావేదిక వద్ద శనివారం ఉదయం ప్రారంభమైన 19వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. గృహనిర్మాణంపై జరిగిన సమీక్ష సందర్భంగా జనవరిలో జరిగే జన్మభూమి కార్యక్రమాల్లో ఇల్లులేని ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని, రెండు,మూడు ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. జన్మభూమి నాటికి ఇల్లు లేనివారి జాబితాను సిద్ధం చేయమని జిల్లా కలెక్టర్లను ఆయన దేశించారు. 2020 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇల్లు సమకూరుస్తామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 19,57,429 ఇళ్లు మంజూరు చేయగా, 7,45,339 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 11,61,812 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 10,00,086 ఇళ్లు మంజూరు కాగా, 4,06,142 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. పీఎంఏవై-ఎన్టీఆర్(గ్రామీణ్) పథకం కింద 1,20,943 ఇళ్లు మంజూరు కాగా, 43,071 పూర్తి అయ్యాయని, పీఎంఏవై-ఎన్టీఆర్(అర్బన్) పథకం కింద 3,86,804 మంజూరు కాగా, 69,963 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు వివరించారు. ఎన్టీఆర్ స్పెషల్ హౌసింగ్ కింద హుద్‌హుద్ బాధితులకు 9,170 ఇళ్లు మంజూరు చేయగా, 8,788 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు. గత 3 ఏళ్లలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద మంజూరైన 6 లక్షల ఇళ్లలో ఇంకా 60 వేల ఇళ్ల పనులు ప్రారంభం కాలేదని, వాటిని వెంటనే ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణకు గృహమిత్రలను నియమించుకోమని చెప్పారు.  మెప్మా, డ్వాక్రా మహిళలను గృహమిత్రలుగా ఎంపిక చేసి,  ఇంటికి ఇంత చొప్పున వారికి గౌరవ వేతనం  ఇవ్వమని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో గ్రామీణ, పట్టణ శాఖల మధ్య సమన్వయం ముఖ్యమని చెప్పారు. ఆధార్ లింకేజీ ద్వారా ఇంకా ఇళ్లులేని పేదలు 10 లక్షల మందిపైగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. జన్మభూమి లోపల ఎంతమందికి ఇళ్లు లేవో అంచనా వేయాలని,  వాళ్లందరికీ జన్మభూమి కాగానే ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పారు. జనవరిలో మరో 4 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు పునాదులు వేయాలన్నారు. మంచిరోజు చూసి భారీఎత్తున  మళ్లీ సామూహిక గృహ ప్రవేశాలను పండుగగా జరపాలని చెప్పారు.  అవసరాన్ని బట్టి గృహ నిర్మాణాల కోసం హౌసింగ్ కార్పోరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇస్తామని చెప్పారు. గృహ నిర్మాణంలో విశాఖ విధానం ఒక బెస్ట్ మోడల్ అని, అక్కడ వెయ్యి ఎకరాలు భూ సమీకరణ విధానంలో తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఒంగోలు, ఏలూరు, కడపలలో  అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీలను ఏర్పాటు చేశామని,  యూడిఏ కిందకు వచ్చిన ఈ 3 పట్టణాలలో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం కావాలన్నారు.
              కలెక్టర్ల సమావేశాలు మేధోమధనానికి ఉపకరిస్తున్నాయని,  ఫలితాల సాధనలో ఈ సమావేశాల ప్రాధాన్యత చాలా వుందన్నారు. 5 ఏళ్ల కాలంలో 19 సార్లు జిల్లా కలెక్టర్ల సమావేశాలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు.  కలెక్టర్లు అందరూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారని,   ప్రభుత్వంలోని వివిధ శాఖలకు 635 పురస్కారాలు దక్కడం అరుదైన అనుభవంగా పేర్కొన్నారు. నిరంతరం పనిలోనే నిమగ్నం అవుతున్నామని,  పనిలో ఉంటే వేరే ఆలోచనలు కూడా రావని, ఈ అవార్డులు మన అద్భుతమైన పనితీరుకు నిదర్శనం అన్నారు. జిల్లా, గ్రామస్థాయి ప్రణాళికల రూపకల్పనకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం సాధించిన అభివృద్ధిపై శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని, నిర్ణీత లక్ష్యాలను సాధించుకోవడంలో సానుకూల, ఆశావహ దృక్పధంతో ఉండాలన్నారు.  6వ విడత జన్మభూమి –మా ఊరు కార్యక్రమం గ్రామాలు, వార్డులలో పండగ వాతావరణంలో జరపాలని చెప్పారు. గ్రామస్థాయి సూక్ష్మ ప్రణాళికలను వెల్లడించడానికి ఈ సభలను వేదికలుగా ఉపయోగించుకోవాలని చెప్పారు.  ప్రకృతి వ్యవసాయంపై గ్రామ సభలలో అవగాహన కల్పించాలన్నారు.

               విభజన సమయంలో ఎదురైన సమస్యలు వెంటాడుతూ వస్తున్నాయని, సమయం కూడా ఇవ్వకుండా హైకోర్టు విభజన చేశారని, అయితే మనం సిద్ధంగానే ఉన్నామని,  వచ్చే ఉద్యోగులు సంసిద్ధంగా లేకుండానే హడావుడిగా విభజన చేశారన్నారు. కోర్టులు కూడా వస్తున్నాయని,  విమానయాన సర్వీసులు తగినన్ని లేవని, వాటిని వెంటనే కల్పించాలని అందరూ కోరుతున్నారన్నారు. ఎయిర్‌షో చివరి నిమిషంలో విత్ డ్రా చేశారంటే ఎంత కక్షగా వ్యవహరిస్తున్నారో అర్ధం అవుతోందన్నారు. 2019లో పోలవరం కాలువల ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పారు. ఉద్యానవన పంటలలో అనంతపురం జిల్లా అగ్రస్థానంలోఉందని చెప్పారు.  ఇచ్చిన కాసిన్ని నీళ్లకే అనంతపురం ఉద్యాన రైతులు అద్భుత ఫలితాలను సాధించారన్నారు. రాయలసీమలో నీళ్లను సక్రమంగా వినియోగించుకుంటే అది రానున్న రోజులలో హార్టీకల్చర్ హబ్‌గా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యానవన పంటలకు  పెట్టుబడులు తక్కువ, ఫలితాలు ఎక్కువన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు రానున్న కాలంలో ప్రాథమిక రంగంలో ప్రధమంగా ఉంటాయని చెప్పారు. కాలుష్య ప్రభావం, నీరు లేకపోవడం కారణాలుగా ఆక్వా కల్చర్‌లో ప్రకాశం జిల్లా వెనుకబడిందన్నారు.  కేంద్రం సహకరించకున్నా మన కష్టంతో 10.52 శాతం వృద్ధి  రేటు సాధించినట్లు చెప్పారు.  రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వడం వల్లనే అనేక సమస్యల నుంచి గట్టెక్కగలిగామని చెప్పారు.  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నీళ్లు ఉన్నాయి, తీర ప్రాంతం ఉంది, అభివృద్ధికి వీలైన వాతావరణం ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో అక్కడ అభివృద్ధి సాధ్యం కావడం లేదన్నారు. 
అవినీతిని చాలావరకు నియంత్రించామని, అవినీతి నిర్మూలనలో మూడవ స్థానంలో నిలిచామని చెప్పారు. సాంకేతికత, జవాబుదారి విధానాల వల్లనే అవినీతి నియంత్రణలో ఒక రోల్ మోడల్‌గా ఉండగలిగినట్లు పేర్కొన్నారు.
175 నియోజకవర్గాలలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని,
బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్లు, బెస్ట్ నాలెడ్జ్ పార్టనర్లను తీసుకొచ్చి మెడ్ టెక్ పార్కును ఒక అత్యుత్తమ నమూనాగా నిలిపిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ఇదేవిధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 200 ఎకరాలలో ఆర్ అండ్ డీ, ప్రోడక్ట్ టెస్టింగ్, మార్కెటింగ్, వేర్ హౌసింగ్ తదితర సదుపాయాలతో దేశానికి ఒక నమూనాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మనకు మానవ వనరులకు, సహజ వనరులకు కొదవలేదని, నైపుణ్యం, తెలివితేటలు ఉన్నాయన్నారు.  మంచి ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడానికి తగిన వసతులు ఉన్నాయని, హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. 10 శ్వేత పత్రాలపై జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పెద్దఎత్తున చర్చ జరగాలన్నారు. పది రోజులలో గ్రామాలలో ప్రజానీకానికి అవగాహన కల్పించాలని చెప్పారు. నాలుగేళ్లుగా వరుసగా వృద్ది ఫలితాలలో అగ్రస్థానంలో ఉన్నామని,  2014 నుంచి జాతీయస్థాయి కంటే ఎక్కువగా వృద్ధి ఫలితాలను సాధిస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో వర్షాభావం వల్ల వృద్ధిలో తగ్గుదల కనిపిస్తోందన్నారు. సేవారంగంలో తక్కువ పెట్టుబడులు, ఎక్కువ ఆదాయం వస్తుందని, అందువల్ల ఆ రంగంపై నిరంతరం దృష్టిపెడితే అద్భుత ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. విశాఖ ఉత్సవ్ పెడితే అక్కడ హోటల్ గదులు దొరకడం లేదని, పర్యాటకంగా అభివృద్ధి చెందితే మనకు తిరుగులేదని,  వృద్ధిలో దూసుకుపోతామని చెప్పారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలలో వృద్ధి కనిపిస్తున్నా సేవారంగంలో ఇంకా దూసుకువెళ్లవలసి అవసరం ఉందని, సుస్థిర అభివృద్ధి సేవా రంగం నుంచే వస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధికి ప్రధానమైనవి మౌలిక సదుపాయాలని, అందులో ప్రజా సౌకర్యాలకు ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంతో ముఖ్యమని చెప్పారు. దేశంలో పోటీ తత్వానికి గీటురాయి మౌలికవసతులన్నారు.

 ప్రజలలో అన్ని విషయాలలో 100 శాతం సంతృప్తి స్థాయి ఫలితాలు రావాలని,  సుస్థిర వృద్ధి సాధించాలని, పేదలకు ఆదాయం పెరగాలని చెప్పారు. హెల్త్  అండ్ న్యూట్రీషన్‌లో ప్రభుత్వ సేవలను మెరుగుపర్చవలసిన అవసరం ఉందన్నారు.   ప్రైవేట్ భాగస్వాములు అందించే సేవలపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. వ్యర్ధ పదార్థాల సేకరణకు అవసరమైన సంఖ్యలో వాహనాలు అందించామా లేదా అనేది కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.  తాగునీటికి టెండర్లు పిలిచారని,  రూ.15 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టామని, 3 ఏళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ సహా గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ సమకూరుస్తున్నామని, చేసిన పనులను సక్రమరీతిలో ప్రజలకు తెలియజేయగలగాలని చెప్పారు. డాటెడ్ భూములు, ఎస్టేట్ భూముల సమస్యలు సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.

 పౌరుడు ఒకడే, ప్రభుత్వం ఒకటే
పౌరుడు ఒకడే, ప్రభుత్వం ఒకటే...శాఖలే వేర్వేరు. సమన్వయంతో్ అన్ని శాఖలూ ఏకోన్ముఖంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.  చిరుధాన్యాల వాడకంపై ప్రజలను చైత్యన పరాచాలని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో రాగుల వినియోగం బాగుందని, అందువల్ల  వారిని ప్రోత్సహించాలని, ఆరోగ్యం పెంచే ఆహారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు.  మధుమేహం పెంచే ఆహారం ఆరోగ్యకరం కాదని, ప్రభుత్వం సరఫరా చేసే ఆహారం ప్రజల ఆరోగ్యం మరింత పెంచేదిగా ఉండాలని ఆయన అన్నారు. 17,15,571 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు,  రైతులకు రూ.2,640కోట్లు చెల్లించినట్లు తెలిపారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కేవలం చర్చించి ఉపయోగం లేదు, అమలుచేసి వాస్తవరూపంలోకి తీసుకొచ్చినప్పుడే వాటికి సార్ధకత చేకూరుతుందని అన్నారు.  అర్హులు అందరికీ రేషన్ సక్రమంగా అందించాలని, ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించాలని సీఎం చెప్పారు.  డీలర్లకు చెల్లింపులు సక్రమంగా చేయండని, రేషన్ సరిగ్గా పంపిణీచేసేలా పర్యవేక్షించండని సీఎం ఆదేశించారు.  ఏడాదిలో ప్రతినెలా వేలిముద్ర పడనివాళ్ల జాబితా రూపొందించి, వాళ్లందరికీ డోర్ డెలివరి చేయమని ఆదేశించారు. బయో మెట్రిక్ లో లోపాలు, ఐరిస్ లో లోపాల వల్ల కార్డుదారులకు ఇబ్బందులు ఉండకూడదని, ఇలాంటివి ఏమన్నా ఉంటే నాలుగైదు శాతం కూడా ఉండవని, అటువంటి లోపాలు కూడా నివారించాలని చెప్పారు. రేషన్ డీలర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో వాళ్లతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోమని చెప్పారు.  వచ్చే నెలలో రేషన్ పంపిణీలో 90శాతం సంతృప్తి ప్రజల్లో రావాలన్నారు. ఈ జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో స్ప్లిట్ రేషన్ కార్డులు అందించాలని ఆదేశించారు. స్ప్లిట్ కార్డులు జారీచేసే అధికారం కలెక్టర్లదేనని, అర్హులు అందరికీ అందజేయాలని చెప్పారు. ధాన్యం సేకరణ, చెల్లింపులు పారదర్శకంగా జరగాలని, అటు రైతులకు న్యాయం జరగాలని, ఇటు రైస్ మిల్లర్లు కూడా క్రమశిక్షణగా వ్యవహరించాలని, ఎంత ధాన్యం తీసుకున్నారో, అంత బియ్యం మిల్లర్లు ఇవ్వాలని, ఈ విధానం సక్రమంగా పాటించాలని సీఎం స్పష్టం చేశారు.
కొత్త రేషన్ కార్డుల కోసం మొత్తం 21,565 దరకాస్తులు రాగా, అందులో 14,414 దరకాస్తులను ఆమోదించామని, 4,538 దరకాస్తులను తిరస్కరించామని, 12.1 శాతం మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు పౌరసరఫరా శాఖ కమిషనర్  రాజశేఖర్ చెప్పారు. చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీలో 95శాతం సంతృప్తి వచ్చినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర గిరిజన ఏజెన్సీలలో కిరోసిన్ లేక అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను మంత్రి సుజయ కృష్ణ రంగారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు ప్రస్తావించారు. కిరోసిన్ లేకపోవడం వల్ల  కూరాకుల రైతులు పడే కష్టాలను, వారి చిన్న చిన్న కమతాలు, వారు మోసుకెళ్లే చిన్న పంపుసెట్లు గురించి మంత్రి రంగారావు వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 25వేల లోపే ఉంటాయని, బ్లూ కిరోసిన్ లేకపోతే వైట్ కిరోసిన్ ఇవ్వాలని, దానివల్ల సబ్సిడి రూ.2 కోట్లు అయినా ఇబ్బందిలేదని సీఎం చెప్పారు.  జనవరినుంచి గుడిసెల్లో నివాసించే గిరిజనులకు ఐటిడిఏ ద్వారా  కిరోసిన్ అందించాలని ఆదేశించారు. పించన్ల కోసం కొత్తగా వచ్చిన 2.65 లక్షల దరఖాస్తులను జన్మభూమిలోపు తనిఖీ చేసి అర్హులకు మంజూరు పత్రాలు అందజేసి, ఫిబ్రవరి నుంచి పించన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.  గిరిజనులకు పించన్ల వయో పరిమితిని 50 ఏళ్లకు తగ్గించామని, దీనికి సంబంధించి వచ్చిన 60 వేల దరఖాస్తులు వెంటనే పరిశీలించి, వారికి కూడా ఫిబ్రవరి నుంచి పించన్లు అందేలా చూడాలని చెప్పారు.
ప్రభుత్వ లబ్ది అర్హులకే అందాలని,  అత్యధిక కుటుంబాలకు సంక్షేమం చేరువ కావాలని, ఒకే కుటుంబంలో రెండు పించన్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు పేదరికం, మానసిక వైకల్యం, శారీరక వైకల్యం ప్రాతిపదికన అర్హతలను నిర్ణయించాలని చెప్పారు. స్కూల్ శానిటేషన్ లో ఇవ్వాల్సిన రూ.100కోట్లు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.  మధ్యాహ్న భోజనం, డ్వాక్రా మహిళా సంఘాలకు చెల్లించాల్సిన మొత్తాలు వెంటనే ఇవ్వాలని, బిల్లుల చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం తగదని,  ఆయా శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు.  మనం చేసే కష్టం కూడా కనబడాలని, గ్రామసభల్లో మనం చేసినవి అన్నీ చెప్పాలని, ఇన్ని అవార్డులు వచ్చాయంటే మన పనితీరును అవే చెబుతాయన్నారు.  కుటుంబ స్థాయిలో ఏం చేశామో,  గ్రామ/వార్డు స్థాయిలో ఏం చేశామో ప్రతి గ్రామంలో స్టిక్కర్లు, వాల్ పోస్టర్లు, గోడ రాతల ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు. ఈ ఏడాది చంద్రన్న బీమా’ 56,783 క్లెయిమ్స్ వచ్చాయని,. 49,596 క్లెయిమ్స్ పరిష్కారం అయినట్లు, రూ.750 కోట్లు లబ్దిదారులకు అందజేసినట్లు వివరించారు. ఈ ఏడాది 3,640 కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం అందజేసినట్లు తెలిపారు. ఈ నాలుగేళ్లలో 1.98 లక్షల దరఖాస్తుదారులకు రూ.2,409 కోట్ల సాధారణ బీమా పరిహారం అందజేసినట్లు తెలిపారు. చంద్రన్న పెళ్లి కానుకకు 41,151 దరఖాస్తులు అందాయని, 39,602 పెళ్లిళ్లు జరిగాయని,  33,528 మందికి 100 శాతం, 2,315మందికి 20 శాతం చెల్లింపులు జరిగాయని చెప్పారు.  ముఖ్యమంత్రి యువనేస్తం కింద డిసెంబర్ నెలలో 3,31,723 మందికి రూ.80.77 కోట్లు పెన్షన్ రూపంలో అందజేసినట్లు తెలిపారు. ఈ నెలాఖరుకు అర్హులు 4 లక్షలకు చేరుకుంటారని అంచనాగా సీఎం చెప్పారు. యువత నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వం తరఫున అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  ఇంజనీరింగ్ పట్టభద్రులలో మన రాష్ట్రమే ముందుందని, నైపుణ్యాభివృద్ధిలో ముందున్నామని, ఉన్నత విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి సంస్థ దీనిపై మరింత దృష్టిపెట్టి దేశంలో మన రాష్ట్రమే ముందుండేలా శ్రద్ధపెట్టాలన్నారు.  యువతను ప్రోత్సహించడంలో అధికార యంత్రాంగం మరింత శ్రద్ద చూపాలన్నారు. ఉపాధి కల్పించే పరిశ్రమలు, సంస్థలతో సమన్వయం చేసుకోవాలి. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.  పెథాయ్ తుపాను కారణంగా 7, 8 రోజులు  వేటకు వెళ్లని గుంటూరు, విజయనగరం జిల్లాలలోని  మత్స్యకారులకు కూడా  ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆయా జిల్లా కలెక్టర్లు కోరగా, అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

Dec 28, 2018


కాకినాడ సెజ్ లో మెగా పెట్రోకెమికల్ ప్రాజక్ట్ ప్రతిపాదన
స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం
                      సచివాలయం, డిసెంబర్ 28: కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్)లో మెగా పెట్రోకెమికల్ ప్రాజక్ట్ ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది.  సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశ మందిరంలో సీఎస్ అనిల్ చంద్ర పునీఠ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం  స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఈ ప్రాజక్ట్ విషయమై చర్చించారు. హల్డియా పెట్రోకెమికల్స్ సంస్థతో కలసి టీసీజీ రిఫైనరీ లిమిటెడ్ ఈ కెమికట్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ప్రాజక్ట్ ని చేపట్టడానికి ముందుకు వచ్చినట్లు  అధికారులు సీఎస్ కు వివరించారు. ఆ సంస్థ ప్రతిపాదించిన ప్రకారం అయిదు ఏళ్లలో పూర్తి అయ్యే ఈ ప్రాజక్ట్ కు దశలవారీగా రూ.62 వేల కోట్ల పెట్టుబడి పెడతారని, ప్రత్యక్షంగా 5 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజక్ట్ కు అవసరమైన  2500 ఎకరాల ప్రైవేటు భూములను ఆ సంస్థ కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ప్రవేట్ భూముల ధరలు, పెట్టుబడులు, జీఎస్టీ, బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్(ఇఐడిఎఫ్), కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్, ఎక్సట్రనల్ కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్, విద్యుత్ సబ్జిడీ తదితర అంశాలను చర్చించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మన్మోహన్ సింగ్, డాక్టర్ డి.సాంబశివరావు,  ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఎనర్జీ, ఇన్ఫ్రాస్టక్చర్, ఇన్వెస్ట్ మెంట్ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాల వళవన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Dec 27, 2018


ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశే లక్ష్యం
మంత్రి ఫరూక్
           సచివాలయం, డిసెంబర్ 27: ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశే లక్ష్యంగా తాము అహర్నిశలు శ్రమిస్తున్నట్లు  వైద్యవిద్య, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ వైద్య సేవ, ఏపీ మెడ్ టెక్ జోన్, ఆహారభద్రత, మైనార్టీ సంక్షేమం, సాధికారత  శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ చెప్పారు. శాసనసభ భవనం కమిటీ హాలులో గురువారం ఉదయం జరిగిన వైద్యాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని కల్పించడానికి మీరందరు సేవాభావంతో పని చేయాలని డాక్టర్లందరినీ కోరారు. పేదలకు ఉచిత వైద్యం కల్పించాలని, జబ్బులు, ఆసుపత్రులు అంటే ప్రజలు భయపడకూడదన్నారు. వైద్యం కోసం ఎవ్వరూ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు రాకూడదన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు గత సంవత్సరం కంటే  ఈ సంవత్సరం దాదాపు రెండింతల బడ్జెట్ అంటే      రూ.8,463.51 కోట్లు కేటాయించారని తెలిపారు. ఏ తల్లి, ఏ బిడ్డ చనిపోకూడదని, మాతృ శిశు మరణాలని గణనీయంగా తగ్గిచాలని కోరారు. సీఎం కోరినట్లు 2019 మార్చి  నాటికి మాతృమరణాలను  ప్రస్తుతమున్న  67 నుంచి 50 కి తగ్గించాలన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ క్రిందకు అన్ని రకాల కాన్పులను తీసుకువస్తున్నామని చెప్పారు.  2,3 రోజులలో సీఎం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు.  ఆషా వర్కర్లకు ప్రోత్సాహాలతో కలిపి నెలకు  రూ.8,600 వరకు ఇస్తున్నామని, వారితో మంచిగా పనిచేయించుకొని మెరుగైన సేవలు ప్రజలకు అందించాలన్నారు. టి.బి. పేషెంట్లకు పౌష్టికాహారం  కోసం నెలకు రూ.500 ఇస్తున్నామని తెలిపారు. పోలియోను నిర్మూలించినట్లు  టి.బి, కుష్ఠు రోగాలను కూడా అంతమొందించవలసిన అవసరం ఉందన్నారు. కాన్సర్ కి కారణం అయ్యే గుట్కాను ప్రజలు వాడరాదని, ఫుడ్ సేఫ్టీ అధికారులు  వాటి అమ్మకాలను అడ్డుకోవాలని కోరారు. కొందరు దొంగ డాక్టర్లు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారని, ఇక ముందు అటువంటి ఆస్పత్రులు ఉండకూడదని అధికారులను ఆదేశించారు.  
              వచ్చే జన్మభూమి కార్యక్రమాన్ని వినియోగించుకొని ప్రజలకు ఆరోగ్య విద్యను అందించాలన్నారు. ఊబకాయం పెరుగుతున్నందున తగు జాగ్రత్తలు వారికి వివరించాలని  కోరారు. జన్మభూమి కార్యక్రమములకు డాక్టర్లు  తప్పకుండ హాజరుకావాలని, అలాగని ఆస్పత్రులు  మూత పడకుండా పిజి స్టూడెంట్స్ ని,  ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల డాక్టర్లను వినియోగించుకొని తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.   ముఖ్యమంత్రి  బాల సురక్షా పథకం క్రింద ఇప్పటి వరకు 20.5 లక్షల మంది బాల బాలికలకు స్కానింగ్ చేసినట్లు తెలిపారు. 0-18 సంవత్సరాల  బాల బాలికలందరిని స్కానింగ్ చేసి వారికి  ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. 104, 108 సేవలను కూడా సక్రమంగా నిర్వహించి, ఫిర్యాదులు లేకుండా ప్రజలకు సేవలందించాలన్నారు. తప్పు చేసే సర్వీస్ ప్రొవైడర్స్ పై జరిమానాలు విధించడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి అత్యాధునిక సేవలు మన ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న విధంగా  ఇతర రాష్ట్రంలో ఎక్కడా లేవని తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది కృషి వల్ల  రాష్ట్రానికి 24 అవార్డులు లభించాయని,  ఈ అవార్డుల సాధన కోసం కృషి చేసిన  అందరికి ధన్యవాదాలు తెలిపారు.  సమావేశంలో వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య, రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, టీచింగ్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్,  ఎన్టీఆర్ వైద్యసేవ, డ్రగ్ కంట్రోల్ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అవసరమున్న శాఖలకు అదనపు నిధులు

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సమావేశంలో 
మంత్రులు నక్కా ఆనందబాబు, కిడారి శ్రావణ్ కుమార్
     వంద శాతం నిధులు ఖర్చు చేసిన కార్మిక శాఖ         
                    సచివాలయం, డిసెంబర్ 27: అవసరమున్న శాఖలకు 2018-19 ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి అదనపు నిధులు కేటాయించాలని మంత్రులు నక్కా ఆనంద బాబు, కిడారి శ్రావణ్ కుమార్ లు నిర్ణయించారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో గురువారం ఉదయం ఈ ఇద్దరు మంత్రుల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నోడల్ ఏజన్సీల 22వ సమావేశం జరిగింది. నిధుల కేటాయింపు, వ్యయాలను మంత్రులు సమీక్షించారు. షెడ్యూల్ కులాల కాంపొనెన్ట్ కింద 22 శాఖలకు చెందిన 43 విభాగాలకు ఈ ఏడాది రూ.11,228.11 కోట్లను కేటాయించగా, 2018 డిసెంబర్ 25 నాటికి రూ.5,930.04 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు.  బడ్జెట్ కేటాయింపులో ఇది 52.81 శాతం అని వారు పేర్కొన్నారు.  9 శాఖలు 50 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేశాయని, కార్మిక శాఖ వంద శాతం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 81 శాతం, కుటుంబ సంక్షేమశాఖ 75 శాతం, గ్రామీణాభివృద్ధి శాఖ 69 శాతం, నీటి పారుదల శాఖ 64 శాతం ఖర్చు చేశాయని వివరించారు. గిరిజన ప్రాంతాలలోని గర్బిణీలు, పిల్లలు, అంగన్ వాడీ కేంద్రాలకు రానివారి కోసం చంద్రన్న గిరి పోషణ పథకం కింద పౌష్టికాహారం ఇంటి వద్దే అందించే ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 
              ఖర్చు చేయని  శాఖల నుంచి నిధులను సేకరించి, ఇతర శాఖలకు బదిలీ చేయాలని మంత్రులు  నిర్ణయించారు. పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, గ్రామీణ నీటి పారుదల శాఖలకు అదనంగా నిధులు కేటాయించాలని, సాంఘీక సంక్షేమ శాఖ కళాశాల వసతి గృహాలకు 20 కంప్యూటర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టల్స్ లో ఇంగ్లీష్ భాష, కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిలో శిక్షణ ఇప్పించాలని ప్రతిపాదించారు. ఎస్ సీసీ కింద అమలు చేస్తున్న పథకాలను మంచి పేరున్న సంస్థ ద్వారా సర్వే చేయించాలని మంత్రులు నిర్ణయించారు. అన్ని శాఖలు తమకు కేటాయించిన సబ్ ప్లాన్  నిధులను ఖర్చు చేయాలని మంత్రులు ఆదేశించారు. వివిధ శాఖలు ప్రతిపాదించిన కొత్త పనులకు వారు ఆమోదం తెలిపారు. కొత్త పథకాలలో భాగంగా ఏజన్సీ  ప్రాంతాలలో నివసిస్తున్న ఒక్కో గిరిజన కుటుంబానికి చలిని తట్టుకునేందుకు రెండు  రగ్గులను ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రాంతాలలో నడుపుతున్న అంగన్ వాడీ కేంద్రాలలోని పిల్లల మానసికాభివృద్ధికి ఆటవస్తువులు పంపిణీ చేయాలని తీర్మానించారు. ఐటిడిఏ ముఖ్య కేంద్రాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత కావలసిన అదనపు సహాయం అందించడానికి మంత్రులు అంగీకరించారు.  ఆర్ అండ్ బీ శాఖ ద్వారా నిర్మిస్తున్న ప్రధాన రోడ్లు, నిర్వహణ, మరమ్మతుల కొరకు, ముఖ్య ప్రదేశాల సుందరీకరణ పనులు రూ.232 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలోని 13 వేలకు పైగా ఉన్న గృహ నిర్మాణ లబ్దిదారులకు 2017-18లో ఇచ్చిన విధంగానే అదనపు సహాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ సహాయం రూ.40 కోట్ల వరకు ఉంటుందని అంచనా.  పనులు పూర్తి అయిన వాటికి బిల్లులు త్వరగా చెల్లించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.  డప్పు కళాకారులకు డప్పుతోపాటు దుస్తులు, గజ్జలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గిరిజన భవన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అరకు నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి దత్తత గ్రామం పెదలబూడులో ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందించలాని నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలలోని రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.  మంత్రి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఈ సమావేశానికి తాను తొలిసారిగా హాజరయ్యానని, శాఖలో జరుగుతున్న పనులను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సిద్ధార్ధ జైన్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అరుణ్ కుమార్, సెర్ఫ్ సీఈఓ కృష్ణమోహన్, మున్సిపల్, అర్బన్ డెవలప్ మెంట్ కమిషనర్ కన్నబాబు, జీసీసీ ఎండి బాబురావు నాయుడు, డీఐజీ ఎల్.కె.వి. రంగారావు, ట్రైకార్ ఎండి రవీంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.  


విస్తరించిన పర్యాటక రంగం
            

           రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్తపుంతలు తొక్కుతూ నూతన పోకడలుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు అనుగుణంగా  అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగం విస్తరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అవకాశాలను ఆ శాఖ సంద్వినియోగం చేసుకుంటోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది.  
ఆధ్యాత్మిక పర్యాటకం, గ్రామీణ పర్యాటకం, బీచ్ పర్యాటకం, వినోద పర్యాటకం... ఇలా అన్ని వైపులా అన్ని రంగాల్లో ఈ శాఖ చొచ్చుకుపోతోంది. పర్యాటకానికి అవకాశం ఉన్న పుణ్యక్షేత్రాలు, పురాతన దేవాలయాలు, ప్రదేశాలు, నదులు, కాలువలు, సెలయేర్లు, సుందర ప్రదేశాలు, సముద్రతీరాలు వంటి వాటిని అభివృద్ధి పరుస్తోంది. నదులలో భద్రతతో కూడిన బోటు షికారుకు ఏర్పాట్లు చేశారు. పర్యాటకులకు కావలసిన హోటల్స్, వినోద కేంద్రాలు, రోడ్లు, పర్యాటక అతిధి గృహాలు ... వంటి మౌలిక సదుపాయాలు సమకూరుస్తోంది. దేశ, విదేశ పర్యాటకులకు ఆంధ్ర వంటకాలు రుచి చూపిస్తున్నారు. గ్రామీణ ప‌ర్యాట‌కాన్ని అభివృద్ది చేసే క్రమంలో నూత‌నంగా చేప‌ట్టిన సంస్కృతి ప్రాజెక్టుకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.  భార‌తీయ జీవ‌నం, రాష్ట్రంలో ఆయా ప్రాంతాల సంస్కృతి, క‌ళ‌ల అభివృద్ధి ఆ శాఖ అనేక చర్యలు చేపట్టింది.  తెలుగు సంస్కృతి, తెలుగు నృత్య రీతులు, తెలుగు వంటలు, సాంప్రదాయానికి ప్రతీక అయిన సంక్రాంతి వేడుకల నిర్వహణ, హ‌రిక‌ధ‌, బుర్ర‌ క‌ధ, ఒగ్గుకథ, కోలాటం, థింసా నృత్యం వంటి కళలతోపాటు వారసత్వంగా వచ్చే కళల పునరుజ్జీవానికి  స్ధానిక క‌ళాకారుల‌ను ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగా ఈ శాఖ మంచి ఫలితాలను సాధిస్తోంది.  రాష్ట్ర విభజన తరువాత ఈ రంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకు ముందు ఎన్నడూలేని రీతిలో ఈ రంగం విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఆ శాఖ చేపట్టే  అంతర్జాతీయ ఈవెంట్లు, సోష‌ల్ మీడియా స‌మ్మిట్‌ఎఫ్‌1హెచ్‌2ఓ బోట్ రేసింగ్ఎయిర్ షో వంటి పర్యాటక ఉత్సవాల ద్వారా ప్రజలలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతోంది. రాజధాని అమరావతిని కూడా పర్యాటకులను ఆకర్షించే రీతిలో రూపొందిస్తున్నారు.
           దేశంలో 13 శాతం అంటే రాష్ట్రలో 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంట భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అపారమైన ఖనిజ సంపద  పరిశ్రమల నిర్మాణానికి, పోర్టులు  ఎగుమతులు, దిగుమతులకు ఉపయోగపడటంతోపాటు బీచ్ టూరిజానికి ఉపయోగపడుతోంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా అనేక కార్యక్రమాలు రూపొందించింది.   ఈ రంగంలో ఆర్థిక వృద్ధి రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో 6.96 శాతం వున్న అభివృద్ధి సూచిక రాష్ట్రం చేపట్టిన విప్లవాత్మక అభివృద్ధి చర్యలతో 2017-18 ఆర్ధిక సంవత్సరానికి 11.22 శాతం అభివృద్ధి సూచికను చేరుకుంది.   ప‌విత్ర సంగ‌మంగా ప్ర‌సిద్ది కెక్కిన కృష్ణా, గోదావ‌రి న‌దీసంగ‌మ ప్రాంతాన్ని సందర్శకులను ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కృష్ణానదికి మహర్ధశపట్టుకుంది. విజయవాడలో నది ఒడ్డున అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భవానీ ద్వీపాన్ని అన్ని సౌకర్యాలతో పర్యాటకులను ఆకర్షించేవిధంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ప‌ర్యాట‌క ఆస్తుల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం భద్రపరిచే ఏర్పాటు చేస్తున్నారు  గండికోట‌లో నూత‌నంగా ఏర్పాటు చేయ‌ద‌ల‌చిన ఎడ్వంచ‌ర్స్ అకాడ‌మీ ప‌నులు డిసెంబ‌ర్ చివ‌రి వారంలో ప్రారంభించేలా కార్యాచ‌ర‌ణ రూపొందించారు. ఎపిటిడిసి వెబ్ సైట్‌లో ప‌ర్యాట‌క పండుగ‌ల‌కు సంబంధించిన స‌మాచారం డిజిట‌ల్ క్యాలెండ‌ర్ రూపంలో అందుబాటులో ఉంచే ఏర్పాటు చేస్తున్నారు.  ప‌ర్యాట‌కుల సౌకర్యార్థం ఆ శాఖ ఆధునిక ఓల్వో బ‌స్సుల‌ను ప్రవేశపెట్టింది. పూనా, కోల్‌క‌తా, ముంబై, న్యూఢిల్లీ, జైపూర్, హైద‌రాబాద్‌, మైసూర్‌ల‌లో మాదిరి  ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను ప్రభుత్వం  ప్రోత్సహిస్తోంది. ప‌ర్యాట‌క శాఖ భాగ‌స్వామ్యంతో మ‌హీంద్ర జూమ్ కార్లు ప్రవేశపెట్టింది.  ఎవ‌రికి వారు డ్రైవింగ్ చేసుకునేలా ఏర్పాటు చేసిన ఈ బ్యాట‌రీ అద్దె కార్లు గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం, విజయవాడ బెంజ్ స‌ర్కిల్, స‌చివాల‌యం వ‌ద్ద అందుబాటులో ఉంచుతారు. తెలుగు సంస్కృతిలో అంత‌ర్భాగంగా ఉన్న  ఆహారం గురించి నేటి త‌రంతో పాటు, జాతీయ, అంత‌ర్జాతీయ స్ధాయి ప‌ర్యాట‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఆ శాఖ ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్ పేరుతో ఆహార పండుగ‌లు నిర్వహిస్తోంది. 
        త‌పాలా శాఖ అందిస్తున్న మై స్టాంప్ ప‌థకాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలోని ప‌న్నెండు ప‌ర్యాట‌క ప్రాంతాల‌పై ప్ర‌త్యేక త‌పాళా బిళ్ల‌ల‌ను విడుద‌ల చేయించింది. తద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగానూ ప‌ర్యాట‌క ప్రాంతాలు మ‌రింత‌గా జ‌న బాహుళ్యంలోకి వెళ్లేలా చేస్తోంది. పర్యటక రంగ పరంగా రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల వివిధ జాతీయ, అంతర్జాతీయ స్ధాయి సంస్ధలు పర్యాటక శాఖకు అవార్డులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో పర్యాటక రంగంలో  సమగ్ర అభివృద్ధిని సాధించిన రాష్ట్రంగా వరుసగా రెండేళ్లు రాష్ట్ర పర్యాటక శాఖకు  అరుదైన గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా ఇండియా టుడే ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కాన్ క్లేవ్ లో ఏపీ టూరిజం దేశంలోనే అత్యుత్తమంగా నిలిచిందని కొనియాడుతూ ప‌ర్యాట‌క రంగంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం అవార్డును పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు  అందించారు. ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌ను వేగ‌వంతం చేయడం కోసం ఏక‌గ‌వాక్ష విధానాన్ని మ‌రింత స‌ర‌ళీక‌రించి, పటిష్టపరిచారు.  ప‌ర్యాట‌క పెట్టుబ‌డిదారులు త‌మ అనుమ‌తుల కోసం వివిధ కార్యాల‌యాల చుట్టూ తిరిగే ప‌రిస్ధితి ఎదురు కాకుండా ఈ విధానం ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కల్పించే సౌకర్యాల వల్ల ఈ రంగంలో పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి. పలు ప్రాజెక్టులు మొదలుపెట్టారు. దాంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914





Dec 26, 2018

ఉక్కు రాష్ట్రం కానున్న ఆంధ్రప్రదేశ్
v 27న కడప జిల్లాలో శంకుస్థాపన
v ఎం.కంబాలదిన్నెలో 3,147 ఎకరాల కేటాయింపు
v తీరం వెంట మరొకటి నెలకొల్పాలన్న ప్రతిపాదన
             

           విశాఖలో భారీ ఉక్కు కర్మాగారంతోపాటు రాష్ట్రంలో మరో రెండు ఉక్కు కర్మాగారాలు రానున్నాయి. రాయలసీమలో ఒక కర్మాగారం స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, సముద్ర తీరంలోనే మరొకటి నెలకొల్పడానికి చైనాకు చెందిన కంపెనీ ముందుకొచ్చింది. ఈ రెండిటి స్థాపన పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భూగర్భంలో అమూల్యమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. అంతులేని జలరాశి పారుతోంది. 974 కిలో మీటర్ల సముద్ర తీరంతోపాటు తీరం వెంట భూగర్భంలో కూడా ఖనిజాలు నిల్వ ఉన్నాయి. ఈ వనరులన్నిటినీ ఒక ప్రణాళిక ప్రకారం సమర్థవంతంగా వినియోగించుకుంటే రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే స్వర్ణాంధ్రగా మారుతుంది. గతంలో పాలకులందరూ ఒక్క హైదరాబాద్ పైనే దృష్టిపెట్టి దానిని అద్వితీయంగా అభివృద్ధి చేశారు. అపారంగా వనరులు ఉండిఅభివృద్ధికి అవకాశం ఉన్నా ఆంధ్ర ప్రాంతంపై అంతగా శ్రద్ధ చూపలేదు. ఏ విధమైన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా రాష్ట్ర ప్రజల అభిష్టానికి పూర్తి భిన్నంగా రాష్ట్రాన్ని విడగొట్టడంవిడిపోయిన పరిస్థితుల నేపధ్యంలో అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి కసి పెరిగింది.  ఉన్న వనరులను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అవకాశం ఉన్న మేరకు సమంగా పంపిణీ చేసిఅన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉంది.  రాష్ట్రంలోని 13 జిల్లాలలోని మారుమూల ప్రాంతాలతో సహా  ప్రాథమిక సౌకర్యాలుమౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వివక్ష చూపుతుండటంతో వాటిని కూడా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. విభజన ఒప్పందంలో భాగంగా కేంద్రం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయవలసి ఉంది.  ఈ విషయంలో  కేంద్రం జాప్యం చేస్తోందన్న భావన సర్వత్రా నెలకొంది. ఈ నేపధ్యంలో  రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన సమగ్ర ఉక్కు కర్మాగార నిర్మాణం కడప జిల్లాలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఈ ఉక్కు కర్మాగారం నిర్మించాలని తీర్మానించారు.  రాయలసీమ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతతో వేస్తున్న ముందడుగుగా దీనిని భావించవచ్చు. ప్రభుత్వం దీనిని ఒక సవాలుగా తీసుకుని  వంద శాతం పెట్టుబడి వ్యయాన్ని భరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కార్పొరేషన్ కు ప్రాథమిక పెట్టుబడిగా రూ.2 వేల కోట్లు కేటాయించింది.  కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుగా గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సీఎండీగా పని చేసిన పి.మధుసూధన్‌ను నియమించనున్నారు. మూడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.12 వేల కోట్లు. కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె గ్రామంలో ఈ నెల 27న దీని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీ  కోసం 3,147 ఎక‌రాల భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి ఏపీఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించారు.  భవిష్యత్ లో ప్రైవేటు సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ గా  ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా  ప్రభుత్వానికి ఉంది.  బ్యాంకుల నుంచి రుణాన్ని సేకరించడంతోపాటు అవసరమైతే ఈక్విటీకి వెళ్లాలని కూడా భావిస్తోంది.
                  ఒకవైపు కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సన్నాహాలు చేస్తుంటేమరోవైపు భారీ ఉక్కు పరిశ్రమను రాష్ట్రంలో స్థాపించేందుకు చైనాకు చెందిన ఒక సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు డిసెంబర్ 19న  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఏడాదికి 7.2 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆ కంపెనీ ఆసక్తి చూపుతోంది.  ఇందు కోసం సముద్ర తీరం వెంట ఏదైనా పోర్టు సమీపంలో రెండు వేల ఎకరాల భూమిని కేటాయించాలని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎంను కోరారు. చైనా-ఇండియా స్టీల్ ప్లాంట్ ఇన్వెస్ట్‌ మెంట్ ప్రాజెక్టు కింద వారు పెట్టుబడులు పెట్టదలిచారు. ఆసియా దేశాలతో వాణిజ్యంభారత దేశంలో ఉక్కుకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అత్యంత అనుకూల ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకుంది. ముడి ఇనుముబొగ్గు గనులకు సంబంధించి ఆ కంపెనీ ఆస్ట్రేలియాతో ఒప్పందం కూడా చేసుకుంది.  ఈ కంపెనీలో వివిధ దేశాల్లోని పలు సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి సమగ్ర నివేదికతో  రావాలని ఆ సంస్థ ప్రతినిధులకు సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారాలు అందిస్తామనిఅన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామని వారికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాల అనుకూల వాతావరణం ఉన్నట్లు స్పష్టమవుతోంది. నవరత్నాలలో ఒకటిగా ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన విశాఖ ఉక్కు కర్మాగారం ఉంది. దేశంలో ఇదొక్కటే సమగ్ర ఉక్కు కర్మాగారం.  కడప జిల్లాతోపాటు సముద్ర తీరానికి సమీపంలో చైనా సంస్థ మరో ఉక్కు కర్మాగారం స్థాపించితే ఆంధ్రప్రదేశ్ ఉక్కు రాష్ట్రంగా తయారవడంతోపాటు రాష్ట్రం సమగ్రాభివృద్ధికి ఇవి తోడ్పడతాయి.
-         శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ - 9440222914

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...