Jul 31, 2018


పార్లమెంట్ హామీలు అమలు చేయకుండా
ఏపీకి అన్యాయం చేసిన కేంద్రం
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు

               సచివాలయం, జూలై 31: పార్లమెంటులో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్రం నిధులు విడుదల చేయలేదని, సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీ చేయలేదని చెప్పారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఇస్తామన్న ప్యాకేజీ ప్రకారం కూడా నిధులు ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నేతలు పార్లమెంటులో ఒకటి, బయట ఒకటి చెబుతున్నారని, సుప్రీం కోర్టుని, పార్లమెంటుని కూడా తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. ఉన్నత విద్యా సంస్థల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుని ఖాతరు చేయలేదన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు ఏడాదిలోపల తమతమ సమస్యలను పరిష్కరించుకోవలసి ఉందని, ఏడాది దాటితే కేంద్రం కలుగజేసుకొని పరిష్కరించవలసి ఉందన్నారు. విభజన జరిగి 4 ఏళ్లు గడిచినా ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని సమస్యలను కేంద్రం పరిష్కరించలేదని చెప్పారు. 9వ షెడ్యూల్ లోని అంశాలను కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. పదవ షెడ్యూల్ లోని 142 సంస్థల ఆస్తులు, అప్పుల విలువ లెక్కించి, జనాభా ప్రాతిపధికన ఏపీకి 58 శాతం, తెలంగాణకు 42 శాతం  పంపిణీ చేయవలసి ఉందని, ఆ విషయం కూడా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఆఫిడవిట్ లో పంపిణీ చేయవలసిన అవసరంలేదని పేర్కొంటున్నారని చెప్పారు. 10వ షెడ్యూల్ లో పేర్కొన్న వివిధ క్లాజులలో తెలిపిన ప్రకారం ఆయా సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీ చేయవలసిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.  కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా టాస్క్ ఫోర్స్ నివేదికను పట్టించుకోకుండా ప్లాంట్ ఏర్పాటు చేయడం వీలుకాదని చెప్పారన్నారు. రైల్వే జోన్ కూడా ఇవ్వక్కరలేదని చెబుతున్నారన్నారని పేర్కొన్నారు.  పలు విషయాలలో ప్రజలను తప్పు ద్రోవపట్టిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఉద్దేశం వారికి లేదన్నారు.  ప్రజాస్వామ్యంలో ఇటువంటి విషయాలన్నీ ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. అందుకే టీడీపీ పార్లమెంటులోనూ, బయట ఆందోళన చేస్తోందన్నారు.  పార్లమెంట్ హామీలు నెరవేర్చేవరకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెగేసి చెప్పారు.

       రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం చేయని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్  ప్రశ్నించడంలేదన్నారు. పైగా కేంద్రానికి అనుకూలంగా వారు మాట్లాడుతున్నారని విమర్శించారు.  అన్ని విషయాలు ప్రజలకు తెలుసని చెప్పారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడంలేదని, ఏపీకి కూడా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని, 90:10 నిధులు ఇస్తామని చెప్పారన్నారు. ఏ ఒక్క పథకానికి సంబంధించి కూడా ఆ విధంగా నిధులు ఇవ్వలేదని తెలిపారు. ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా మాట తప్పి రాష్ట్రానికి అన్యాయం చేశారని యనమల అన్నారు.

బీసీల అభ్యున్నతికి కృషి చేసిన టీడీపీ
          తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాం నుంచి  బీసీల అభ్యున్నతికి టీడీపీ కృషి చేసిందన్నారు. బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించింది తమ పార్టీయేనని తెలిపారు. బీసీల రిజర్వేషన్ 27 శాతానికి పెంచింది కూడా తామేనని స్పష్టం చేశారు.  మురళీధరన్ కమిషన్ నివేదికని ఆమోదించింది తామేనని చెప్పారు. ఆనాడు కొందరు దానిని వ్యతిరేకించారన్నారు. బీసీ సబ్ ప్లాన్, ఆదరణ పథకం, చేనేత కార్మికుల రుణమాఫీ, చేనేత వస్త్రాలకు సబ్సిడీ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. బీసీల కోసం దాదాపు రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. బీసీలు మొదటి నుంచి తమ వెంటే ఉంటున్నట్లు చెప్పారు.
పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కాపులను బీసీలలో చేర్చడానికి తమ పరిధిలో చేయవలసినదంతా పక్కాగా చేశామని చెప్పారు. ఒక కులాన్ని బీసీ జాబితాలో చేర్చేది కేంద్ర-రాష్ట్ర ఉమ్మడి అంశమని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉభయ సభలలో చట్టం చేసి, దానిని కేంద్రానికి పంపామని, ఇక ఆ అంశం కేంద్రం పరిధిలో ఉందని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావించినట్లు చెప్పారు. రాజ్యాంగ మూల సూత్రాలకు విఘాతం కలుగకుండా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి డిమాండ్లు ఉన్నాయని, రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని కేంద్రం స్పందించవలసిన అవసరం ఉందని యనమల అన్నారు.

Jul 25, 2018


బంద్ విఫలం చేసిన ప్రజలు

మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ హిదాయత్
        
                 సచివాలయం, జూలై 24: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ విఫలమైందని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ హిదాయత్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. బంద్ కు ప్రజా సంఘాలు కూడా సహకరించలేదన్నారు. ప్రధాన ప్రతిపక్షం బంద్ కు పిలుపు ఇస్తే ఈ విధంగా విఫలం కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. బీజేపీ డైరెక్షన్ లోనే వైసీపీ బంద్ చేసిందని విమర్శించారు. బంద్ ద్వారా విధ్వంసం సృష్టించి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే వారి ఉద్దేశం అన్నారు. బంద్ వల్ల ఎవరికి లాభం అని ప్రశ్నించారు.   బిజేపీ ప్రయోజనం కోసమే వైసీపీ బంద్ చేస్తున్నదని తెలుసుకున్న ప్రజలు ఆ పార్టీకి సహకరించలేదన్నారు. బంద్ కారణంగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నిర్వహించవలసిన ఎంబీబీఎస్ 2, 4వ సంవత్సరం పరీక్షలు వాయిదాపడ్డాయన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే బంద్ ఎందుకు చేయాలని అడిగారు. ఈ బంద్ వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడంతో రూ.170 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బీజేపీ వ్యూహంలో భాగంగానే వైసీపీ బంద్ కు పిలుపు ఇచ్చిందన్నారు. పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి నిరసన తెలుపకుండా, పరోక్షంగా మద్దతు తెలిపిందన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని, ప్రధాని ప్రసంగానికి రోడ్డెక్కి నిరసన తెలిపిందని గుర్తు చేశారు. బంద్ ఓ నాటకంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీలేని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంటులో చర్చ జరిగే సమయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన రెడ్డి కోర్టులో చేతులుకట్టుకొని నిలబడ్డారన్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో తెలుగు ఓటర్లు బీజేపీకి ఓటు వేయవద్దని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారని, వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కుటిల రాజకీయాలవైపు ప్రజలు ఉండరని, కుప్పిగంతులు వేసే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని పేర్కొన్నారు. కేంద్రం నిరంకుశ విధానానికి టీడీపీ మడమ తిప్పకుండా పోరాటం చేస్తుందన్నారు. అల్లూరి సీతారామ రాజు, ప్రకాశం పంతులు, ఎన్టీఆర్ లా చంద్రబాబు నాయుడు పోరాట పటిమని ప్రజలు గుర్తించారని హిదాయత్ అన్నారు.
--------------



నమ్మలేని నిజాలు బీసీలకు తీరని అన్యాయం

v మంచి ర్యాంకులు వచ్చినవారితో బీసీ ఖాళీల భర్తీ
v తక్కువ ర్యాంకులు వచ్చినవారితో ఓపెన్ కేటగిరీ పోస్టుల భర్తీ
v మొత్తం ఖాళీలు ఇదేవిధంగా భర్తీ
v చిత్రం..చిత్రం...ఏపీపీఎస్సీ విచిత్రం
v రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం
v రిజర్వేషన్ అమలు తీరుని పరిశీలించే వ్యవస్థ లేదు
         ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నప్పటికీ రిజర్వేషన్ వ్యతిరేక వర్గాల వారు వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ, బీసీలు లబ్ది పొందే అనేక చోట్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసే చర్యల వల్ల ఇలా జరుగుతోంది. రిజర్వేషన్లు చట్టప్రకారం సక్రమంగా అమలు చేయకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని తెలిసి కూడా వారు బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు.  మార్కులు, ర్యాంకులు ప్రాతిపదికగా భర్తీ చేసే ఉద్యోగ ఖాళీల విషయంలో నిబంధనలను అధికారులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు  తమకు అనుకూలంగా మలుచుకొని అమలు చేస్తున్నారు. ఖాళీల భర్తీ విషయంలో తొలుత ఓపెన్ కేటగిరీ పోస్టులు భర్తీ  చేసి, ఆ తరువాత రిజర్వేషన్ కేటగిరీ పోస్టులు భర్తీ చేయాలి. ఆ విధంగా చేస్తే బీసీలలో అత్యధిక మార్కులు వచ్చిన వారు కొందరు ఓపెన్ కేటగిరి పోస్టులు పొందే అవకాశం ఉంటుంది. ఆ తరువాత రిజర్వేషన్ కేటగిరి పోస్టులు భర్తీ చేసినప్పుడు వరుస క్రమంలో ఆ తరువాత ర్యాంకులు పొందినవారికి అవకాశం వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా జరిగే ఖాళీల భర్తీ  ఈ విధంగా జరగడంలేదు. తొలుత రిజర్వేషన్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలా చేయడం వల్ల అత్యధిక మార్కులతో మంచి ర్యాంకులు పొంది, ఓపెన్ కేటగిరిలో ఎంపిక కావలసినవారు కూడా రిజర్వేషన్ కేటగిరిలో ఎంపికవుతున్నారు. వారు ఓపెన్ కేటగిరిలో ఎంపికయితే మరికొందరికి రిజర్వేషన్ కేటగిరిలో అవకాశం వచ్చే వీలుంటుంది. అలాకాకుండా కొందరు ఉద్దేశపూర్వకంగా వారికి దక్కవలసిన పోస్టులు దక్కకుండా అడ్డుపడుతున్నారు. ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పట్టించుకునే నాధుడే లేడు. ముఖ్యంగా ఏపీపీఎస్సీ లో జరిగే అవకతవకలను పరిశీలిస్తే బీసీలు ఏవిధంగా, ఎలా నష్టపోతున్నారో తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడానికి  గతంలో ఏపీపీఎస్సీ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసేది. వాటికి ఆ రిజర్వేషన్ వర్గాల వారే పోటీపడి, మంచి ర్యాంకులు సాధించినవారు  పోస్టులు పొందేవారు.  2016లో మాత్రం తాజా పోస్టుల భర్తీకి, బ్యాక్ లాగ్ (క్యారీ ఫార్వర్డ్) పోస్టుల భర్తీకి ఒకే నోటిఫికేషన్ విడుదల చేసింది. పంచాయతీరాజ్, నీటి పారుదల మొదలైన శాఖలలో 748 ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ (6/2016) విడుదల చేసింది. ఈ ఖాళీలలోనే బ్యాక్ లాగ్ ఖాళీలు కూడా ఉన్నాయి. అలాగే మునిసిపల్, పబ్లిక్ హెల్త్  వంటి శాఖలలో ఖాళీగా ఉన్న  149 ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్)   పోస్టుల భర్తీకి కూడా మరో నోటిఫికేషన్ (09/2016) విడుదల చేసింది. ఇందులో కూడా బ్యాక్ లాగ్, తాజా పోస్టులు రెండూ ఉన్నాయి. ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి అభ్యర్థులకు వేరువేరుగా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. అర్హులకు మెయిన్ పరీక్ష నిర్వహించి మెరిట్ జాబితా తయారు చేశారు. ఆ మెరిట్ జాబితా ప్రకారం ఏపీపీఎస్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలు పెట్టింది. సమస్య ఇక్కడే మొదలైంది. ముందు బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఓపెన్ క్యాటగిరిలో ఎంపిక కావలసిన బీసీ అభ్యర్థులు ఆ అవకాశాన్ని కోల్పోయారు. బ్యాక్ లాగ్ ఖాళీలో ఎంపికయ్యారు. ముందు ఓపెన్ క్యాటగిరి ఖాళీలను భర్తీ చేస్తే ఆ అభ్యర్థులు ఓపెన్ లో ఎంపికయ్యేవారు. బ్యాక్ లాగ్ లో కొందరు బీసీ అభ్యర్థులకు అవకాశం వచ్చేది. బ్యాక్ లాగ్, తాజా ఖాళీల భర్తీకి ఒకే నోటిఫికేషన్ విడుదల సరైన పద్ధతి కాదు. ఒక వేళ అలా జారీ చేసినా, ముందు ఓపెన్ కేటగిరిలోని ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలి. ఆ తరువాత రిజర్వేషన్ కేటగిరి భర్తీ చేయాలి. అలా చేసినప్పుడు జాబితాలో ముందున్న రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులు ఓపెన్ కేటగిరిలో ఎంపికవుతారు. ఆ తరువాత రిజర్వేషన్ కేటగిరి పోస్టులకు రిజర్వేషన్ అభ్యర్థులు ఎంపికవుతారు. ఇక్కడ అలా జరగకుండా ఓపెన్ కేటగిరిలో ఎంపిక కావలసిన అభ్యర్థులు బ్యాక్ లాగ్ లో ఎంపికయ్యారు. వాస్తవానికి ఆ అభ్యర్థులు ఓపెన్ లో ఎంపికై ఉంటే, బ్యాక్ లాగ్ పోస్టులకు మరి కొందరు బీసీ అభ్యర్థులు ఎంపికయ్యేవారు. ముందు బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం వల్ల బీసీ అభ్యర్థులు అనేక పోస్టులు నష్టపోయారు. బ్యాక్ లాగ్ పోస్టులకు వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్ష, ఎంపిక కూడా వేరుగా నిర్వహించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు.  రెండిటికి కలిపి నోటిఫికేషన్ విడుదల చేయడం, ముందు బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయడం వల్ల బీసీలకు అన్యాయం జరిగింది.  రిజర్వేషన్ నిబంధనలను అధికారులు వారు ఇష్టమొచ్చినట్లు అన్వయించుకోవడం వల్ల రిజర్వేషన్ స్ఫూర్తి దెబ్బతింటోంది. రిజర్వేషన్ అభ్యర్థులు నష్టపోతున్నారు. రావలసిన పోస్టులు వారికి రావడంలేదు. ఇటువంటి వాటిని సరిదిద్దే బలమైన వ్యవస్థ కొరత ఉందని స్పష్టమవుతోంది.

             ఏపీపీఎస్సీ 09/2016 నోటీఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఖాళీలను పరిశీలిస్తే జరిగిన అవకతవకలు, బీసీలు నష్టపోయిన తీరు అర్ధమవుతుంది. జోన్-2లో పోస్ట్ కోడ్ -1(పీసీ-01) బీసీ-బీ జనరల్  బ్యాక్ లాగ్ ఖాళీని 113వ ర్యాంకు సాధించిన బీసీ-బీ అభ్యర్థితో నింపారు. అదే జోన్ లో అదే పోస్టుకు సంబంధించిన తాజా ఖాళీలను 117, 132, 139 ర్యాంకులు సాధించిన అభ్యర్థులతో నింపారు. మంచి ర్యాంకు సాధించిన రిజర్వ్ డ్ అభ్యర్థి రిజర్వ్ డ్ ఖాళీలోనూ, అంతకంటే తక్కువ ర్యాంకులు సాధించిన వారు ఓపెన్ కేటగిరిలో ఎంపికయ్యారు.  జోన్ – 2లో 111వ ర్యాంకు పొందిన బీసీ-డీ అభ్యర్థితో బ్యాక్ లాగ్ ఖాళీని నింపారు. తాజా ఖాళీలలో బీసీ-డీ ఖాళీలు లేవు. ముందు ఓపెన్ కేటగిరి ఖాళీలను భర్తీ చేస్తే ఆ అభ్యర్థి ఓపెన్ లో ఎంపికయ్యేవారు. బ్యాక్ లాగ్ లో మరో బీసీ-డీ అభ్యర్థికి అవకాశం వచ్చేది. ఇక్కడే మరో తప్పు జరిగింది. జోన్-1కు చెందిన 169వ ర్యాంక్ సాధించిన బీసీ-డీ అభ్యర్థిని నాన్-లోకల్ కేటగిరి కింద జోన్-2లో ఎంపిక చేశారు. నాన్ లోకల్ కేటగిరి ఖాళీని భర్తీ చేసేటప్పుడు ఆ జోన్ లోని అభ్యర్థులందరికంటే మెరుగైన ర్యాంకు సాధించిన అభ్యర్థితో ఆ ఖాళీని నింపాలి. 111వ ర్యాంకు సాధించిన అభ్యర్థి ఉండగా, 169వ ర్యాంకు వచ్చిన నాన్ లోకల్ అభ్యర్థితో ఆ ఖాళీని నింపారు. ఖాళీలను నింపే పద్ధతి ఇదేనా? బ్యాక్ లాగ్ పోస్టులు ముందు భర్తీ చేయడం వల్ల ఇలా జరిగింది. జోన్-3లో పీసీ-01 బ్యాక్ లాగ్ పోస్ట్ ని 43వ ర్యాంకు సాధించిన బీసీ-బీ అభ్యర్థితో నింపారు. ఓపెన్ కేటగిరిలో అదే పోస్ట్ కు సంబంధించిన తాజా ఖాళీలను 46,78,83,85 ర్యాంకులు సాధించిన అభ్యర్థులతో నింపారు. అత్యధిక మార్కులు సాధించి ఓపెన్ కేటగిరిలో ఎంపిక కావలసిన అభ్యర్థులను అన్యాయంగా బ్యాక్ లాగ్ పోస్టులలో ఎంపిక చేశారు.  జోన్-4లో పీసీ-01 ఖాళీని 73వ ర్యాంకు సాధించిన అభ్యర్థిని బీసీ-బీ నాన్ లోకల్ కేటగిరిలో ఎంపిక చేశారు. 84, 88, 119,129 ర్యాంకులు సాధించిన అభ్యర్థులను ఓపెన్ కేటగిరిలో ఎంపిక చేశారు. ఈ జోన్ లో మాత్రం అన్నీ తాజా ఖాళీలే. 73వ ర్యాంకు సాధించిన అభ్యర్థిని రిజర్వేషన్ కేటగిరి పోస్టుకు ఎంపిక చేశారు. ఆ తరువాత ర్యాంకులు సాధించిన వారిని ఓపెన్ కేటగిరిలో ఎంపిక చేశారు. ఇక్కడ స్పష్టంగా అర్ధమవుతున్నదేమిటంటే అధిక మార్కులతో మంచి  ర్యాంకులు వచ్చిన బీసీ అభ్యర్థులతో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేశారు. ఆ తరువాత ర్యాంకులు వచ్చినవారితో ఓపెన్ కేటగిరి పోస్టులను భర్తీ చేశారు. ఖాళీలను ఈ విధంగా భర్తీ చేస్తారని ఎవరైనా ఊహించగలరా? సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, ఎక్కువ మార్కులతో మంచి ర్యాంకులు సాధించిన వారు ఓపెన్ కేటగిరీలో ఎంపికవుతారని, తక్కువ మార్కులు వచ్చినవారు రిజర్వేషన్ కేటగిరిలో ఎంపికవుతారని అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది రివర్స్. ఇది ఎంత అన్యాయమో, ఎంత దారుణమో ప్రభుత్వం పరిశీలించవలసి ఉంది.

మరో నోటిఫికేషన్ ఖాళీల భర్తీ కూడా అంతే !
             మరోనోటిఫికేషన్ (06/2016) ద్వారా ఖాళీల భర్తీ కూడా ఇదే విధంగా జరిగింది. జోన్-1లో బ్యాక్ లాగ్ పోస్ట్ కోడ్ -1 (పీసీ-01)ని 43వ ర్యాంకు సాధించిన బీసీ-డీ అభ్యర్థితో నింపారు. తాజా ఖాళీలను ఓపెన్ కేటగిరిలో 64, 70 ర్యాంకుల వారితో నింపారు. జోన్-1లో పీసీ-03 బ్యాక్ లాగ్ ఖాళీని 368వ ర్యాంక్ వచ్చిన లోకల్ బీసీ-బీ అభ్యర్థితో నింపారు. 422, 441 ర్యాంకులు సాధించిన బీసీ-బీ అభ్యర్థులను నాన్-లోకల్ కేటగిరిలో ఎంపిక చేశారు. వాస్తవానికి నాన్-లోకల్ వారికి లోకల్ వారికంటే మంచి మార్కులు రావాలి. బ్యాక్ లాగ్ పోస్టు ముందు నింపడం వల్ల బీసీ-బీ అభ్యర్థి అవకాశాన్ని కోల్పోయారు. జోన్-1లోనే బ్యాక్ లాగ్ పోస్ట్ కోడ్ -5ని 199వ ర్యాంకు సాధించిన బీసీ-ఏ అభ్యర్థితో నింపారు. తాజా ఖాళీలు ఓపెన్ కేటగిరిలో 214, 297, 320, 332, 335, 343, 354 ర్యాంకులు సాధించినవారిని ఎంపిక చేశారు.
             జోన్-2లో బ్యాక్ లాగ్ పోస్ట్ కోడ్ -3 ని 204వ ర్యాంక్ వచ్చిన బీసీ-ఏ అభ్యర్థితో నింపారు. అదే జోన్ లో అదే పోస్ట్  తాజా ఓపెన్ కేటగిరి ఖాళీలను 237, 252, 314, 315 ర్యాంకుల వారితో నింపారు. ఈ రకమైన ఏపీపీఎస్సీ నియామకాలకు బాధ్యులు ఎవరు? అధిక మార్కులు వచ్చిన బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ పోస్టులకు తోసేసి, అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని ఓపెన్ కేటగిరిలో ఎంపిక చేయడం వల్ల బీసీలు తీవ్రంగా నష్టపోయారు. ఆర్థిక, సామాజిక న్యాయం కోసం రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఎందుకు? వ్యవస్థలో పాతుకుపోయిన కులాలు, సామాజిక అసమానతలను తొలగించాలన్న ఉద్దేశంతో పెద్దలు ప్రవేశపెట్టిందీ రిజర్వేషన్ విధానం. అటువంటి ఉద్దేశాలకు, రాజ్యాంగ మూలసూత్రాలకు విఘాతం కలిగించే ఈ రకమైన అవకతవకలను సరిదిద్దడానికి, ఇక ముందు ఇలా జరగకుండా ప్రభుత్వం ఓ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం  ఉంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి. బీసీ సంక్షేమ శాసనసభా కమిటీ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టాలి.                                                           
-        మంచా విజయమోహన రావు, సీకే జూనియర్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్. మంగళగిరి. 9849136544  



పూర్తి వివరాలతో టేబుల్
ఏపీపీఎస్సీ చిత్రాలు - ఖాళీల భర్తీలో అవకతవకలుబీసీలకు తీరని అన్యాయం
ఖాళీలు
ఏ ర్యాంక్ వారితో నింపారు

ఖాళీలు
ఏ ర్యాంక్ వారితో నింపారు
బీసీ  కేటగిరి
113

బీసీ  కేటగిరి
43
ఓపెన్ కేటగిరి
117, 132, 139

ఓపెన్ కేటగిరి
64, 70
బీసీ  కేటగిరి
43

బీసీ  కేటగిరి
368
ఓపెన్ కేటగిరి
46, 78, 83, 85

ఓపెన్ కేటగిరి
422, 441
బీసీ  కేటగిరి
73

బీసీ  కేటగిరి
199
ఓపెన్ కేటగిరి
84, 88, 119, 129

ఓపెన్ కేటగిరి
214, 297, 310, 320, 332, 335, 343, 354
బీసీ  కేటగిరి
204



ఓపెన్ కేటగిరి
237, 252, 314, 315




...

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...