Jul 12, 2018


పుస్తక సమీక్ష
 వారసత్వ, కుటుంబ రాజకీయాలపై పరిశోధన

·       నాలుగు జిల్లాల్లో పోటీచేసి గెలిచిన ఘనుడు
·       అయిదుసార్లు గెలిచిన బావబావమరుదులు
·       తండ్రి, కొడుకు, మనవడి గెలుపులు
       
 
     వారసత్వం అనేది అన్ని సందర్బాల్లో మంచి ఫలితాలివ్వదు. వ్యాపారాలు, వృత్తులు వంటివాటిలో సాధ్యమైనా రాజకీయాల్లో మాత్రం సాధ్యం కాదు. అంతర్జాతీయంగా కొన్ని వ్యాపార సంస్థలు, మన దేశంలో టాటా, బిర్లా, అంబానీ వంటివారు, గ్రామాల్లో, పట్టణాల్లో వైశ్య కులం వారు వారసత్వంగా వ్యాపారాలు కొనసాగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తూనే ఉన్నారు. అలాగే చేతి వృత్తులు ముఖ్యంగా పౌరోహిత్యం, చేనేత, విశ్వబ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులు వంటివారి వృత్తులు వేల సంవత్సరాలుగా వారసత్వంగానే కొనసాగుతున్నాయి. ఆయా రంగాల్లో నైపుణ్యత కూడా  అలవడుతోంది. రాజకీయాల్లో మాత్రం రాచరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య రాజకీయాల వరకు ఒకటి రెండు తరాలకు మించి మంచి ఫలితాలిచ్చిన దాఖలాలులేవు. మన దేశంలో, రాష్ట్రంలో రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల కోసం పాకులాట ఎక్కువగానే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, తండ్రీ కూతుళ్లు, తల్లీకొడుకులు, తల్లీకూతుళ్లు, తాతామనవడు వంటి వారసత్వంతోపాటు అన్నదమ్ములు, వియ్యంకులు, బావబావమరుదులు వంటి ఇతర కుటుంబ సభ్యుల రాజకీయ వారసత్వ పోకడలపై  సీనియర్ జర్నలిస్ట్ మదమంచి సాంబశివరావు పరిశోధన చేసి రాసిన పుస్తకం ఇది. వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్ల నష్టాలు ఎన్నో జరిగాయి. అరాచకీయానికి దారితీశాయి. ఆయా నాయకుల ఆర్థిక స్తోమత, వ్యక్తిత్వాలు మీద ఆధారపడి వారు రాణించిన, ప్రజలకు మేలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి నాయకులు నిజంగా ప్రజాబలంతో నిలదొక్కుకున్నారు. కొందరు రాజకీయ నేతల మధ్య బంధుత్వాలకు సంబంధించి మనకి తెలియని అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో ఒకే కుటుంబం నుంచి తండ్రి, కొడుకు, అల్లుడు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. మనవడు ఎంపీ అయ్యాడు. వియ్యంకుడు ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు వీరిలో ఒక్కొక్కరు నాలుగుసార్లు, అయిదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయిదుసార్లు ఎన్నికైనవారిలో బావబాబమరుదులు ఇద్దరూ ఉండటం విశేషం. అంతేకాకుండా కొందరు నాయకులు పార్టీలు మారి, నియోజకవర్గాలు, జిల్లాలు మారి పోటీ చేసి గెలుపొందారు. ఒక నేత మూడు పార్టీల తరపున శానసభకు, శానస మండలికి ప్రాతినిద్యంవహించారు. ఒక నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుంచి 9 సార్లు ఎన్నికయ్యారు. ఒక నేత నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మరో నాయకుడు నాలుగు జిల్లాల్లో పోటీ చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందాడు. అతనే మూడుసార్లు మంత్రిగాఒకసారి ముఖ్యమంత్రిగా చేశాడు.    ఉమ్మడి ఏపీకి చెందిన ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో అనేకం ఉన్నాయి. సాంబశివరావు చాలా శ్రమించి కుటుంబ రాజకీయాలను పరిశోధన చేసి చాలా చక్కగా విశ్లేషించారు. 

పుస్తకం పేరు: నేను నా కుటుంబం
 రచయిత : మదమంచి సాంబశివరావు
 పుస్తకాలు దొరుకు ప్రదేశం: 
గ్రీన్ థింకర్స్ పబ్లికేషన్స్,
సౌపాడు గ్రామం, వట్టిచెరుకూరు మండలం,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522017
సెల్ నెంబర్: 9885317835

-       శిరందాసు నాగార్జున - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...