Jul 6, 2018


 ఎస్ఎస్సీ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల
10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ : మంత్రి గంటా శ్రీనివాసరావు

·       52.42 శాతం ఉత్తీర్ణత
·       85.43 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా ఫస్ట్
·       16.53 శాతంతో చివరి స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా

              సచివాలయం, జూలై 6: ఎస్ఎస్సీ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్ష-2018 ఫలితాలను విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు శుక్రవారం ఉదయం సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో విడుదల చేశారు. ఫలితాల సీడీని మీడియాకు అందజేశారు. సీడీ పాస్ వర్డ్ POLAVARAM గా పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలు జూన్ 11 నుంచి 25 వరకు జరిగినట్లు తెలిపారు. 29, 30తేదీలలో రెండు రోజులు స్పాట్ వాల్యూషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరీక్షలకు మొత్తం 35,147 మంది హాజరు కాగా, 18,424 మంది ఉత్తీర్ణులైనట్లు వివరించారు. ఉత్తీర్ణత శాతం 52.42 శాతంగా పేర్కొన్నారు. గత ఏడాది 71.37 శాతం ఉత్తీర్ణులయ్యారని,  ఉత్తీర్ణత ఫలితాలు ఈ ఏడాది 18.95 శాతం  తగ్గినట్లు చెప్పారు.
బాలురు 18,440 మంది హాజరుకాగా, 9,679 మంది, బాలికలు 16,707 మంది హాజరు కాగా 8745 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. బాలురు 52.49 శాతం, బాలికలు 52.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. బాలికలకంటే బాలురు 0.15 శాతం ఎక్కువ ఉత్తీర్ణలైనట్లు తెలిపారు. ఫలితాలను WWW.BSEAP.ORG వెబ్ సైట్ లో చూసుకోవచ్చని చెప్పారు.
          అత్యధిక 85.43 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 16.53 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి జిల్లా చివరి స్థానంలో ఉన్నట్లు చెప్పారు. గత సాధారణ పరీక్షా ఫలితాల్లో కూడా ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలిచిన విషయం గుర్తు చేశారు.   తూర్పుగోదావరి జిల్లాలో 83.39 శాతం, అనంతపురం జిల్లాలో 82.65 శాతం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 81.85 శాతం, గుంటూరు జిల్లాలో 80.84 శాతం, చిత్తూరు జిల్లాలో 75.49 శాతం, విజయనగరం జిల్లాలో 65.27 శాతం, కృష్ణా జిల్లాలో 59.60 శాతం, విశాఖ జిల్లాలో 57.64 శాతం, కర్నూలు జిల్లాలో 58.71 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 53.92 శాతం, నెల్లూరు జిల్లాలో 41.03 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు వివరించారు. ఫలితాలు ప్రచురించిన 7 రోజుల లోపల సబ్జెక్ట్ కు రూ.500 లు చెల్లించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయించుకోవచ్చని మంత్రి తెలిపారు. రీవెరిఫికేషన్ తోపాటు మార్కులు వేసిన జవాబు పత్రాలు కావాలంటే వెయ్యి రూపాయలు చెల్లించాలన్నారు.  ఉత్తీర్ణులయినవారికి, కానివారికి 15 రోజుల లోపల సర్టిఫికెట్లు అందజేస్తారని చెప్పారు.

10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
           డీఎస్సీ నోటిఫికేషన్ 10 రోజుల్లో జారీ చేస్తామని మంత్రి చెప్పారు. ఇంతకు ముందు ఈ నెల 6న జారీ చేయాలని అనుకున్నామని, చిన్నచిన్న అవాంతరాల వల్ల ఇవ్వలేకపోయామన్నారు. ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను, ఆ శాఖ చేసిన సూచనల ప్రకారం పరిష్కరిస్తామన్నారు. ఎన్సీటీఈ మార్గదర్శక సూత్రాల్లో కూడా కొన్ని మార్పులు చేసిన నేపధ్యంలో అన్ని అంశాలను చర్చించి వారం, పది రోజుల్లో ఒక నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఏమీ పెరగవని, గతంలో ప్రకటించిన విధంగా 10,351 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని చెప్పారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలలో పోస్టులు భర్తీ చేస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ వంటి మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించిన టెండర్లు ఎక్కువ కోట్ చేసినందున జాప్యం జరిగినట్లు తెలిపారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యా పరంగా రాష్ట్రం 17వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకినట్లు తెలిపారు. గణితంలో మొదటి స్థానంలో నిలిచినట్లు మంత్రి గంటా చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...