Jul 13, 2018


అధికారుల అలసత్వం వల్ల బీసీ విద్యార్థులకు అన్యాయం
బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్ గుండుమల తిప్పేస్వామి

Ø రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేస్తాం
Ø సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే 550 జీఓ
Ø ఆధారాలు సమర్పించి స్టే రద్దు చేయిస్తాం
Ø మెడికల్ సీట్ల భర్తీ రీ కౌన్సిలింగ్ నిర్వహిస్తాం
Ø  
               సచివాలయం, జూలై 13: అధికారుల అలసత్వం వల్ల ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో రిజర్వేషన్ వర్గాలకు ముఖ్యంగా బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్ గుండుమల తిప్పేస్వామి చెప్పారు. అమరావతిలోని వెలగపూడి శాసనసభ భవనం మొదటి అంతస్తులోని కమిటీ హాలులో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులకు మెడికల్ కౌన్సిలింగ్ లో జరుగుతున్న అన్యాయంపై నెల రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోందన్నారు. బీసీ విద్యార్థులు, బీసీ సంఘాల వాదనలో న్యాయం ఉందన్నారు. ఉయయం జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశంపై ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎన్టీఆర్ వైద్య విశ్యవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సీ.వెంకటేశ్వర రావు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.రామారావు, ఇతర ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. 2001లో సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా రూపొందించిన 550 జీఓ ప్రకారం 16 ఏళ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ కౌన్సిలింగ్ లో సీట్లు భర్తీ చేశారని చెప్పారు. 2017 ఆగస్ట్ 30 కోర్టు ఇన్ టెర్మ స్టే ఇవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తిందన్నారు. స్టే ఎత్తివేయడానికి కావలసి మద్దతు డాక్యుమెంట్లు, ఆధారాలు  ఉన్నత విద్యాశాఖ వద్ద ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పించి స్టే ఎత్తివేయిస్తామని చెప్పారు. రిజర్వేషన్ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన కౌన్సిలింగ్ ఆపివేయమని ఆదేశించారన్నారు. కొందరు అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోవడంతో స్టే ఎత్తివేయించడంలో ఇంత జాప్యం జరిగిందన్నారు. స్టే ఎత్తివేసిన తరువాత రీ కౌన్సిలింగ్ జరిపి రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. జాప్యానికి కారకులైన వారిపై వచ్చే కమిటీ సమావేశంలో చర్యలు తీసుకుంటామన్నారు.

     రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరుగకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరిగే విధంగా చూస్తామన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అన్యాయం జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల కమిటీ విజయనగరం జిల్లాలో పర్యటించిందని, అక్కడ అన్ని అంశాలను పరిశీలించామన్నారు. రిజర్వేషన్లను ఎవరు ఇష్టం వచ్చినట్లు వారికి అనుకూలంగా మలచుకోవడానికి వీలులేదని తిప్పేస్వామి హెచ్చరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు పి.అనంత లక్ష్మి, డాక్టర్ బి.అశోక్, బి.రామమూర్తి, ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు పాల్గొన్నారు.

స్టే ఎత్తివేయడానికి కోర్టుకు ఆధారాలు సమర్పణ
          మెడికల్ కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి స్టే ని ఎత్తివేయమని కోరుతూ తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. అమరావతిలోని వెలగపూడి శాసనసభ భవనం మొదటి అంతస్తులోని కమిటీ హాలులో శుక్రవారం ఉదయం జరిగిన బీసీ సంక్షేమ కమిటీ సమావేశంలో రిజర్వేషన్ అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.550ని రూపొందించింది. ఈ జీఓ ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థి ఓపెన్ కేటగిరీలో ఒక కళాశాలలో చేరి, తరువాత రిజర్వేషన్ కేటగిరీలో మరో కళాశాల లేదా కోర్సులోకి మారితే ఏర్పడిన ఖాళీని అదే రిజర్వు కేటగిరి అభ్యర్థితో మెరిట్ ప్రకారం భర్తీ చేయాలి. 2001 నుంచి ఈ ప్రకారమే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారు. 2017లో తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయించారని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు 2017 ఆగస్ట్ 30న ఆ రకమైన సీట్ల కేటాయింపు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు వెలువడే నాటికి సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి అయింది. కోర్టు మధ్యంతర ఉత్వర్వులను దృష్టిలోపెట్టుకొని ఈ ఏడాది సీట్లను భర్తీ చేస్తుండటంతో రిజర్వేషర్ వర్గాలు ఆందోళనకు దిగాయి. మధ్యంతర ఉత్తర్వులను తొలగించి, కేసును కొట్టివేయవలసిందిగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం హైకోర్టును కోరినట్లు, కేసు విచారణలో ఉన్నట్లు, సోమవారం విచారణ జరుగుతుందని  ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఎన్టీఆర్ వైద్య విశ్యవిద్యాలయం వైస్ ఛాన్సలర్ సీ.వెంకటేశ్వర రావులు కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ తిప్పేస్వామి మాట్లాడుతూ స్టే ఎత్తివేయించడానికి ఇంత కాలం ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.  అధికారులు తగిన బాధ్యతతో వ్యవహరించకపోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. రిజర్వేషన్ వర్గాలకు అన్యాయం జరగడానికి వీలులేదన్నారు. వారికి న్యాయం జరగాలని చెప్పారు. అందుకు తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించి స్టే ఎత్తివేయించడానికి తీవ్రంగా ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ విషయంలో రిజర్వేషన్ వర్గాలకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఉన్నతాధికారులను, వైస్ ఛాన్సలర్ ని తిప్పేస్వామి కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులతోపాటు బిసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ వి.రామారావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...