Jul 31, 2018


పార్లమెంట్ హామీలు అమలు చేయకుండా
ఏపీకి అన్యాయం చేసిన కేంద్రం
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు

               సచివాలయం, జూలై 31: పార్లమెంటులో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్రం నిధులు విడుదల చేయలేదని, సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీ చేయలేదని చెప్పారు. ప్రత్యేక హోదాకు సమానంగా ఇస్తామన్న ప్యాకేజీ ప్రకారం కూడా నిధులు ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నేతలు పార్లమెంటులో ఒకటి, బయట ఒకటి చెబుతున్నారని, సుప్రీం కోర్టుని, పార్లమెంటుని కూడా తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. ఉన్నత విద్యా సంస్థల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుని ఖాతరు చేయలేదన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు ఏడాదిలోపల తమతమ సమస్యలను పరిష్కరించుకోవలసి ఉందని, ఏడాది దాటితే కేంద్రం కలుగజేసుకొని పరిష్కరించవలసి ఉందన్నారు. విభజన జరిగి 4 ఏళ్లు గడిచినా ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని సమస్యలను కేంద్రం పరిష్కరించలేదని చెప్పారు. 9వ షెడ్యూల్ లోని అంశాలను కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. పదవ షెడ్యూల్ లోని 142 సంస్థల ఆస్తులు, అప్పుల విలువ లెక్కించి, జనాభా ప్రాతిపధికన ఏపీకి 58 శాతం, తెలంగాణకు 42 శాతం  పంపిణీ చేయవలసి ఉందని, ఆ విషయం కూడా పట్టించుకోవడంలేదని తెలిపారు. ఆఫిడవిట్ లో పంపిణీ చేయవలసిన అవసరంలేదని పేర్కొంటున్నారని చెప్పారు. 10వ షెడ్యూల్ లో పేర్కొన్న వివిధ క్లాజులలో తెలిపిన ప్రకారం ఆయా సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీ చేయవలసిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.  కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా టాస్క్ ఫోర్స్ నివేదికను పట్టించుకోకుండా ప్లాంట్ ఏర్పాటు చేయడం వీలుకాదని చెప్పారన్నారు. రైల్వే జోన్ కూడా ఇవ్వక్కరలేదని చెబుతున్నారన్నారని పేర్కొన్నారు.  పలు విషయాలలో ప్రజలను తప్పు ద్రోవపట్టిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఉద్దేశం వారికి లేదన్నారు.  ప్రజాస్వామ్యంలో ఇటువంటి విషయాలన్నీ ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. అందుకే టీడీపీ పార్లమెంటులోనూ, బయట ఆందోళన చేస్తోందన్నారు.  పార్లమెంట్ హామీలు నెరవేర్చేవరకు తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెగేసి చెప్పారు.

       రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం చేయని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్  ప్రశ్నించడంలేదన్నారు. పైగా కేంద్రానికి అనుకూలంగా వారు మాట్లాడుతున్నారని విమర్శించారు.  అన్ని విషయాలు ప్రజలకు తెలుసని చెప్పారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడంలేదని, ఏపీకి కూడా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని, 90:10 నిధులు ఇస్తామని చెప్పారన్నారు. ఏ ఒక్క పథకానికి సంబంధించి కూడా ఆ విధంగా నిధులు ఇవ్వలేదని తెలిపారు. ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా మాట తప్పి రాష్ట్రానికి అన్యాయం చేశారని యనమల అన్నారు.

బీసీల అభ్యున్నతికి కృషి చేసిన టీడీపీ
          తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాం నుంచి  బీసీల అభ్యున్నతికి టీడీపీ కృషి చేసిందన్నారు. బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించింది తమ పార్టీయేనని తెలిపారు. బీసీల రిజర్వేషన్ 27 శాతానికి పెంచింది కూడా తామేనని స్పష్టం చేశారు.  మురళీధరన్ కమిషన్ నివేదికని ఆమోదించింది తామేనని చెప్పారు. ఆనాడు కొందరు దానిని వ్యతిరేకించారన్నారు. బీసీ సబ్ ప్లాన్, ఆదరణ పథకం, చేనేత కార్మికుల రుణమాఫీ, చేనేత వస్త్రాలకు సబ్సిడీ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. బీసీల కోసం దాదాపు రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. బీసీలు మొదటి నుంచి తమ వెంటే ఉంటున్నట్లు చెప్పారు.
పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం కాపులను బీసీలలో చేర్చడానికి తమ పరిధిలో చేయవలసినదంతా పక్కాగా చేశామని చెప్పారు. ఒక కులాన్ని బీసీ జాబితాలో చేర్చేది కేంద్ర-రాష్ట్ర ఉమ్మడి అంశమని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఉభయ సభలలో చట్టం చేసి, దానిని కేంద్రానికి పంపామని, ఇక ఆ అంశం కేంద్రం పరిధిలో ఉందని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావించినట్లు చెప్పారు. రాజ్యాంగ మూల సూత్రాలకు విఘాతం కలుగకుండా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి డిమాండ్లు ఉన్నాయని, రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని కేంద్రం స్పందించవలసిన అవసరం ఉందని యనమల అన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...