Sep 18, 2022

దటీజ్ బాలకృష్ణ!



నందమూరి అందగాడు, నటరత్న, విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావు కుమారుడు, నటవారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టినా బాలకృష్ణ   తన నటనా ప్రతిభతో నటుడిగా ఉన్నత శిఖరాలధిరోహించారు. తెలుగువారి హృదయాలను కొల్లగొట్టిన యువరత్న బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా అనేక వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఆయన పౌరాణిక, జానపద, సాంఘిక, సైన్స్ ఫిక్షన్ వంటి 106 చిత్రాలలో  నటించారు.నట సింహంగా పేరు పొందిన బాలకృష్ణను కుటుంబ సభ్యులు,అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు.

 ఫ్యాక్షన్ డైలాగులు చెప్పడంలో దిట్టగా పేరొందిన బాలయ్య 1960లో జూన్ 10న నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతులకు జన్మించారు. చెన్నై టీనగర్ బజుల్లా రోడ్డులోని హాస్యనటుడు శివరావు ఇంటిని 1953లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు. ఈ ఇంట్లో ఉండగానే బాలకృష్ణ జన్మించారు. ఎన్టీఆర్, బసవతారకం  దంపతులకు 12 మంది సంతానం. ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు. ఆరవ కుమారుడైన బాలక‌ృష్ణ తల్లిదండ్రుల చెప్పుచేతల్లో ఎంతో క్రమశిక్షణగా పెరిగారు. బాలకృష్ణ బాల్యం అంతా హైదరాబాదులోనే గడిచింది. ఇంటర్మీడియట్ పూర్తి అయిన వెంటనే నటుడు కావాలని ఆయన అనుకున్నారు. అయితే,  కనీసం డిగ్రీ  పూర్తి చేయాలన్న  తండ్రి కోరిక మేరకు హైదరాబాద్ నిజాం కళాశాలలో బీఏ చదివారు.

 1982 డిసెంబరు 8న బాలకృష్ణ   వసుంధరాదేవిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు బ్రాహ్మణి, తేజస్విని, ఒక కుమారుడు  తారకరామ తేజ మోక్షజ్ఞ. బాలకృష్ణ 14 సంవత్సరాల వయసులోనే 1974లో  తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించారు. తర్వాత తండ్రితో  కలిసి ఎక్కువ చిత్రాలలో నటించారు. బాలక‌ృష్ణ  తండ్రి దర్శకత్వం వహించిన  తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం చిత్రాలలో నటించారు. తండ్రి ద్వారా అపారమైన నటనానుభవాన్ని గఢించారు. 


దానవీరశూర కర్ణ సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ సినిమాకు దర్శకుడైన ఎన్టీఆర్ హరిక‌‌ృష్ణ, బాలకృష్ణల చేతకూడా సెట్ పనులు చేయించారు. ఒకరోజు అన్నదమ్ములిద్దరూ సెట్ లో బాయిస్ తో పనిచేయిస్తూ ఎన్టీఆర్ కు కనిపించారు. అది చూసి ఆయన సెట్ లో పనులు చేయించడమేకాదు, మనం కూడా చేయాలని అని చెప్పారు. ఒక్క సెట్ వర్కే కాదు, లైట్ బాయ్, ప్రొడక్షన్, మేకప్, కాస్ట్యూమ్ తదితర పనులు చేసే అందరితోపాటు సినీ పరిశ్రమలోని అందరినీ గౌరవించాలి.  మన ఎదుగుదలలో అందరి కృషి ఉంటుందన్నారు. అందరినీ సమానంగా చూడాలని చెప్పారు. చెప్పిన సమయం కంటే ముందే సెట్ కు రావాలని కూడా చెప్పారు. అప్పటి నుంచి బాలకృష్ణ తండ్రి మాటలను శిరోధార్యంగా భావించారు. అందరినీ గౌరవించేవారు. 

దాన వీర శూర కర్ణ సినిమాలో హరికృష్ణ కుమారుడి పాత్రలో బాలయ్య కనిపిస్తారు. ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి ‘రామ్ రహీమ్’ చిత్రంలో నటించారు.1984లో రూపొందించిన సాహసమేజీవితం చిత్రంతో బాలయ్య కమర్షియల్ గా సక్సెస్ సాధించడం మొదలైంది. అక్కడ నుంచి కమర్షియల్ చిత్రాలకు బాలయ్య కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఆ తరువాత యాక్షన్, ఫ్యాక్షన్ చిత్రాలలో నటించి ట్రెండ్ సెట్టర్ అయ్యారు. కత్తి పట్టి, డైలాగ్ చెప్పి, కంటి చూపుతో  కలెక్షన్లలో రికార్డులు సృష్టించారు.యాక్షన్, డ్యాన్సులు, ఫైట్స్, హావభావాల ప్రదర్శన,డైలాగ్స్ చెప్పడంలో  తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అలవర్చుకున్నారు. సమరసింహారెడ్డి చిత్రంతో ఫాక్షన్ చిత్రాలకు ఓ ఊపు తెచ్చారు. అప్పటి నుంచి బాలయ్యలోని నటసింహం జూలు దులిపింది. బాలయ్య తొడకొట్టినా, మీసం తిప్పినా రచ్చరచ్చే.బాలకృష్ణ సినిమా విడుదలవుతుందంటే చాలు అభిమానులకు పండగే. థియేటర్లు హౌస్ ఫుల్. కలెక్షన్ల వర్షం.

 1974లో తాతమ్మ కలలో బాలయ్యకు తాతమ్మగా నటించిన విలక్షణ నటి భానుమతి, మళ్లీ  పది సంవత్సరాల తరువాత 1984లో మంగమ్మగారి మనవడు చిత్రంలో నానమ్మగా నటించారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది.బాలయ్యకు మంచిపేరు తెచ్చిపెట్టంది. బాలయ్య సినీజీవితంలో గొప్ప మలుపు అది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఏర్పడలేదు. ఆ తరువాత కథానాయకుడు,భార్యాభర్తల బంధం,నిప్పులాంటి మనిషి, ముద్దుల కృష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, అపూర్వసహోదరులు, భార్గవరాముడు,మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు,నారీనారీ నడుమ మురారి, లారీడ్రైవర్, ఆదిత్య 369, భైరవద్వీపం, బొబ్బిలి సింహం,శ్రీకృష్ణార్జున విజయం, ముద్దుల మొగుడు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు,  లక్ష్మీ నరసింహా, సింహా,శ్రీరామరాజ్యం, లెజెండ్, గౌతమీపుత్రశాతకర్ణి,  రూలర్ వంటి చిత్రాలలో నటించారు. బాలయ్య 106వ చిత్రం అఖండ భారీ కలెక్షన్లతో  ఘన విజయం సాధించింది. 

బాలక‌ృష్ణ నటనతోపాటు నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించారు. ‘సుల్తాన్, బాల గోపాలుడు, ‘అల్లరి పిడుగు, ప్రాణానికి ప్రాణం సినిమాలకు సమర్ఫకుడిగా వ్యవహరించిన బాలకృష్ణ  తండ్రి జీవితంపై తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో నిర్మాతగా మారడమే కాకుండా, ఆ చిత్రాలలో తానే  హీరోగా నటించారు. నందమూరి వారసుడిగా సినిమా రంగంలో తండ్రి ఎన్టీఆర్ నటించిన  శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు,దుష్యంతుడు, హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక,చారిత్రక పాత్రలను పోషించారు. మెప్పించారు. ఒక రకంగా అది బాలకృష్ణకు అదృష్టంగా భావించవచ్చు. సినిమా రంగంలో తండ్రి పేరు చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ ఎదుగుతూ వచ్చారు. అందంలో తండ్రికి తగ్గ తనయుడిగా కూడా ఉంటారు. అందువల్లే బాలయ్యను అభిమానులు  నందమూరి అందగాడు అని పిలుచుకుంటారు. 

 ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో  ఎన్టీఆర్ విశ్వామిత్రుడిగా, రావణుడిగా, బాలయ్య హరిశ్చంద్రుడిగా, దుష్యంతుడిగా ద్విపాత్రాభినయం చేశారు. ఒకే సినిమాలో తండ్రి కొడుకులు  ద్విపాత్రాభినయం చేయడం ఒక ప్రత్యేకత. అది ఒక రికార్డు. 

 హీరోయిన్ విజయశాంతితో అత్యధికంగా 17 చిత్రాల్లో బాలక‌ృష్ణ హీరోగా నటించారు.వెండితెరపై ఈ జంటకు మంచిపేరొచ్చింది.ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అత్యధికంగా 13 చిత్రాల్లో బాలయ్య హీరోగా నటించారు.  అందులో 9 చిత్రాలు హిట్టయ్యాయి. బాలయ్య 50వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారీ’కి కోదండరామిరెడ్డే దర్శకులు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 7, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో  7 చిత్రాల్లో నటించారు. 1987లో ఒకే సంవత్సరంలో బాలకృష్ణ    నటించిన 8 సినిమాలు విడుదలవడం విశేషం.బాలయ్య సినీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ  కుంగిపోలేదు. అలాగే, ఘనవిజయాలు సాధించినప్పటికీ  పొంగిపోలేదు. 

   బాలకృష్ణకు తను నటించిన చిత్రాలలో సమర సింహారెడ్డి అంటే ఎక్కువ ఇష్టపడతారు. అలాగే రజనీకాంత్ ముత్తు, అమితాబచ్చన్ అగ్నిపథ్, చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి అంటే బాలయ్యకు ఇష్టం.బాలకృష్ణ పైసావసూల్  సినిమా కోసం మొదటిసారి పాట పాడారు.  పాండురంగడు చిత్రంలో మాతృదేవోభవా అన్న సూక్తి మరిచాను అనే పాటలో పశ్చాత్తాప  పడిన కొడుకు  పాత్రలో   బాలకృష్ణ జీవించారు. ఈ పాటకి   థియేటర్లలో  ప్రేక్షకులు కన్నీటిపర్యంతమయ్యారు. 

తెలుగులో  తొలి టైమ్ మిషన్ నేపథ్యం గల సినిమా ‘ఆదిత్య 369’లో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య నటన అమోఘం.ఈచిత్రాన్ని ఇండియన్ ఇంటర్నేషనల్  ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. 

 మొత్తం 15 చిత్రాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ‘అధినాయకుడు’లో తాతా,తండ్రి,మనవడుగా మూడు పాత్రల్లో నటించారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో  మూడు సినిమాలు ‘భార్యభర్తల అనుబంధం, ‘గాండీవం’, శ్రీరామరాజ్యంలలో నటించారు. బాలయ్య   కృష్ణ, కృష్ణంరాజులతో కలిసి సుల్తాన్ చిత్రంలో నటించారు. బాలకృష్ణ అతిథి పాత్రలో ఒకే ఒక చిత్రం ‘త్రిమూర్తులు’లో నటించారు. టి.సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ, శోభన్ బాబు,కృష్ణంరాజు,చిరంజీవి, నాగార్జున కూడా అతిథి పాత్రలలో నటించారు. 

 బాలయ్య  స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ‘నర్తనశాల’ సినిమా నిర్మాణం సౌందర్య మరణంతో ఆగిపోయింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో దాదాపు 80 శాతం షూటింట్ పూర్తి అయిన  ‘విక్రమ సింహ భూపతి’ సినిమా  వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేదు.  బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. జై బాలయ్య అని పేరు పెడితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా దీని టీజర్ విడుదల చేశారు. అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. బాలయ్య ఆగస్టు 30, 2022 నాటికి  తన నటప్రస్థానం 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 

బాలయ్య బాబు ఆహా టీవీలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ప్రొగ్రామ్‌ను కూడా విజయవంతంగా నిర్వహించారు. తన స్టైల్లో పంచ్ మీద పంచ్ వేస్తూ  హాస్యం పండిస్తూ సరదా సరదాగా నడిపారు. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాడతారని, ఓపెన్ గా ఉంటారని,బాలయ్యది చిన్న పిల్లవాడి మనస్తత్వం అని అతని సన్నిహితులు చెబుతారు.  సినిమా సెట్ లోకి రాగానే  చిత్ర బృందంలోని వారందరికి విష్ చేయడం బాలయ్య బాబుకు

అలవాటు.తండ్రి మాదిరిగానే బాలయ్య తెల్లవారు జామున 3.30 గంటలకే నిద్రలేస్తారు. యోగా,వ్యాయామం చేస్తారు.  సేవారంగంలో కూడా బాలయ్య ముందున్నారు.హైదరాబాద్ లోని వారి తల్లిగారి పేరుతో  అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆస్పత్రికి  చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. నందమూరి బసవతారకం-రామారావు మెమోరియల్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ పాలకమండలి ఆధ్వర్యంలో ఈ ఆస్పత్రిని లాభాపేక్షలేకుండా  నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆస్పత్రి ద్వారా ఎంతోమంది పేదలకు తక్కువ ఖర్చుతో  వైద్యం అందిస్తున్నారు. పేదలకు నాణ్య‌మైన వైద్య సేవ‌లందిస్తోన్న ఆస్పత్రిగా నీతి అయోగ్  కూడా దీనిని గుర్తించింది. 

 అన్ని విషయాలలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించారు. తండ్రి  మూడుసార్లు గెలిచిన అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచే  బాలయ్య   2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

బాలకృష్ణ  2001లో నరసింహానాయుడు, 2010లో సింహా, 2014లో  లెజెండ్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ  నంది అవార్డులు మూడు  అందుకున్నారు. 1994లో భైరవద్వీపం చిత్రానికి  ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, పాండు రంగడు చిత్రానికి  సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు,  సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలకు  ఉత్తమ నటుడిగా భరతముని అవార్డులు,లెజెండ్ చిత్రానికి  ఉత్తమ కథానాయకునిగా దక్షిణ భారత సినిమాటోగ్రాఫర్స్ అవార్డు అందుకున్నారు. 2007లో అక్కినేని అభినయ పురస్కారంతో బాలయ్యను సత్కరించారు. ఇంకా సంతోషం, సీమా, సిని‘మా’, టీఎస్ఆర్ నేషనల్ అవార్డులు వంటివి అనేకం అందుకున్నారు. 

ఇప్పటి వరకూ ఒక్క వ్యాపార ప్రకటనలో కూడా నటించకపోవడం బాలయ్య ప్రత్యేకత. నాకు ఈ ఇమేజ్ ఇచ్చింది ప్రేక్షకులే. వారిచ్చిన ఇమేజ్‌ను మన స్వార్థం కోసం ఉపయోగించకోకూడదన్నదే నాన్న ఎన్టీఆర్ గారి అభిప్రాయం. ఆయన బాటలోనే నేను కూడా ఇప్పటి వరకు ఎలాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించలేదని చెప్పారు. దటీజ్  బాలకృష్ణ. 


                                                                    -శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...