Apr 26, 2019


2021 మార్చి 1 నుంచి జనాభా లెక్కల సేకరణ

             సచివాలయం, ఏప్రిల్ 26: కేంద్ర ప్రభుత్వం 2021లో దేశంలోని జనాభా లెక్కలను సేకరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఆధారంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఇక్కడ జీఓ జారీ చేశారు. ఆ జీఓ ప్రకారం  దేశమంతా 2021 మార్చి 1వ తేదీ  00.00 గంటల సమయాన్ని ప్రామాణికంగా తీసుకొని జనాభా లెక్కలను సేకరిస్తారు. జమ్మూ-కాశ్మీర్, ఉత్తరా ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలోని మంచు గడ్డకట్టే కొండ ప్రాంతాలలో మాత్రం అంతకంటే ముందుగానే 2020 అక్టోబర్ 1వ తేదీ 00.00 గంటలను ప్రామాణికంగా తీసుకొని జనాభా లెక్కలు సేకరిస్తారు.


Apr 24, 2019

ముఖ్యమంత్రి సహాయ నిధికి టెక్ మహీంద్ర రూ.20 లక్షల విరాళం


అమరావతి, ఏప్రిల్ 24: ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)కి టెక్ మహీంద్ర సంస్థ రూ.20 లక్షల రూపాయలు అందజేసింది. సచివాలయంలోని 1వ బ్లాక్ మొదటి అంతస్తులో బుధవారం మధ్యాహ్నం సంస్థ విసి కెవిఆర్ సుబ్రహ్మణ్యం   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంను కలిసి చెక్కుని అందజేశారు.




బీసీ లపై కక్షకట్టిన ఏపీపీఎస్సీ



బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన ఆగ్రహం
         
అమరావతి, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) బీసీ యువతపై కక్ష కట్టి తీవ్ర అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ వ్యతిరేక వర్గాల వారు వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీలో,  లబ్ది పొందే అనేక చోట్ల బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసే చర్యల వల్ల ఇలా జరుగుతోంది. రిజర్వేషన్లు చట్టప్రకారం సక్రమంగా అమలు చేయకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని తెలిసి కూడా వారు బీసీ వర్గాల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి విషయాలలో  ఏపీపీఎస్సీ ముందుంది. బీసీలకు చట్ట ప్రకారం రావలసిన ఉద్యోగ అవకాశాలను రాకుండా ఏపీపీఎస్సీ తను ఇష్టానుసారం నిబంధనలు రూపొందిస్తోంది. గతంలో కూడా తొలుత రిజర్వేషన్ ఖాళీలను భర్తీ చేసి, తరువాత ఓపెన్ కేటగిరీ పోస్టులను భర్తీ చేశారు. ఆ విధంగా చేయడం వల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపిక కావలసిన బీసీ అభ్యర్థులు కూడా బీసీ కేటగిరిలో ఎంపికయ్యారు. ఆ తరువాత అవకాశాలను బీసీ అభ్యర్థులు నష్టపోయారని ఆయన వివరించారు. ఇప్పుడు కూడా బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగే విధంగా ఏపీపీఎస్సీ నిబంధనలు రూపొందించినట్లు తెలిపారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్  బీసీలను విభజించే ధోరణిలో ఉంది. మెయిన్ కు అర్హత సాధించడానికి నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ లో ఓసీలకు కట్ ఆఫ్ మార్క్స్ 150 కి 52.70గా నిర్ణయించింది. బీసీ-, బీ, డీ గ్రూపులకు కూడా ఎటువంటి మినహాయింపు ఇవ్వకుండా అవే కటాఫ్ మార్కులుగా నిర్ణయించింది. బీసీ-సీ కి 30.74 మార్కులు, బీసీ-ఇ కి 43.92గా నిర్ణయించింది. ఈ విధంగా బీసీ-, బీ, డీ గ్రూపుల వారికి ఏపీపీఎస్సీ అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ గ్రూపు కులాల వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు.  రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ సౌకర్యానికి విఘాతం కలిగించడమేనన్నారు. ఓసీలతో సమానంగా కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించడం అన్యాం అన్నారు.  వయసు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు మినహాయింపు ఇచ్చారని, మార్కుల విషయంలో ఈ విధంగా వ్యవహరించారన్నారు. బీసీ గ్రూపులలో ఈ విధమైన విభజన తీసుకురావడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. బీసీ అభ్యర్థులకు ఈ రకంగా అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం అని ఆయన హెచ్చరించారు.  మెయిన్ కు అర్హత మార్కులను బీసీ-, బీ, డీ గ్రూపుల వారికి తగ్గించాలని శంకర రావు డిమాండ్ చేశారు.

Apr 23, 2019


స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్
బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
సచివాలయం, ఏప్రిల్ 22: పంచాయతీరాజ్  ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు సోమవారం మధ్యాహ్నం సచివాలయం 1వ బ్లాక్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంకు అందజేశారు. రాబోయే పంచాయతీరాజ్  ఎన్నికలలో చట్ట ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ను పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి హైకోర్టు ఈ రిజర్వేషన్లక సంబంధించి దాఖలైన ఒక పిటిషన్ ను విచారించి 34 శాతం రిజర్వేషన్ కొనసాగించాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే బీసీల జనగణనకు సంబంధించి డేటా కోర్టుకు సమర్పించాలని కూడా ఆదేశించింది.  కోర్టు ఆదేశాల ప్రకారం గత ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించారని, అయితే కోర్టు కోరిన ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గానీ, ఏపీ ప్రభుత్వం గానీ డేటాని ఇంతవరకు సమర్పించలేదని తెలిపారు. దాంతో తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ని 34 శాతం నుంచి 21 శాతానికి కుదించి అమలు చేస్తున్నారన్నారు. ఏపీలో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాధారణ ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికలు జరుగకుండా ఈ రెండు ప్రభుత్వాలు జాగ్రత్తపడ్డాయని విమర్శించారు. ఈ ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ద్వారా బీసీ వ్యతిరేకత స్పష్టమవుతోందన్నారు. ఇది బీసీలపై కుట్ర తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. రాష్ట్రప్రభుత్వం తరపున గవర్నర్ నరసింహన్ తగిన చర్యలు తీసుకొని బీసీలకు చట్టప్రకారం 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించవలసిందిగా కేశన శంకరరావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసినవారిలో సంఘం రాష్ట్ర నేతలు తన్నీరు ఆంజనేయులు, కుమ్మర క్రాంతి కుమార్, పరసా రంగనాథ్, దూళిపూడి ఏసుబాబు, అన్నం శివరాఘవయ్య, నాగలింగం, అంగిరేకుల గోపి తదితరులు ఉన్నారు.

అమరావతి మీడియా హౌస్
9346619396
9440222914




ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ బకాయిలు చెల్లించాలి
బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
సచివాలయం, ఏప్రిల్ 22: ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు సోమవారం మధ్యాహ్నం సచివాలయం 1వ బ్లాక్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంకు అందజేశారు. ఆర్టీసీలో 56వేల మంది కార్మికులు అరకొర జీతాలతో సర్ధుకొని బతుకుతూ ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల కృషిని ప్రశంసించారు. అయితే సంస్థ నుంచి  రావలసిన పాత బకాయిలు సకాలంలో అందక కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు రాకపోవడంతో కార్మికుల వేతన సవరణ బకాయిలు చెల్లించలేమని సంస్థ పేర్కొన్నట్లు పేర్కొన్నారు. బస్ పాస్ లు తదితర రాయితీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.650 కోట్లు అందవలసి ఉందని తెలిపారు. ఇందులో రూ.350 కోట్లు ఆర్టీసీకి మంజూరు చేస్తున్నాట్లు గత ఏడాది అక్టోబర్ లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అయితే ఆ మొత్తం ఇప్పటి వరకు ఆర్టీసీకి అందలేదన్నారు. గత సంవత్సరం సమ్మె బాట పడుతున్న కార్మికులకు హామీలు ఇస్తూ 20 శాతం బకాయిలు చెల్లించారని, మిగిలిన 80 శాతం బకాయిలు ఏప్రిల్ లో 40 శాతం, జూలైలో 40 శాతం చెల్లిస్తామని రాతపూర్వకంగా ఒప్పందం కూడా చేసుకున్నారని వివరించారు. ఇప్పటి వరకు ఆ ఒప్పందం అమలు కాలేదని తెలిపారు. అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు ఆర్టీసీ నుంచి గానీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో కార్మికులు అందోళనకు గురవుతున్నారన్నారు. ఈ విషయంలో స్పందించి సకాలంలో తగిన చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంని  బీసీ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసినవారిలో సంఘం రాష్ట్ర నేతలు తన్నీరు ఆంజనేయులు, కుమ్మర క్రాంతి కుమార్, పరసా రంగనాథ్, దూళిపూడి ఏసుబాబు, అన్నం శివరాఘవయ్య, నాగలింగం, అంగిరేకుల గోపి తదితరులు ఉన్నారు.

500 జనాభా గల ప్రతి గిరిజన ఆవాసాన్ని
ప్రత్యేక రెవెన్యూ గ్రామపంచాయతీగా గుర్తించాలి
గిరిజన ప్రజాసమాఖ్య డిమాండ్
                 సచివాలయం, ఏప్రిల్ 22: ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 500 జనాభా గల ప్రతి గిరిజన తండా, గ్రామం, గూడెంని ప్రత్యేక రెవెన్యూ గ్రామపంచాయతీగా గుర్తించాలని గిరిజన ప్రజాసమాఖ్య జాతీయ కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ సోమవారం మధ్యాహ్నం సచివాలయం 1వ బ్లాక్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంకు ఒక వినతి పత్రం అందజేశారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 500 జనాభా గల గిరిజన ఆవాసాలను ప్రత్యేక గిరిజన గ్రామంగా గుర్తించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆ వినతి పత్రంలో తెలిపారు. అయితే ఆ జీఓని 2011 జనాభా లెక్కల ప్రకారం అనేక ఆంక్షలతో రూపొందించారని పేర్కొన్నారు. ఆ జీఓ ప్రకారం 9 జిల్లాల్లో 147 గిరిజన ఆవాసాలు మాత్రమే పంచాయతీలుగా గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆ జీఓని పున:పరిశీలించి, ఆంక్షలను తొలగించి ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీను గుర్తించాలని ఆయన కోరారు. గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి దోహదపడే విధంగా గిరిజన ఆవాసాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు.

Apr 16, 2019


రేపు బీటీ నాయుడు ప్రమాణస్వీకారం
          
  అమరావతి, ఏప్రిల్ 16: బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, బోయ(వాల్మీకి)ఫెడరేషన్ చైర్మన్ బెందుల తిరుమల నాయుడు (బీటీ నాయుడు) ఈ నెల 17వ తేదీ బుధవారం శాసన మండలి సభ్యుడుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన బీసీలు, ముఖ్యంగా బోయల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ముందుంటారు. ఫ్యాక్షన్ సంస్కృతిలో ఇరువర్గాల తరపున బలైపోయిన బోయల కేసులను ఆయనే  హైకోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ వాదించి, వారికి అండగా నిలిచారు. వాల్మీకి, బోయలను షెడ్యూల్డ్ తెగలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడానికి ఐక్య వాల్మీకి తెగ పోరాట కమిటీ జాతీయ అధ్యక్షుడుగా ఆయన ఎంతో కృషి చేశారు. అహర్నిశలు బీసీల కోసం శ్రమిస్తూ బీసీ నేతగా గుర్తింపు పొందారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు రామాయణ గ్రంథకర్త, మహాకవి వాల్మీకి జయంతి వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక ఆయన కృషి ప్రశంసనీయమైనది. బీటీ నాయుడు సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మార్చి 5న ఆయన శాసన మండలి సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

          కాకతీయ యూనిర్సిటీ నుంచి సైకాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన నాయుడు ఎస్వీ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేశారు. రాయలసీమ ఫ్యాక్షనిజంపై ఉస్మానియా యూనివర్సిటీకి పరిశోధనా పత్రం సమర్పించారు.  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బీసీల సంక్షేమం కోసం కృషి చేశారు. అనేక సమాజిక ఉద్యమాలలో చురుకుగా పని చేసిన అనుభవం ఉంది.  1994లో టీడీపీలో చేరిన ఆయన పార్టీలో అంచలంచలుగా ఎదిగారు.  పార్టీ లీగల్ సెల్ ఆదోని నియోజకవర్గ అధ్యక్షుడుగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధికార ప్రతినిధిగా, మూడు సార్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, మూడు సార్లు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అనేక పదవులు సమర్ధవంతంగా నిర్వహించారు. అంతే కాకుండా దళిత ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా అనేక పదవులు నిర్వహించారు. కర్నూలు లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా 2004, 2014లలో పోటీ చేసి ఓడిపోయారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణానికి, బీసీలు, వాల్మీకుల అభ్యున్నతికి, సామాజాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ బుధవారం మధ్యాహ్నం 2.34 గంటలకు శాసనసభ ప్రాంగణంలో  ఆయన చేత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయిస్తారు.

Apr 12, 2019

అభివృద్ధికి అవార్డులే నిదర్శనం!
Ø 700పైగా అవార్డులు అందుకున్న ఏపీ      
Ø జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
Ø రెండంకెల ఆర్థిక వృద్ధి
Ø ప్రగతి పథంలో ఏపీ

             రాజధాని లేకుండాఆర్థిక లోటుతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్లను ఎదుర్కొంటూ అనేక విజయాలను సాధించింది. అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తన సత్తాను చాటుకుంది. ఆర్థిక పరిస్థితులను అదిగమిస్తూ ప్రతి రంగంప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. విభజన చట్టంలోని అనేక అంశాల అమలు విషయంలో కేంద్రం జాప్యం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పలు పనులను కొనసాగిస్తోంది.  ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు,  అధికార యంత్రాంగం పట్టుదలతో అద్వితీయంగా కృషి చేసి లక్ష్యాలను సాధించారు. కొన్ని రంగాల్లో లక్ష్యాలకు మించి విజయం సాధించారు. కృష్ణ-గోదావరి నదుల అనుసందానంతో రాయలసీమకు కూడా సాగు నీరు అందిస్తున్నారు. భూగర్భ జలాలు పెంచడానికి చేపట్టిన చర్యలు ఫలితాలు ఇవ్వడంతో రాయలసీమలో ఉద్యానవన పంటల ఉత్పత్తి పెరిగింది. పారిశ్రామిక వికేంద్రీకరణలో భాగంగా అనంతపురంచిత్తూరువిశాఖపట్నం జిల్లాలతోపాటు ప్రతి జిల్లాలో అనేక పరిశ్రమలు స్థాపించారు. ఉపాధి అవకాశాలు పెరిగాయి.  సరళతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో రాష్ట్రం వరుసగా రెండేళ్ల నుంచి మొదటి స్థానంలో నిలిచింది. కార్పోరేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్ వన్ గా నిలిచినట్లు రిజర్వు బ్యాంకు ఏపీకి అవార్డు అందజేసింది. దీంతో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ఫోకస్ అవుతోంది. పెట్టుబడులు రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. గ్రామీణాభివృద్ధిలో కూడా రాష్ట్రం మొదటి స్థానం సాధించింది.  ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సర్వే ప్రకారం అవినీతి అతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పొందిన 702 అవార్డులే అందుకు నిదర్శనం. దక్షిణ భారతదేశంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది. ఎల్ఈడీ బల్బుల వినియోగంలో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇ-ప్రగతిలో రాష్ట్రం దేశంలో అగ్రభాగాన నిలిచింది. లెడ్ బల్బుల ఏర్పాటులో కూడా రాష్ట్రం ముందుంది. అన్నిశాఖలలో నూరు శాతం డిజిటలైజేషన్ దిశగా పనులు జరుగుతున్నాయి.  ప్రణాళికాబద్దంగా లక్ష్యాలను రూపొందించుకుని స్థిరమైన రెండంకెల వృద్ధి రేటు సాధించింది. మొత్తం జాతీయ స్థూల అదనపు విలువ (జీవీఏ - గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి రేటుతో పోల్చితే రాష్ట్ర జీవీఏ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. సమ్మితళితస్థిరమైన  రెండంకెల వృద్ధిరేటు  లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తూ అనేక విజయాలు సాధించింది. మానవ వనరులుమౌలిక వసతులురాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులురాజకీయ సుస్థిరతపాలనావిధానంవ్యాపార అనుకూల వాతావరణం అనే ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకొని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) సంస్థ దేశవ్యాప్తంగా 2016లో 29 రాష్ట్రాలుఢిల్లీలో సర్వే నిర్వహించింది.  ఆర్థిక పరిస్థితులను పరిశీలించినప్పుడు ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందే వాతావరణం ఉన్నట్లు తేలింది. కార్మికుల లభ్యతకార్గో నిర్వహణసులభతరమైన భూకొనుగోలు కార్యకలాపాలు ఏపీ ప్రధాన బలాలని  సర్వే నివేదికలో ఆ సంస్థ పేర్కొంది.  

          పారిశ్రామిక ప్రగతిఅభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రాతిపదికగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీప్రమోషన్‌ (డిఐపిపి) కార్యాలయం అందించిన తాజా వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ 96.75 శాతం ప్రగతి సూచీని నమోదు చేసుకుంది. భాగస్వామ్య సదస్సుల నిర్వహణఅనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి వేల కోట్ల రూపాయల పెట్టుబుడుల  ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో సులభత వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా ప్రథమ స్థానానికి దూసుకు వెళ్ళిందని డిఐపిపి పేర్కొంది. ఎలక్ట్రానిక్ రంగంలో రాష్ట్రం దూసుకుపోతోంది. దేశంలో తయారయ్యే ప్రతి 10 సెల్‌ఫోన్లలో 3 మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. పేదలకు శాశ్వత గృహాలు నిర్మించాలనే లక్ష్యంతో అత్యధిక ఇళ్లను కట్టించి ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. పంచాయతీరాజ్ఇ-ప్రగతివిద్యుత్గృహ నిర్మానం వంటి రంగంలో రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. దక్షిణ భారతదేశంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది. ఎల్ఈడీ బల్బుల వినియోగంలో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇ-ప్రగతిలో రాష్ట్రం దేశంలో అగ్రభాగాన నిలిచింది. లెడ్ బల్బుల ఏర్పాటులో కూడా రాష్ట్రం ముందుంది. అన్నిశాఖలలో నూరు శాతం డిజిటలైజేషన్ దిశగా పనులు జరుగుతున్నాయి. ఎనర్జీమౌలిక సదుపాయాలుపెట్టుబడుల శాఖ అత్యధికంగా 107 అవార్డులు సాధించి అగ్రభాగాన నిలిచింది. మునిసిపల్ పరిపాలనపట్టణాభివృద్ధి శాఖ 91 అవార్డులుపంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ 82, వైద్య ఆరోగ్య శాఖ 55, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ 38, పాఠశాల విద్యాశాఖ 33, జలవనరుల శాఖ 30, యూత్ అడ్వాన్స్ మెంట్టూరిజం అండ్ కల్చరల్ శాఖ (వైఏటీ అండ్ సీ) 20 అవార్డులు సాధించాయి. ఉపాధి హామీ పథకం అమలులో అనేక విభాగాలలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్ధానంలో నిలిచింది. ఈ నిధులను రాష్ట్రం సమర్థవంతంగా వినియోగించుకొంటూ గ్రామీణులకు ఉపాధి కల్పిస్తూనే స్థిరాస్థిని పెంచుతోంది. కేంద్ర పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ రాష్ట్రాలకు ప్రకటించిన అవార్డులలో అత్యధికంగా ఏపీ సొంతం చేసుకుంది.   గ్రామీణ వ్యాపారవేత్తల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అయిదుగురికిఅనంతపురం జిల్లాకు చెందిన ఒకరికి స్కోచ్‌ అవార్డులు దక్కాయి.  విశాఖలో సొంతంగా స్థలాలు ఉండిఇళ్లు నిర్మించుకోవాలని ఆశగా ఉన్న లబ్దిదారుల కోసం చేసిన వినూత్న ప్రయోగానికి గోల్డెన్ అవార్డ్ వరించింది. లబ్దిదారులకి నేరుగా బ్యాంక్ ద్వారా డబ్బు పంపించడం వంటి ప్రతిభ‌కి ఈ అవార్డ్ వచ్చింది. జాతీయ స్థాయి జల అవార్డులలో ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం దక్కింది. ఈ శాఖకు 30 అవార్డులు వచ్చాయి. నీటి వనరుల విభాగంలో  ఏపీ జల వనరుల శాఖకు కేంద్రం 2019 అవార్డు ప్రకటించింది. భూగర్భజలాల పెంపుపై ఏపికి జాతీయ పురస్కారం లభించింది.  జలవనరుల శాఖ  నైపుణ్యాభివృద్ధి విభాగానికి గ్లోబల్ ప్లాటినమ్ అవార్డు-2019 లభించింది. జల చైతన్యంలోరైతాంగానికి సాధికారత కల్పించడంలోనైపుణ్యాభివృద్ధికి  ఆ శాఖ కృషికి ఈ అవార్డు దక్కింది. భూగర్భ జలాల పెంపులో అనంతపురం జిల్లాకు మొదటి స్థానం,  నదుల పునరుజ్జీవనంలో కర్నూలుకు మొదటి స్థానంవాటర్ రీచార్జిలో విశాఖకు రెండో స్థానం,  రివైవల్ ఆఫ్ వాటర్ విభాగంలో కడప జిల్లాకు మొదటి స్థానం లభించాయి. జిల్లామండల స్థాయిలో నీరు-ప్రగతిపై అవగాహనకు శ్వేతపత్రాలు విడుదల చేసిన జలవనరుల శాఖ కృషిని ఎనర్జీ ఎన్విరాన్‌మెట్ ఫౌండేషన్ ఇండియా గుర్తించి పురస్కారం ప్రకటించింది. ఆంధ్రపదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో 2018కి  ‘ఉత్తమ జాతీయ టూరిజం అవార్డు’ అందుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల జాబితాలో ఆంధ్రప్రదేశ్  నుంచి విజయవాడతిరుపతి,సూళ్లూరుపేటకావలి  నిలిచాయి. కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం ప్రాజెక్టువంశధారఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ తదితర ప్రాజెక్టులకు సంబంధించి తీసుకున్న చర్యలురెవెన్యూ వ్యవస్థలో తీసుకొచ్చిన సరికొత్త విధానాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కెవిఎస్ చక్రధర్ బాబు 2019లో జాతీయస్థాయి ఈ-గవర్నెన్స్‌ అవార్డు అందుకున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏపీ వివిధ రంగాల్లో అనేక అవార్డులు సాధించి ప్రగతిప్రథాన నడుస్తోంది.

-     శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Apr 11, 2019


సంతృప్తికరంగా పోలింగ్
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది
·       6 గంటల వరకు 74 శాతం పోలింగ్
·       25 సంఘటనలు జరిగాయి
·       ఇద్దరు మృతి

           సచివాలయం, ఏప్రిల్ 11: రాష్ట్రంలో పోలింగ్ సంతృప్తికరంగా జరిగినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిపారు. 6 గంటల వరకు 74 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిసిందని, పూర్తి వివరాలు అందవలసి ఉందన్నారు. సాయంత్రం 6 గంటల లోపల పోలింగ్ కేంద్రాలకు వచ్చినవారిని రాత్రి ఎంత సమయం అయినా ఓటు వేయడానికి అనుమతిస్తారని చెప్పారు. నక్సల్  ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.  పోలీస్ నివేదిక ప్రకారం ఘర్షణలు, రాళ్లు విసురుకోవడం వంటి సంఘటనలు రాష్ట్రంలో 25 జరిగినట్లు వివరించారు. ఇద్దరు మృతి చెందినట్లు చెప్పారు. పోల్ డైరీ, వెబ్ క్యాస్టింగ్, వీడియో రికార్డింగ్ ల ఆధారంగా రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడు, జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదికలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి తగు చర్యల నిమిత్తమై పంపుతారని చెప్పారు.  ఈ మొత్తం అంశంపై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవలసి ఉంటుందని తెలిపారు.  రీపోలింగ్ కు సంబంధించి తుది నిర్ణయం ఈసీఐ తీసుకుంటుందని చెప్పారు.
                 రాష్ట్ర వ్యాప్తంగా 45,959 పోలింగ్ బూత్ లు ఉన్నాయని చెప్పారు.  మాక్ పోలింగ్ తరువాత ఈవీఎంలలోని డేటా తీసివేయని కేసులు ఆరు నమోదైనట్లు తెలిపారు. విధుల నిర్వహణలో బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లు రుజువైతే, ఎన్నికల నియమావళిని అనుసరించి వారిపై చర్యలు తీసుకుంటారన్నారు.  ఈవీఎంల విధ్వంసానికి సంబంధించి ఏడు కేసులు నమోదైనట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 3 గంటల తరువాత పోలింగ్ జరగలేదని సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారి పరిశీలన నిమిత్తం పంపామని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.  

Apr 10, 2019

ఓటరే అత్యంత శక్తిమంతుడు


         
రామాయణ మహా కావ్యంలో హనుమంతుడు తన శక్తియుక్తులతో సీతారాముల శోకాన్ని పోగొట్టి లక్ష్మణుడి ప్రాణాలను నిలబెట్టాడు. కాని అతనికి తన బలం ఎంతటిదో తెలియదని అంటారు. అలాగే మన దేశంలోని ఓటర్ కు తన ఓటు విలువ, దాని శక్తి తెలియడంలేదు. ప్రజాస్వామ్యంలో ఓటరే అత్యంత శక్తిమంతుడు.  ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా అతని ఒక్కడికే సాధ్యం. మన దేశంలో అయిదేళ్లకు ఒకసారి మన పాలకులను మనమే ఎన్నుకునే అవకాశం వస్తుంది. అలాంటి సువర్ణ అవకాశం 2019 ఏప్రిల్ 11న మనకి వచ్చింది.  ఎటువంటి పాలకుడు కావాలో ఓటర్లే నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మన హక్కు.  ‘‘నేను నా దేశ ప్రజల చేతికి అదునైన కత్తి ఏదీ ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే. అది కత్తికంటే పదునైనది’’ అని భారత రాజ్యాంగ రచనలో కీలక భూమిక పోషించన అంబేద్కర్ ఆనాడే చెప్పారు. ఆయనే రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనను పూర్తి చేసిన 1949 నవంబర్‌ 26న ‘1950 జనవరి 26న మనం వైరుధ్యాల మయమయిన జీవితంలోకి
ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. ఆర్థిక జీవనంలో అసమానత ఉంటుంది. రాజకీయంగా ఒక మనిషికి ఒకే ఓటుఒక ఓటుకి ఒకే విలువ. ఆర్థిక రాజకీయ వ్యవస్థ వల్ల మన సామాజికఆర్థిక జీవనంలో మనం ఒక మనిషికి ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించి తీరాలి. లేకపోతేఎంతో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అనుభవిస్తున్నవారు ధ్వంసం చేస్తారు’’ అని పేర్కొన్నారు. అంటే ఓటు అనేది ఓ తిరుగులేని ఆయుధం.  ఓటరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అప్పుడే ఉత్తమమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఓటరు నాడిని అంచనా వేయడానికి దేశంలో, రాష్ట్రంలో అనేక సర్వేలు చేస్తున్నారు. ఒక సర్వేవికి మరొక సర్వేకి పొంతనే లేదు. అంటే ఈ సారి దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఓటర్ ఆలోచన తెలుసుకోవడం సాధ్యం కావడంలేదని అర్ధమవుతోంది. మన రాష్ట్రం విషయానికి వస్తే శాసనసభ స్థానాలు 175 ఉన్నాయి. వాటిలో ఒక సర్వే ప్రకారం టీడీపీకి 45 నుంచి 54, వైఎస్ఆర్ సీపీకి 121 నుంచి 130, మరో సర్వే ప్రకారం టీడీపీకి 125, వైఎస్ఆర్ సీపీకి 45, జనసేనకు 5 వస్తాయని, ఇంకో సర్వే ప్రకారం టీడీపీకి 101, వైఎస్ఆర్ సీపీకి 29, 45 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని వెల్లడించారు. మరో సంస్థ సర్వేలో టీడీపీ 17, వైఎస్ఆర్ సీపీ 158 స్థానాలు గెలుచుకుంటుందని తేల్చింది. లోక్ సభ స్థానాలు 25 ఉన్నాయి. వాటిలో ఒక సర్వే ప్రకారం టీడీపీకి 18, వైఎస్ఆర్ సీపీకి 6, ఒక స్థానంలో గట్టి పోటీ ఉంటుందని తేల్చారు. ఇంకో సర్వే ప్రకారం టీడీపికి 20, వైఎస్ఆర్ సీపీకి 4, జన సేన ఒకటి, మరొక సర్వే టీడీపీ 4, వైఎస్ఆర్ సీపీకి 21 వస్తాయని వెల్లడించారు. ఈ విధంగా ఒక సర్వేకి మరో సర్వేకి పొంతనలేదు. ఓటర్ అభిప్రాయం తెలుసుకోవడానికి ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు. దేశమంతటా వాటి గురించే చర్చ. సర్వేల ఫలితాలు పార్టీల నేతల్లో దడ పుట్టిస్తున్నాయి. దాంతో వారి మేనిఫెస్టోలలో హామీలు గుప్పించేస్తున్నారు.  అంటే ఓటుకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్ధం చేసుకోవాలి. అధికారంలో ఎవరు ఉండాలో నిర్ణయించేది ఈ ఓటే. తన బలం తనికి తెలియకపోతే సింహం కూడా కుక్కలా చెప్పిన మాట వింటుంది. అదే విధంగా ఓటర్  కులంమతండబ్బు వంటి ప్రలోభాల మాయలోపడి తన ఓటు ఎంత శక్తివంతమైనదో తెలుసుకోలేకపోవడం, దాదాపు 40 శాతం మంది బద్దకించి ఓటు వేయకపోవడం బాధాకరం. ఈ నేపధ్యంలో పౌరులకు ఓటు విలువ గురించి తెలియజెప్పడానికి ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా చట్టం తీసుకుకావడం ఉత్తమం. అప్పుడు ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు వేయడానికి ముందుకు వస్తారు.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


Apr 6, 2019


జనాభాలో, ఓటర్లలో
తూర్పు ఫస్ట్ – గుంటూరు సెకండ్
v యువ ఓటర్లలో  గుంటూరు టాప్
v ఈ ఎన్నికల్లో  వృద్ధుల ఓట్లే కీలకం     
                      
  రాష్ట్రంలోని జనాభా, ఓటర్ల గణాంకాల వివరాల ప్రకారం చాలా అంశాలలో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంటే, గుంటూరు జిల్లా రెండవ స్థానంలో ఉంది. ఓటర్లు, పురుష, మహిళా ఓటర్లు, జనాభా, పురుష, మహిళా జనాభా విషయంలో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంటే, గుంటూరు జిల్లా రెండవ స్థానంలో ఉంది. అయితే 18-19 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్ల విషయంలో మొత్తం 10,15,219 మంది ఉండగా గుంటూరు మొదటి (1,01,189) స్థానంలో, కర్నూలు ద్వితీయ(99,442), కృష్ణా జిల్లా తృతీయ (97,935) స్థానంలో ఉన్నాయి. స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తిలో వెయ్యి మంది పురుషులకు 1046 మంది స్త్రీలతో గుంటూరు మొదటి స్థానంలో, నెల్లూరు ద్వితీయ (1039), కృష్ణా తృతీయ (1031) స్థానంలో ఉన్నాయి. 2019 మార్చి 25 నాటికి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,93,45,717 మంది ఉండగా, 42,04,436 మందితో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో, 39, 74, 491 మందితో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో, 35,78,458 మందితో విశాఖపట్నం జిల్లా తృతీయ స్థానంలో ఉన్నాయి. మహిళా ఓటర్లు మొత్తం 1,98,79,421 మంది ఉండగా,  21,23,332 మందితో తూర్పుగోదావరి జిల్లా, 20,31,269 మందితో గుంటూరు, 18,02,631 మందితో విశాఖపట్నం, పురుష ఓటర్లు మొత్తం 1,94,62,339 మంది ఉండగా, 20,80,751 మందితో తూర్పుగోదావరి జిల్లా, 19,42,760 మందితో గుంటూరు జిల్లా, 17,75,630 మందితో విశాఖపట్నం జిల్లాలు వరుసగా మొదటి మూడు స్థానాలలో నిలిచాయి. స్త్రీ – పురుష ఓటర్ల నిష్పత్తిలో వెయ్యి మంది పురుషులకు గుంటూరులో 1046 స్త్రీలు ఉండగా, నెల్లూరులో 1,039 మంది, కృష్ణా జిల్లాలో 1,031 మంది ఉన్నారు.  సర్వీస్ ఓట్లు మొత్తం 56,908 ఉండగా, 15,140తో శ్రీకాకుళం మొదటి స్థానంలో,7,297తో ప్రకాశం ద్వితీయ స్థానంలో, 6,158తో విశాఖపట్నం జిల్లా తృతీయ స్థానంలో ఉన్నాయి. థర్డ్ జండర్ ఓట్లు మొత్తం 3,957 ఉండగా, 533తో కర్నూలు, 462తో గుంటూరు, 374తో నెల్లూరు వరుసగా మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. విదేశీ ఓట్లు మొత్తం 5,323 ఉండగా, 1,068 ఓట్లతో కడప, 879తో గుంటూరు, 839 ఓట్లతో కృష్ణా జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయి.

జనాభాలో తూర్పు, గుంటూరు, కృష్ణా
           2019 జనాభా లెక్కల(అంచనా) ప్రకారం రాష్ట్రంలో 5,30,01,971 మంది జనాభా ఉండగా, 54,96,839 మందితో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 52,69,062 మందితో గుంటూరు జిల్లా ద్వితీయ, 47,24,006 మందితో కృష్ణా జిల్లా తృతీయ స్థానంలో ఉన్నాయి. పురుషలు 27,29,597, స్త్రీలు 27,67,242తో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో, పురుషులు 26,30,881, స్త్రీలు 26,38,180తో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో, పురుషులు 23,53,757, స్త్రీలు 23,70,249తో కృష్ణా జిల్లా 3వ స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం పురుషులు 2,64,42,077 మంది, స్త్రీలు 2,65,59,894 మంది, అంటే పురుషుల కంటే స్త్రీలు 1,17,817 మంది ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో పురుష ఓటర్లు 1,94,62,339 మంది ఉండగా, స్ల్రీ ఓటర్లు 1,98,79,421 మంది, అంటే పురుషుల కంటే స్త్రీ ఓటర్లు 4,17,082 మంది ఎక్కువగా ఉన్నారు. జనాభాలో లక్షా 17 వేల మంది స్త్రీలు ఎక్కువగా ఉంటే, ఓటర్ల వద్దకు వచ్చేసరికి 4 లక్షల 17 వేల మంది అధికంగా ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం పురుషులకంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారని అర్ధమవుతోంది. యువత, మధ్య వయసు వారికంటే వృద్ధులే ఓపికతో పోలింగ్ బూత్ ల వద్ద వెళ్లి ఓట్లు వేస్తారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకునేవారు  54,28,247 మంది ఉన్నారు. వారిలో వృద్ధులే అధిక సంఖ్యలో ఉంటారు.  ఈ ఎన్నికలలో వృద్ధులు, వృద్ధ మహిళల ఓట్లు కీలకంగా ఉంటాయి.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...