Apr 24, 2019

బీసీ లపై కక్షకట్టిన ఏపీపీఎస్సీ



బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన ఆగ్రహం
         
అమరావతి, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) బీసీ యువతపై కక్ష కట్టి తీవ్ర అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ వ్యతిరేక వర్గాల వారు వెనుకబడిన తరగతుల (బీసీ) వారికి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీలో,  లబ్ది పొందే అనేక చోట్ల బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసే చర్యల వల్ల ఇలా జరుగుతోంది. రిజర్వేషన్లు చట్టప్రకారం సక్రమంగా అమలు చేయకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అని తెలిసి కూడా వారు బీసీ వర్గాల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి విషయాలలో  ఏపీపీఎస్సీ ముందుంది. బీసీలకు చట్ట ప్రకారం రావలసిన ఉద్యోగ అవకాశాలను రాకుండా ఏపీపీఎస్సీ తను ఇష్టానుసారం నిబంధనలు రూపొందిస్తోంది. గతంలో కూడా తొలుత రిజర్వేషన్ ఖాళీలను భర్తీ చేసి, తరువాత ఓపెన్ కేటగిరీ పోస్టులను భర్తీ చేశారు. ఆ విధంగా చేయడం వల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపిక కావలసిన బీసీ అభ్యర్థులు కూడా బీసీ కేటగిరిలో ఎంపికయ్యారు. ఆ తరువాత అవకాశాలను బీసీ అభ్యర్థులు నష్టపోయారని ఆయన వివరించారు. ఇప్పుడు కూడా బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగే విధంగా ఏపీపీఎస్సీ నిబంధనలు రూపొందించినట్లు తెలిపారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు జారీ చేసిన నోటిఫికేషన్  బీసీలను విభజించే ధోరణిలో ఉంది. మెయిన్ కు అర్హత సాధించడానికి నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ లో ఓసీలకు కట్ ఆఫ్ మార్క్స్ 150 కి 52.70గా నిర్ణయించింది. బీసీ-, బీ, డీ గ్రూపులకు కూడా ఎటువంటి మినహాయింపు ఇవ్వకుండా అవే కటాఫ్ మార్కులుగా నిర్ణయించింది. బీసీ-సీ కి 30.74 మార్కులు, బీసీ-ఇ కి 43.92గా నిర్ణయించింది. ఈ విధంగా బీసీ-, బీ, డీ గ్రూపుల వారికి ఏపీపీఎస్సీ అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ గ్రూపు కులాల వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు.  రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ సౌకర్యానికి విఘాతం కలిగించడమేనన్నారు. ఓసీలతో సమానంగా కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించడం అన్యాం అన్నారు.  వయసు మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు మినహాయింపు ఇచ్చారని, మార్కుల విషయంలో ఈ విధంగా వ్యవహరించారన్నారు. బీసీ గ్రూపులలో ఈ విధమైన విభజన తీసుకురావడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. బీసీ అభ్యర్థులకు ఈ రకంగా అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోం అని ఆయన హెచ్చరించారు.  మెయిన్ కు అర్హత మార్కులను బీసీ-, బీ, డీ గ్రూపుల వారికి తగ్గించాలని శంకర రావు డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...