Apr 10, 2019

ఓటరే అత్యంత శక్తిమంతుడు


         
రామాయణ మహా కావ్యంలో హనుమంతుడు తన శక్తియుక్తులతో సీతారాముల శోకాన్ని పోగొట్టి లక్ష్మణుడి ప్రాణాలను నిలబెట్టాడు. కాని అతనికి తన బలం ఎంతటిదో తెలియదని అంటారు. అలాగే మన దేశంలోని ఓటర్ కు తన ఓటు విలువ, దాని శక్తి తెలియడంలేదు. ప్రజాస్వామ్యంలో ఓటరే అత్యంత శక్తిమంతుడు.  ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా అతని ఒక్కడికే సాధ్యం. మన దేశంలో అయిదేళ్లకు ఒకసారి మన పాలకులను మనమే ఎన్నుకునే అవకాశం వస్తుంది. అలాంటి సువర్ణ అవకాశం 2019 ఏప్రిల్ 11న మనకి వచ్చింది.  ఎటువంటి పాలకుడు కావాలో ఓటర్లే నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మన హక్కు.  ‘‘నేను నా దేశ ప్రజల చేతికి అదునైన కత్తి ఏదీ ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే. అది కత్తికంటే పదునైనది’’ అని భారత రాజ్యాంగ రచనలో కీలక భూమిక పోషించన అంబేద్కర్ ఆనాడే చెప్పారు. ఆయనే రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనను పూర్తి చేసిన 1949 నవంబర్‌ 26న ‘1950 జనవరి 26న మనం వైరుధ్యాల మయమయిన జీవితంలోకి
ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. ఆర్థిక జీవనంలో అసమానత ఉంటుంది. రాజకీయంగా ఒక మనిషికి ఒకే ఓటుఒక ఓటుకి ఒకే విలువ. ఆర్థిక రాజకీయ వ్యవస్థ వల్ల మన సామాజికఆర్థిక జీవనంలో మనం ఒక మనిషికి ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తూనే ఉంటాం. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా తొలగించి తీరాలి. లేకపోతేఎంతో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలు అనుభవిస్తున్నవారు ధ్వంసం చేస్తారు’’ అని పేర్కొన్నారు. అంటే ఓటు అనేది ఓ తిరుగులేని ఆయుధం.  ఓటరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అప్పుడే ఉత్తమమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఓటరు నాడిని అంచనా వేయడానికి దేశంలో, రాష్ట్రంలో అనేక సర్వేలు చేస్తున్నారు. ఒక సర్వేవికి మరొక సర్వేకి పొంతనే లేదు. అంటే ఈ సారి దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఓటర్ ఆలోచన తెలుసుకోవడం సాధ్యం కావడంలేదని అర్ధమవుతోంది. మన రాష్ట్రం విషయానికి వస్తే శాసనసభ స్థానాలు 175 ఉన్నాయి. వాటిలో ఒక సర్వే ప్రకారం టీడీపీకి 45 నుంచి 54, వైఎస్ఆర్ సీపీకి 121 నుంచి 130, మరో సర్వే ప్రకారం టీడీపీకి 125, వైఎస్ఆర్ సీపీకి 45, జనసేనకు 5 వస్తాయని, ఇంకో సర్వే ప్రకారం టీడీపీకి 101, వైఎస్ఆర్ సీపీకి 29, 45 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని వెల్లడించారు. మరో సంస్థ సర్వేలో టీడీపీ 17, వైఎస్ఆర్ సీపీ 158 స్థానాలు గెలుచుకుంటుందని తేల్చింది. లోక్ సభ స్థానాలు 25 ఉన్నాయి. వాటిలో ఒక సర్వే ప్రకారం టీడీపీకి 18, వైఎస్ఆర్ సీపీకి 6, ఒక స్థానంలో గట్టి పోటీ ఉంటుందని తేల్చారు. ఇంకో సర్వే ప్రకారం టీడీపికి 20, వైఎస్ఆర్ సీపీకి 4, జన సేన ఒకటి, మరొక సర్వే టీడీపీ 4, వైఎస్ఆర్ సీపీకి 21 వస్తాయని వెల్లడించారు. ఈ విధంగా ఒక సర్వేకి మరో సర్వేకి పొంతనలేదు. ఓటర్ అభిప్రాయం తెలుసుకోవడానికి ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ సర్వేలు నిర్వహిస్తున్నారు. దేశమంతటా వాటి గురించే చర్చ. సర్వేల ఫలితాలు పార్టీల నేతల్లో దడ పుట్టిస్తున్నాయి. దాంతో వారి మేనిఫెస్టోలలో హామీలు గుప్పించేస్తున్నారు.  అంటే ఓటుకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్ధం చేసుకోవాలి. అధికారంలో ఎవరు ఉండాలో నిర్ణయించేది ఈ ఓటే. తన బలం తనికి తెలియకపోతే సింహం కూడా కుక్కలా చెప్పిన మాట వింటుంది. అదే విధంగా ఓటర్  కులంమతండబ్బు వంటి ప్రలోభాల మాయలోపడి తన ఓటు ఎంత శక్తివంతమైనదో తెలుసుకోలేకపోవడం, దాదాపు 40 శాతం మంది బద్దకించి ఓటు వేయకపోవడం బాధాకరం. ఈ నేపధ్యంలో పౌరులకు ఓటు విలువ గురించి తెలియజెప్పడానికి ఓటు వేయని వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా చట్టం తీసుకుకావడం ఉత్తమం. అప్పుడు ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు వేయడానికి ముందుకు వస్తారు.

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...