Apr 11, 2019


సంతృప్తికరంగా పోలింగ్
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది
·       6 గంటల వరకు 74 శాతం పోలింగ్
·       25 సంఘటనలు జరిగాయి
·       ఇద్దరు మృతి

           సచివాలయం, ఏప్రిల్ 11: రాష్ట్రంలో పోలింగ్ సంతృప్తికరంగా జరిగినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిపారు. 6 గంటల వరకు 74 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిసిందని, పూర్తి వివరాలు అందవలసి ఉందన్నారు. సాయంత్రం 6 గంటల లోపల పోలింగ్ కేంద్రాలకు వచ్చినవారిని రాత్రి ఎంత సమయం అయినా ఓటు వేయడానికి అనుమతిస్తారని చెప్పారు. నక్సల్  ప్రభావిత ప్రాంతాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.  పోలీస్ నివేదిక ప్రకారం ఘర్షణలు, రాళ్లు విసురుకోవడం వంటి సంఘటనలు రాష్ట్రంలో 25 జరిగినట్లు వివరించారు. ఇద్దరు మృతి చెందినట్లు చెప్పారు. పోల్ డైరీ, వెబ్ క్యాస్టింగ్, వీడియో రికార్డింగ్ ల ఆధారంగా రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడు, జిల్లా ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదికలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి తగు చర్యల నిమిత్తమై పంపుతారని చెప్పారు.  ఈ మొత్తం అంశంపై తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవలసి ఉంటుందని తెలిపారు.  రీపోలింగ్ కు సంబంధించి తుది నిర్ణయం ఈసీఐ తీసుకుంటుందని చెప్పారు.
                 రాష్ట్ర వ్యాప్తంగా 45,959 పోలింగ్ బూత్ లు ఉన్నాయని చెప్పారు.  మాక్ పోలింగ్ తరువాత ఈవీఎంలలోని డేటా తీసివేయని కేసులు ఆరు నమోదైనట్లు తెలిపారు. విధుల నిర్వహణలో బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లు రుజువైతే, ఎన్నికల నియమావళిని అనుసరించి వారిపై చర్యలు తీసుకుంటారన్నారు.  ఈవీఎంల విధ్వంసానికి సంబంధించి ఏడు కేసులు నమోదైనట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 3 గంటల తరువాత పోలింగ్ జరగలేదని సమాచారం అందిందని, ఆ సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారి పరిశీలన నిమిత్తం పంపామని గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...