Apr 16, 2019


రేపు బీటీ నాయుడు ప్రమాణస్వీకారం
          
  అమరావతి, ఏప్రిల్ 16: బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, బోయ(వాల్మీకి)ఫెడరేషన్ చైర్మన్ బెందుల తిరుమల నాయుడు (బీటీ నాయుడు) ఈ నెల 17వ తేదీ బుధవారం శాసన మండలి సభ్యుడుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన బీసీలు, ముఖ్యంగా బోయల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ముందుంటారు. ఫ్యాక్షన్ సంస్కృతిలో ఇరువర్గాల తరపున బలైపోయిన బోయల కేసులను ఆయనే  హైకోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ వాదించి, వారికి అండగా నిలిచారు. వాల్మీకి, బోయలను షెడ్యూల్డ్ తెగలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడానికి ఐక్య వాల్మీకి తెగ పోరాట కమిటీ జాతీయ అధ్యక్షుడుగా ఆయన ఎంతో కృషి చేశారు. అహర్నిశలు బీసీల కోసం శ్రమిస్తూ బీసీ నేతగా గుర్తింపు పొందారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజు రామాయణ గ్రంథకర్త, మహాకవి వాల్మీకి జయంతి వేడుకలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక ఆయన కృషి ప్రశంసనీయమైనది. బీటీ నాయుడు సేవలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మార్చి 5న ఆయన శాసన మండలి సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

          కాకతీయ యూనిర్సిటీ నుంచి సైకాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన నాయుడు ఎస్వీ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేశారు. రాయలసీమ ఫ్యాక్షనిజంపై ఉస్మానియా యూనివర్సిటీకి పరిశోధనా పత్రం సమర్పించారు.  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బీసీల సంక్షేమం కోసం కృషి చేశారు. అనేక సమాజిక ఉద్యమాలలో చురుకుగా పని చేసిన అనుభవం ఉంది.  1994లో టీడీపీలో చేరిన ఆయన పార్టీలో అంచలంచలుగా ఎదిగారు.  పార్టీ లీగల్ సెల్ ఆదోని నియోజకవర్గ అధ్యక్షుడుగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధికార ప్రతినిధిగా, మూడు సార్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, మూడు సార్లు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా అనేక పదవులు సమర్ధవంతంగా నిర్వహించారు. అంతే కాకుండా దళిత ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా అనేక పదవులు నిర్వహించారు. కర్నూలు లోక్ సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా 2004, 2014లలో పోటీ చేసి ఓడిపోయారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణానికి, బీసీలు, వాల్మీకుల అభ్యున్నతికి, సామాజాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ బుధవారం మధ్యాహ్నం 2.34 గంటలకు శాసనసభ ప్రాంగణంలో  ఆయన చేత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయిస్తారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...