Aug 31, 2018


మత ఘర్షణలకు దిగజారిన వైసీపీ

ఎస్పీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి విమర్శ
        సచివాలయం, ఆగస్ట్ 31: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి దిగజారిందని ఎస్పీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరులో జరిగిన నారా హమారా-టీడీపీ హమారా బహిరంగ సభలో ఫ్లకార్డులు పట్టుకొని అలజడి సృష్టించిన యువకులు వైసీపి కార్యకర్తలని తెలిపారు. కర్నూలు జిల్లా నుంచి వారిని పంపారని చెప్పారు. అమాయకులైన పేద ముస్లిం మైనార్టీ యువకులను ఉసిగొల్పి గుంటూరు సభలో ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు చేయించారన్నారు. అమాయకులైన ముస్లింలను బలి చేయడానికి వైసీపీ పన్నిన కుట్ర పట్ల రాష్ట్రంలోని ముస్లింలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.   ఇతర పార్టీ బహిరంగ సభలలోకి చొరబడి అలజడి సృష్టించే సాంప్రదాయం మన రాష్ట్రంలో లేదన్నారు. తాము గానీ, ఇతర పార్టీల వారు గానీ, కమ్యూనిస్టులు గానీ అలా చేయరని చెప్పారు. మన రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని, ముస్లింలకు, క్రైస్తవులకు వ్యతిరేక పార్టీగా బిజేపీపై ముద్రపడిందని, అటువంటి పార్టీతో కలిసి వైసీపీ పని చేస్తోందని విమర్శించారు. తమపై ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడానికి ఆ పార్టీ అలా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ ముస్లింల వ్యతిరేక పార్టీ అని వారు గ్రహించారని పేర్కొన్నారు.  సెక్యులర్ అనే పదానికి వైసీపీకి అర్ధం తెలియదన్నారు. టీడీపీ బహిరంగ సభలను విచ్ఛిన్నం చేయడానికి, మత ఘర్షణలు సృష్టించడానికి ఆ పార్టీ దిగజారడం సిగ్గు చేటన్నారు.  టీడీపీ పేదవర్గాల వైపు నిలబడిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అంబేద్కర్ ఆలోచనా విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు.  ముస్లింలు టీడీపీ వైపు ఉన్నారని చెప్పారు.  చంద్రబాబు నాయుడు దేశం మొత్తంలో చక్రం తిప్పుతారన్నారు.

లక్ష మందితో క్రిస్టియన్ మైనార్టీల బహిరంగ సభ
త్వరలో లక్ష మంది క్రిస్టియన్ మైనార్టీలతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జూపూడి తెలిపారు. సభ జరిగే ప్రదేశం, తేదీ చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని చెప్పారు. విద్య, అభివృద్ధి, సంక్షేమం కోసం ఇటువంటి సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవుల నాయకత్వం పెంపొందించడానికి ఇటువంటి సభలు ఉపయోగపడతాయని జూపూడి చెప్పారు.

6న మంత్రి మండలి సమావేశం
                సచివాలయం, ఆగస్ట్ 31: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం సెప్టెంబర్ 6వ తేది గురువారం సాయంత్రం 3 గంటలకు సచివాలయం 1వ బ్లాక్  మొదటి అంతస్తులోని కేబినెట్ సమావేశ హాలులో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Aug 30, 2018


వేగం పుంజుకున్న పంచాయతీరాజ్ శాఖ పనులు
           
   పంచాయతీరాజ్ శాఖలో పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి.-పాలన అమలులోకి రావడంతో ఫైల్స్ అన్ని ఆన్ లైన్ లో వెంటవెంటనే పరిష్కారమవుతున్నాయి. కొన్ని ఫైళ్లకు నిమిషాల్లోనే సమాధానం వెళ్లిపోతోంది.  గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గ్రామీణ రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలకు, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గ్రామాన్ని పచ్చదనంతో నింపడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఈ శాఖలో నిధులు పుష్కలంగా ఉన్నాయి. ఈ శాఖ మంత్రి నారా లోకేష్ తండ్రి మాదిరిగానే చాలా చురుకుగా వ్యవహరిస్తూ అధికారులతోమ అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పనులు చేయిస్తున్నారుఈ ఆర్థిక సంవత్సరంలో బీటీ రోడ్లకు రూ.400 కోట్లు కేటాయించి, రూ.73.43 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. 6,039 కిలోమీటర్ల పొడవైన సిమెంట్ రోడ్లు నిర్మించారు. 3,113 అంగన్ వాడీ కేంద్రాలు, 451 గ్రామ పంచాయతీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 48 స్త్రీ శక్తి 66 చేప పిల్లల పెంపకం చెరువుల పనులు, 80 చేపలు ఎండబెట్టే ఫ్లాట్ ఫారాల పనులు పూర్తి చేశారు. 669 స్మశానాలను అభివృద్ధి చేశారు. చంద్రకాంతి పేరుతో దేశంలోనే మొట్టమొదటగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్ట్ కింద ఈ ఏడాది చివరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఎల్ఈడీ బల్బులు అమరుస్తారు. 23.90 లక్షల ఎల్ఈడీ బల్బులు అమర్చాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో 12.84 లక్షల బల్బులు ఏర్పాటు చేయగా, 3,701 గ్రామ పంచాయతీల్లో వంద శాతం బల్బులు ఏర్పాటు చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు రూ.420 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించి, ఇప్పటి వరకు రూ.32.15 కోట్ల విలువైన పనులు చేశారు. 2వేల గ్రామ పంచాయతీల్లో   ఈ తయారీ కేంద్రాలను నిర్మించారు.  గత సంవత్సరం 759 కేంద్రాలు నిర్మించారు. ఈ ఏడాది చివరకు 9వేల గ్రామాల్లో ఈ కేంద్రాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. వాటర్ షెడ్ పథకం కింద రూ.421 కోట్లతో చెక్ డ్యాంలు, ఊట కుంటలు, నీటి నిల్వ కట్టడాలు వంటి పనులు చేపట్టాలని నిర్ధేశించారు.  ఎన్టీఆర్ జలసిరి పేరుతో ఎస్సీ,ఎస్టీలకు చెందిన బోరు బావులకు విద్యుత్ సౌకర్యం కల్పించి దాదాపు 70వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ పథకం కింద 15వేలకు పైగా సోలార్ పంపుసెట్లు అమర్చి 70 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అనుసంధానంతో   గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా-ఎంజీఎన్ఆర్ఈజీఎస్- మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్) ప్రణాళికను రూపొందించారు.  ఈ ఆర్థిక సంవత్సరం (2018-19)లో వేతనాల కింద రూ. 6 వేల కోట్ల చెల్లించేలా, మెటీరియల్ వాటా కింద రూ.5 వేల కోట్లు సాధించేలా పనులు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే అనుసంధాన శాఖల నుంచి రూ.2,809 కోట్ల నిధులు రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.4940 కోట్ల ఖర్చుతో ఉపాధి హామీ, ఇతర పనులు చేపట్టాలని నిర్ణయించి ఇప్పటి వరకు రూ.2669 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంతో కలిసి రూ.2337 కోట్ల విలువైన పనులు చేయాలని నిర్ణయించారు. రూ.467.39 కోట్ల విలువైన పనులు చేశారు. గిరిజన సంక్షేమ శాఖతో కలిసి రూ.242 కోట్లతో పనులు చేయాలని నిర్ణయించి, రూ.51.47 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఐసీడీఎస్ తో కలిసి రూ.310 కోట్లతో పనులు చేపట్టి, రూ.15.52 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. గృహ నిర్మాణ శాఖతో రూ.2740 కోట్లతో పనులు చేయాలని నిర్ణయించి, రూ.97.47 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఆర్ డబ్ల్యూఎస్ తో కలసి రూ.5.4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్-సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ)తో కలిసి రూ.79.43 కోట్లు , అటవీ శాఖతో కలిసి రూ.42.3 కోట్లు, పశుసంవర్ధక శాఖతో కలిసి రూ.11.7 కోట్లు, పట్టు పరిశ్రమల శాఖతో కలిసి రూ.5.81 కోట్లు, మత్స్య శాఖతో కలిసి రూ. 15.11 కోట్లు, శాప్(ఎస్ఏఏపి-స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)తో కలిసి రూ.3.22 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. 179 పాఠశాలలో ఆట స్థలాలను అభివృద్ధి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పశువులకు 608 నీటి తొట్టెలు నిర్మించారు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పేరిట 16,892 ఎకరాల్లో గడ్డిని పెంచుతున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో 71,437 ఇటుకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి, 1,43,171 మందికి లబ్ధి చేకూర్చారు. ఈ విధంగా గ్రామీణాభివృద్ధికి, గ్రామీణులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి పంచాయతీరాజ్ శాఖ విశేష కృషి చేస్తోంది.
-         శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ - 9440222914

Aug 29, 2018


విజయవాడ-గూడూరు రైల్వే లైన్ నిర్మాణంపై ప్రధాని ఆరా
            సచివాలయం, ఆగస్ట్ 29: రాష్ట్రంలో విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైన్ నిర్మాణ వివరాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహానిని అడిగి  తెలుసుకున్నారు. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. విజయవాడ-గూడూరు మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి, ఇతర చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని లోహాని ప్రధానికి చెప్పారు. ఈ రైల్వే లైన్ పొడవు 288 కిలోమీటర్లని తెలిపారు. ఆ తరువాత ఎన్నోర్-తిరువళ్లూర్-బెంగళూరు-పుదుచ్చేరి-నాగపట్నం-మదురై-టూటికోరన్ గ్యాస్ పైప్ లైన్ గురించి కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎంఎం కుట్టీ ప్రధానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో 1244 కిలోమీటర్ల పొడవున ఈ పైప్ లైన్ నిర్మిస్తారని చెప్పారు. ఈ  పైప్ లైన్ ని 5 దశలలో నిర్మిస్తారని, ఫారెస్ట్ భూమి, ప్రైవేటు భూమికి సంబంధిచి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి పర్యావరణ నివేదిక కూడా రావలసి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ కు  సంబంధించిన ఫారెస్ట్ భూమి, ఇతర భూసేకరణ వివరాలను  ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి దినేష్ కుమార్ ప్రధానికి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

హరికృష్ణ మృతికి మండలి చైర్మన్ ఫరూక్ దిగ్భ్రాంతి
           
  
సచివాలయం, ఆగస్ట్ 29: ప్రముఖ సినీ నటులు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎన్ఎండి ఫరూక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. స్వర్గీయ నందమూరి తారకరావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సందర్భంగా ఆయన పిలుపు మేరకు తాము పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆ నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన చైతన్య రథాన్ని హరికృష్ణ స్వయంగా డ్రైవ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీకి ఎనలేని సేవచేశారన్నారు. హరికృష్ణ తనకు అత్యంత సన్నిహితులని, ఆయన లేని లోటు తనకు వ్యక్తిగతంగానూ, పార్టీకీ తీరనిలోటని ఫరూక్ పేర్కొన్నారు.

నరేగాతో గ్రామీణాభివృద్ధి
v పలు అంశాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం
v 2 ఏళ్లలో 1340 మోడల్ గ్రామాల లక్ష్యం
v భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రాధాన్యత
v 4 ఏళ్లలో రూ.23,141 కోట్ల వ్యయం


            గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా-ఎంజీఎన్ఆర్ఈజీఎస్- మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్) గ్రామీణులకు పని దినాలు కల్పించడంతోపాటు రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. అంతే కాకుండా ఈ పథకం అమలుకు సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోల్చితే   పలు అంశాలలో రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2017-18 సంవత్సరంలో వంద రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాల సంఖ్య(6,33,081) విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా, పశ్చిమ బెంగాల్(5,40,248) రెండవ స్థానంలో, చత్తీస్ గడ్ (3,09,907) మూడవ స్థానంలో నిలిచాయి. పంట సంజీవనిలో ఏపీ మొదటి స్థానంలో, జార్ఖండ్ 2, తెలంగాణ 3వ స్థానంలో ఉన్నాయి. 1,64,023 వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐహెచ్ హెచ్ఎల్-ఇండివిడ్యువల్ హౌస్ హోల్డ్ లిట్రిన్స్) నిర్మించి ఏపీ ప్రథమ స్థానంలో, తమిళనాడు(51,136) 2వ స్థానం, గుజరాత్ (38,650) 3వ స్థానంలో నిలిచాయి. అనుసంధాన శాఖలు రూ.2,646 కోట్లు మెటీరియల్ కు ఖర్చు చేసి ఏపీ మొదటి స్థానంలో, రూ.1,847 కోట్లో పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో, రూ.1,549 కోట్లతో మధ్య ప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నాయిఈ పథకం కింద రూ.6,149 కోట్లు ఖర్చు చేసి రెండవ స్థానంలో నిలిచింది. అలాగే వర్మీ కంపోస్ట్ గుంతల సంఖ్యలో, అంగన్ వాడీ కేంద్రాల సంఖ్యలో, రోడ్డుకు ఇరువైపుల మొక్కల పెంపకంలో రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉంది. ఈ పథకానికి సంబంధించి మొత్తం 10 సూచికల్లో నాలుగింటిలో మొదటి స్థానం, మరో 4లో 2వ స్థానం, ఇంకో రెండు సూచికల్లో ఏపీ 4వ స్థానం సాధించింది.

           పేదవారికి ఒకొక్కరికి ఏడాదికి కనీసం 100 రోజులు, కరువు సమయంలో 150 రోజుల పనిదినాలు తగ్గకుండా ఉపాధి కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోంది. 153 రకాల కార్యకలాపాలకు ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఉంది.  గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, స్థిర ఆస్తులు సమకూర్చడం, పేదలకు మెరుగైన జీవన వనరులు సమకూర్చడం, పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం వంటి పలు కార్యక్రమాలను నరేగా నిధులతో చేపడుతున్నారు. ఈ నిధులతో గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, తాగునీరు, అంగన్‌వాడి భవనాల నిర్మాణం... వంటి మౌలిక వసతుల కల్పన పెద్దఎత్తున చేపట్టారు.  అలాగే చెరువులు, పంట సంజీవని కుంటల తవ్వకం, చిన్నచిన్న కాలువలు, చెరువుల్లో పూడిక తీయడం, అడవుల పెంపకం, మొక్కలు నాటటం, గ్రామీణ రహదారుల నిర్మాణం, శ్మశానాల మరమ్మతులు, గ్రామాల్లో సామాజిక అవసరాలకు ఉపయోగపడేవిధంగా పంచాయతీ భవనాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలకు ఇప్పటికే వందల సంఖ్యలో శాశ్విత భవనాలు నిర్మించారు. ఇంకా అనేక భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ పథకం నిధులతో గృహ నిర్మాణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పాఠశాల విద్య, మత్స్య, పశు సంవర్ధక, జల వనరులు, సెర్ప్, మెప్మా, వ్యవసాయ, ఉద్యాన శాఖ తదితర శాఖలు పనులు చేయిస్తున్నారు. మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం షెడ్లు, పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణం, ఆట స్థలాలు ఆటలకు అనువుగా అభివృద్ధి చేయడం, గోవులకు  గోకులంనిర్మాణాలు చేపట్టారు.
               రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. గ్రామాలలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.  తక్కువ సమయంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు.   పథకం నిధులతో రెండేళ్లలో రాష్ట్రంలో 1340 మోడల్ గ్రామాలను అభివృద్ధి చేయాలన్నది ఆయన లక్ష్యం. ఆ దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లాలోని జగన్నాథపురం, సింగరాజుపాలెం తదితర 11 గ్రామాల్లో పూర్తిగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామాన్ని లోకేష్ దత్తత తీసుకొని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. ఆ గ్రామంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను కూడా పూర్తి చేశారు.
4 ఏళ్లలో రూ.23,141 కోట్ల వ్యయం
               ఈ పథకం కింద నాలుగేళ్ల 3 నెలల్లో అంటే 2014-15 నుంచి 2018-19 ఆగస్ట్ వరకు రాష్ట్రంలో రూ.23,141.35 కోట్లు ఖర్చు చేశారు. 92.38 కోట్ల పనిదినాలు కల్పించారు. వేతనాల కింద రూ.13,284 కోట్లు చెల్లించారు. మెటీరియల్ కు రూ. 8,541.19 కోట్లు వ్యయం చేశారు. 3.70 కోట్ల కుటుంబాలకు పని కల్పించారు. పంట సంజీవనీ పథకం కింద 5,60,654 సేద్యపు నీటి కుంటలు, 14,28,565 ఇంకుడు గుంటలు తవ్వారు. 8,43,070 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. 5,092 అంగన్ వాడీ కేంద్రాలు, 1,906 గ్రామ పంచాయతీ భవనాలు, 369 మండల స్త్రీ శక్తి భవనాలు నిర్మించారు. 18,857 కిలోమీటర్ల సిసి రోడ్లు వేశారు. ఈ విధంగా ఈ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి జరుగుతోంది.   
-         శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ - 9440222914

Aug 28, 2018


అమరావతి బాండ్లకు అద్వితీయ స్పందన
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
Ø ఒక్క రూపాయి అవినీతి జరిగిందని రుజువు చేసినా రాజీనామాకు సిద్ధం
Ø పెరిగిన రాష్ట్ర ఇమేజ్
Ø రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు వ్యాపార దిగ్గజాలు సిద్ధం
Ø పెట్టుబడి పెట్టడానికి విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి

              సచివాలయం, ఆగస్ట్ 28: అమరావతి బాండ్లకు బొంబాయి స్టాక్ ఎక్ఛ్సేంజ్(బీఎస్సీ) లో అద్వితీయమైన స్పందన వచ్చినట్లు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2 వేల కోట్ల విలువ గల బాండ్లు జారీ చేసిన గంట వ్యవధిలోనే బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరింనట్లు చెప్పారు. ఆశించిన దానికంటే ఒకటిన్నర రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యిందని తెలిపారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే ఇంత స్పందన వచ్చిందన్నారు.  ఇది గొప్ప విజయంగా పేర్కొన్నారు.  బాండ్ల విడుదలతో జాతీయ, అంతర్జాతీయ మదుపరుల్లో రాష్ట్ర ఇమేజ్ పెరిగిందని చెప్పారు. ముంబాయ్ లో సోమవారం జరిగిన బాండ్ల లిస్టింగ్‌ (బాండ్లను కొనుగోలు చేసిన సంస్థలకు స్టాక్‌ మార్కెట్‌లో ఇతరులకు విక్రయించుకునే వీలు కల్పించడం) కార్యక్రమానికి దేశంలోని వ్యాపార దిగ్గజాలు హాజరైనట్లు తెలిపారు. ముఖేష్ అంబానీ, గోద్రోజ్, కుమార మంగళం బిర్లా, మహేంద్ర గ్రూప్ ప్రతినిధులు, బీకే గోయంకా, రహేజా సంస్థ ప్రతినిధులు వంటి వారు అనేక మంది వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రతిఒక్కరూ ఆసక్తి కనబరిచినట్లు తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులు కూడా లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నారని చెప్పారు.
           రాష్ట్రం విడిపోయిన క్లిష్టమైన పరిస్థితులలో రాజధాని నిర్మాణానికి హామీ మేరకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే అవకాశం ఉన్న అన్ని మార్గాలలో నిధులు సమీకరిస్తోందన్నారు. అందులో భాగంగానే బాండ్లు విడుదల చేసినట్లు తెలిపారు. కేంద్రం సాయం చేయకపోయినా చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారు ఓర్వలేకోతున్నారన్నారు. ఈర్ష్యతో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేంద్రం లక్షల కోట్లు సేకరించే చోట, సెబి వంటి స్వతంత్ర సంస్థ బాండ్ల విడుదలను నియంత్రిస్తుందని, ఇటువంటి కార్యక్రమంలో అవినీతి ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. బాండ్ల విడుదల వ్యవహారం అంతా పారదర్శకంగా జరిగినట్లు తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు రుజువు చేసినా తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రుజువు చేయలేని పక్షంలో ఆయన రాజీనామా చేస్తారా? కనీసం క్షమాపణలైనా చెబుతారా? అని అడిగారు. ఎందుకు ఇలా విషయం కక్కుతున్నారో అర్ధం కావడంలేదన్నారు. ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారు నష్టపోతారని చెబుతున్నారని, వారు ఎలా నష్టపోతారని ప్రశ్నించారు.
              అనీల్ అంబానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని, భారత దేశ ఇమేజ్ దిగజారిందని చెప్పారు. అటువంటి కంపెనీలకే కేంద్రం డిఫెన్స్ కు సంబంధించిన భారీ కాంట్రాక్టులు ఇస్తూ సపోర్ట్ గా ఉంటుందన్నారు. గుజరాత్ లో నష్టాల్లో, పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిన జీఎస్పీసీని   ఓఎన్జీసి చేత కొనుగోలు చేయించారని పేర్కొన్నారు.   బీహార్ లో శ్రీజమ్ స్కామ్ భారీ స్థాయిలో జరిగిందని చెప్పారు. జీవిఎల్ వంటి వారు అటువంటి అంశాలను ప్రశ్నించరన్నారు.
             బాండ్ల వడ్డీ రేటు, ఎరేంజర్ ఫీపై కూడా అర్ధంపర్ధంలేని విమర్శలు చేస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారమే ఆ చెల్లింపులు జరిగాయని, ఎక్కువ ఇవ్వడంలేదని తెలిపారు. సంస్థల రేటింగ్ ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తారని చెప్పారు. ట్రిపుల్ ఏ, డబుల్ ఏ, ఏ, ఏ ప్లస్ వంటి రేటింగ్ లు ఆదారంగా వడ్డీ రేటు ఉంటుదని తెలిపారు. ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న పవర్ గ్రిడ్, ఆర్ఇసీ వంటి రూ.20 వేల కోట్లు రిజర్వు ఫండ్స్ ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూడు నెలల క్రితం 9.49 శాతం వడ్డీ రేటుతో బాండ్లు విడుదల చేసినట్లు వివరించారు.  నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీఎస్పీసీ విస్తరణ కోసం రూ.1000 కోట్లకు బాండ్లు విడుదల చేశారని, వాటి వడ్డీ రేటు 10.45 శాతం అని, ఎరేంజర్ ఫీ 1.5 శాతం అని తెలిపారు. వాటి కాల పరిమితి 60 ఏళ్లని చెప్పారు. ఆ తరువాత జీఎస్సీసి గ్యాస్ పంపిణీ కోసం విడుదల చేసిన బాండ్లకు వడ్డీ రేటు 10.30 శాతం, ఎరేంజర్ ఫీ 1.5 శాతం అని తెలిపారు. అమరావతి కోసం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టాక్స్ ఫ్రీ బాండ్లకు అనుమతి ఇవ్వమంటే కేంద్రం ఇవ్వడంలేదని చెప్పారు. 2014 నుంచి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రం విడిపోయిన నేపధ్యంలో ప్రత్యేక అంశంగా భావించి అనుమతి ఇవ్వవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు.  ఎన్ హెచ్ఏ, పవర్ ఫైనాన్స్ వంటి సంస్థలకు టాక్స్ ఫ్రీ బాండ్లకు అనుమతి ఇస్తుందన్నారు.   ఆర్థిక అంశాలు తెలియకుండా విమర్శించడం మానుకోవాలని సలహా ఇచ్చారు. తెలిసీ తెలియకుండా ఆరోపణలు చేయడం తప్పన్నారు. ఆర్థిక అంశాలను నేర్చుకోవాలని, అవసరమైతే నేర్పుతామని చెప్పారు. ఆర్థిక అంశాలపై శిక్షణకు సెబి నేతృత్వంలో కార్యక్రమాలు కూడా కేంద్రం నిర్వర్తిస్తోందన్నారు.

                 దేశంలోని అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ అమరావతి అని కుటుంబరావు  తెలిపారు.  రాజధాని అమరావతి ప్రాజెక్ట్ మొదటి దశ నిర్మాణ వ్యయం రూ.48,115 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 56 ప్రాజెక్టులని, వాటిలో 36 మొదలయ్యాయని తెలిపారు. అమరావతి అభివృద్ధి పనులను చేపట్టడంలోగానీ, నిధులు సమకూర్చుకోవడంలో గానీ  సీఆర్డీఏ సమర్థవంతంగా వ్యవహరిస్తోందన్నారు. చేయగలిగిన పనులను దృష్టిలోపెట్టుకొని మాత్రమే సీఆర్డీఏ విడతలవారీగా అప్పులు సేకరిస్తోందని చెప్పారు. నిధుల కొరత లేకుండా రోడ్ మ్యాప్ రూపొందించుకున్నట్లు తెలిపారు. తక్కువ కాలంలో ఎక్కువ నిధులు సేకరిస్తోందని చెప్పారు.  వచ్చే ఏడాది నుంచి సీఆర్డీఏకు ఆదాయం కూడా మొదలవుతుందని చెప్పారు. ప్లాట్లు పంపిణీ చేస్తున్నారని, యూజర్, అనుమతుల ఛార్జీలు వస్తాయని, అది స్వయంసమృద్ధి దిశగా వెళుతోందన్నారు.

        పీడీ ఖాతాలను కూడా తరచూ విమర్శించడం అలవాటైపోయిందన్నారు. రాష్ట్రంలో సీఎఫ్ఎంఎస్ (సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ) విధానం ద్వారా ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై విమర్శలలో కూడా వాస్తవం లేదన్నారు. ఒక్క నెలకు మించి బకాయిలు పెండింగ్ లో లేవని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఉందని చెప్పారు. బయటివారికే నమ్మకంలేదన్నారు. అమరావతి నగరం అద్వితీయంగా రూపొందుతుందని కుటుంబరావు చెప్పారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...