Mar 13, 2017

అమరావతికి ఐటీ కంపెనీల రాక

   ü ఒకే రోజు 8 కంపెనీలను ప్రారంభించిన సీఎం
ü కీలక పాత్ర పోషిస్తున్న ఏపీఎన్ఆర్టీ
ü వందల కోట్ల పెట్టుబడులతో వేల మందికి ఉపాధి
ü మైక్రోసాఫ్ట్, హెచ్ సీఎల్ కూడా వచ్చే అవకాశాలు
ü ఐటీ ఉద్యోగాల కోసం అభ్యర్థులకు వెబ్ సైట్

           
నూతన రాజధాని అమరావతికి ఐటీ కంపెనీల రాక మొదలైంది. గత నెల 17వ తేదీ ఒక్క రోజే విజయవాడలో అత్యాధునికంగా నిర్మించిన ఇండ్ వెల్ స్క్వేర్ భవనంలో 8 కంపెనీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కంపెనీల ద్వారా 650 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. త్వరలో మరో 20 కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత మరో వంద కంపెనీల వరకు ఇక్కడ స్థాపించడానికి ప్రవాస ఆంధ్రులు ఆసక్తి చూపుతున్నాను.  ఐటీ కంపెనీలు, ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) కంపెనీల రాకకు, పెట్టుబడులు రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగువారి సొసైటీ(ఏపీఎన్ఆర్టీ) కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పుతూ వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి, వేల మందికి ఉపాధి కల్పించడానికి ఏపీఎన్ఆర్టీ ప్రణాళికలు రూపొందించుకుంది. ప్రభుత్వ సలహాదారుడైన డాక్టర్ రవి వేమూరి అధ్యక్షులుగా పూర్తీగా ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్షలేని సొసైటీగా దీనిని ఏర్పాటు చేశారు. 2016 మేలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పల్లె రఘునాథ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన ఈ సొసైటీలో 83 దేశాలకు చెందిన 32వేల మంది సభ్యులుగా ఉన్నారు. దీని ప్రధాన కార్యాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. 192 మంది అంతర్జాతీయ కోఆర్డినేటర్లు, ఆరుగురు ప్రాంతీయ అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు. ఈ సొసైటీ ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు ప్రవాస తెలుగువారికి మధ్య వారధిలా పని చేస్తోంది. ప్రవాస తెలుగువారికి పలు రకాల సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాస తెలుగువారిని ప్రోత్సహిస్తోంది. ముందుకు వచ్చినవారికి పెట్టుబడులకు సంబంధించిన, న్యాయపరమైన సలహాలు, బ్యాంకింగ్ సేవలు అందజేస్తోంది. పరిశ్రమల స్థాపనలో వివిధ ప్రక్రియలలో వారికి సహాయ సహకారాలు అందజేస్తోంది. వారు స్వదేశానికి వచ్చే సమయంలో ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ దగ్గర నుంచి హోటల్ రూమ్స్, క్యాబ్స్ బుకింగ్, దేవాలయాల సందర్శనలకు సహాయపడుతోంది. ప్రవాస తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో కూడా ఈ సొసైటీ సహకారం అందిస్తుంది.  డాక్యుమెంట్లు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు, పాస్ పోర్టు, ఓటర్ కార్డు వంటి వాటిని పోగొట్టుకున్నప్పుడు వాటిని వెతికే విషయంలో ఈ సొసైటీకి సంబంధించిన బృందం సహాయపడుతుంది. వారి సమయం వృధాకాకుండా చూస్తుంది. అంతేకాకుండా స్మార్ట్ విలేజ్ కార్యక్రమాలలో వారు పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తోంది. గత నవంబర్ వరకు విశాఖపట్నంలో  ప్రవాస తెలుగువారు 9 ఐటీ కంపెనీలను స్థాపించారు. ఆ కంపెనీల (డీజిట్, ఎవాల్యూట్, నెట్ వర్క్ ఆబ్జెక్ట్, రిసికార్ప, కైరోస్,అంజూర్,ప్రిమస్,ఫ్యాబిట్,థాట్ వేవ్) ద్వారా 430 మందికి ఉపాధి లభిస్తోంది.

విజయవాడలో యాక్సెల్‌ ఐటీ, హార్జన్‌ ఐటీ, ఎంఎస్‌ఆర్‌ కాస్మోస్‌, అడాప్ట్‌ సొల్యూషన్స్‌, అడ్వాన్స్‌ సాప్ట్‌, ఇంటెల్లి సాఫ్ట్‌, టైమ్‌స్క్వేరిట్‌ వంటి ఐటీ కంపెనీలను ప్రారంభించారు. అమెరికా నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను కూడా ఏపీఎన్‌ఆర్టీయే సమకూర్చనుంది.  ఈ కంపెనీల్లో పనిచేయడానికి అనుకూలంగా ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు తగి శిక్షణ ఇప్పించేందుకు మరో 14 కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలను ఇక్కడ  ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలకు మంగళగిరి వద్ద ఉన్న ఐటీ టవర్‌లో స్థలం కేటాయించారు. ప్రస్తుతం ప్రారంభించిన ఐటీ కంపెనీలకు కావలసిన అభ్యర్థులను ఎంపిచేసి వారికి శిక్షణ ఇస్తారు. మూడు మాసాల్లో శిక్షణ పూర్తి చేసి జూన్‌ నాటికి వారు ఆయా కంపెనీల్లో ఉద్యోగాలుగా చేరే అవకాశం ఉంది. అభ్యర్థులు ఐటీసిఇఎన్ టీఆర్ఏఎల్.ఐఎన్( itcentral.in) అనే వెబ్ సైట్ ని ఓపెన్ చేసి తమ దరకాస్తుని పోస్ట్ చేయాలి.  అర్హులైన అభ్యర్థులను వారు ఇంటర్వ్యూకు పిలిచి, ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు.  అమరావతిని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతి నగరాన్ని పెద్ద ఐటీ హబ్‌గా రూపొందిస్తే  ఇంజినీరింగ్‌ యువతకు స్థానికంగానే ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్ రప్టివ్ సాఫ్ట్ వేర్, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ వంటి సంస్థలు ప్రారంభించారు. అత్యధిక మంది రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు.
రూ.201.50 కోట్ల పెట్టుబడితో 2615 మందికి ఉపాధి
          అమరావతి ఇండస్ట్రియల్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలలో దాదాపు రూ.201.50 కోట్ల పెట్టుబడులు, వర్కింగ్ క్యాపిటల్ తో 75 పరిశ్రమలను నెలకొల్పనున్నారు. వీటి ద్వారా 2615 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ పరిశ్రమల స్థాపనకు 6348.50 యూనిట్ల హెచ్ పీ విద్యుత్, 8,96,976 గ్యాలన్ల నీరు అవసరం ఉంటుందని వారు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వాటిలో లక్ష్మీ ప్లాస్టిక్స్, సంజయ్ టెక్నికల్ సర్వీసెస్, శ్రీభరణి ఎంటర్ ప్రైజెస్, సీ అండ్ ఎన్ ఇండస్ట్రీస్, ఎస్వీ పాలిమర్స్,మార్క్ ఆంగ్రో ఇండస్ట్రీస్, గౌతమ్ ఇండస్ట్రీస్, జీఎస్ ఎలక్ట్రికల్స్ వంటి కంపెనీలు  ఉన్నాయి. నాలుగు ఐటీ, ఒక ఆటోమొబైల్ కంపెనీలు విశాఖపట్నంలో తమ యూనిట్లను స్థాపించడానికి వచ్చే ఫిబ్రవరిలో పనులను ప్రారంభిస్తాయి. ఈ యూనిట్ల ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆటోమోటిక్ రోబోటిక్స్ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడితో ప్రెసిసింగ్ ఇంజన్ టెస్టింగ్ అండ్ డెవలప్ మెంట్ యూనిట్ ని స్థాపించాలన్న యోచనలో ఉంది. ఈ యూనిట్ స్థాపిస్తే 400 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అమరావతి, విశాఖలలో వచ్చే మార్చిలో 14 ఐటీ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక అంశాలలో  శిక్షణ ఇస్తారు.
ఇంతే కాకుండా దేశంలో ఐటి దిగ్గజాల్లో ఒకటైన అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కూడా ఇక్కడ తమ యూనిట్ స్థాపించే ప్రయత్నంలో ఉంది.  తమ అతిపెద్ద డెవలప్ మెంట్ సెంటర్లలో ఒకదాన్ని ఇక్కడ 30 ఎకరాల స్థలంలో నిర్మించాలన్న ఆలోచనతో ఆ కంపెనీ ఉంది. ఇందు కోసం  ఆ కంపెనీ దాదాపు రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టే అవకాశం ఉంది. ఈ విషయమై ఆ కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా తమ యూనిట్ ను  అమరావతిలో స్థాపించే అవకాశం ఉంది. ఈ విషయమై ఏపీకే చెందిన ఆ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్లతో సీఎం చంద్రబాబు నాయుడు పలుసార్ల చర్చలు జరిపారు. ఎలాగైనా ఆ కంపెనీని ఇక్కడకు తీసుకురావాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. ఈ కంపెనీలన్నీ అమరావతి వస్తే ఇది పెద్ద సాఫ్ట్ వేర్ హబ్ గా రూపొందే అవకాశం ఉంది. అలాగే వేల మంది యువతకు ఉపాధి లభిస్తుంది.

-                                                                              శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

Mar 9, 2017

ఫలితాల ఆధారిత బడ్జెట్

Ø 2017-18  బడ్జెట్ 13న ప్రవేశపెట్టే అవకాశం
Ø వినూత్న విధానంలో బడ్జెట్
Ø 7 మిషన్ల ప్రాతిపధికగా లక్ష్యాల నిర్ధేశం
Ø యువతకు, ఆడబిడ్డలకు కొత్త పథకాలు
Ø  ఇ-ప్రగతి నామ సంవత్సరంగా ప్రకటన
Ø అవసరాలే కొలమానంగా కేటాయింపులు
Ø ప్రణాళిక-ప్రణాళికేతర విభజనలేదు
Ø ప్రతి కుటుంబం రూ. 10 వేల ఆదాయమే లక్ష్యం         
వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) ఫలితాల ఆధారిత బడ్జెట్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  మానవాభివృద్ధి సూచికకు దేశంలో కేరళను, ప్రపంచ స్థాయిలో నార్వే దేశాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6 శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  13న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఫలితాలు రాబట్టేదిగా, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు బడ్జెట్ అంచనాలు సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. నిధుల ఏకీకరణ, మళ్లింపుతో ఇప్పటివరకు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను అధిగమించింది. గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కనిపిస్తోంది. ఈ సారి కూడా కొత్త శాసనసభలో ప్రవేశపెట్టే బడ్జెట్ అదే పంథాలో ఉండే అవకాశం ఉంది. సమర్థ నీటి వినియోగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్థ సంవత్సరంలో వ్యవసాయంలో వృద్ధి రేటు 24.5 శాతం నమోదైంది. వచ్చే ఏడాది వ్యవసాయ రంగం 25 శాతం, అనుబంధ రంగాలు 30 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించారు. అంతేకాకుండా 7 మిషన్ల ప్రాతిపధికగా లక్ష్యాలు, ఫలితాలు  నిర్ధేశించుకొని బడ్జెట్ ను  తయారు చేయనున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన కష్టాలను అధిగమించి, అభివృద్ధి సాధించేందుకు మిషన్ మోడ్ తో పని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక రంగ మిషన్, సామాజిక, పారిశ్రామిక, సేవా రంగాలతోపాటు మౌలికసదుపాయాలు, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి మిషన్ మొత్తం ఏడు మిషన్లతో ఈ ప్రభుత్వం  కొత్త శకం ప్రారంభించింది. నవ్యాంధ్రప్రదేశ్ నిలదొక్కుకొని అగ్రస్థానానికి ఎగబాగటానికి మరో నాలుగేళ్ల సమయం పడుతుందని అంచనా.
          పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో సుస్థిరమైన సమ్మిళిత వృద్ధి సాధించడంతోపాటు అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో మిషన్ల విధానాన్ని తీసుకువచ్చారు. 7 మిషన్లకు సంబంధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలను విశ్లేషించుకుంటూ, 2017-18 బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నారు. ఫలిత ఆధారిత బడ్జెట్ గా అంచనాలు, లక్ష్యాలలో స్పష్టత ఉండేవిధంగా అన్ని శాఖలు జాగ్రత్త వహిస్తున్నాయి.  ప్రతి శాఖను ఇ-ప్రగతితో అనుసంధానించడం ద్వారా జవాబుదారీతనం ఉండాలనేది ప్రభుత్వ అభిప్రాయం. అన్ని శాఖల్లో సంపూర్ణ పారదర్శకత కోసం 2017-18 సంవత్సరాన్ని ప్రభుత్వం ఇ-ప్రగతి నామ సంవత్సరంగా ప్రకటించింది. అభివృద్ధికి ఆర్ధికలోటు అనేది ఆటంకం కాకుండా శాఖలు పరిపుష్టం కావాడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖలు సుస్థిర స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆదాయవనరులు పెంపొందించుకునే విధంగా ప్రణాళికా రచన చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నిధుల సమీకరణ కోసం జలవనరుల అభివృద్ధి కార్పోరేషన్, రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పోరేషన్, రైతు సాధికార సంస్థ, మహిళా సాధికార సంస్థ, మునిసిపట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ మొత్తం ఆ సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు.

         సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో తొమ్మిది పట్టణాభివృద్ధికి సంబంధించినవే వున్నాయి.   వాటిలో నూరు శాతం ఫలితాలు సాధించేందుకు పురపాలకశాఖ దృష్టి పెట్టింది. అమృత్ పథకం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వినియోగించుకుని పట్టణాలు అభివృద్ధి చెందేలా వచ్చే  ఆర్ధిక సంవత్సరంలో స్పష్టమైన కార్యాచరణ వుండేవిధంగా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, రహదారుల అనుసంధానం చేయడంతో పాటు అన్ని గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. విద్యావ్యవస్థను సంస్కరించి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు మరింతగా దృష్టిపెట్టేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. విద్యారంగానికి రూ.20 వేల కోట్లు కేటాయించి, అవకాశాలు కల్పించినా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఫలితాలు నిరాశాజనకంగా వున్నాయి.

          అవసరాలే కొలమానంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017-18 బడ్జెట్‌ను ప్రణాళిక-ప్రణాళికేతర పద్దుల కింద విభజించడం లేదు. వినూత్న విధానంలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖలు  తమ అవసరాలకు తగ్గట్టు అంచనాలు రూపొందించారు.  అన్ని శాఖలు తమ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని సంపూర్ణ ఫలితాలు సాధించేలా కేటాయింపులు చేస్తున్నారు.   సంక్షేమం-అభివృద్ధి సమతూకంగా బడ్జెట్ రూపొందిస్తే అందరికి ఆమోదయోగ్యంగా వుంటుందన్నది అందరి అభిప్రాయం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్లు, కాపు-బ్రాహ్మణ కార్పొరేషన్లు, మైనారిటీ సంక్షేమం, వ్యవసాయం, వైద్య-విద్య రంగాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు.  పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి కుటుంబం కనీసం నెలకు రూ. 10 వేల ఆదాయం ఆర్జించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడాలన్నది  ప్రభుత్వ లక్ష్యం.   2018 డిసెంబర్ నాటికి అన్ని రంగాల్లో స్పష్టమైన ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో ప్రవేశ పెట్టనున్న కొత్త  బడ్జెట్ చాలా కీలకం కానుంది.
            కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు బడ్జెట్లు  ప్రవేశపెట్టారు. ఇది మూడవ బడ్జెట్. ఇందు లో  యువతకు, ఆడబిడ్డల కోసం కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధి స్పష్టంగా కనిపించేలా ఈ బడ్జెట్ ను రూపొందించనున్నారు. కొత్త బడ్జెట్ రూ.1,46,833 కోట్లతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయం తగ్గుతుందని, రుణ చెల్లింపులు పెరుగతాయన్నది ఆర్థిక శాఖ అంచనా. కేంద్ర వనరులపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుదన్న అభిప్రాయం కూడా ఉంది. 2016-17తో పోలిస్తే బడ్జెట్‌ పరిమాణం 7.55 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. 2015-16తో పోలిస్తే 2016-17 బడ్జెట్‌ పరిమాణం ఏకంగా 20.9 శాతం పెరిగింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల బడ్జెట్‌ పరిమాణం తగ్గనుందని తెలుస్తోంది.

     కేంద్ర పథకాల ద్వారా ఎక్కువ నిధులను తెచ్చుకోవలసిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర వార్షిక బడ్జెట్ ఇప్పటికే పార్లమెంట్ లో ప్రవేశపెట్టినందున, దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ కు రూపకల్పన జరుగుతోంది.   కేంద్ర పథకాల్లో 60:40 నిష్పత్తిలో నిధులు వస్తాయి. ఉపాధి హామీ తరహాలో డిమాండ్‌ ఆధారంగా మరికొన్ని నిధులు వస్తాయి. ఇవి కాకుండా కేంద్ర అథారిటీల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆయా మార్గాల్లో గ్రాంట్లు గానీ, తక్కువ వడ్డీతో రుణాలు గానీ, ఎంత వీలైతే అంత తెచ్చుకొనేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. కేంద్రం అమలు చేస్తున్న 73 పథకాలతో లక్ష్య సాధనను నిర్దేశించుకొని, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. 153 రకాల ప్రభుత్వ కార్యకలాపాలను నరేగా(జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) నిధులతో ఏకీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా ఈ సారి రూ.7500 కోట్లు ఖర్చుచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అలాగే. స్వచ్ఛ భారత ఫండ్‌ను ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక శాఖ వద్ద రూ.40 వేల కోట్ల కార్పస్‌ ఉంది. కేంద్ర పథకాలకు కేటాయించిన నిధుల్లో ఏ శాఖ ఎంత అవకాశం ఉంటే ఆ మేరకు నిధులు తెచ్చుకునే విధంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయిస్తే దేశ జనాభాలో 4.43 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు.  ఆ దామాషా ప్రకారం నిధులు తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

-                                                   శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Mar 6, 2017

ఫైబర్ గ్రిడ్ ద్వారా సాంకేతిక విప్లవం

ü ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్
ü రాష్ట్రంలో 17 సీసీసీలు
ü అమరావతి, విశాఖపట్నంలలో డేటా సెంటర్లు

     
    ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవం మొదలైంది.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్‌ సేవల తొలి దశ పూర్తి అయింది. మొదట ఫైబర్ నెట్ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో జనవరిలో మొదలయ్యాయి. ఏపీఎస్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి. మొదట ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలతోపాటు 1200 ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ సేవలు అందించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలందించడానికి ఏర్పాట్లు చేశారు.  తొలి దశలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎంఎస్ఓ(మల్టీ సిస్టమ్ ఆపరేటర్)లు, ఎల్సీఓల ద్వారా  ఫైబర్ నెట్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం పది లక్షల సీపీఈ బాక్సులకు ఆర్డర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం లక్షకుపైగా కనెక్షన్లు ఇచ్చారు. మార్చి చివరకు పది లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలలో కూడా  ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తారు. విస్తృత స్థాయిలో ఈ సేవలను వినియోగించుకోవాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం లక్షా 30 వేల కనెక్షన్లు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలన్నది లక్ష్యం.

ఈ నేపధ్యంలో ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 13 జిల్లాలతోపాటు ఒక రాష్ట్ర స్థాయి సెంటర్, 3 పోలీస్ కమిషనరేట్ స్థాయి సెంటర్లు మొత్తం 17 ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల సమాచారం ఈ కేంద్రాలకు చేరేవిధంగా ఏర్పాట్లు చేస్తారు.  జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల్లో సీసీసీ ఏర్పాటు చేయడానికి మూడు వేల చదరపు అడుగుల ప్రభుత్వం భవనం సమకూరుస్తారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో కమిషనరేట్ స్థాయిలో సీసీసీలు ఏర్పాటు చేయడానికి అదనంగా మరో 3వేల చదరపు అడుగుల ప్రభుత్వం భవనాలు కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి సీసీసీ ఏర్పాటుకు అమరావతిలో 8 వేల నుంచి పది వేల చదరపు అడుగుల భవనం సమకూరుస్తారు. ప్రతి సీసీసీకి అత్యాధునిక కంప్యూటర్లు, సర్వర్లు, నిఘా కెమేరాలు వంటి వాటిని సమకూరుస్తారు. జిల్లా సీసీసీలు  రాజధాని సీసీసీకి అనుసంధానంగా పని చేస్తుంటాయి. సమాచారం విషయంలో  భవిష్యత్ లో వీటిని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉంది.

అమరావతి, విశాఖలలో డేటా సెంటర్లు
అలాగే రాజధాని అమరావతితోపాటు విశాఖపట్నంలలో రెండు డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో  రాజధానిలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఏపీసీఆర్డీఏ(ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) వారు ఇంట‌ర్నెట్‌ ఇన్నొవేటివ్ జ‌పాన్‌(ఐఐజె) సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధులు అమరావతిలో కూడా పర్యటించారు. వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 9,500 ప్రాంతాలలో 18 వేల సీసీ కెమెరాలు అమర్చుతారు. క్లౌడ్ ప్రాతిపదికన వీసీఎస్(విర్చువల్ క్లాస్ రూమ్ సిస్టమ్)ప్రవేశ పెట్టడానికి 4వేల తరగతి గదులను ఎంపిక చేశారు. దాదాపు 5 వేల పాఠశాలలకు ఫైబర్‌నెట్‌ సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  ఫైబర్ గ్రిడ్ ఫేజ్-1లో భాగంగా దేశ వ్యాప్తంగా 12వేల టెలికమ్ టవర్లను అభివృద్ధి చేస్తారు. ఈ విధంగా ఫైబర్‌నెట్‌ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా  ఇ-ప్రగతిలో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఏర్పడుతుంది.


-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

మిషన్ల ప్రాతిపధికగా 2017-18 బడ్జెట్ లక్ష్యాలు

·       13న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
·       ప్రతి శాఖ ఇ-ప్రగతితో అనుసంధానం
·       యువతకు, ఆడబిడ్డలకు కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం
·       ఒక్కో మిషన్ పై 45 రోజులకు ఒకసారి సమీక్ష
·       ప్రణాళిక-ప్రణాళికేతర విభజనలేదు
·       సుస్థిర సమ్మిళిత వృద్ధే ధ్యేయం
·       సంక్షేమం-అభివృద్ధి సమతూకం
·       బడ్జెట్ పై నోట్ల రద్దు ప్రభావం పడనుందా?
·       పన్నుల ఆదాయం తగ్గే అవకాశం        
      వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) బడ్జెట్ లక్ష్యాలను 7 మిషన్ల ప్రాతిపధికగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయిచింది.  మార్చి 6 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, 13న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఫలితాలు రాబట్టేదిగా, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు ఆయా శాఖాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన కష్టాలను అధిగమించి, అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిషన్ మోడ్ తో పని చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక రంగ మిషన్, సామాజిక, పారిశ్రామిక, సేవా రంగాలతోపాటు మౌలికసదుపాయాలు, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి మిషన్ మొత్తం ఏడు మిషన్లతో ఈ ప్రభుత్వం  కొత్త శకం ప్రారంభించింది. పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో సుస్థిరమైన సమ్మిళిత వృద్ధి సాధించడంతోపాటు అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఈ మిషన్ల విధానాన్ని తీసుకువచ్చారు. 7 మిషన్లకు సంబంధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలను విశ్లేషించుకుంటూ, 2017-18 బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నారు. ఫలిత ఆధారిత బడ్జెట్ గా అంచనాలు, లక్ష్యాలలో స్పష్టత ఉండేవిధంగా అన్ని శాఖలు జాగ్రత్త వహిస్తున్నాయి.  ఇక నుంచి అన్ని మిషన్లపైన 45 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రతి శాఖను ఇ-ప్రగతితో అనుసంధానించడం ద్వారా జవాబుదారీతనం ఉండాలనేది ప్రభుత్వ అభిప్రాయం. అభివృద్ధికి ఆర్ధికలోటు అనేది ఆటంకం కాకుండా శాఖలు పరిపుష్టం కావాడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖలు సుస్థిర స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆదాయవనరులు పెంపొందించుకునే విధంగా ప్రణాళికా రచన చేస్తున్నారు.

         సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో తొమ్మిది పట్టణాభివృద్ధికి సంబంధించినవే వున్నాయి.   వాటిలో నూరు శాతం ఫలితాలు సాధించేందుకు పురపాలకశాఖ దృష్టి పెట్టింది. అమృత్ పథకం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వినియోగించుకుని పట్టణాలు అభివృద్ధి చెందేలా వచ్చే  ఆర్ధిక సంవత్సరంలో స్పష్టమైన కార్యాచరణ వుండేవిధంగా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, రహదారుల అనుసంధానం చేయడంతో పాటు అన్ని గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ వాతావరణం ప్రధాన ఆకర్షణగా అగ్రి టూరిజంను ప్రోత్సహిస్తారు. విద్యావ్యవస్థను సంస్కరించి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు మరింతగా దృష్టిపెట్టేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. విద్యారంగానికి అపార నిధులు, అవకాశాలు కల్పించినా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఫలితాలు నిరాశాజనకంగా వున్నాయన్న భావన పలువురిలో ఉంది. అక్షరాస్యతలో, నాక్ రేటింగ్ లో రాష్ట్రం వెనుకబడి వుండటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి పీఎంకేవీవై (ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన) పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. దానిని మొదటి స్థానంలోకి తీసుకువెళ్లేవిధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన యువతలో కనీసం 50 శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

          అవసరాలే కొలమానంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017-18 బడ్జెట్‌ను ప్రణాళిక-ప్రణాళికేతర పద్దుల కింద విభజించడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖలు  తమ అవసరాలకు తగ్గట్టు అంచనాలు రూపొందించారు.  అన్ని శాఖలు తమ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని సంపూర్ణ ఫలితాలు సాధించేలా కేటాయింపులు చేస్తున్నారు.   సంక్షేమం-అభివృద్ధి సమతూకంగా బడ్జెట్ రూపొందిస్తే అందరికి ఆమోదయోగ్యంగా వుంటుందన్నది అందరి అభిప్రాయం. బడ్జెట్ కేటాయింపుల్లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్లు, కాపు-బ్రాహ్మణ కార్పొరేషన్లు, మైనారిటీ సంక్షేమం, వ్యవసాయం, వైద్య-విద్య రంగాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని నిర్ణయించారు.  పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి కుటుంబం కనీసం నెలకు రూ. 10 వేల ఆదాయం ఆర్జించేందుకు ఈ బడ్జెట్ తోడ్పాటు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.   2018 డిసెంబర్ నాటికి అన్ని రంగాల్లో స్పష్టమైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో  ప్రవేశ పెట్టనున్న కొత్త  బడ్జెట్ చాలా కీలకం కానుంది.
 కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టే ఈ మూడవ బడ్జెట్ లో  రాష్ట్రంలోని యువతకు, ఆడబిడ్డల కోసం కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధి కళ్లకు కట్టేలా ఈ బడ్జెట్ ను రూపొందించనున్నారు. కొత్త బడ్జెట్ రూ.1,46,833 కోట్లతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయం తగ్గుతుందని, రుణ చెల్లింపులు పెరుగతాయన్నది ఆర్థిక శాఖ అంచనా. కేంద్ర వనరులపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుదన్న అభిప్రాయం కూడా ఉంది. 2016-17తో పోలిస్తే బడ్జెట్‌ పరిమాణం 7.55 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. 2015-16తో పోలిస్తే 2016-17 బడ్జెట్‌ పరిమాణం ఏకంగా 20.9 శాతం పెరిగింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల బడ్జెట్‌ పరిమాణం తగ్గనుందని తెలుస్తోంది.

     కేంద్ర పథకాల ద్వారా ఎక్కువ నిధులను తెచ్చుకోవలసిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది.  కేంద్ర పథకాల్లో 60:40 నిష్పత్తిలో నిధులు వస్తాయి. ఉపాధి హామీ తరహాలో డిమాండ్‌ ఆధారంగా మరికొన్ని నిధులు వస్తాయి. ఇవి కాకుండా కేంద్ర అథారిటీల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆయా మార్గాల్లో గ్రాంట్లు గానీ, తక్కువ వడ్డీతో రుణాలు గానీ, ఎంత వీలైతే అంత తెచ్చుకొనేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలను తయారుచేస్తున్నారు. ఢిల్లీతో సంబంధాలు పెంచుకొని ఎక్కువ నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే ఆయా శాఖల అధికారులు ఎంపీలతో కలసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. స్వచ్ఛ భారత ఫండ్‌ను ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక శాఖ వద్ద రూ.40 వేల కోట్ల కార్పస్‌ ఉంది. కేంద్ర పథకాలకు కేటాయించిన నిధుల్లో ఏ శాఖ ఎంత అవకాశం ఉంటే ఆ మేరకు నిధులు తెచ్చుకునే విధంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయిస్తే దేశ జనాభాలో 4.43 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు.  ఆ దామాషా ప్రకారం నిధులు తెచ్చుకునేవిధంగా ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.
 -          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...