Mar 6, 2017

ఫైబర్ గ్రిడ్ ద్వారా సాంకేతిక విప్లవం

ü ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్
ü రాష్ట్రంలో 17 సీసీసీలు
ü అమరావతి, విశాఖపట్నంలలో డేటా సెంటర్లు

     
    ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవం మొదలైంది.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్‌ సేవల తొలి దశ పూర్తి అయింది. మొదట ఫైబర్ నెట్ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో జనవరిలో మొదలయ్యాయి. ఏపీఎస్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి. మొదట ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలతోపాటు 1200 ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ సేవలు అందించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలందించడానికి ఏర్పాట్లు చేశారు.  తొలి దశలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎంఎస్ఓ(మల్టీ సిస్టమ్ ఆపరేటర్)లు, ఎల్సీఓల ద్వారా  ఫైబర్ నెట్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం పది లక్షల సీపీఈ బాక్సులకు ఆర్డర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం లక్షకుపైగా కనెక్షన్లు ఇచ్చారు. మార్చి చివరకు పది లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలలో కూడా  ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తారు. విస్తృత స్థాయిలో ఈ సేవలను వినియోగించుకోవాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం లక్షా 30 వేల కనెక్షన్లు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలన్నది లక్ష్యం.

ఈ నేపధ్యంలో ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 13 జిల్లాలతోపాటు ఒక రాష్ట్ర స్థాయి సెంటర్, 3 పోలీస్ కమిషనరేట్ స్థాయి సెంటర్లు మొత్తం 17 ఏర్పాటు చేస్తారు. అన్ని రకాల సమాచారం ఈ కేంద్రాలకు చేరేవిధంగా ఏర్పాట్లు చేస్తారు.  జిల్లా స్థాయిలో ఆయా జిల్లాల్లో సీసీసీ ఏర్పాటు చేయడానికి మూడు వేల చదరపు అడుగుల ప్రభుత్వం భవనం సమకూరుస్తారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో కమిషనరేట్ స్థాయిలో సీసీసీలు ఏర్పాటు చేయడానికి అదనంగా మరో 3వేల చదరపు అడుగుల ప్రభుత్వం భవనాలు కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి సీసీసీ ఏర్పాటుకు అమరావతిలో 8 వేల నుంచి పది వేల చదరపు అడుగుల భవనం సమకూరుస్తారు. ప్రతి సీసీసీకి అత్యాధునిక కంప్యూటర్లు, సర్వర్లు, నిఘా కెమేరాలు వంటి వాటిని సమకూరుస్తారు. జిల్లా సీసీసీలు  రాజధాని సీసీసీకి అనుసంధానంగా పని చేస్తుంటాయి. సమాచారం విషయంలో  భవిష్యత్ లో వీటిని విస్తృత స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం ఉంది.

అమరావతి, విశాఖలలో డేటా సెంటర్లు
అలాగే రాజధాని అమరావతితోపాటు విశాఖపట్నంలలో రెండు డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో  రాజధానిలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఏపీసీఆర్డీఏ(ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) వారు ఇంట‌ర్నెట్‌ ఇన్నొవేటివ్ జ‌పాన్‌(ఐఐజె) సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ సంస్థ ప్రతినిధులు అమరావతిలో కూడా పర్యటించారు. వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 9,500 ప్రాంతాలలో 18 వేల సీసీ కెమెరాలు అమర్చుతారు. క్లౌడ్ ప్రాతిపదికన వీసీఎస్(విర్చువల్ క్లాస్ రూమ్ సిస్టమ్)ప్రవేశ పెట్టడానికి 4వేల తరగతి గదులను ఎంపిక చేశారు. దాదాపు 5 వేల పాఠశాలలకు ఫైబర్‌నెట్‌ సేవలు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  ఫైబర్ గ్రిడ్ ఫేజ్-1లో భాగంగా దేశ వ్యాప్తంగా 12వేల టెలికమ్ టవర్లను అభివృద్ధి చేస్తారు. ఈ విధంగా ఫైబర్‌నెట్‌ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా  ఇ-ప్రగతిలో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఏర్పడుతుంది.


-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...