Mar 6, 2017

మిషన్ల ప్రాతిపధికగా 2017-18 బడ్జెట్ లక్ష్యాలు

·       13న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
·       ప్రతి శాఖ ఇ-ప్రగతితో అనుసంధానం
·       యువతకు, ఆడబిడ్డలకు కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం
·       ఒక్కో మిషన్ పై 45 రోజులకు ఒకసారి సమీక్ష
·       ప్రణాళిక-ప్రణాళికేతర విభజనలేదు
·       సుస్థిర సమ్మిళిత వృద్ధే ధ్యేయం
·       సంక్షేమం-అభివృద్ధి సమతూకం
·       బడ్జెట్ పై నోట్ల రద్దు ప్రభావం పడనుందా?
·       పన్నుల ఆదాయం తగ్గే అవకాశం        
      వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) బడ్జెట్ లక్ష్యాలను 7 మిషన్ల ప్రాతిపధికగా రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయిచింది.  మార్చి 6 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, 13న బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్ ఫలితాలు రాబట్టేదిగా, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు ఆయా శాఖాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన కష్టాలను అధిగమించి, అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిషన్ మోడ్ తో పని చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక రంగ మిషన్, సామాజిక, పారిశ్రామిక, సేవా రంగాలతోపాటు మౌలికసదుపాయాలు, పట్టణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి మిషన్ మొత్తం ఏడు మిషన్లతో ఈ ప్రభుత్వం  కొత్త శకం ప్రారంభించింది. పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో సుస్థిరమైన సమ్మిళిత వృద్ధి సాధించడంతోపాటు అన్ని రంగాల్లో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఈ మిషన్ల విధానాన్ని తీసుకువచ్చారు. 7 మిషన్లకు సంబంధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ఫలితాలను విశ్లేషించుకుంటూ, 2017-18 బడ్జెట్ అంచనాలను రూపొందిస్తున్నారు. ఫలిత ఆధారిత బడ్జెట్ గా అంచనాలు, లక్ష్యాలలో స్పష్టత ఉండేవిధంగా అన్ని శాఖలు జాగ్రత్త వహిస్తున్నాయి.  ఇక నుంచి అన్ని మిషన్లపైన 45 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రతి శాఖను ఇ-ప్రగతితో అనుసంధానించడం ద్వారా జవాబుదారీతనం ఉండాలనేది ప్రభుత్వ అభిప్రాయం. అభివృద్ధికి ఆర్ధికలోటు అనేది ఆటంకం కాకుండా శాఖలు పరిపుష్టం కావాడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని శాఖలు సుస్థిర స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆదాయవనరులు పెంపొందించుకునే విధంగా ప్రణాళికా రచన చేస్తున్నారు.

         సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో తొమ్మిది పట్టణాభివృద్ధికి సంబంధించినవే వున్నాయి.   వాటిలో నూరు శాతం ఫలితాలు సాధించేందుకు పురపాలకశాఖ దృష్టి పెట్టింది. అమృత్ పథకం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులను పూర్తి స్థాయిలో సంపూర్ణంగా వినియోగించుకుని పట్టణాలు అభివృద్ధి చెందేలా వచ్చే  ఆర్ధిక సంవత్సరంలో స్పష్టమైన కార్యాచరణ వుండేవిధంగా అధికారులు జాగ్రత్తపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, రహదారుల అనుసంధానం చేయడంతో పాటు అన్ని గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్రంలో గ్రామీణ వాతావరణం ప్రధాన ఆకర్షణగా అగ్రి టూరిజంను ప్రోత్సహిస్తారు. విద్యావ్యవస్థను సంస్కరించి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు మరింతగా దృష్టిపెట్టేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. విద్యారంగానికి అపార నిధులు, అవకాశాలు కల్పించినా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటం వల్ల ఫలితాలు నిరాశాజనకంగా వున్నాయన్న భావన పలువురిలో ఉంది. అక్షరాస్యతలో, నాక్ రేటింగ్ లో రాష్ట్రం వెనుకబడి వుండటానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా భావిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి పీఎంకేవీవై (ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన) పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. దానిని మొదటి స్థానంలోకి తీసుకువెళ్లేవిధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన యువతలో కనీసం 50 శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

          అవసరాలే కొలమానంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017-18 బడ్జెట్‌ను ప్రణాళిక-ప్రణాళికేతర పద్దుల కింద విభజించడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖలు  తమ అవసరాలకు తగ్గట్టు అంచనాలు రూపొందించారు.  అన్ని శాఖలు తమ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని సంపూర్ణ ఫలితాలు సాధించేలా కేటాయింపులు చేస్తున్నారు.   సంక్షేమం-అభివృద్ధి సమతూకంగా బడ్జెట్ రూపొందిస్తే అందరికి ఆమోదయోగ్యంగా వుంటుందన్నది అందరి అభిప్రాయం. బడ్జెట్ కేటాయింపుల్లో  ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్లు, కాపు-బ్రాహ్మణ కార్పొరేషన్లు, మైనారిటీ సంక్షేమం, వ్యవసాయం, వైద్య-విద్య రంగాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని నిర్ణయించారు.  పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రతి కుటుంబం కనీసం నెలకు రూ. 10 వేల ఆదాయం ఆర్జించేందుకు ఈ బడ్జెట్ తోడ్పాటు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.   2018 డిసెంబర్ నాటికి అన్ని రంగాల్లో స్పష్టమైన ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో  ప్రవేశ పెట్టనున్న కొత్త  బడ్జెట్ చాలా కీలకం కానుంది.
 కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టే ఈ మూడవ బడ్జెట్ లో  రాష్ట్రంలోని యువతకు, ఆడబిడ్డల కోసం కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధి కళ్లకు కట్టేలా ఈ బడ్జెట్ ను రూపొందించనున్నారు. కొత్త బడ్జెట్ రూ.1,46,833 కోట్లతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయం తగ్గుతుందని, రుణ చెల్లింపులు పెరుగతాయన్నది ఆర్థిక శాఖ అంచనా. కేంద్ర వనరులపై ఎక్కువగా ఆధారపడవలసి ఉంటుదన్న అభిప్రాయం కూడా ఉంది. 2016-17తో పోలిస్తే బడ్జెట్‌ పరిమాణం 7.55 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. 2015-16తో పోలిస్తే 2016-17 బడ్జెట్‌ పరిమాణం ఏకంగా 20.9 శాతం పెరిగింది. పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల బడ్జెట్‌ పరిమాణం తగ్గనుందని తెలుస్తోంది.

     కేంద్ర పథకాల ద్వారా ఎక్కువ నిధులను తెచ్చుకోవలసిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది.  కేంద్ర పథకాల్లో 60:40 నిష్పత్తిలో నిధులు వస్తాయి. ఉపాధి హామీ తరహాలో డిమాండ్‌ ఆధారంగా మరికొన్ని నిధులు వస్తాయి. ఇవి కాకుండా కేంద్ర అథారిటీల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆయా మార్గాల్లో గ్రాంట్లు గానీ, తక్కువ వడ్డీతో రుణాలు గానీ, ఎంత వీలైతే అంత తెచ్చుకొనేవిధంగా ప్రణాళికలు రూపొందించారు. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలను తయారుచేస్తున్నారు. ఢిల్లీతో సంబంధాలు పెంచుకొని ఎక్కువ నిధులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే ఆయా శాఖల అధికారులు ఎంపీలతో కలసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. స్వచ్ఛ భారత ఫండ్‌ను ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక శాఖ వద్ద రూ.40 వేల కోట్ల కార్పస్‌ ఉంది. కేంద్ర పథకాలకు కేటాయించిన నిధుల్లో ఏ శాఖ ఎంత అవకాశం ఉంటే ఆ మేరకు నిధులు తెచ్చుకునే విధంగా ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలను మినహాయిస్తే దేశ జనాభాలో 4.43 శాతం మంది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు.  ఆ దామాషా ప్రకారం నిధులు తెచ్చుకునేవిధంగా ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.
 -          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...