Feb 27, 2017

నరేగా నిధులతో గ్రామీణాభివృద్ధి

Ø 2017-18లో భారీ ప్రతిపాదనలు
Ø నిధుల వినియోగ లక్ష్యం రూ.7500 కోట్లు
Ø 4 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్విత భవనాలు
Ø 4 లక్షల పంట సంజీవని కుంటలు
Ø 3 వేల కిలోమీటర్ల పొడవున మొక్కల  పెంపకం
Ø6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు
Ø 70 మినీ స్టేడియంల నిర్మాణం
Ø 90 లక్షల డ్వాక్రా సభ్యుల భాగస్వామ్యం
Ø ‘పల్లెవనం’ పేరుతో గ్రామాల్లో మొక్కలు

        రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి, ఉపాధి హామీకి నరేగా(ఎంజీఎన్ఆర్ఈజీఎస్- మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ స్కీమ్) అత్యంత ఉపయోగకరంగా ఉంది. దీని ద్వారా గ్రామీణులకు ఉపాధితోపాటు అభివృద్ధి జరుగుతోంది. ఈ నిధులతో గ్రామాల్లో పాఠశాల భవనాలు, సిసి రోడ్లు మొదలైన మౌలిక వసతుల కల్పన పెద్దఎత్తున జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే చెరువులు, పంటసంజీవని కుంటల తవ్వకం, చిన్నచిన్న కాలువలు, చెరువుల్లో పూడిక తీయడం, అడవుల పెంపకం, చెట్లు నాటటం, గ్రామీణ రహదారుల నిర్మాణం, గ్రామాల్లో సామాజిక అవసరాలకు ఉపయోగపడేవిధంగా పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలకు శాశ్విత భవనాలు నిర్మించడం  వంటి  పనులు చేపడతారు.  153 రకాల కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశం ఉన్న ఈ నిధుల వినియోగానికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించేందుకు  త్వరలో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని  ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ నిధులను సమర్ధవంతంగా వినియోగించడానికి, జవాబుదారీతనం వుండేలా ఖర్చు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల ద్వారా  సంపద సృష్టి జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
ఎక్కువ శాఖలు నరేగా నిధులు ఉపయోగించుకుని ఆస్తులు సమకూర్చుకునే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ పథకం అమలులో రాష్ట్రం మెరుగైన పనితీరు కనబరుస్తున్నందుకు కేంద్రం ప్రశంచింది. ఈ నిధులను వినియోగించి ఉపాధి హామీ పనులు కల్పించడంలో రెండవ స్థానంలో ఉన్న ఏపీని మొదటి స్థానానికి తీసుకురావాలన్నది ప్రభుత్వ ప్రధాన ధ్యేయం.

       రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 661 మండలాల్లోని 13,104 గ్రామ పంచాయతీల్లో ఈ ఉపాధి హామీ పనులు చేపట్టారు. ఈ పథకం కింద 84,68,774  జాబ్ కార్డులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నాటికి రాష్ట్రంలో నరేగా కింద 11,54,297 పనులు పూర్తి చేశారు. 5,87,080 పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 17,47,57,199 వ్యక్తిగత పని దినాలు కల్పించారు. కూలీలకు కూలి కింద రూ. 2,471 కోట్లు చెల్లించారు. 37,84,846 కుటుంబాలకు చెందిన 62,09,757 మందికి ఉపాధి కల్పించారు.

      రసాయనిక ఎరువుల వాడకం ద్వారా వ్యవసాయ పంటలు విషపూరితమవుతున్నాయి. వీటిని వినియోగించిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. మోతాదుకు మించి ఎరువులు, పురుగుల మందులు వాడటం వల్ల మన దేశంలో ఉత్పత్తి అయ్యే పండ్లు, మిరపకాయలు, కూరగాయలను కొన్ని దేశాలు తిరస్కరిస్తున్నాయి.  సేంద్రీయ ఎరువుల వాడటం ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడమేకాకుండా పర్యావరణానికి  రక్షణ చేకూరుతుంది. పర్యావరణ సమతౌల్యతను కాపాడుకోగలిగితే అటు పంటలకు, ఇటు ప్రజలకు కూడా అన్ని విధాల ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది.   రసాయనిక ఎరువులు వాడుతూపోతే భూసారం దెబ్బతింటుంది. రానురాను పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది.  ప్రపంచ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సేంద్రీయ వ్యవసాయాన్నే ప్రోత్సహిస్తోంది. సేంద్రీయ వ్యవసాయానికి మించిన మరో ఉత్తమ మార్గంలేదని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఇన్ని  ప్రయోజనాలు ఉన్నందున  రాష్ట్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించింది. ఉత్పత్తిలో సస్య రక్షణ చర్యలు చేపట్టి  నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలని నిర్ణయించింది.  ఇందులో భాగంగా నరేగా నిధులతో భారీ స్థాయిలో వర్మికంపోస్ట్ యూనిట్లను నెలకొల్పేవిధంగా రైతులను ప్రోత్సహిస్తోంది.  వ్యవసాయ -ఉద్యానవ శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, సెర్ప్ సమన్వయంతో వర్మి కంపోస్ట్ తయారీ, సరఫరాకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు.

    ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఆరు వేల కోట్ల రూపాయల నరేగా నిధులు ఖర్చు చేశారు.  వచ్చే అర్థిక సంవత్సరం 2017-18లో రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  లక్ష్యంగా నిర్ణయించారు. ఈ నిధులతో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 4 లక్షల పంట సంజీవని కుంటలు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల వర్మి కంపోస్ట్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. అలాగే  3 వేల కిలోమీటర్ల పొడవున మొక్కల  పెంపకం చేపడతారు.  4 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మించాలని నిర్ణయించారు.  6 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపడతారు.  రెండున్నర లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ధేశించారు.  70 మినీ స్టేడియాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. నరేగా నిధులతో మొక్కల పెంపకాన్ని చేపట్టడం ద్వారా అటు ఉపాధి, ఇటు పచ్చదనం పెంపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అటవీ భూములు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో,  రహదారులకు ఇరువైపులా ఈ నిధులతో మొక్కలు పెంచుతారు.
      నగర వనాలతో ఆశించిన ఫలితాలు లభించాయి. అందువల్లపల్లెవనంపేరుతో గ్రామాల్లో కూడా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.   గ్రీన్ ఫీల్డ్ లక్ష్య సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుంది.   ఉద్యానవన శాఖ అత్యధిక ఫలితాలు సాధిస్తే పర్యావరణానికి  ఎక్కువ మేలు జరుగుతుంది. రైతులు అధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు ఎక్కువ అవకాశం వుంటుంది. నరేగా నిధులను ఖర్చు చేయడం ద్వారా ఈ శాఖ  నూరు శాతం లక్ష్యాలను సాధించడానికి వీలవుతుంది. 
ఈ నిధులు వినియోగించి చేపట్టే ఉపాధి కార్యక్రమాల్లో రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు చెందిన  90 లక్షల మంది సభ్యులను భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆ విధంగా చేస్తే  ప్రతి కుటుంబానికి నెలకు ఖచ్చితంగా రూ. 10 వేల ఆదాయం లభించే అవకాశం లభిస్తుంది.

          ఈ పథకం కింద చేపట్టే పనులను నిధుల కోసం ఆపకుండా, ఆయా శాఖలు తమ వద్ద ఉన్న నిధులను వినియోగించి ఆ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆ తరువాత ఎటూ ఆ నిధులు వస్తాయి కాబట్టి డబ్బు ముందుగా ఖర్చు చేసినా ఆయా శాఖలకు ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రతి శాఖ ఈ నిధుల వినియోగానికి సంబంధించి లక్ష్యాలను నిర్ణయించుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా నరేగా నిధులను సమర్థవంతంగా వినియోగించుకొని సాధ్యమైనంత ఎక్కువమందికి ఉపాధి కల్పించడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తూ పచ్చదనం నింపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...