Feb 6, 2017

మహిళా శక్తి ఒకేచోట ఏకం కానున్న వేళ!

Ø 10 నుంచి 3 రోజులు మహిళా పార్లమెంటేరియన్ సదస్సు
Ø పవిత్ర సంగమం  వద్ద భారీ  ఏర్పాట్లు
Ø దేశవిదేశాలకు చెందిన ప్రముఖ మహిళలు రాక
Ø 15వేల మంది హాజరయ్యే అవకాశం
Ø ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు

         రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సదస్సులను తలదన్నేవిధంగా జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే అధికారులు కృషి చేస్తున్నారు. విజయవాడ కృష్ణా నదీ తీరం ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో మూడు రోజులపాటు ఈ సదస్సు నిర్వహించనున్న విషయం తెలిసిందే.  సమాజంలో అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉన్నత లక్ష్యంతో, స్ఫూర్తి కలిగించి, వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు  దీనిని నిర్వహిస్తున్నారు.  దేశంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే దేశవిదేశాల నుంచి దాదాపు 9వేల మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఈ సంఖ్య 15వేలకు చేరే అవకాశం ఉంది. వీరిలో అత్యధిక మంది విద్యార్థినులు ఉంటారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పూర్తితో చైర్మన్ గా శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, చీఫ్ పేట్రన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,  పేట్రన్ గా ప్రముఖ గాంధేయవాది ఈలా భట్, కన్వీనర్ గా  ప్రముఖ విద్యావేత్త రాహుల్ వి. కరద్  ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.  నూతన రాజధానిలో ఇటువంటి అద్వితీయమైన సదస్సు నిర్వహించడం గొప్ప అవకాశంగా భావించవచ్చు. దీనిని విజయవంతం చేయడానికి విస్తృత స్థాయిలో ప్రచారం కూడా కల్పించారు.  
         సామాజికంగా, వాణిజ్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలు ఎదుగుతున్నారు. పలు రంగాలలో దూసుకుపోతున్నారు. మనదేశంలో వివిధ రంగాల్లో మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్ సభ మాజీ స్పీకర్, మీరాకుమార్, ప్రస్తుత స్పీకర్ సుమిత్రా మహాజన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ, మ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్, మేనకా గాంధీ, స్మృతి ఇరాని, పెప్సికో సీఈఓ ఇంద్రనూయీ, ఎస్ బీఐ చైర్ పర్శన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ సీఈఓ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ ఎండీ శిఖా శర్మ, శ్రీరాం లైఫ్ ఇన్సురెన్స్ ఎండీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అఖిలా శ్రీనివాసన్, బయోకాన్ ఫౌండర్ చైర్మన్ ఎండీ కిరణ్ మజుందార్, లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎండీ ఉషా సంగ్వాన్, వీరే కాకుండా కార్పోరేట్ రంగంలో విజయలక్ష్మీ అయ్యర్, నైనాలాల్ కిద్వాయ్, అర్చనా భార్గవ, శుభలక్ష్మీ పన్సే, కకు నకటే, రేణు చల్లూ,  రోషిణి నాడార్, కీర్తిగా రెడ్డి, నీలం ధావన్, అరుణా జయంతి, దిబ్జానీ ఘోష్, రేఖా ఎం.మీనన్, రూపా కుడ్వా, వనితా నారాయణన్ వంటి వారు బాగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని మహిళలు ఏలుతున్నారు.  అంగ్ సాన్ సూకీ, కిరణ్ బేడీ, తస్లిమా సస్రీన్ వంటి వారితోపాటు సాహిత్యం, సినిమా,  క్రీడలు వంటి రంగాల్లో కూడా మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుతున్నారు.
          ఈ సదస్సుకు హాజరైన మహిళలతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తారు. ఆకాశంలో సగమైన మహిళలకూ బాధ్యతలు, బాధలు,  కోరికలు, ఆలోచనలు, అభిప్రాయాలు, సమస్యలు ఉంటాయి.  అన్ని మతాలు, ప్రాంతాలు, కులాలు, సంస్కృతులు, వివిధ సామాజిక వర్గాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మహిళలందరూ ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే రాజకీయ, విద్య, క్రీడలు, పరిశ్రమలు, మీడియా, సినిమా, కళలు, న్యాయ వ్యవస్థల నుంచి మహిళలతోపాటు విద్యార్థినులు భారీ సంఖ్యలో పాల్గొని వారివారి అనుభవాలను తెలియజేస్తారు. రాజకీయ, పారిశ్రామిక, విద్యా, పరిశోధన, శాస్త్రసాంకేతిక రంగాలలో మహిళల ఎదుగుదలకు గల అవకాశాలను చర్చిస్తారు. అంతేకాకుండా భారతదేశం సుసంపన్నం కావడానికి మహిళా శక్తిని ఏవిధంగా వినియోగించాలి వంటి అంశాలను కూడా తెలియజేస్తారు. జాతీయ స్థాయిలో మహిళలు ఎదుర్కొనే రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలు చర్చించి, వాటిని అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలు, విధివిధానాలు ఈ సమావేశంలో రూపొందిస్తారు. దేశ,విదేశాలకు చెందిన రాజకీయ ప్రతినిధులతోపాటు ప్రముఖ కార్పోరేట్ సంస్థలకు చెందిన మహిళలు కూడా ఈ సదస్సుకు హాజరవుతారు. దేశం నలుమూలల నుంచి 405 మంది మహిళా శాసనసభ్యులు, 92 మంది మహిళా పార్లమెంట్ సభ్యులు, కార్పోరేట్ సంస్థల నుంచి మూడు వందలమందికి పైగా మహిళా ప్రతినిధులు హాజరవుతారు.
        ఈ సదస్సులో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు దలైలామా, రవి శంకర్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ అక్బర్ ఖాన్, యుపిఎస్సీ మాజీ చైర్ పర్సన్ ఆల్కా సిరోహి, ఎమ్మెల్యే అఖిల ప్రియ, అనిత, భారత సంతతికి చెందిన మేరిల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్ సభ్యురాలు, అరుంధతి భట్టాచార్య,  క్రీడాకారిణులు అరుణిమా సిన్హా, పి.వి.సింధు,  మయన్మార్ స్టేట్ కౌన్సెలర్ అంగ్ సాన్ సూకీ, ఎన్డీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్క్తా దత్, చందా కోచర్, భావనా దోషి, దీపా వెంకట్, ఈలా బెన్ భట్, లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్ సన్ సిర్లీఫ్, యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా, హెచ్ ఎస్ బీ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రసిడెంట్ డాక్టర్ గనేష్ నటరాజన్,  ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీ. రోహిణి, ప్రొఫెసర్ హరిదాస్, సచిన్ టెండూల్కర్, ఇందిరా దత్, ఇంద్రనూయి, మనిషా కోయిరాల, జూహీచావ్లా,  ఎంపి కల్వకుంట్ల కవిత, కిరణ్ మజుందార్ షా, కిరణ్ బేడీ, లతా మంగేష్కర్, లలితా కుమార మంగళం, లక్ష్మి అగర్వాల్, నారా బ్రాహ్మణి, నోబెల్ ఫ్రైజ్ విజేత ప్రొఫెసర్ ముహ్మద్ యూనస్, సుధామూర్తి, పద్మశ్రీ వారియర్, సోనాల్ మాన్ సింగ్, సీమా రావు, శైలజా కిరణ్, నందితా దాస్, కేంద్ర మంత్రులు నిర్మాలా సీతారామన్, స్మృతి ఇరాని,  కవితా జైన్, పూసపాటి అశోక్ గజపతి రాజు, వైఎస్ చౌదరి,  రాష్ట్ర మంత్రి పీతల సుజాతలతోపాటు దేశవిదేశాలకు చెందిన పలువురు ప్రముఖ మహిళలు ప్రసంగించే అవకాశం ఉంది. మూడు రోజులపాటు 7 విభాగాలు జరిగే ఈ సదస్సులో వివిధ రంగాలకు చెందిన 60 మంది నిష్ణాతులు తమ విలువైన సందేశాలను ఇస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు వస్తున్నందున ఆ స్థాయిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సదస్సు జరిగే విధంగా  ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇస్తారు.  ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా  జిల్లా అధికారయంత్రాంగంతోపాటు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...