Feb 6, 2017

మూడేళ్లలో అమరావతికి ఒక రూపం


·       నిర్మాణానికి భారీస్థాయిలో దేశ, విదేశీ సంస్థల ఆర్థిక సాయం
·       మెట్రో రైల్ కు రూ.100 కోట్ల కేటాయింపు
·       ప్రపంచ స్థాయి విద్యా కేంద్రం
·       23 గ్రామాల్లో రైతులకు ప్లాట్ల కేటాయింపు
·       పలు సంస్థలకు భూముల కేటాయింపు
·       ప్రధాన ఆర్కిటెక్ట్ ఖరారు - 22న ప్రధాన ఆకృతులు అందజేత
·       హోటళ్లు, పాఠశాలల నిర్మాణానికి టెండర్లు
·       తాజా అంచనాల ప్రకారం నిర్మాణ వ్యయం రూ.58వేల కోట్లు
·       4 వరుసలతో 7 ప్రధాన రోడ్ల నిర్మాణం

       ఆంధ్రప్రదేశ్  నూతన ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి దేశవిదేశాలోని ఆర్థిక సంస్థలు భారీ స్థాయిలో ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. భూ సమీకరణ దాదాపు పూర్తి అయింది. నిధుల సమీకరణ కూడా ఓ కొలిక్కి వచ్చింది. ఇక డిజైన్ల (ఆకృతులు)ను ఆమోదించి నిర్మాణం మొదలుపెట్టడమే మిగిలింది. కృష్ణా నది ఒడ్డున 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టింది. రాష్ట్రంలోని 5.23 కోట్ల మందికి చెందిన ఇంతటి భారీ ప్రాజెక్టు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలన్నింటినీ ప్రభుత్వం తీసుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే అమరావతి బ్రాండ్ నేమ్ ప్రచారం చేయడానికి, పారిశ్రామిక పెట్టుబడులు రాబట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ప్రభుత్వ ప్రతినిధులు అనేకమంది పలు దేశాల పర్యటన ఫలితాలనిస్తోంది. సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, బ్రిటన్, రష్యా, కజకిస్తాన్ వంటి దేశాలు తమ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచలోని పలు ప్రముఖ ఆర్థిక, పారిశ్రామిక, విద్య, వైద్య సంస్థల ప్రతినిధులు ప్రజా రాజధాని అమరావతిని సందర్శించారు. ఇక్కడ పరిస్థితులను పరిశీలించారు. ఇక్కడ చేపట్టే నిర్మాణల గురించి తెలుసుకున్నారు. దీని నిర్మాణంలో అన్నిదశలలో పాలుపొచుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారు.
రూ.58వేల కోట్లు ఖర్చు :     తాజా అంచనాల ప్రకారం రాజధాని నిర్మాణానికి రూ.58వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1425 కోట్లు మాత్రమే సమకూరుస్తుంది. కొంత భాగం కేంద్రం ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే కేంద్రం రూ.2,500 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తం దేశ, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మార్గాలలో నిధుల సేకరణకు ఏపీసీఆర్ డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ) ప్రయత్నాలు చేస్తోంది.  కొన్ని ప్రాజెక్టులను ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతుల్లో మొదలు పెట్టేందుకు ప్రాజెక్టులు, జాతీయ పెట్టుబడి సంస్థల నుంచి అవసరమైన నిధుల సమీకరిస్తారు. అమరావతి నిర్మాణానికి ముందకు వచ్చినవాటిలో ప్రపంచ బ్యాంక్(ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకనస్ట్రక్షన్ అండ్ డవలప్ మెంట్), ఏఐఐబీ(ఆసియా మౌలికవసతుల పెట్టుబడి బ్యాంక్), భారత ప్రభుత్వ సంస్థ హడ్కో(హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) వంటి ఆర్థిక సంస్థలు ఉన్నాయి. అమరావతిలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు మొదటి విడతగా 50 కోట్ల డాలర్లు (సుమారుగా 3350 కోట్లు) రుణం ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టుకి ప్రపంచబ్యాంకు గుర్తింపు నెంబరు కూడా ఇచ్చింది. నెంబరు ఇస్తే ప్రాజెక్టుకి బ్యాంకు దాదాపు ఆమోద ముద్ర వేసినట్లే. హడ్కో రూ.7500 కోట్లు రుణం ఇస్తుంది. హడ్కో వడ్డీ శాతాన్ని కూడా 10.5  నుంచి 9.5 శాతానికి తగ్గించనుంది.  కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) సూచన మేరకు ఇతర మార్గాలలో కూడా నిధులు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాండ్స్ ద్వారా కూడా నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాండ్లు తీసుకునేవారికి పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తారు. బాండ్లు ద్వారా రెండు వేల కోట్ల రూపాయల వరకు సమకూరుతాయని భావిస్తున్నారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మసాలా బాండ్లు(రూపీ-డినామినేటెడ్ బాండ్లు) రూపంలో కూడా నిధులు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలలో రాజధాని నిర్మాణానికి సీఆర్డీఏ నిధులు సమకూర్చుకుంటోంది.
ప్రజా భాగస్వామ్యం: ప్రజారాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలు కూడా భాగస్వాములవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుని అందుకుని ‘నా ఇటుక- నా అమరావతి’ ద్వారా లక్షల మంది విరాళాలు అందజేస్తున్నారు. అమరావతి వెబ్ సైట్ ద్వారా దేశవిదేశాలలోని తెలుగు ప్రజలు ఒక్కో ఇటుక పది రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ‘నా ఇటుక- నా అమరావతి’ ద్వారా ఇప్పటి వరకు రెండు 26 వేల  మందికి పైగా ప్రజలు 56 లక్షలకుపైగా ఇటుకలు కొనుగోలు చేశారు.
23 గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు: ఒక పక్క భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయిస్తూ, మరో పక్క రాజధానిలో భవనాల నిర్మాణానికి డిజైన్లను ఆమోదించడం, రోడ్లు, పాఠశాలల నిర్మాణానికి బిడ్లు పిలవడంలో సీఆర్డీఏ బీజిబీగా ఉంది.  ఇప్పటి వరకు 23 గ్రామాలలోని రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లు పంపిణీ చేశారు.
34,984 ఎకరాల సమీకరణ:  అమరావతి మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారు. 90 శాతం పైగా భూమిని సీఆర్టీఏ స్వాధీనం చేసుకుంది.  రాజధాని పరిధిలో 53,478 ఎకరాల భూమి ఉంది. ఇందులో 37,505 ఎకరాలను లాండ్ పూలింగ్ పథకం కింద సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 34,984 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. కృష్ణా నది ఒడ్డున 15 కిలోమీటర్ల పొడవున 217 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అత్యంత ఆధునిక ప్రభుత్వ భవనాల మాస్టర్ ఆర్కిటెక్ట్ లుగా లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్, మన దేశానికి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ లను ఎంపిక చేశారు. శాసనసభ, హైకోర్టు, ఇతర ప్రధాన ప్రభుత్వ భవనాల ఆకృతుల విషయమై వారితో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.  రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధాన ఆకృతులను నార్మన్ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ వచ్చే నెలలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. మూడేళ్లలో రాజధానికి ఒక రూపం తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.  క్యాపిటల్ జోన్ లో భవనాల కోసం రూ.10,519 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7,390 కోట్లు, భవిష్యత్ అవసరాల కోసం కల్పించవలసిన మౌలిక వసతులకు రూ. 9,181 కోట్లు ఖర్చవుతాయని అంచనా. మిగిలిన ప్రభుత్వ భవనాల ఆర్కిటెక్ట్ ల ఎంపికకు కూడా టెండర్లను పిలిచారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా అత్యంత సౌకర్యవంతంగా ప్రజా రవాణా వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రధానమైన రోడ్లు అన్నిటికి టెండర్లు పిలిచారు. భూగర్భంలో ఈహెచ్ టీ(ఎలక్ట్రానిక్ హై టెక్షన్) కేబుల్ లైన్స్ అమర్చడానికి టెండర్లను త్వరలో పిలుస్తారు.
ప్రపంచ స్థాయి విద్యా కేంద్రం:  రానున్న అయిదేళ్లలో ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి అనుగునంగా రాజధానిలో వివిధ ప్రముఖ విద్య, వైద్య సంస్థలకు భూములు కేటాయించారు. దేశంలో టాప్ 20, ప్రపంచంలో టాప్ 20 విశ్వవిద్యాలయాలను ఏపీకి తీసుకురావల్లన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. ఆ మేరకు ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం, భూములు కేటాయించడం జరిగిపోయాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్), శ్రీరామస్వామి మెమోరియల్ (ఎస్ఆర్ఎం) యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇండో-యుకే హెల్త్ ఇన్ స్టిట్యూట్, డాక్టర్ బీఆర్ శెట్టి మెడికల్ సిటీ వంటి వాటితోపాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారు.  ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్ కు మొదటి దశలో 50,  రెండు దశలో 100 కలిపి మొత్తం 150 ఎకరాలు కేటాయించనున్నారు.  నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ)కి 50 ఎకరాలు, సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ)కి ఐదు ఎకరాలు, ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది.

 హోటళ్లు, పాఠశాలలు, రోడ్ల నిర్మాణానికి టెండర్లు: ప్రముఖ సంస్థలకు భూలు, రైతులకు ప్లాట్ల కేటాయింపు, రోడ్లు, హోటళ్లు, పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పిలవడం, ప్లాన్ల పరిశీలనలో సీఆర్డీఏ నిమగ్నమై ఉంది.  రాజధానిలో రోడ్లు, పాఠశాలలు, స్టార్ హోటళ్లు, హాస్పటళ్లు, ఎంఐసీఈ(మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఈవెంట్స్) సెక్టార్ లో నిర్మాణానికి సీఆర్డీఏ ఆర్.ఎఫ్.పీ.లను ఆహ్వానించింది.  అమరావతి మెట్రో రైల్ నిర్మాణానికి 2017-18 కేంద్ర బడ్జెట్ లో రూ.100 కోట్లు కేటాయించారు. 160కి పైగా ప్రాథమిక పాఠశాలలు, వందకు పైగా ఉన్నత పాఠశాలలు, 27 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. అందులో భాగంగా  జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆరు పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సీఆర్ డీఏ ఆర్ఎఫ్ పీలను ఆహ్వానించింది. అలాగే ఒక 5 స్టార్, ఒక 4 స్టార్, 4 త్రీస్టార్ హోటళ్లకు ఆర్ఎఫ్ పీలను విడుదల చేసింది. రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మరోవైపు నిర్మాణ నాణ్యతకు సంబంధించి యంత్రాల ద్వారా వంద అడుగుల లోతు వరకు మట్టి నమూనాలను కూడా సేకరిస్తున్నారు.  రాజధాని లోపల 320 కిలోమీటర్ల మేర 4 వరుసలతో 7 ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. ఈ రోడ్లకు భూసేకరణ పనులు కూడా మొదలయ్యాయి. 14 నెలల్లో ఈ రోడ్లు నిర్మాణం పూర్తి చేయడానికి సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడే ప్రత్యేక పరిశ్రమగా ఎదుగుతున్న ఎంఐసీఈ రంగంలో కూడా టెండర్లను పిలిచారు. మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ శక్తి వంటి వాటికి త్వరలో టెండర్లు పిలవనున్నారు.  అమరావతిలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల వ్యయంతో అంబేద్కర్ స్మృతి వనం నిర్మిస్తారు. ఇందులోనే బౌద్ధ ధ్యా నకేంద్రం, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటాయి. అంతేకాకుండా విజయవాడ – అమరావతి – గుంటూరు – తెనాలి – కేసీ కెనాల్ మీదగా విజయవాడకు 105 కిలోమీటర్ల పొడవున హై స్పీడ్ సర్క్యులర్ రైలు మార్గం నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది. రూ.10 వేల కోట్లు ఖర్చు కాగల ఈ ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర  ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ పనులన్నీ అనుకున్నట్లుగానే శరవేగంగా జరిగితే మూడేళ్లలో రాజధానికి ఒక రూపం వస్తుంది.

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...