Feb 8, 2017

రాష్ట్రాభివృద్ధిలో కీలకంగా ఎయిర్ పోర్టులు


ü 2020 నాటికి 12 విమానాశ్రయాలు
ü మౌలిక వసతుల్లో భాగంగా కొత్త నిర్మాణాలు
ü భూసేకరణ బాధ్యతలు కలెక్టర్లకు అప్పగింత

        రాష్ట్రం అన్ని రంగాలతోపాటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తూ, కొత్త వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  మౌలిక సదుపాయల కల్పనలో విమానాశ్రయాలు కీలకంగా ఉంటాయి. దానికి తోడు రాష్ట్రం విడిపోయిన తరువాత ఇక్కడ విమానయాన సేవలు విస్తృతమయ్యాయి.  ముందుముందు విమాన సర్వీసుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.  ఈ నేపధ్యంలో 2020 నాటికి రాష్ట్రంలో మొత్తం 12 విమానాశ్రయాలు విమానా రాకపోకలు నిర్వహించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా నిర్మించేవాటికి సంబంధించి భూసేకరణ బాధ్యతలను ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.  రాష్ట్రాన్ని విమానయాన హబ్‌గా రూపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి, గన్నవరం (విజయవాడ), తిరుపతి, కడప విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు నడుస్తున్నాయి.   గన్నవరం విమానాశ్రయంలో ఇన్ టెర్మ టెర్మినల్ భవనాన్ని గత నెలలో ప్రారంభించారు. దీనికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ఇవ్వాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను కోరారు. విశాఖలో కస్టమ్స్ విమానాశ్రయం కూడా ఉంది. ఇది ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో ఉంటుంది. మిగిలినవాటిని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) నిర్వహిస్తోంది. విమానాశ్రయ పరిసరాలలో మొక్కలు పెంచి, పచ్చదనం నింపి అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఏఏఐ నిర్ణయించింది. ఇందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఏఏఐకి సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.  కొత్తగా   విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డు విమానాశ్రయం, విశాఖ-చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ లో నెల్లూరు జిల్లా దగదుర్తి విమానాశ్రయం, కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కొత్తగా నిర్మిస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మిస్తారు. కొత్త విమానాశ్రయాలను పీపీపీ పద్దతిలో నిర్మిస్తారు.  ప్రకాశం జిల్లా దొనకొండలో బ్రిటీష్ కాలంలో ఏర్పాటైన విమానాశ్రయాన్ని పునరుద్దరిస్తారు. దీనిని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్-రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) కింద అభివృద్ధి చేయనుంది.

       మంగళగిరి వద్ద  5వేల ఎకరాలలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం(పీపీపీ)లో అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయిలో నిర్మిస్తారు. సింగపూర్ సంస్థ రూపొందించిన నూతన రాజధాని ముసాయిదా ప్రణాళికలో కూడా దీనిని పేర్కొన్నారు. అయితే దీనికి ఇంకా స్థల నిర్ణయం జరుగలేదు. భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ  గ్రీన్‌ఫీల్డు విమానాశ్రయంగా నిర్మించేందుకు కేంద్ర విమానయాన శాఖ (ఎంఓసీఏ-మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అంగీకారం తెలిపింది. టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ నివేదిక కూడా పూర్తి అయింది. పీపీపీ పద్దతిలో టెండర్లు కూడా పిలిచారు. ఆసక్తి చూపిన బిడ్డర్లతో రెండు సార్లు ప్రీ-బిడ్ మీటింగ్స్ కూడా నిర్వహించారు. వారికి ప్రతిపాదిత స్థలాన్ని కూడా చూపారు. మొత్తం 5,311 ఎకరాల్లో దీనిని నిర్మిస్తారు. ఇప్పటికే ఈ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి 1237.30 ఎకరాల భూమిని అప్పగించారు. మిగిలిన భూసేకరణను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ విమానాశ్రయాన్ని ఆసియా పసిఫిక్‌కు గేట్‌వేగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. విమానయాన రంగానికి సంబంధించిన తయారీ యూనిట్లను దీని చుట్టూ అభివృద్ధి చేస్తారు. విమాన నిర్వహణ, మరమ్మతు (ఎంఆర్‌ఓ) యూనిట్‌ను, మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ కేంద్రం వంటి వాటిని ఏర్పాటుచేస్తారు. రెండు సమాంతర రన్‌వేలు, ఒక ద్వితీయ శ్రేణి రన్‌వే ఉంటాయి.
       దగదర్తి మండలం కేకేగుంట, దామవరం ప్రాంతంలో దస్తగిరి విమానాశ్రయం నిర్మిస్తారు. దీని నిర్మాణానికి కూడా ఎంఓసీఏ అనుమతి లభించింది. టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ నివేదిక  పూర్తి అయింది. బిడ్ల పరిశీలన జరుగుతోంది. దీనికి సంబంధించి పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులను త్వరగా పరిష్కరించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ని ప్రభుత్వం ఆదేశించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కన్నమడకల, ఓర్వకల్లు, పూడిచర్ల గ్రామాల సమీపంలో 1082.36 ఎకరాల పరిధిలో ఓర్వకల్లు విమానాశ్రయాన్ని నిర్మిస్తారు. భూసేకరణ పనులను జిల్లా అధికార యంత్రంగా పూర్తి చేసింది. ఈ గ్రీన్‌ఫీల్డు విమానాశ్రయం నిర్మాణానికి రూ.200 కోట్లు ఆర్థికసాయం అందించేందుకు హుడ్కో సంస్థ ముందుకు వచ్చింది.
        ఓర్వకల్లు  గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ మొదటి ప్యాకేజీలో రన్ వే, ప్రహరీగోడ నిర్మాణం టెండర్ ఖరారైంది. రెండవ ప్యాకేజీలోని విమానాశ్రయ టెర్నినల్ భవనం నిర్మాణ టెండర్ ని త్వరలో పిలుస్తారు. దీనికి సంబంధించిన భూసేకరణ, అప్పగింత కార్యక్రమం త్వరగా పూర్తిచేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు ఉన్నందున ఈ పనులన్నీ చెకచెకా జరుగుతున్నాయి.


       అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఒక ప్రైవేట్ విమానాశ్రయం ఉంది. ఇక్కడ రాకపోకలు కొనసాగుతున్నాయి.  గుంటూరు జిల్లా విజయపురిలో నాగార్జున సాగర్ వద్ద కూడా మరో  ప్రైవేటు విమానాశ్రయం ఉంది. దీనిని అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావలసిన భూసేకరకు సహకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే అటు తెలంగాణ, ఇటు ఏపీకి ఉపయుక్తంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. అలాగే సాగర్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిచెందడానికి అవకాశం ఏర్పడుతుంది.  కర్నూలు జిల్లా శ్రీశైలం, గుంటూరు జిల్లా నాగార్జున సాగర్ లలో ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీటిలో చాలావరకు ఈ ఏడాదే పనులు మొదలుపెట్టి 2020 నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా విమానాశ్రయం నిర్మించే ఆలోచనలో ఉంది.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...