Feb 22, 2017

ఎల్ఈడీ బల్బులతో భారీగా విద్యుత్ ఆదా

v ఏడాదికి రూ.11,022 కోట్ల ఆదా
v దేశంలో 21,21,69,709 ఎల్ఈడీ బల్బులు పంపిణీv ఏపీలో 2,07,81,743 పంపిణీ
         ఆధునిక సమాజంలో విద్యుత్ లేకుండా ఒక్క క్షణం గడవదు. ఏ ప్రాంత అభివృద్ధి అయినా విద్యుత్ సరఫరాపైనే అధారపడి ఉంటుంది. విద్యుత్ సరఫరా తగినంత లేక అనేక ప్రాంతాలలో పలు చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యుత్ ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతోపాటు విద్యుత్ ని ఆదా చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నాయి. ఎల్ఈడి (లైట్ ఎమిట్టింగ్ డైయోడ్)  బల్బుల వినియోగం వల్ల 45 నుంచి 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. 60 వాట్స్ సాధారణ బల్బు జీవిత కాలం 1200 గంటలయితే, 6-8 వాట్స్ ఎల్ఈడీ బల్బు జీవిత కాలం 50 వేల గంటలు. సాధారణ బల్బుతో పోల్చితే ఎల్ఈడీ బల్బు జీవిత కాలం నాలుగు రెట్లు ఎక్కువ.  అలాగే సాధారణ 60 వాట్స్ బల్బుతో సమానంగా 8 వాట్స్ ఎల్ఈడీ బల్బు కాంతిని ఇస్తుంది. అంటే చాలా తక్కువ విద్యుత్ తో ఎక్కువ కాంతిని పొందవచ్చు. ఈ బల్బులను వినియోగించడం వల్ల వినియోగదారుల విద్యుత్ బిల్లు చాలా వరకు తగ్గుతుంది. దేశంలో మొదటిసారిగా పాండిచేరిలో 2014 ఫిబ్రవరి 7న డిస్కమ్స్ సహకారంతో సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చే ఎనర్జీ ఎఫిసియంట్ లైటింగ్ ప్రోగ్రామ్(ఈఈఎల్ పి)ని ప్రారంభించారు.  ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఎల్ఈడీ బల్బుల వాడకం మొదలుపెట్టాయి. దాంతో దేశంలో భారీ స్థాయిలో విద్యుత్  ఆదా అవుతోంది. ఈ పథకాన్ని 2015 జనవరి 5న డొమెస్టిక్ ఎఫిసియంట్ లైటింగ్ ప్రోగ్రామ్(డీఈఎల్ పీ)గా మర్చారు. అందరికీ ఎల్ఈడీ బల్బులు అందజేసే ఉజాల(యుజెఏఎల్ఏ-ఉన్నత్ జ్యోతి బై అఫర్డబుల్ లెడ్స్ ఫర్ ఆల్) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015 మే1న ప్రారంభించారు. ఈ పథకం కింద 9 వాట్ల లెడ్ బల్బును రాయితీపైన అందజేస్తున్నారు. ఒక్కో ఇంటికి రెండు బల్బులు ఇస్తున్నారు. ఇళ్లలో  60 వాట్ల బల్బు వాడే స్థానంలో వీటిని వాడుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధరకు వీటిని అందజేశారు.  దీని అసలు ధర 160 రూపాయలు ఉండగా, రాష్ట్రాలలో సబ్సిడీపై 10 రూపాయల నుంచి 85 రూపాయల వరకు వినియోగదారులకు అందజేశారు. ఎల్ఈడీ బల్బులు సబ్సిడీపై ఇవ్వడాన్ని ఏపీలో 2014 అక్టోబరు 2న ప్రారంభించారు. ఇక్కడ అత్యధిక సబ్సిడీపై అతి తక్కువ ధరకు ఒక్కో బల్బు పది రూపాయలకే ఇచ్చారు.
 ఏడాదికి రూ.11,022 కోట్ల ఆదా:  2017 ఫిబ్రవరి 21వ తేదీ ఉజాల డ్యాష్ బోర్డు లెక్కల ప్రకారం ఈ బల్బులు వాడటం వల్ల దేశం మొత్తం మీద ఏడాదికి 27,554 ఎంఎన్ కెడబ్ల్యూహెచ్ విద్యుత్, రూ.11,022 కోట్లు ఆదా అయ్యాయి. పీక్ అవర్ డిమాండ్ 5,516 మెగావాట్స్ తగ్గింది. ఆంధ్రప్రదేశ్ లో ఏడాదికి 26,98,863 ఎండబ్లూహెచ్ (మెగావాట్ అవర్స్) విద్యుత్,  రూ.1,080 కోట్లు ఆదా అయింది. పీక్ అవర్ డిమాండ్ 540 మెగావాట్స్ కు తగ్గింది. దాదాపు 50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుండటంతో ఎల్ఈడీ బల్బుల పంపిణీ ప్రక్రియని ముమ్మరం చేశారు. ఉజాల పథకం కింద 2017 ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రానికి  దేశంలో 21,21,69,709 ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు. ఈ బల్బుల పరిశ్రమలు 2016 డిసెంబర్ 31 వరకు 26 కోట్ల 30 లక్షల బల్బులు అమ్మాయి. 2019 నాటికి దేశంలో 77 కోట్ల సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ విధంగా వంద మిలియన్ కెడబ్ల్యూహెచ్ (కిలోవాట్ అవర్) విద్యుత్ ఆదా అవుతుందని అంచనా.
           రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే 3,09,12,435 బల్బులు పంపిణీ చేసి గుజరాత్ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత 2,07,81,743 బల్బులతో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో, 2,07,28,359 బల్బులతో మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉన్నాయి. 1,50,16,547  బల్బులతో ఉత్తర ప్రదేశ్ 4వ స్థానం, 1,45,50,181 బల్బులతో కర్ణాటక 5వ స్థానంలో, 1,25,16,616  బల్బులు పంపిణీ చేసి రాజస్థాన్ 6వ స్థానంలో, 1,09,97,122 బల్బులు పంపిణీ చేసి బీహార్ 7వ స్థానంలో, 1,07,95,778 బల్బులతో మధ్యప్రదేశ్ 8వ స్థానంలో, 1,01,08,040 బల్బులతో కేరళ 9వ స్థానంలో ఉన్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాలు కోటి బల్బుల లోపలే పంపిణీ చేశాయి.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
        మునిసిపల్ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, ఇళ్లలోనూ లెడ్ లైటింగ్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఓ ఛాలెంచ్ గా తీసుకొని దిగ్విజయంగా అమలు చేస్తోంది. విద్యుత్ ని ఆదా చేయడంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జాతీయ స్థాయిలో పలు బహుమతులను కూడా గెలుచుకుంది. మళ్లీ ఇప్పుడు లెడ్ బల్బుల వినియోగం వల్ల అయ్యే విద్యుత్ ఆదా గురించి  ప్రజలకు అవగాహన కలిగించి, విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బల్బులను వినియోగించి విద్యుత్ ని సాధ్యమైనంత ఎక్కువగా ఆదా చేయాన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు.  ఏపీలో నగర వీధులన్నిటినీ లెడ్ బల్బుల వెలుగులతో నింపేశారు. పట్టణాల వీధుల్లో కూడా పూర్తిగా ఈ బల్బులను అమరుస్తున్నారు. చాలా వరకు పూర్తి చేశారు. ఇక గ్రామ వీధులపై దృష్టి పెట్టారు. విశాఖ నగర వీధుల్లో అత్యధికంగా 1,02,227 బల్సులను అమర్చారు. ఇక్కడ 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. విజయవాడలో 32,296 బల్బులు అమర్చారు.
నెల్లూరులో 23,202 బల్బులు అమర్చగా 59.19 శాతం విద్యుత్ ఆదా అవుతోంది. ఏలూరులో 8,035 బల్బులు అమర్చగా, 59.69 శాతం విద్యుత్ ఆదా అవుతోంది.
 కాకినాడలో 12,365, గుంటూరులో 10,096, అనంతపురంలో 9,912, విజయనగరంలో 9,450, తిరుపతిలో 9,038,  కర్నూలులో 5, 045, రాజమండ్రిలో 5,770 బల్సులు అమర్చారు. మునిసిపల్ వీధులలో కూడా ఈ బల్బులే కాంతులు వెదజల్లుతున్నాయి. కావలి వీధుల్లో 6,007 బల్బులు, హిందూపూర్ లో 6,397, నరసరావు పేట వీధుల్లో 4,871 బల్బులు అమర్చారు. మిగిలిన మునిసిపాలిటీలలో ఆయా పట్టణాల పరిధిని బట్టి వెయ్యి నుంచి నాలుగు వేల వరకు ఈ బల్బులు ఏర్పాటు చేశారు.
      రాష్ట్రంలోని 12,909 గ్రామాల్లోని 25 లక్షల సాధారణ వీధి బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చడానికి ఏర్పాట్లు చేశారు.  సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె నుంచే శ్రీకారం చుట్టారు. ఈ గ్రామంలోని 120 సాధారణ వీధి బల్బుల స్థానంలో  ఎల్ఈడీ బల్బులు అమర్చారు. ఇంకా మరికొన్ని గ్రామాలలో కూడా అమర్చారు. అన్ని గ్రామాలలో ఈ బల్బులను అమరిస్తే ఏడాదికి 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందా అవుతుందని అంచనా.   వంద శాతం ఇళ్లలో వినియోగించడానికి మొత్తం 2.32 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం మొత్తం అమలయితే 1291 ఎంయు(మిలియన్ యూనిట్స్) విద్యుత్ ను పొదుపు చేయవచ్చని అంచనా. పీక్ అవర్స్ లో లోడ్ ను 620 మెగావాట్స్ కు తగ్గించవచ్చని భావిస్తున్నారు.  ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అమలు చేశారు. ఓ సర్వే ప్రకారం ఆ జిల్లాల్లో 58 వేల మంది వినియోగదారులు ఒక్కో బల్బుకు ఏడాదికి 73.7 యూనిట్స్ విద్యుత్ ను ఆదా చేశారు.
విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా:  విశాఖపట్నంలో అన్ని వీధి దీపాలు హుద్ హుద్ తుపానుకు ధ్వంసం అయ్యాయి. వాటి స్థానంలో లెడ్ బల్బులను అమర్చారు. 92 వేల ఎల్ఈడీ వీధి బల్బులను 45 రోజులలో అమర్చి రికార్డు సృష్టించారు. ఈ  బల్బుల వల్ల నెలకు 40 నుంచి 45 శాతం వరకు విద్యుత్ ఆదా అయింది. ఆ ప్రకారం 2015 సంవత్సరం మొత్తం మీద విద్యుత్ బిల్లు రూ.4.23 కోట్లు తగ్గింది. ప్రస్తుతం విశాఖలో 48 శాతం విద్యుత్ ఆదా అవుతోంది.  రాష్ట్రంలోని 111 మునిసిపాలిటీలలో 5.7 లక్షల వీధి బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులను అమర్చటానికి పూనుకున్నారు. ఇప్పటికే చాలావరకు మునిసిపాలిటీలలో బల్బులు మార్చారు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు:   రాష్ట్రంలో జరుగుతున్న ఎల్ఈడీ లైటింగ్ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రపంచ బ్యాంక్, ఫ్రాన్స్ లోని అంతర్జాతీయ ఎనర్జీ ఏజన్సీ (ఐఇఏ) వంటి సంస్థలు పనితీరును మెచ్చుకున్నాయి. పారిస్ లో జరిగిన సిఓపి-21 సమ్మిట్ లో ఎల్ఈడీ వీధి లైట్ల వినియోగం ద్వారా గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో  ఆదా అయిన విద్యుత్ అంశాన్ని చర్చించారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా,చైనా, ఇండియా,సౌత్ ఆఫ్రికా) వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ లో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టునే ప్రదర్శించి, ఇతర దేశాలకు ఓ రోల్ మోడల్ గా నిలిచింది.
అవార్డులు: ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ సరఫరా కంపెనీ (ఏపీడీసీఎల్‌), ఐదు జిల్లాల్లో ఎల్‌ఈడీ దీపాల సరఫరా సమర్ధవంతంగా నిర్వహించినందుకు 2015కు 'బెస్ట్‌ డిస్కం'గా ఎంపికైంది. విద్యుత్‌ ఆదా చేసే ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేసి  విశాఖ మహానగర పాలక సంస్థ జాతీయ అవార్డు సాధించింది.
     - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...