Feb 14, 2017

నేడే జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు

·       ఉన్నత శిఖరాలకు చేరిన మహిళలు కలిసే పవిత్ర సంగమం
     
          జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో అత్యున్న స్థానానికి ఎదిగిన మహిళలు ఈ రోజు కృష్ణా తీరంలో కొలువుకానున్నారు. విజయవాడ
కృష్ణా నదీ తీరాన ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద శుక్రవారం ఉదయం 10 గంటలకు జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ప్రారంభమవుతుంది. వరుసగా మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సదస్సులను మరిమించే విధంగా అత్యంత భారీ స్థాయిలో ఈ సదస్సు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దేశంలో మొదటిసారి జరుగుతున్న ఈ సదస్సులో దాదాపు 12వేల మంది పాల్గొనే అవకాశం ఉంది. దేశవిదేశాలకు చెందిన ప్రముఖ మహిళలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 8 వేల మంది విద్యార్థినులు పాల్గొననున్నారు.
రాజకీయ, విద్య, క్రీడలు, పరిశ్రమలు, మీడియా, సినిమా, కళలు, న్యాయ వ్యవస్థల నుంచి మహిళలతోపాటు విద్యార్థినులు భారీ సంఖ్యలో పాల్గొని వారివారి అనుభవాలను తెలియజేస్తారు.... 
          రాజకీయ, పారిశ్రామిక, విద్యా, పరిశోధన, మీడియా, సినిమా, వివిధ కళలు, న్యాయవ్యవస్థ, శాస్త్రసాంకేతిక తదితర అన్ని రంగాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ చర్చిస్తారు. పలువురు మహిళలు, విద్యార్థినులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవాలు వివరిస్తారు. అలాగే పరిష్కారమార్గాలను సూచిస్తారు. కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో మహిళా సాధికారితకు సంబంధించి అమూల్యమైన, ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
         
         సదస్సు ప్రారంభానికి ముందు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు పాల్గొనేవారి పేర్లు నమోదు చేసుకుంటారు. ఇప్పటికే పది వేల మంది ఆన్ లైన్ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు సదస్సు ప్రదేశంలో రిజిస్టర్ చేసుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే  ప్రారంభ సదస్సులో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు హెచ్.హెచ్. దలైలామా, ప్రముఖ గాంధేయవాధి ఈలా భట్, సినిమా నటి జూహీ చావ్లా, శాసనసభ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ డిప్యూటీ డైరెక్టర్ కేథరిన్ హే, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్, ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్, రాష్ట్ర మంత్రి పీతల సుజాత, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనమ్ మాలకొండయ్య, సదస్సు  కన్వీనర్ గా  ప్రముఖ విద్యావేత్త రాహుల్ వి. కరద్, సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రంజనీ కుమారి, ముకుల్ మాధవ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ రితూ చాబ్రియా, బాంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ డాక్టర్ శిరిన్ షార్మిన్ చౌదరి, భరత్ బయోటెక్ లిమిటెడ్ కో-ఫౌండర్ సుచిత్రా ఇల్లా   ప్రసంగిస్తారు.
          మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు లంచ్ బ్రేక్.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.40 గంటల వరకు మొదటి ప్లీనరీ సదస్సు జరుగుతుంది. ఈ విభాగంలో మహిళలు రాజకీయంగా  ఎదుర్కొనే సమస్యలపై చర్చిస్తారు. స్టాప్ యాసిడ్ ఎటాక్ మిషన్ క్రుసేడర్ లక్ష్మీ అగర్వాల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక గజపతి రాజు, సినిమా నటి మనీషా కోయిరాలా, భారత సంతతికి చెందిన అమెరికా రాజకీయ నాయకురాలు అరుణా మిల్లర్, నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ ముహ్మద్ యూనస్, ఆసియన్ న్యూస్ ఇంటర్నేషన్ ఎడిటర్ స్మితా ప్రకాష్, కినెటిక్ ఇంజనీరింగ్ ఫౌండర్, వైస్ చైర్ పర్సన్ సులజ్జా ఫిరోడియా మోట్వానీ, పశ్చిమ ఆఫ్రికా సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కామెరా సనగాకబా  ప్రసంగిస్తారు.
సాయంత్రం 4.40 గంటల నుంచి 6.30 గంటల వరకు యువతులు, విద్యార్థినులకు సంబంధించిన సమస్యలపై సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో స్కూల్ గవర్నమెంట్ మిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ శైలశ్రీ హరిదాస్, తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత, నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, ఏపీ మహిళా స్వయంసేవక సంఘాల కమ్యునిటీ ఆర్గనైజర్ విజయభారతి ప్రసంగిస్తారు. 
సాంస్కృతి కార్యక్రమాలు
        రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు పవిత్ర సంగమం వద్ద అమరావతి అంతర్జాతీయ సంగీత నృత్యోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5.00 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. 5 దేశాలకు చెందిన అంతర్జాతీయ కళా బృందాలతోపాటు మనదేశానికి చెందిన ప్రఖ్యాత కళాకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో తమతమ ప్రదర్శనలు ఇస్తారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...