Feb 27, 2017

వివాదాస్పద ఘటనలకు దృశ్య రూపం ఇవ్వడంలో దిట్ట

         వివాదాలకు చిరునామా రామ్ గోపాల్ వర్మ.  పరిచయం అక్కరలేని సంచలన సినిమా దర్శకుడు. వివాదాస్పద వాస్తవ ఘటనలకు దృశ్య రూపం ఇవ్వడంలో వర్మ దిట్ట.  అటు సినిమా, ఇటు నిజజీవితంలో ఏదో ఒక వ్యాఖ్య చేసి  వార్తలకెక్కడం ఆయన జీవన శైలిగా మారిపోయింది. సినిమా హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు, చివరికి మత విశ్వాసాలను కూడా  వదలరు. కొన్ని సందర్భాల్లో  చాలా వింత వింతగా  మాట్లాడతారు. ఆయన మాటల ద్వారా ఎంతోమందిని నొప్పిస్తుంటారు. మెప్పిస్తుంటారు. వివాదాలు, సంచలనాలే కాదు కొన్ని కొన్ని సందర్భాలలో  కొత్తకొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంటారు.  వివాదాలు లేకపోతే ఆయనకు ఒక్క క్షణం కూడా గడవదు. ఎంతటి వివాదాన్నైనా వర్మ సీరియస్ గా తీసుకోరు. అదే ఆయన ప్రత్యేకత.  ఆయన ఎన్నుకునే సినిమా కథలు కూడా ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో వివాదాలు రేపి, సంచలనాలు సృష్టించిన వాస్తవ సంఘటనలే అయి ఉంటాయి.  సినిమా టైటిల్ ద్వారా కూడా వర్మ రాము సంచలనాలు సృష్టించగల నేర్పరి. 26/11 ఇండియాపై దాడి, రక్త చరిత్ర, వీరప్పన్, వంగవీటి వంటి సినిమాలు నిర్మించడం, దర్శకత్వం వహించడం, రక్తి కట్టించడం అంత సామాన్యమైన విషయమేమీకాదు. ఇవన్నీ చాలా వివాదాస్పద వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రాలు. ఈ కథలతో సంబంధం ఉన్న వ్యక్తులు, గ్రూపులు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇవేమీ చారిత్రక కథలు కాదు. నిన్న మొన్న జరిగిన సంఘటనలు. ముఖ్యంగా రక్త చరిత్ర, వంగవీటి చిత్రాలు నిర్మిస్తున్నట్లు వర్మ ప్రకటించినప్పుడు చాలా మంది కంగారుపడ్డారు. ఈ కథలకు సంబంధించి వాస్తవ సంఘటనలు తెలిసినవారు, కీలక పాత్ర పోషించినవారు, మంచి, చెడు ఫలితాలు అనుభవించినవారు ఇంకా బతికే ఉన్నారు. ముఖ్యంగా ఈ కథల్లోని ప్రధాన పాత్రల భార్యలు, వారి పిల్లలు అందరూ బతికే ఉన్నారు. ఆయా కథలకు సంబంధించి కొన్ని ప్రధాన సంఘటనలు ఆయా సమయాల్లో, ఆయా ప్రాంతాల్లో తీవ్ర సంచలనాలు  సృష్టించాయి. ఇటువంటి చిత్రాలను నిర్మించి వర్మ ఏం గొడవలు సృష్టిస్తాడోనని కూడా కొందరు భయపడ్డారు. ప్రజలే కాదు, ప్రభుత్వ అధికారులు కూడా భయపడ్డారు.  ఈ చిత్రాలను నిర్మించవద్దని వర్మకు కొందరు మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో చెప్పారు. కొందరు మామూలుగా, కొందరు బెదిరించి మరీ చెప్పారు. సినిమాలు నిర్మించడంలో ఎంతటి ప్రావీణ్యత ఉందో ఇటువంటివి ధైర్యంగా ఎదుర్కొనడంలో కూడా వర్మ ఘటికుడు. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రని, సమాజంలో పలు అంశాలతో పెనవేసుకున్న సంఘటనలను ఎటువంటి వివాదాలకు తావులేకుండా చిత్ర రూపం కల్పించడంలో వర్మ దిట్ట అని రుజువైంది. ఈ చిత్రాలను వర్మ చాలా చాకచక్యంగా నిర్మించారు.
       భారతీయ సినిమా చరిత్రలో ఆ రంగంలోని 24 విభాగాల్లో ప్రావీణ్యం ఉన్న అత్యంత శక్తివంతుడైన దర్శకుడు వర్మ.   కథల ఎంపిక, చిత్రానువాదం, దర్శకత్వం, చిత్ర ప్రచారం విషయంలో తనకు తనే సాటి.  అతనితో పోల్చగల దర్శకులు మరొకరులేరు. ప్రతి చిత్రంపై అతని ముద్ర ఉంటుంది. అదే అతని ప్రత్యేకత. భారతీయ చిత్ర పరిశ్రమలో  మెగా దర్శకులుగా పేరుపొందినవారి ప్రతిభా సామర్థ్యాలతో పోల్చిచే ఇతనికి చాలా అదనపు అర్హతలు, తెలివితేటలు, శక్తి, సామర్ధ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. కథ- కథనం -  సంగీతం- చిత్రీకరణలో కొత్తదనం చూడంతోపాటు ఆధునిక సాంకేతికతను ఆసాంతం వాడుకునే సమర్ధత ఉన్న దర్శకుడు వర్మ. కొత్త కొత్త ఆలోచనలు, కొత్తపోకడలు పోవడంతోపాటు ఎటువంటి ఆలోచననైనా సినిమాగా రూపొందించగల  సత్తా, సామర్ధ్యం ఆయనకు ఉన్నాయి. కథ పాతదే అయినా కొత్త తరహాలో, అత్యాధునిక సాంకేతిక విలువలతో చిత్రం నిర్మించడం అతని ప్రత్యేకత. అందుకే ఇంత సుదీర్ఘ కాలం వర్మ దర్శకుడిగా మనగలుగుతున్నారు. ఇక  చిత్ర ప్రచారం విషయంలో  ఏ దర్శకునికీ లేని ప్రత్యేక సామర్థ్యం అతనికి ఉంది. ఇంతకు ముందు కూడా ఎవరూ సినిమా ద్వారా గానీ, వ్యక్తిగతంగానీ ఇంతటి ప్రచారాన్ని పొందలేదు. ముందు ప్రేక్షకులను ఆకర్షించేవిధంగా, వారిలో ఆసక్తి రేకెత్తించే విధంగా సినిమా పేరుపెడతారు. ఆ తరువాత కథ, కథనంపై సంచనల వ్యాఖ్యలు చేస్తారు. దాంతో అందరి నోళ్లలో వర్మ, అతని కొత్త సినిమాపైనే చర్చ జరుగుతుంది. వంగవీటి తరువాత యథావిధిగా వర్మ మరో ప్రకటన చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, ముఖ్యమంత్రి అవ్వాలన్న కలలు కల్లలై జైలుకు వెళ్లిన శశికళ జీవిత చరిత్రపై సినిమా నిర్మిస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని స్నేహితురాళ్లు ఇద్దరి మధ్య ఉన్న విషయాలను తెరకెక్కిస్తానని వర్మ చెప్పారు. తనదైన శైలిలో కథలో చివరి భాగం చెప్పి చర్చకు తెరలేపారు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలకు తట్టుకోలేక జయలలిత ఆత్మ సమాధిలో నుంచి బయటకు రావడమే తన సినిమాలో క్లైమాక్స్ గా వర్మ చెప్పారు.

శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...