Feb 17, 2017

గ్రిడ్ల వ్యవస్థతో ఏపీ సమగ్రాభివృద్ధి

Ø ఫైబర్, రోడ్, పవర్, వాటర్, గ్యాస్ గ్రిడ్ల ఏర్పాటు
Ø ఇంటింటికి గ్యాస్ సరఫరా
Ø మారుమూల గ్రామాలకు తాగునీటి సదుపాయం
Ø రూ.149 లకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఫోన్ సౌకర్యం ప్రారంభం
Ø ప్రతి పల్లె నుంచి రవాణా సౌకర్యం
Ø అత్యంత కీలకంగా విద్యుత్ రంగం గుర్తింపు

        రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రిడ్ల వ్యవస్థ  ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అపారంగా ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.  రాష్ట్రంలో అంతులేని జలరాశి పారుతోంది. 974 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. భూగర్భంలో అమూల్యమైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. ఈ వనరులన్నిటినీ ఒక ప్రణాళిక ప్రకారం  సమర్థవంతంగా వినియోగించుకుంటే రాష్ట్రం  స్వర్ణాంధ్రగా మారిపోతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఉన్నా వనరులను సమంగా పంపిణీ చేసి, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం  గ్రిడ్ల వ్యవస్థను ప్రారంభించింది. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సమకూర్చే ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు 13 జిల్లాల్లోని మారు మూల ప్రాంతాలకు కూడా  సమానంగా అందుతాయి. గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్, ఫైబర్ గ్రిడ్, రోడ్ గ్రిడ్, పవర్ గ్రిడ్  మొత్తం అయిదు గ్రిడ్లను ఏర్పాటు చేసింది.
గ్యాస్ గ్రిడ్: కెజి(కృష్ణా, గోదావరి) బేసిన్ లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయి. అవి రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రానున్న అయిదేళ్లలో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. విశాఖపట్నం జిల్లా గంగవరం వద్ద ఎల్ పి జి టెర్మినల్ ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టు వద్ద ఫ్లోటింగ్ స్టోరేజ్ రీ-గ్యాసిఫికేషన్ యూనిట్ ను శరవేగంగా నిర్మిస్తున్నారు. కాకినాడ నుంచి విశాఖ వరకు గ్యాస్ పైప్ లైన్, ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలో  ప్రతి ఇంటికి ఈ  సంవత్సరంలోనే గ్యాస్ పంపిణీ చేసి గ్యాస్ గ్రిడ్ తొలి దశను ప్రారంభిస్తారు. ఈ ఏడాదే  ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది.  కాకినాడ-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ కు సంబంధించి సర్వే దాదాపు పూర్తి అయింది. గ్యాస్ పంపిణీ కోసం గోదావరి గ్యాస్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత సర్వే కూడా పూర్తి అయింది. కొవ్వూరు సిఎన్ జి (కంప్రెస్ డ్ నేచురల్ గ్యాస్) స్టేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఒక రోజుకు సగటున 50 కిలోల అమ్మకం జరుగుతోంది. ఇటువంటి మరో పది స్టేషన్లను అందుబాటులోకి తేనున్నారు. ప్రయోగాత్మకంగా తొలుత కొవ్వూరు, రాజమహేంద్రవరంలలో ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత జూన్ నాటికి భీమవరం, ఏలూరుల్లో సరఫరా చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఆర్టీసీ బస్సులకు గ్యాస్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు కూడా పైప్ లైన్ల ద్వారా గ్యాస్ పంపిణీ చేసే ఉద్దేశం కూడా ఉంది. రాష్ర్ట వ్యాప్తంగా ఏడు మార్గాల్లో పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.  ఏటా అయిదు మిలియన్ టన్నుల గ్యాస్ సరఫరా చేసే సామర్థ్యం కలిగిన ఈ టెర్నినల్ ను త్వరగా పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ పైప్ లైన్ల ద్వారా తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కూడా గ్యాస్ పంపిణీ చేసే అవకాశం ఉంది.

వాటర్ గ్రిడ్: రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఈ గ్రిడ్ ను ఏర్పాటు చేశారు.  ఈ గ్రిడ్ ద్వారా పట్టణ ప్రాంతాలతోపాటు అన్ని గ్రామాలకు 365 రోజులూ తాగునీటి సదుపాయ కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీని ద్వారా జలవనరులు సక్రమంగా పంపిణీ జరిగిగృహ అవసరాలు, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలు తీరతాయి. 2019 నాటికి రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో కూడా తాగునీటి సమస్య లేకుండా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికి పది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులు పూర్తి చేయడానికి వెయ్యి కోట్ల రూపాయలను జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్ఆర్ డి డబ్ల్యూపి) కింద పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఫైబర్ గ్రిడ్:         ఫైబర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక విప్లవం మొదలైంది.  ఇంటర్నెట్, మొబైల్ విప్లవంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. ఈ రోజు బ్రాడ్ బ్రాండ్ లేని గ్రామం లేదు. అత్యధికులు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇంటర్నెట్ ఒక మానవ హక్కుగా మారిన తరుణంలో బ్రాడ్ బ్రాండ్ విప్లవం ద్వారా అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్‌ సేవల తొలి దశ పూర్తి అయింది. మొదట ఫైబర్ నెట్ సేవలు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లె మండలం మోరీ, మోరిపోడు గ్రామాల్లో మొదలయ్యాయి. ఏపీఎస్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్ఎఫ్ఎల్) ఆధ్వర్యంలో ఫైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్నాయి. మొదట ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలతోపాటు 1200 ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ సేవలు అందించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలందించడానికి ఏర్పాట్లు చేశారు.  తొలి దశలో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఎంఎస్ఓ(మల్టీ సిస్టమ్ ఆపరేటర్)లు, ఎల్సీఓల ద్వారా  ఫైబర్ నెట్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం పది లక్షల సీపీఈ బాక్సులకు ఆర్డర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం పదివేలకుపైగా కనెక్షన్లు ఇచ్చారు. మార్చి చివరకు పది లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలలో కూడా  ఫైబర్ గ్రిడ్ సేవలు అందిస్తారు. విస్తృత స్థాయిలో ఈ సేవలను వినియోగించుకోవాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో మొత్తం లక్షా 30 వేల కనెక్షన్లు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రాజెక్టుని ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలన్నది లక్ష్యం. దేశంలో ఇటువంటి పథకం చేపట్టిన రాష్ట్రం మనదే.  ఈ పథకాన్ని దేశమంతటా విస్తరింపజేయడానికి కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని అభ్యర్థిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలలతో పాటు 8 జిల్లాలలో ఇప్పటికే ఈ పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన జిల్లాలలో కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మొత్తం 23,500 కిలో మీటర్ల ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేయవలసి ఉంది. అందులో  22 వేల కిలో మీటర్లకుపైగా లైన్లు పూర్తి అయ్యాయి.  రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బ్రాడ్ బ్రాండ్ విప్లవం ఒక ప్రధాన సాధన అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు. ఇప్పటికే ప్రభుత్వ విభాగాలన్నింటిలో డిజిటలైజేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. కొన్ని శాఖల్లో నూరు శాతం కూడా పూర్తి అయింది. ఈ విధంగా కొత్త శకానికి నాంది పలికి దేశంలో రాష్ట్రం  గుర్తింపు పొందింది. 
రోడ్ గ్రిడ్ : రాష్ట్రంలోని మారు మూల గ్రామాల నుంచి, 9 జిల్లాలలోని  సముద్రతీరం నుంచి జాతీయ రహదారులను కలిపేవిధంగా రోడ్లను నిర్మించడానికి ఈ రోడ్ గ్రిడ్ ను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి బిటి రోడ్డు, గ్రామాల నుంచి మండల కేంద్రానికి సింగిల్ లైన్ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రోడ్లు, జాతీయ మార్గాల అవసరాలను బట్టి నాలుగు, ఆరు వరుసల రోడ్లు నిర్మిస్తారు. జిల్లా కేంద్రాల నుంచి ప్రధాన నగరాలకు ఆరు వరుసల రోడ్లు నిర్మిస్తారు. ప్రధాన నగరాల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్లును ఏర్పాట చేస్తారు. ఓడ రేవులతో రాష్ట్ర రహదారులను అనుసంధానం చేసి, రాష్ట్రం నుంచి దేశమంతటికి రవాణా సౌకర్యం కల్పిస్తారు. రాష్ట్రంలోని 46,440 కిలో మీటర్ల దహదారులను క్రమంగా జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులకు ఈ రహదారులను అనుసంధానించి కారిడార్లుగా వినియోగించేందుకు వీలుగా ఈ గ్రిడ్ ద్వారా  ప్రణాళికలు రూపొందించారు. అలాగే నూతన రాజధాని అమరావతికి కూడా అటు రాయలసీమ నుంచి, ఇటు ఉత్తరాంధ్ర నుంచి అనుసంధానంగా ప్రత్యేక రోడ్లు నిర్మిస్తారు. ప్రస్తుతం అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే కోసం భూసేకరణ, సమీకణ పనులు జరుగుతున్నాయి.
పవర్ గ్రిడ్: రాష్ట్ర ప్రగతికి చోదకంగా నిలిచే విద్యుచ్ఛక్తి రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకంగా గుర్తించింది. అన్ని ప్రాంతాలకు అంతరాయంలేకుండా విద్యుత్ సరఫరా సవ్యంగా జరిగేందుకు ఈ గ్రిడ్ ను ఏర్పాటు చేసింది. విద్యుత్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అద్వితీయమైన విజయాలు సాధించింది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రభుత్వం 2014లో బాధ్యతలు స్వీకరించేనాటికి  రాష్ట్రంలో రోజుకు 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేది. రెండేళ్లలో మిగులు రాష్ట్రంలో నిలిచింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, పొదుపు, సంరక్షణ విధానాలలో రాష్ట్రం వరుసగా అవార్డులు అందుకుంది. గృహావసరాలకు, పరిశ్రమలకు 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తూ కూడా మిగులు విద్యుత్ సాధించడం విశేషం. రాష్ట్రంలో డిమాండ్ కు సరిప విద్యుత్ సరఫరా అవుతోంది. విద్యుత్ లేక మూతపడిన అనేక చిన్న,మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరించారు. దాంతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
రాష్ట్రంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం ఓ రికార్డు.  ఏపీలో వంద శాతం విద్యుదీకరణ పూర్తయింది. రాష్ట్రంలో ఇంతకు ముందు అయిదు లక్షల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేదు. 4.5 లక్షలకుపైగా ఇళ్లకు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలినవాటికి కూడా కనెక్షన్లు ఇస్తున్నారు. కొద్ది రోజులలోనే ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి రాష్ట్రం రికార్డు సృష్టించబోతోంది. విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడానికి సాధ్యంకాని గిరిజన ప్రాంతాల్లో సౌరవిద్యుత్ అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వంద శాతం ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన తొలి జిల్లాగా  పశ్చిమగోదావరి జిల్లా రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఏడు గంటల విద్యుత్ అందిస్తున్నారు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడ్దా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా భూగర్భ విద్యుత్ లైన్లను శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రూ.3,010 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
      తలసరి విద్యుత్ వినియోగాన్ని బాగా పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.  2015లో ఉన్న1050 కిలో వాట్ల నుంచి 2019లో 1750 కిలోవాట్లు, 2022లో 2298 కిలోవాట్లు, 2029 నాటికి 3600 కిలో వాట్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే పునరుద్ధరణీయ ఇంధన సామర్థ్యం 2015లో ఉన్న 2 గిగావాట్ల నుంచి 2019కి 8, 2022కి 14, 2029 నాటికి 29 గిగావాట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ధేశించింది.  గృహ వినియోగదారులకు విద్యుత్ ఖర్చు తగ్గించడానికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేశారు. నగరాలు, పట్టణాలలోని వీధి దీపాల స్థానంలో ఎల్ఈడీ బల్బులను మార్చడం, సౌర, పవన విద్యుత్ ను ప్రోత్సహించడం ద్వారా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
           రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటోంది. ఈ నష్టం 2014-15లో 11.81 శాతం కాగా2015-16లో 10.29 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది ఈ నష్టాన్ని సింగిల్ డిజిట్ కు తగ్గించాలన్నది లక్ష్యం. విద్యుత్ పంపిణీ, సరఫరా సక్రమంగా జరిగేందుకు 25వేల కోట్ల రూపాయలతో ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. 2015-16లో 2290 మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థాన్ని సమకూర్చారు. రానున్న మూడేళ్లలో 4,800 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని సమకూర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లా పూడిమడకలో ఎన్.టి.పి.సి రూ.28వేల కోట్లతో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. 2020 నాటికి రెండు ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. నెల్లూరులో సెమ్ కార్ప్, ఇతర సంస్థలు కలసి రూ.20వేల కోట్లతో 1320 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.   నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో, విజయవాడ విటిపిఎస్ లో ఒక్కోచోట 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల విస్తరణ కార్యక్రమం చేపట్టారు.  ఏపి జన్ కో ఆధ్వర్యంలో వీటి నిర్మాణం జరుగుతోంది. 
  పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ ఈ ఏడాది బెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసర్’, బెస్ట్ నోడల్ ఏజెన్సీ గా ఎంపికయింది. కేంద్ర ఎనర్జీజ్యూరీ  ఇచ్చే అవార్డుకు నెడ్ క్యాప్(జాతీయ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ) వరుసగా గెలుచుకున్న ఏడో అవార్డు. ఈ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేసింది. ఇంధన రంగంలో 2015లో ప్రకటించిన 5 జాతీయ పురస్కారాలను మన రాష్ట్రం కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రం ఒకే రంగంలో ఇన్ని అవార్డులను సాధించడం ఓ రికార్డ్. విద్యుత్‌ సమర్ధ వినియోగం, పర్యవేక్షణ, అమలు చేస్తున్న ఉత్తమ డిజైన్‌ ఏజెన్సీ (ఎస్‌.డీ.ఏ.) విభాగంగా రాష్ట్ర ప్రభు త్వానికి ఈ పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ సరఫరా కంపెనీ (ఏపీడీసీఎల్‌), ఐదు జిల్లాల్లో ఎల్‌ఈడీ దీపాల సరఫరా సమర్ధవంతంగా నిర్వహించినందుకు 'బెస్ట్‌ డిస్కం'గా ఎంపికైంది. విశాఖ మహానగర పాలక సంస్థ విద్యుత్‌ ఆదా చేసే ఎల్‌ఈడీ వీధి దీపాల వ్యవస్థను ఏర్పాటు చేసి జాతీయ అవార్డు సాధించింది.
 ఈ గ్రిడ్లు ద్వారా  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వనరులు సమంగా పంపిణీ జరిగి అన్ని జిల్లాలలో ఉత్పత్తి, ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు పెరిగితే రాష్ట్రం స్థిరమైన రెండంకెల అభివృద్ధిని సాధిస్తుంది. 

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...