Feb 3, 2017

కేంద్ర నిధులు పూర్తిగా వినియోగించే యత్నం

 ·       రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేయాలని నిర్ణయం

          రాష్ట్రాభివృద్ధికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అదే క్రమంలో  కేంద్రం నుంచి రావలసిన అన్ని రకాల నిధులు రాబట్టాలని నిర్ణయించింది. వివిధ పథకాల కింద ఈ ఆర్థిక సంవత్సరం(2016-17)లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నిటినీ పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక రెండు నెలలే సమయం ఉంది. ఈ కాలంలోనే కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే  31 పథకాల(సీఎస్ఎస్)తోపాటు ఇతర నిధులకు సంబంధించిన పనులను   పూర్తి చేయాలి. వీటికి తోడు 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ఖర్చు చేసి ఆ పనులను  త్వరితగతిన పూర్తిచేయాలని నిర్ణయించింది.  పథకానికి సంబంధించిన నిబంధనల ప్రకారం ఒక్కో పథకానికి ఒక్కో నిష్పత్తిలో కేంద్రం నిధులు కేటాయిస్తుంది. కేంద్రం నిధులు అందించేవాటిలో ఎంజీఎన్ఆర్ఈజీఏ(మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం), గృహ నిర్మాణం (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన), సర్వశిక్ష అభియాన్, స్వచ్ఛభారత్ అభియాన్, స్మార్ట్ సిటీలు, జాతీయ గ్రామీణ త్రాగునీటి కార్యక్రమం (ఎన్ఆర్డీడబ్ల్యూపి),  జాతీయ ఆరోగ్య మిషన్, ఐసీడీఎస్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్ వై), సమగ్ర నీటి సరఫరా పథకం (సీపీడబ్ల్యూఎస్ఎస్), నేషనల్ అర్బన్ మిషన్, ప్రధానమంత్రి క్రిషి సించయీ యోజన, రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్(ఆర్జీఎస్ఏ- 75 శాతం కేంద,25 శాతం రాష్ట్ర నిధులు) వంటి పథకాలు ఉన్నాయి. అంతే కాకుండా వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు మంజూరు చేసింది. అమరావతిని వారసత్వ సంపదగా ప్రకటిస్తూ కేంద్రం  హృదయ్’ (హెరిటేజ్ సిటీస్ డెవలప్‌మెంట్ అండ్ ఆగుమెంటేషన్ యోజన) పథకం కింద  రూ.22.26 కోట్ల నిధులు మంజూరు చేసింది. దాదాపు అన్ని శాఖలలో కేంద్రం ఆర్థిక సహాయం అందించే పథకాలు అనేకం ఉన్నాయి. వాటిలో చాలా వరకు చివరి దశకు వచ్చాయి. అయితే ఇంకా పలు శాఖలలో పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఈ రెండు నెలల లోపల ఆ పనులు పూర్తి చేస్తేనే కేంద్ర నిధులు విడుదల చేస్తుంది. లేకపోతే అవి మురిగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దీనిని దృష్టిలో పెట్టుకొని అ పనులు అన్నిటినీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు విడుదల చేయాలని నిర్ణయం
           కేంద్రంతో జతపడి ఉన్న పనులు పూర్తి కావడానికి నిష్పత్తి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం  కూడా నిధులు మంజూరు చేయాలి. చాలా పథకాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మంజూరు చేయవలసిన నిధులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే మంజూరు చేస్తామని, ఆ పనులను ఈ రెండు నెలల లోపల పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి యనమల రామ కృష్ణుడు మంగళవారం జరిగిన ముందస్తు బడ్జెట్ సమావేశాలలో అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. పనులు పూర్తి చేయడం ద్వారా  కేంద్రం నుంచి రావలసిన నిధులను పూర్తిగా రాబట్టాలని చెప్పారు. ప్రతి పథకం తాలూక పనులను కూడా ఆయన సమీక్షించారు. నిధుల వినియోగానికి సంబంధించి ఆయన కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు.  మంత్రులను, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మనలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారమేనని, అందరూ మనసుపెట్టి గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఇళ్లు లేని నిరుపేదలకు గృహ వసతి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఇళ్ల నిర్మాణం వేగం పెంచాలని సంబంధిత అధికారులను మంత్రి రామకృష్ణుడు ఆదేశించారు. సమయం తక్కువగా ఉన్నందున కేంద్ర పథకాలకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసే పనులలో ఆర్థిక శాఖ నిమగ్నమై ఉంది.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో కేటాయించిన నిధులతోపాటు అవసరమైన పథకాలకు అదనపు నిధులను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అలాగే మ్యాచింగ్ గ్రాంట్ కూడా విడుదల చేసి కేంద్రం నిధులను పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...