Feb 3, 2017

భారీ స్థాయిలో పోటీ!

§  గ్రూప్ –I సిలబస్
     §  సిద్ధం కావడం ఎలా?
 
        ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వంలోని వివిధ  శాఖల్లో భర్తీ చేసే ఖాళీలలో కీలకమైనవి గ్రూప్-1 సర్వీస్ పోస్టులే. జీతం స్కేల్(రూ.40,270 – 93,780) కూడా ఈ ఉద్యోగాలకే ఎక్కువ.  గ్రూప్-1 కి పోటీపడే అభ్యర్థులు డిప్యూటీ కలెక్టర్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మునిసిపల్ కమిషనర్ గ్రేడ్-II, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,
అసిస్టెంట్ ప్రొహెబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెట్  వంటి పోస్టులకు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఈ కేటగిరిలో 78 పోస్టులను భర్తీ చేయడానికి గత నెలలో కమిషన్   నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువగా రాష్ట్ర స్థాయి పోస్టులే ఉన్నాయి. అత్యధికంగా డీఎస్పీ పోస్టులు 24, ఆ తరువాత కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ పోస్టులు 13 ఉన్నాయి.  ప్రభుత్వంలో సివిల్ సర్వీస్ తరువాత ఉన్నతమైన ఉద్యోగాలు ఇవే అయినందున ఆ స్థాయిలోనే తీవ్రమైన పోటీ ఉంటుంది. లక్ష్యం నిర్ధేశించుకొని పట్టుదలతో, అంకితభావంతో చదివే అభ్యర్థులే ఎక్కువగా ఈ పోటీ పరీక్షకు హారవుతారు. ఆషామాషీగా చదివి ఈ పరీక్షలో నెగ్గడం సాధ్యంకాదు. ప్రణాళిక ప్రకారం అత్యధిక సమయం చదవుకే కేటాయించాలి. తూలనాత్మక అధ్యయనం చేయాలి.

ఎంపిక  విధానం : ప్రిలిమినరీ, మెయిన్  రెండు పరీక్షలు, ఇంటర్వ్యూ
ప్రిలిమినరీ పరీక్ష: గ్రూప్-1లో  మొదట మే 7న ఆదివారం స్క్రీనింగ్ టెస్ లేక ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు జిల్లాకు ఒక  కేంద్రం ఉంటుంది. కృష్ణా, చిత్తూరు జిల్లాలకు సంబంధించి విజయవాడ, తిరుపతిలలో, మిగిలిన అన్ని  జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. 150 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఈ పరీక్షలో మైనస్ మార్కులు ఉంటాయి. ఏదైన ఒక ప్రశ్నకు జవాబు తప్పుగా మార్క్ చేస్తే, ఒన్ థర్డ్ మార్క్ మైనస్ చేస్తారు. అంటే మూడు జవాబులు తప్పుగా మార్క్ చేస్తే ఒక మార్క్ మైనస్ చేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జవాబులను చాలా జాగ్రత్తగా మార్క్ చేయాలి. ప్రతి ప్రశ్నకు నిమిషం సమయం ఉన్నందున ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి జవాబు మార్క్ చేయాలి.
స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్
1.     జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన సంఘటనలు.
2.    జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయిలో కరెంట్ ఎఫైర్స్.
3.    సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సమకాలీనాభివృద్ధితోపాటు రోజువారీ దైనందిక జీవితంలో జనరల్ సైన్స్ ఉపయోగాలు.
4.    జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర భౌగోళిక స్వరూపం.
5.    భారతదేశ ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర. భారత జాతీయోధ్యమం ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలు.
6.    భారత రాజకీయాలు, పరిపానాంశాలు. రాజ్యాంగ సమస్యలు, పాలనా విధానాల రూపకల్పన, వాటి అమలు, పరిపాలనా సంస్కరణలు, ఇ-గవర్నెస్ కు తీసుకుంటున్న చర్యలు.
7.    స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఆర్థికాభివృద్ధి. ప్రణాళిక పాత్ర. ప్లానింగ్ కమిషన్, నీతి అయోగ్.  భారత ఆర్థిక వ్యవస్థలో పేదరికం, నిరుద్యోగం, త్రాగునీరు, సాగునీరు, వ్యవసాయ వంటి సమస్యలు. స్థిరమైన ఆర్థికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి,  ద్రవ్యోల్బణం, బడ్జెట్, సామాజిక న్యాయం.
8.    కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ఫైనాన్స్ కమిషన్, కేంద్ర రాష్ట్రాల మధ్య వనరుల విభజన,అధికార వికేంద్రీకరణ.
9.    భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు. బ్యాంకింగ్, ఫైనాన్స్, వాణిజ్యం, సామాజిక రంగాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశం ఎదుర్కొనే పరిస్థితులు. అంతర్జాతీయ పోటీ, ఆర్థిక పరంగా మార్కెట్ అస్థిరత్వం, విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల ప్రవాహం, వస్తువులు, సేవల పన్నులు.
10.                       పర్యావరణ పరిస్థితులు దిగజారడానికి కారణాలు. వాటిని ఎదుర్కోవడానికి ఎదురయ్యే పరిస్థితులు. పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి.
11.           విపత్తుల నిర్వహణ. ప్రకృతీవైపరీత్యాలు ఏర్పడే పరిస్థితులు, వాటి నివారణ, ఉపశమనానికి వ్యూహాలు. విపత్తులు అంచనా వేసే, గ్రహించే భౌగోళిక సమాచార వ్యవస్థ.
12.           లాజికల్ రీజనింగ్, గణాంకాలను ఉపయోగించి విశ్లేషణ చేసే సామర్థ్యం.
13.           గణాంకాల విశ్లేషణ: గణంకాల టేబుల్ రూపొందించడం.  గణాంకాలను దృశ్య రూపం. ప్రాథమికంగా గణాంకాల విశ్లేషణ, గణంకాలను సంక్షిప్తీకరించడం, వివరించడం.
14.           ఆంధ్రప్రదేశ్ విభజన, దాని పరిణామాలు. దాని వల్ల తలెత్తిన పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృత, రాజకీయ, న్యాయసంబంధ అంశాలు. సమస్యలు. రాజధానిని నష్టపోవడం, కొత్త రాజధాని నిర్మాణం, దానికి సంబంధించిన ఆర్థిక అంశాలు. ఉమ్మడిగా ఉన్న సంస్థల విభజన, వాటి పునర్నిర్మాణం. ఉద్యోగుల విభజన, వారి స్థాన చలనం, వారి స్థానికత సమస్యలు. వాణిజ్యం, వ్యాపారవేత్తలపై విభజన ప్రభావం. రాష్ట్ర విభజన తరువాత మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాలు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు, జనాభాపై విభజన ప్రభావం. నదీజలాల పంపిణీపై విభజన ప్రభావం.  తత్ఫలితంగా సంభవించే పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్తీకరణ చట్టం-2014,  నిబంధనల రూపకల్పనలో ఏక పక్ష నిర్ణయాలు.

అబ్జెక్టివ్ పరీక్ష అయినప్పటికీ గ్రూప్-1 ప్రిలిమినరీ అయినందున ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. చరిత్రలో ముఖ్యమైన తేదీలను, గణాంకాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలతోపాటు భారత దేశ చరిత్రను ఆమూలాగ్రం చదవాలి. అంతర్జాతీయ పరంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చే మార్పులను చదివి ఆకళింపు చేసుకోవాలి. రాష్ట్రాంశాలకు వచ్చేసరికి ముఖ్యంగా విభజనకు సంబంధించి ప్రతి అంశం తెలిసి ఉండాలి. విభజనకు ముందు, జరిగిన తీరు, ఆ తరువాత పరిణామాలు, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు చిన్నచిన్న సంఘటనలతోసహా గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మరిముఖ్యంగా రాజధాని ఆధునిక అమరావతి నిర్మాణం విషయంలో పచ్చదనం అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో పర్యావరణంపై కూడా శ్రద్ధ వహించాలి. ఇక లాజికల్ రీజనింగ్, గణాంకాల సంక్షిప్తీకరణ, విశ్లేషణ వంటివి ప్రతి పోటీ పరీక్షకు తప్పనిసరిగా అవసరమైనవి.


ఈ పరీక్షకు పోటీపడేవారు దినపత్రికలు, ముఖ్యమైన వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదవడంతోపాటు ఇంటర్నెట్ పరిజ్ఞానం చాలా అవసరం. నెట్ లో తెలుగులో కూడా సమాచారం లభిస్తుంది.   ప్రణాళికా సంఘం, జనాభా లెక్కలు, గ్రామీణాభివృద్ధి, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆర్థిక, గణాంక శాఖల... వంటి వెబ్ సైట్లను అధ్యయనం చేయాలి.  అలాగే ఆయా అంశాలకు సంబంధించిన  వెబ్ సైట్లను కూడా పరిశీలించాలి. కృషి, పట్టుదలతో విషయ పరిజ్ఞానం పెంచుకుంటే విజయం మిమ్మల్నే వరిస్తుంది. ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించినవారే మెయిన్ పరీక్షకు అర్హులవుతారు.


మెయిన్ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి ఆగస్ట్ 17 నుంచి 27 వరకు మెయిన్ పరీక్ష (రాత పరీక్ష) నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షను విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం 4 కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తారు. మెయిల్ లో ఇంటర్వ్యూకు అర్హత సాధించడానికి 150 మార్కులకు ఒక పేపర్ ఉంటుంది. ఇది పదవ తరగతి స్థాయిలో జనరల్ ఇంగ్లీష్ లో ఉంటుంది. ఇది కాకుండా మరో 5 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 150 మార్కులు. మరో 75 మార్కులు ఇంటర్వ్యూకు ఉంటాయి. మొత్తం 825 మార్కులు. ఇందులో అత్యధిక మార్కులు వచ్చిన వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

-          శిరందాసు నాగార్జున

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...