Feb 17, 2017

ఐటీ కంపెనీల స్థాపనకు ప్రవాస తెలుగువారి ఆసక్తి

ü ఏపీఎన్ఆర్టీలో 83 దేశాలకు చెందిన 32 వేల మంది సభ్యులు
ü ప్రవాస తెలుగువారికి అన్నిరకాల సహాయసహకారాలు
ü వందల కోట్ల పెట్టుబడులతో వేల మందికి ఉపాధి
ü 86 గ్రామాల దత్తత

          రాష్ట్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగువారి సొసైటీ(ఏపీఎన్ఆర్టీ) వివిధ రూపాలలో తనవంతు సాయం అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పుతూ వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి, వేల మందికి ఉపాధి కల్పించడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. 2016 మేలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పల్లె రఘునాథ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన ఈ సొసైటీలో 83 దేశాలకు చెందిన 32వేల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ సలహాదారుడైన డాక్టర్ రవి వేమూరి అధ్యక్షులుగా పూర్తీగా ప్రభుత్వ ఆధ్వర్యంలో లాభాపేక్షలేని సొసైటీగా దీనిని ఏర్పాటు చేశారు.  దీని ప్రధాన కార్యాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. 192 మంది అంతర్జాతీయ కోఆర్డినేటర్లు, ఆరుగురు ప్రాంతీయ అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారు. ఈ సొసైటీ ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు ప్రవాస తెలుగువారికి మధ్య వారధిలా పని చేస్తోంది. ప్రవాస తెలుగువారికి పలు రకాల సేవలు అందిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాస తెలుగువారిని ప్రోత్సహిస్తోంది. ముందుకు వచ్చినవారికి పెట్టుబడులకు సంబంధించిన, న్యాయపరమైన సలహాలు, బ్యాంకింగ్ సేవలు అందజేస్తోంది. పరిశ్రమల స్థాపనలో వివిధ ప్రక్రియలలో వారికి సహాయ సహకారాలు అందజేస్తోంది. వారు స్వదేశానికి వచ్చే సమయంలో ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ దగ్గర నుంచి హోటల్ రూమ్స్, క్యాబ్స్ బుకింగ్, దేవాలయాల సందర్శనలకు సహాయపడుతోంది. ప్రవాస తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో కూడా ఈ సొసైటీ సహకారం అందిస్తుంది.  డాక్యుమెంట్లు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు, పాస్ పోర్టు, ఓటర్ కార్డు వంటి వాటిని పోగొట్టుకున్నప్పుడు వాటిని వెతికే విషయంలో ఈ సొసైటీకి సంబంధించిన బృందం సహాయపడుతుంది. వారి సమయం వృధాకాకుండా చూస్తుంది. అంతేకాకుండా స్మార్ట్ విలేజ్ కార్యక్రమాలలో వారు పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తోంది. గత నవంబర్ వరకు విశాఖపట్నంలో  ప్రవాస తెలుగువారు 9 ఐటీ కంపెనీలను స్థాపించారు. ఆ కంపెనీల (డీజిట్, ఎవాల్యూట్, నెట్ వర్క్ ఆబ్జెక్ట్, రిసికార్ప, కైరోస్,అంజూర్,ప్రిమస్,ఫ్యాబిట్,థాట్ వేవ్) ద్వారా 430 మందికి ఉపాధి లభిస్తోంది.

 ఈ నెల16న  విజయవాడలో యాక్సెల్‌ ఐటీ, హార్జన్‌ ఐటీ, ఎంఎస్‌ఆర్‌ కాస్మోస్‌, అడాప్ట్‌ సొల్యూషన్స్‌, అడ్వాన్స్‌ సాప్ట్‌, ఇంటెల్లి సాఫ్ట్‌, టైమ్‌స్క్వేరిట్‌ వంటి ఐటీ కంపెనీలను ప్రారంభించనున్నారు. ఈ కంపెనీలకు ఆటోనగర్‌లో అత్యాధునికమైన భవనాన్ని కేటాయించారు.  అమెరికా నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను కూడా ఏపీఎన్‌ఆర్టీయే సమకూర్చనుంది.  ఈ కంపెనీల్లో పనిచేయడానికి అనుకూలంగా ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు తగి శిక్షణ ఇప్పించేందుకు మరో 14 కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాలను ఇక్కడ  ఏర్పాటు చేయనున్నారు. కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాలకు మంగళగిరి వద్ద ఉన్న ఐటీ టవర్‌లో స్థలం కేటాయించారు. 10 ఐటీ కంపెనీలకు 500 నుంచి వెయ్యి మంది వరకు  అవసరం ఉంటుంది. మూడు మాసాల్లో శిక్షణ పూర్తి చేసి జూన్‌ నాటికి ఐటీ కంపెనీల్లో వారు ఉద్యోగాలు చేసుకునేలా అవకాశం కల్పిస్తారు. అమరావతిని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అమరావతి నగరాన్ని పెద్ద ఐటీ హబ్‌గా రూపొందించి,  ఇంజినీరింగ్‌ యువతకు స్థానికంగానే ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్ రప్టివ్ సాఫ్ట్ వేర్, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ వంటి సంస్థలు ప్రారంభించారు. అత్యధిక మంది రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు.

రూ.201.50 కోట్ల పెట్టుబడితో 2615 మందికి ఉపాధి
          అమరావతి ఇండస్ట్రియల్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలలో దాదాపు రూ.201.50 కోట్ల పెట్టుబడులు, వర్కింగ్ క్యాపిటల్ తో 75 పరిశ్రమలను నెలకొల్పనున్నారు. వీటి ద్వారా 2615 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ పరిశ్రమల స్థాపనకు 6348.50 యూనిట్ల హెచ్ పీ విద్యుత్, 8,96,976 గ్యాలన్ల నీరు అవసరం ఉంటుందని వారు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వాటిలో లక్ష్మీ ప్లాస్టిక్స్, సంజయ్ టెక్నికల్ సర్వీసెస్, శ్రీభరణి ఎంటర్ ప్రైజెస్, సీ అండ్ ఎన్ ఇండస్ట్రీస్, ఎస్వీ పాలిమర్స్,మార్క్ ఆంగ్రో ఇండస్ట్రీస్, గౌతమ్ ఇండస్ట్రీస్, జీఎస్ ఎలక్ట్రికల్స్ వంటి కంపెనీలు  ఉన్నాయి. నాలుగు ఐటీ, ఒక ఆటోమొబైల్ కంపెనీలు విశాఖపట్నంలో తమ యూనిట్లను స్థాపించడానికి వచ్చే ఫిబ్రవరిలో పనులను ప్రారంభిస్తాయి. ఈ యూనిట్ల ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆటోమోటిక్ రోబోటిక్స్ సంస్థ రూ.50 కోట్ల పెట్టుబడితో ప్రెసిసింగ్ ఇంజన్ టెస్టింగ్ అండ్ డెవలప్ మెంట్ యూనిట్ ని స్థాపించాలన్న యోచనలో ఉంది. ఈ యూనిట్ స్థాపిస్తే 400 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అమరావతి, విశాఖలలో వచ్చే మార్చిలో 14 ఐటీ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లను ప్రారంభించనున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక అంశాలలో  శిక్షణ ఇస్తారు.

86 గ్రామాల దత్తత
           స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ప్రవాస తెలుగువారు రాష్ట్రంలో 13 జిల్లాల్లో 86 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాల అభివృద్ధికి రూ.15 కోట్లు ఖర్చు చేయాలని వారు నిర్ణయించారు. ఈ గ్రామాలలో వారు వాటర్ ప్లాంట్స్, శ్మశానవాటికలు, పాఠశాలలు, సోలార్ పానెల్స్, లెడ్ బల్బులు ఏర్పాటు చేశారు.

ఎన్ఆర్టీ ఐకాన్ : ఈ సొసైటీ ఇంకా అనేక కొత్త ఆలోచనలు చేస్తోంది. ఎన్ఆర్టీ ఐకాన్ నిర్మించాలని, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే అమరావతి టెక్ సపోర్ట్ విలేజ్, గల్ఫ్ బాధితులకు మద్దతుగా ఒక సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చేస్తోంది. అమెరికాలోని దేవాలయాల ద్వారా రాష్ట్రంలోని గ్రామాలను దత్తత తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. రాష్ట్రాభివృద్ధి విషయంలో బాధ్యతగా తమ వంతు కృషి చేస్తామని ఎన్ఆర్టీ ప్రతినిధులు చెప్పారు.

-          శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...