Dec 28, 2020

సీనియర్ సిటిజన్ల పెన్షన్ పథకం

ప్రారంభించిన ఎల్ఐసీ

సీనియర్ సిటిజన్ల కోసం పీఎం వయ వందన యోజన (పీఎంవీవీవై) పెన్షన్ పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించిన తరువాత, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కేంద్రం సబ్సిడీతో అనుసంధానించని పెన్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇటీవలే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను, ఆర్థిక మంత్రిత్వ శాఖ పెన్షన్ ప్లాన్ ను 7.40 శాతం వడ్డీ రేటుతో మార్చి 31, 2023 వరకు పొడిగించింది. ఈ ప్లాన్ మూడు ఆర్థిక సంవత్సరాలు అనగా మార్చి 2023 వరకు విక్రయానికి అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకాన్ని ఆఫ్‌లైన్‌లో, ఎల్‌ఐసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. మొత్తం చెల్లింపును రూ. 15 లక్షలకు మించకుండా అందించే పథకాన్ని అమలు చేసే అధికారం ఎల్‌ఐసీకి మాత్రమే ఉంది. ఈ పాలసీకి 10 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. ఈ పథకం సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తుంది, అయితే మొత్తం 10 సంవత్సరాల కాలానికి నెలవారీగా చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తం ఆధారంగా నెలకు రూ. 1000 కనీస పెన్షన్ పొందవచ్చు. గరిష్ట పెన్షన్ మొత్తం నెలకు రూ. 10,000 గా పరిమితం చేశారు. రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో విక్రయించే పాలసీలకు వర్తించే వడ్డీ రేటు, ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వం సమీక్షించి, నిర్ణయిస్తుంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 12,000 పెన్షన్ కోసం కనీస పెట్టుబడిని రూ. 1,56,658 గా, అలాగే నెలకు రూ. 1000 పొందటానికి కనీస పెట్టుబడిని రూ. 1,62,162 కు సవరించారు. నెలవారీ మోడ్ కోసం కనీస కొనుగోలు ధర రూ. 1,62,162, త్రైమాసిక పెన్షన్ కోసం రూ. 1,61,074, అర్ధ వార్షిక మోడ్‌కు రూ. 1,59,574, వార్షిక మోడ్‌కు రూ. 1,56,658. ఈ పథకం కింద పొందగలిగే గరిష్ట పెన్షన్ నెలకు రూ. 9,250, త్రైమాసికానికి రూ. 27,750, అర్ధ సంవత్సరానికి రూ. 55,500, వార్షిక చెల్లింపు ప్రాతిపదికన రూ. 1,11,000 అని ఎల్ఐసీ తెలిపింది.

ఈ ప్రణాళికలోని అన్ని పాలసీల కింద మొత్తం కొనుగోలు ధర, సీనియర్ సిటిజన్‌కు అనుమతించిన పథకం మునుపటి సంస్కరణల కింద తీసుకున్న అన్ని పాలసీలు రూ. 15 లక్షలకు మించకూడదు. ఈ పథకాన్ని ఒకేసారి పూర్తి మొతాన్ని చెల్లించి కొనుగోలు చేయవచ్చు. అలాగే పెన్షనర్‌కు పెన్షన్ మొత్తాన్ని లేదా కొనుగోలు ధరను ఎంచుకునే అవకాశం ఉంటుంది. పథకాన్ని కొనుగోలు చేసే సమయంలో పెన్షనర్ నెలవారీ / త్రైమాసిక / అర్ధ వార్షిక లేదా వార్షిక పెన్షన్ మోడ్‌ను ఎంచుకోవచ్చు.

పాలసీ కాలపరిమితిలో పెన్షనర్ జీవించి ఉన్నట్లయితే, బకాయిల్లో పింఛను (ఎంచుకున్న మోడ్ ప్రకారం ప్రతి వ్యవధి చివరలో) చెల్లిస్తారని, ఒకవేళ పాలసీ కాలపరిమితిలో పెన్షనర్ మరణించినట్లైతే, కొనుగోలు ధర నామినీకి తిరిగి ఇస్తారని ఎల్ఐసీ తెలిపింది. ఒకవేళ పాలసీ కాలపరిమితి పూర్తి అయ్యే వరకు పెన్షనర్ జీవించి ఉన్నట్లైతే, కొనుగోలు ధర, తుది పెన్షన్ వాయిదా చెల్లించాలి. మూడు పాలసీ సంవత్సరాల తరువాత కొనుగోలు ధరలో 75 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం స్వీయ లేదా జీవిత భాగస్వామి క్లిష్టమైన అనారోగ్యానికి చికిత్స కోసం ముందస్తు నిష్క్రమణను అనుమతిస్తుంది, అలాగే చెల్లించాల్సిన సరెండర్ విలువ కొనుగోలు ధరలో 98 శాతంగా ఉంటుంది.

చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీరేట్లు య‌థాత‌థం

చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తుంది​​​​​​​.

చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ ప‌థ‌కాల‌పై అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రైమాసికానికి వ‌డ్డీ రేట్ల‌ను అదేవిధంగా కొన‌సాగించింది. చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసికానికి ఒక‌సారి మారుస్తుంది. బ్యాంక్ డిపాజిట్ రేట్లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో ఈ ప‌థ‌కాల్లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ) వ‌డ్డీ రేట్లు 7.1 శాతం, 6.8 శాతంగా ఉండ‌నున్నాయి.

ఐదేళ్ల సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ వ‌డ్డీ రేటు 7.4 శాతం.

ఆడ‌పిల్ల‌ల కోసం ఉద్దేశించిన ప‌థ‌కం సుక‌న్య స‌మృద్ధి యోజ‌న వ‌డ్డీ రేట్లు 7.6 శాతం

కిసాన్ వికాస్ ప‌త్ర (కేవీపీ) వ‌డ్డీ రేట్లు 6.9 శాతం

1-5 సంవ‌త్స‌రాల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు 5.5 శాతం నుంచి 6.7 శాతం మేర‌కు ఉన్నాయి.

ఐదేళ్ల రిక‌రింగ్ డిపాజిట్ రేటు 5.8 శాతంగా ఉన్నాయి.

Dec 10, 2020

కొత్త పార్లమెంట్ భవనం విశేషాలు !

 నేడే శంకుస్థాపన



* 64,500 చ.మీ విస్తీర్ణంలో రూ .971 కోట్లతో కొత్త భవనం పురివిప్పి ఆడుతున్న నెమలి ( జాతీయ పక్షి ) ఆకృతిలో లోక్ స‌భ‌ పైకప్పు.

 * విరబూసిన కమలం ( జాతీయ పుష్పం ) రూపంలో రాజ్యసభ పైకప్పు

* పార్లమెంట్ అంతర్భాగంలో జాతీయ వృక్షం మర్రిచెట్టు

* నిర్మాణంలో పాల్గొననున్న 200 కు పైగా హస్తకళాకారులు 

*ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చునే వెసులుబాటు

 * 2022 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం .

పురివిప్పిన నెమలి రూపం.. విరబూసిన కమలం

నూతన లోక్‌సభ, రాజ్యసభల పైకప్పునకు కొత్తరూపు

అణువణువునా భారతీయత

వందేళ్ల అవసరాలకు సరిపోయేలా నిర్మాణం

న్యూ ఢిల్లీ : ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటు త్వరలో సరికొత్త భవనంలో కొలువుదీరబోతోంది. వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా నిర్మించబోతున్న నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంకుస్థాపన చేయనున్నారు. కొత్త భవనంలో అణువణువునా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి (జాతీయ పక్షి) ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం (జాతీయ పుష్పం) రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రి చెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా నిలవనుంది. శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తొలుత భావించింది. సెంట్రల్‌ విస్టా నిర్మాణంపై కేసు నడుస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించనున్నారు. మోదీతోపాటు దాదాపు 200 మంది అతిథులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. వీరిలో పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు, వివిధ దేశాల రాయబారులు ఉండనున్నారు. కొంతమంది గవర్నర్లు, ముఖ్యమంత్రులు శంకుస్థాపన కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు.

నూతన భవన స్వరూపం

* లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజల కోసం 480 సీట్ల చొప్పున ఏర్పాటు చేయనున్నారు.

* లోక్‌సభలో ప్రస్తుతం సభ్యులు కూర్చొనే సీటు పొడవు, వెడల్పుల నిష్పత్తి 45్ఠ40గా ఉండగా, కొత్త దాంట్లో అది 60్ఠ40గా ఉండనుంది.

* ప్రస్తుతం తొలి రెండు వరుసల్లో కూర్చున్నవారికి తప్ప మిగతావారికి డెస్క్‌లు లేవు. కొత్త భవనంలో అందరికీ ఆ సౌకర్యం కల్పిస్తారు.

* ప్రస్తుత భవనంలో అనలాగ్‌ మైక్‌లు ఉండగా, కొత్త దాంట్లో ప్రతి ఎంపీకీ ఒక టచ్‌ స్క్రీన్‌తో కూడిన డిజిటల్‌ సిస్టమ్‌ను ఏర్పాటుచేయనున్నారు.

* ప్రస్తుత సెంట్రల్‌ హాల్‌ 670 చదరపు మీటర్లలో ఉండగా, కొత్త దాంట్లో లోక్‌సభే సెంట్రల్‌ హాల్‌గా ఉంటుంది. అది 1,315 చదరపు మీటర్లలో వస్తుంది.

* సెంట్రల్‌ లాంజ్‌ / కోర్టు యార్డులో జాతీయ వృక్షం మర్రిచెట్టును యథాతథంగా ఉంచుతారు.

* మంత్రుల కార్యాలయాలు లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 20, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 18, మొదటి అంతస్తులో 26, రెండో అంతస్తులో 28 ఉంటాయి.

* లోక్‌సభను ఆనుకొనే ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది.

* కాన్‌స్టిట్యూషన్‌ హాలు ఎత్తు 20 మీటర్లు. దానిపై అశోక స్థూపాన్ని ఏర్పాటుచేస్తారు. ఈ హాలులోనే రాజ్యాంగాన్ని ప్రదర్శనకు ఉంచుతారు.

* ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఉన్నట్లుగానే కొత్త భవనానికీ చుట్టూ నిలువెత్తు రాతిస్తంభాలు వస్తాయి.

* సభ్యులు వేసే ఓటు స్పష్టంగా కనిపించేందుకు వీలుగా నూతన భవనంలో 281 అంగుళాల వీడియో వాల్‌ను ఏర్పాటుచేస్తారు.

* గ్యాలరీల్లో కూర్చొనే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా 165 అంగుళాల తెరలను నెలకొల్పుతారు.

* వీవీఐపీల కోసం 2 గేట్లు, ఎంపీల వాహనాలు రావడానికి 2 గేట్లు, సాధారణ ప్రజలు, సిబ్బంది, మీడియా, సందర్శకుల కోసం 2 గేట్లు కేటాయిస్తారు.

* అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు ఏర్పాటుచేయనున్నారు.

కొత్త భవనంలో ఉండే విభాగాలు

* లోక్‌సభ

* రాజ్యసభ

* సెంట్రల్‌ హాలు

* సెంట్రల్‌ లాంజ్‌ / కోర్ట్‌ యార్డ్‌

* గ్రంథాలయం

* డైనింగ్‌ హాల్‌

* మంత్రుల కార్యాలయాలు

* ప్రధానమంత్రి కార్యాలయం

* కమిటీ హాళ్లు

* లాంజ్‌

* మరుగుదొడ్లు

* కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌

* సెక్యూరిటీ, రిసెప్షన్‌ భవనం

* ప్రెస్‌ లాంజ్‌, సావనీర్‌ షాప్‌

 వివరం  పాత పార్లమెంటు భవనం  కొత్తది

(చదరపు మీటర్లలో) (చదరపు మీటర్లలో)

మొత్తం నిర్మాణ ప్రాంతం 47,443 64,500

బేస్‌మెంట్‌ / లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌  8,000 13,675

గ్రౌండ్‌ ఫ్లోర్‌  16,540  20,320

మొదటి అంతస్తు 13,248  16,680

రెండో అంతస్తు 2,877 8,100

మూడో అంతస్తు 4,463                

వివరం  పాత పార్లమెంటు  భవనం కొత్తది

గేట్లు (సంఖ్య) 12 6

లోక్‌సభలో సీట్లు 552 888

రాజ్యసభలో సీట్లు 245 384

సెంట్రల్‌ హాల్‌లో సీట్లు 436 1,272

మంత్రుల కార్యాలయాలు 37 92

కమిటీ హాళ్లు 3 6

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నేటితో 65 వసంతాల పూర్తి

ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లో ప్రథమస్థానం

ప్రపంచప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి నేటి (డిసెంబర్‌ 10)తో 65 వసంతాలు పూర్తిచేసుకుంది. ఆంధ్రరాష్ట్ర అన్నపూర్ణగా రైతులపాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 1955 డిసెంబర్‌ 10న డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు రూపకల్పనకు ప్రముఖ ఇంజనీర్‌ కేఎల్‌ రావు, ముత్యాల జమీందార్‌ మహేశ్వరప్రసాద్‌ ఆలోచనలు మూలంగా చెప్పవచ్చు. ప్రాజెక్టు నిర్మాణానికి వేలాది మంది శ్రమజీవుల శ్రమశక్తి, వందలాది మంది ప్రాణార్పణలు నేటికీ మరువలేనివి. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1970లో పూర్తయింది. డ్యాం నిర్మాణ దశలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు మొట్టమొదటి చీఫ్‌ ఇంజనీరుగా పనిచేసిన మీర్‌జాఫర్‌ అలి నిబద్ధత కొనియాడదగింది. ప్రపంచ రాతినిర్మాణాల ప్రాజెక్టుల్లోకెల్లా నాగార్జునసాగర్‌ డ్యాం పొడవు, ఎత్తుల్లో ప్రథమస్థానంలో ఉండడం విశేషం! నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇది 285 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి 408 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కలిగివుంది. గత 44 ఏళ్లుగా వచ్చిన వరదలకు రిజర్వాయర్‌లో పూడిక చేరడంతో సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 312 టీంఎసీలుగా ప్రభుత్వం నిర్ధారించింది. అంటే సుమారు 96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని రిజర్వాయర్‌ కోల్పోయింది.

జవహర్‌ కెనాల్‌

కుడికాలువకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 అక్టోబర్‌ 10న శంకుస్థాపన చేశారు. అనంతరం ఈకాలువకు అ ప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న నీటిని విడుదలచేసి జాతికి అంకితమిచ్చారు. దీనిని జవహర్‌ కెనాల్‌ అని పిలుస్తారు. ఈ కాలువ గుంటూరు, ప్రకాశం జిల్లా లో సుమారు 203కి.మీ. ప్రవహిస్తూ రైతన్నల ఆశాజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు నీరందుతోంది. ఈ కాలువ కింద ఆయకట్టును 22 బ్లాకులుగా విభజించారు. వీటికి 9 బ్రాంచ్‌ కెనాల్స్‌ కలిగి 5342 కి.మీ. పంటలకు నీటిని అందిస్తోంది. దీనికితోడు ఫీల్డ్‌చానల్స్‌ ద్వారా 14,400 కి.మీ. పంటలకు నీరు అందుతోంది.

లాల్‌బహుదూర్‌ కెనాల్‌

జై జవాన్‌.. జై కిసాన్‌ అని నినాదించిన మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాసి్త్ర జ్ఞాపకార్థం సాగర్‌ ఎడమ కాలువకు లాలా బహుదూర్‌ కెనాల్‌ అని నామకరణం చేశారు. ఈ కాలువకు 1959లో అప్పటి రాష్ట్ర గవర్నర్‌ భీమ్‌సేన్‌ సచార్‌ శంకుస్థాపన జరుపగా కుడి కాలువతోపాటే ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న ప్రారంభోత్సవం చేశారు. ఈ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తోంది. మొత్తం 297కి.మీ. పరిధిలోని పొలాలకు సాగునీరు అందుతోంది. దీనికున్న 7బ్రాంచ్‌ కాలువల ద్వారా 7722 కి.మీ., ఫీల్డ్‌ చానల్స్‌ ద్వారా 9654 కి.మీ. పంట పొలాలను సస్యశ్యామలం చేస్తుంది. వీటికితోడు 26 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలయ్యే నీటితో కృష్ణాడెల్టా ప్రాంత రైతులకు పంట లు పండించేందుకు ఉపయోగకరంగా ఉంది.

జలవిద్యుత్కేంద్రాలు

నాగార్జునసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సేద్యపు నీటినే కాకుండా జలవిద్యుదుత్పత్తి చేసే కేంద్రంగా కూడా ప్రాధాన్యం పొందింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుపై నిర్మించిన 410 మెగావాట్ల ప్రధాన జలవిద్యుత్కేంద్రం, కుడి కాలువపై 90 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రం, ఎడమ కాలువపై 60మెగావాట్ల జలవిద్యుత్కేంద్రాలను నిర్మించారు. వీటికితోడు కుడికాలువపై హైడల్‌ పవర్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రాష్ట్రంలో సాగు, తాగునీటితోపాటు విద్యుత్‌ కొరతను కూడా తీరుస్తోంది. అందుకే దీనిని బహుళార్థ సాధక ప్రాజెక్టు అని కూడా అంటారు.

ప్రపంచ పర్యాటక కేంద్రంగా...

నాగార్జునసాగర్‌ ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా పేర్గాంచింది. కృష్ణానది లోయలో మహాయాన బౌద్ధమత విస్తరణకు ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన యూనివర్సిటీ ప్రపంచంలో బౌద్ధ మత వ్యాప్తికి ఎంతో దోహదం చేసింది. క్రీస్తు శకం రెండవ శతాబ్ధంలోని శాతవాహన కాలంనాటి జీవనశైలి, మూడవ శతాబ్ధం నాటి ఇక్ష్వాకుల రాజధానిగా విజయపురి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఏకైక ఐలాండ్‌ మ్యూజియంగా ఉన్న నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల, ప్రధాన జలవిద్యుత్కేంద్రాలను, కుడి, ఎడమ కాలువలను, మోడల్‌ డ్యాంను చూసేందుకు ప్రతిరోజూ వందలాది మంది దేశవిదేశీ పర్యాటకులు నాగార్జునసాగర్‌ రావడంతో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు

10 వేల మంది కూలీల ప్రాణ త్యాగం
కొన్ని వేల మంది నిరంతర కృషి
తెలుగుజాతి స్వప్నసాకారం

నల్గొండ  వరం

ప్రపంచంలోనే మానవ నిర్మిత అతిపెద్ద‌ రాతి కట్టడం నాగార్జున సాగర్

కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. తెలంగాణలో నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.

నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్‌గా ప్రసిద్ధి చెందింది. నాగార్జునసాగర్ పట్టణము మూడు భాగములుగా విభజించబడింది. ఆనకట్టకు దక్షిణాన విజయపురి సౌత్ (వీ.పీ.సౌత్) (గుంటూరు జిల్లా), ఆనకట్ట దాటిన వెంటనే ఉత్తరాన పైలాన్ (నల్గొండ జిల్లా), ఉత్తరాన కొండ మీద హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి.

 సాగర్‌ డ్యామ్‌ విశేషాలు

మొత్తం రాతి కట్టడం పొడవు - 4,756 అడుగులు
ఎడమ వైపు మట్టికట్ట పొడవు - 8,400 అడుగులు

కుడి వైపు మట్టి కట్ట పొడవు - 2,800 అడుగులు
మొత్తం ఆనకట్ట పొడవు - 15,956 అడుగులు
రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు - 26
ఒక్కొక్క దాని ఎత్తు, పొడవు - 4,445 అడుగులు
గరిష్ఠ నీటి మట్టం - 590 అడుగులు
డెడ్‌ స్టోరేజీ లెవల్‌ - 490 అడుగులు
సాగర్‌ వద్ద సముద్ర మట్టం - 246 అడుగులు
స్పిల్‌వే వరకు డ్యామ్‌ ఎత్తు - 546 అడుగులు
రిజర్వాయరు వైశాల్యం - 110 చదరపు మైళ్ళు
జల విద్యుదుత్పాదన కేంద్రాలు
ప్రధాన జలవిద్యుదుత్పాన కేంద్రం - 1
110 మెగావాట్లు - 7

సగటున ఏడాదికి విద్యుదుత్పాదన - 1,230 మిలియన్‌ యూనిట్లు

కుడి కాల్వ జలవిద్యుదుత్పాదన కేంద్రం 3130 మెగావాట్లు

సగటున ఏడాదికి విద్యుదుత్పాదన - 292 మిలియన్‌ యూనిట్లు

ఎడమ కాల్వ జలవిద్యుదుత్పాన కేంద్రం - 230 మెగావాట్లు

సగటు విద్యుదుత్పాదన - 127 మిలియన్‌ యూనిట్లు

 

డ్యామ్‌ నిర్మాణంలో ముఖ్యమైన సంఘటనలు

 

1903 - కృష్ణానదిపై డ్యామ్‌ నిర్మాంచాలన్న ఆలోచన

1-4-1954 - ఆలోచనకు తుదిరూపం

10-12-1955 - ప్రాజెక్టుకు శంకుస్థాపన

10-2-1956 - డ్యామ్‌ నిర్మాణ పనులు ప్రారంభించింది.

5-1967 - స్పిల్‌వే వరకు డ్యామ్‌ నిర్మాణం పూర్తి

4-8-1967 - ఎడమ కుడి కాల్వలకు నీటి విడుదల

15-5-1968 - రాతి కట్టడానికి ఆఖరి రాయి వేసిన రోజు

17-10-1974 రిజర్వాయరు 590 అడుగుల వరకు నింపిన తేదీ

 

డ్యామ్‌ నిర్మాణంలో నమ్మలేని నిజాలు

 

* నాగార్జున సాగర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం 73 కోట్ల రూపాయలు మాత్రమే

రోజుకు 45వేల మంది కార్మికులు 12 ఏళ్ళపాటు శ్రమించి ప్రాజెక్టు నిర్మించారు.

సుమారు 10వేల మంది కార్మికులు మృతి చెంది ఉండవచ్చని అంచనా

జలాశయం విస్తీర్ణంలో ప్రపంచంలోనే మూడవ స్థానం ఆక్రమించింది. రాతి కట్టడాలలో ప్రపంచంలోనే మొదటి స్థానం

నీటి విడుదలలో సాగర్‌ కుడి కాల్వ ప్రపంచంలో మొదటిది

పురావస్తు తవ్వకాలలో బుద్దుని ధాతువు(శరీరంలో ఒక భాగం) సాగర్‌ రిజర్వాయరు ప్రాంతంలో లభించింది. ప్రస్తుతం నాగార్జున కొండ మ్యూజియంలో భద్రపరిచారు.

 

ఆయకట్టు వివరాలు

ప్రాజెక్టు కింద 5 జిల్లాల్లో తయారైన ఆయకట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

కుడి కాలువ

జిల్లా ఆయకట్టు,   ఎకరాల్లో

గుంటూరు జిల్లా     6,68,230

ప్రకాశం జిల్లా          4,43,180

మొత్తం               11,11,410

 

ఎడమ కాలువ:-

 

జిల్లా ఆయకట్టు,   ఎకరాల్లో

నల్గొండ జిల్లా        3,72,970

ఖమ్మం జిల్లా         3,46,769

కృష్ణా జిల్లా           4,04,760

మొత్తం              11,24,500

పెద్ద మొత్తం       22,35,910

ప్రాజెక్టు గణాంకాలు

డ్యాము పొడవు: 15,956 అ. (4863.388 మీ.)

ప్రధాన రాతి ఆనకట్ట పొడవు: 4756 అ. (1449.628 మీ.

మొత్తం మట్టికట్టల పొడవు: 11,200 అ. (3413.76 మీ.)

ఎడమ మట్టికట్ట పొడవు: 8400 అ. (2560.32 మీ.)

కుడి మట్టికట్ట పొడవు: 2800 అ. (853.44 మీ.)

మొత్తం క్రెస్టుగేట్ల సంఖ్య: 26

కుడి కాలువ పొడవు: 203 కి.మీ.

ఎడమ కాలువ పొడవు: 179 కి.మీ.

జలాశయ సామర్థ్యం

నాగార్జున సాగర్ జలాశయం

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 408 టి.ఎం.సి. (శతకోటి ఘనపుటడుగులు-థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్)

కనీస స్థాయి నిల్వ: 213 టి.ఎం.సి.

విద్యుదుత్పత్తి సామర్థ్యం

నాగార్జున సాగర్ జలాశయము

విద్యుదుత్పత్తికై నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మూడు కేంద్రాలున్నాయి. వీటి మొత్తం ఉత్పాదక సామర్థ్యం 960 మె.వా. (మెగా వాట్లు)

నది దిగువకు నీరు విడుదలయ్యే చోట నిర్మించిన కేంద్రంలో: 810 మె.వా.,

కుడి కాలువకు నీరు విడుదలయ్యే చోట: 90మె.వా.,

ఎడమకాలువకు నీరు విడుదలయ్యే చోట: 60 మె.వా.

ఉత్పత్తి సామర్థ్యం గల కేంద్రాలు ఉన్నాయి.

 ఆధునిక ప్రపంచములోని మానవనిర్మిత నీటిపారుదల ప్రాజెక్ట్ లలో ''అత్యధ్భుతమైన'' నిర్మాణం..నాగార్జునసాగర్ డ్యాం.ఈప్రాజెక్ట్ నల్గొండ..గుంటూరు జిల్లాల సరిహద్దులలో నిర్మించబడినది. 1955 డిసెంబరు 10 వ తేదీ మన మొదటి ప్రధానమంత్రి శ్రీజవహర్ లాల్ నెహ్రూ గారు ఈప్రాజెక్ట్ కు శంకుస్ధాపన చేశారు.1967 వ సం.లో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ చేత ఈడ్యాం  ప్రారంభించబడినది.

         ఈ అధ్భుత నిర్మాణం ఎత్తు 124 మీటర్లు. పొడవు 1550 మీటర్లు.ఈడ్యాం నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు 132 కోట్ల రూపాయలు. దీనికి చీఫ్ ఇంజనీరు గా కృష్ణా జిల్లా కు చెందిన కె.యల్ రావు గారు పనిచేశారు.

             1964 సం.లో తీసిన ''రాముడు భీముడు'' సినిమాలో యన్.టి.రామారావు గారితో చిత్రీకరించిన "దేశమ్ముమారిందోయ్.. కాలమ్ము మారిందోయ్.." అను పాట నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణసమయంలో అక్కడే షూ టింగ్ చేశారు.

Nov 3, 2020

తెలుగులో ఉత్తమ పుస్తకాలు


●కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

●మహాప్రస్థానం - శ్రీశ్రీ

●ఆంధ్ర మహాభారతం - కవిత్రయం

●మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ

●చివరకు మిగిలేది - బుచ్చిబాబు

●అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్

●అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

●కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి

●వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ

●కళాపూర్ణోదయం - పింగళి సూరన

●సాక్షి - పానుగంటి లక్ష్మీ నరసింహారావు

●గబ్బిలం - గుఱ్ఱం జాషువా

●వసు చరిత్ర - భట్టుమూర్తి

●అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు

●అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి

●అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు

●చదువు - కొడవగంటి కుటుంబరావు

●ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు

●కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి

●వేమన పద్యాలు – వేమన

●కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి

●మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి

●అల్పజీవి – రావిశాస్త్రి

●ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

●ఆంధ్ర మహాభాగవతం – పోతన

●బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి

●మొల్ల రామాయణం – మొల్ల

●అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య

●హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

●కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య

●మైదానం – చలం

●వైతాళికులు – ముద్దుకృష్ణ

●ఫిడేలు రాగాల డజన్ – పఠాభి

●సౌందర నందము - పింగళి, కాటూరి

●విజయవిలాసం - చేమకూర వేంకటకవి

●కీలుబొమ్మలు - జివి కృష్ణారావు

●కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు

●మ్యూజింగ్స్ – చలం

●మనుచరిత్ర- అల్లసాని పెద్దన

●పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ

●ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి

●పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు

●సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర

●దిగంబర కవిత - దిగంబర కవులు

●ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ

●పానశాల - దువ్వూరి రామిరెడ్డి

●శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు

●అంపశయ్య – నవీన్

●చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య

●గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం

●జానకి విముక్తి – రంగనాయకమ్మ

●స్వీయ చరిత్ర – కందుకూరి

● మహోదయం - కెవి రమణారెడ్డి

●నారాయణరావు - అడవి బాపిరాజు

●విశ్వంభర – సినారె

●దాశరథి కవిత – దాశరథి

●కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

●నేను.. నా దేశం - దర్శి చెంచయ్య

●పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం

●ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి

●పారిజాతాపహరణం - నంది తిమ్మన

●పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు

●రాజశేఖర చరిత్ర – కందుకూరి

●రాధికా సాంత్వనము - ముద్దు పళని

● స్వప్న లిపి – అజంతా

●సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి

●శృంగార నైషధం – శ్రీనాథుడు

●ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు

●విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు

●అను క్షణికం - వడ్డెర చండీదాస్

●ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ

●చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి

●చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి

●చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్

●గద్దర్ పాటలు – గద్దర్

●హాంగ్ మీ క్విక్ - బీనాదేవి

●ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్

●కుమార సంభవం - నన్నే చోడుడు

●మైనా - శీలా వీర్రాజు

●మాభూమి - సుంకర, వాసిరెడ్డి

●మోహన వంశీ – లత

●రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి

●రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి

●సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

●సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి

●సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం

●స్వేచ్ఛ – ఓల్గా

●కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

●వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

●తృణకంకణం – రాయప్రోలు

●హృదయనేత్రి - మాలతీ చందూర్

●బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్

●నీతి చంద్రిక - చిన్నయ సూరి

●తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

●నీలిమేఘాలు – ఓల్గా

●అడవి ఉప్పొంగిన రాత్రి – విమల

●చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్

●కొయ్య గుర్రం – నగ్నముని

●నగరంలో వాన – కుందుర్తి

●శివారెడ్డి కవిత – శివారెడ్డి

( సేకరణ :--వెంకటప్పయ్య టేకుమళ్ళ)

Oct 31, 2020

సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకోవాలి

బోంబే ఐఐటి విద్యార్ధులతో   చంద్రబాబు 

‘‘గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్’’ ఆన్ లైన్ సమావేశంలో శనివారం మధ్యాహ్నం బోంబే ఐఐటి విద్యార్ధులను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సామర్ధ్యం బైటపడుతుంది. సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకుంటే ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలుస్తారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొన్న తీరుతెన్నులను బట్టే రాబోయే రోజుల్లో వివిధ దేశాలు ముందంజ వేస్తాయి.  ఎవరైతే కరోనాను సమర్ధంగా ఎదుర్కొన్నారో వారికి నష్టాలు తగ్గాయి, ఎదుర్కోలేనివాళ్లు అనేక ఇబ్బందులకు గురయ్యారు.  కరోనా కారణంగా ఆర్ధిక సమస్యలు పెరిగాయి, ఆత్మహత్యలకు పాల్పడ్డారు,మానసిక శారీరక ఇబ్బందులు పడ్డారు. కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు కూడా వెళ్లలేని దుస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో మా వంతు బాధ్యతగా ప్రతివారం కేంద్రానికి నివేదికలు పంపాం. ప్రభుత్వ విధానాల రూపకల్పనకు దోహదం చేశాం. కరోనాపై తొలిరోజునుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాను. జనవరిలోనే అప్రమత్తం చేశాను. కరోనా విజృంభిస్తే సమాజానికి వాటిల్లే కష్టనష్టాలను వివరించాం. డిజిటల్ వర్కింగ్ ను ప్రోత్సహించాం, మాస్క్ విధిగా ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రజలను చైతన్యపరిచాం. 


మా తరం దేశ స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పుట్టినవాళ్లం. మీ యువతరం ఆర్ధిక సంస్కరణల ముందు, తర్వాత పుట్టినవాళ్లు.  1991లో టైమ్స్ మ్యాగజైన్ లో ‘‘ప్రపంచ ఆర్ధిక సవాళ్లను భారతదేశం ఎదుర్కోగలదా’’ అనే వ్యాసం  మమ్మల్నెంతో అసంతృప్తికి గురిచేసింది. దానినొక సవాల్ గా తీసుకునేలా చేసింది. ఆర్ధిక సంస్కరణలకు ముందు మనదేశంలో ఏకపార్టీ పాలన ఉండేది. తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల పాలన వచ్చింది. ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టినప్పుడు పెట్రోల్ డీజిల్ దిగుమతులకు కూడా ఆర్ధిక కటకట. బంగారం కూడా కుదవబెట్టిన పరిస్థితులు. ఆ స్థితినుంచి ఇప్పుడు ఈ స్థాయికి చేరాం, భవిష్యత్తులో ప్రపంచంలోనే తొలిరెండు స్థానాల్లో భారతదేశం చేరనుంది. 

     1991లో ఆర్ధిక సంస్కరణలు, 1995లో తాను సీఎం కావడం, 1996లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు, ఏపిలో సెకండ్ జనరేషన్ రిఫామ్స్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. తొలిసారి సీఎం కాగానే విజన్ 2020 రూపొందించానని, 20ఏళ్ల ముందు ఆలోచనలు చేయడం ఏమిటనే కొందరి సందేహాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా చేసిన కృషి వివరించారు.  హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్ సిటి ఐటి రంగంలో విప్లవాత్మక మార్పులు తేగా, సైబర్ టవర్స్ ఐటి అభివృద్దికే నమూనా అయ్యింది. ఆర్ధికంగా ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి దోహదం చేసింది. సియాటెల్ తర్వాత రెండవ బేస్ గా హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈవో ఆంధ్రప్రదేశ్ నుంచే, గూగల్ సిఈవో ఇండియా నుంచే, అనేక సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అంతా మనదేశం నుంచే కావడం విశేషం. హైదరాబాద్ లో అప్పుడు అభివృద్ది చేసిన బయో టెక్నాలజీ పార్క్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా ముందంజలో ఉండటం, 8లేన్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు,  దేశానికే 4% జిడిపి ఇచ్చే స్థాయికి హైదరాబాద్ చేరేందుకు ఇవన్నీ దోహదపడ్డాయి.రాష్ట్ర విభజన తర్వాత 13జిల్లాల ఏపికి ఆర్ధిక కష్టాలు..రాజధాని లేదు, బస్సులోనుంచే పరిపాలన.. పట్టుదలతో పనిచేసి 10.5% వృద్దిరేటు సాధించాం, జాతీయ వృద్దిరేటు 7.3% ఉంటే దానికన్నా మూడు నాలుగు రెట్లు ముందున్నాం. వరుసగా 4ఏళ్లు రెండంకెల వృద్ది సాధించాం. వ్యవసాయం అనుబంధ రంగాల్లో 17% వృద్ది సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 4ఏళ్లు నెంబర్ వన్ గా నిలబడ్డాం. రూ 15.48లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబట్టాం, దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డిఐ కియా ఏపికి తెచ్చాం. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం, పట్టుదలగా పనిచేయడం ద్వారానే పురోగతిని సాధించాం. గత 30ఏళ్లలో సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రాబోయే 30ఏళ్ల అభివృద్ధి వైపు మనందరి దృష్టి ఉండాలి. 2050నాటికి ఎలా ఉండాలన్న ఆలోచన చేయాలి. 

గతంలో ‘‘ప్రి రిఫామ్స్, పోస్ట్ రిఫామ్స్’’ గా అభివృద్ది చరిత్ర రాసినట్లే, ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్’’ గా అభివృద్ది చరిత్ర తిరగరాసే పరిస్థితులు ఉన్నాయి. కోవిడ్ తెచ్చిన మార్పులను అందిపుచ్చుకోవాలి. మన విజన్ ఎప్పుడూ దూరదృష్టితో ఉండాలి. మరో 30ఏళ్ల ముందు ఆలోచనలు చేయాలి. 30ఏళ్ల తర్వాత నువ్వెలా ఉంటావు, దేశం ఎలా ఉంటుంది, మన విజన్ ఎలా ఉండాలి, అది సాధించడానికి నువ్వేం చేయాలి, దేశానికేం ఇవ్వాలి, సమాజానికేం ఇవ్వాలి అనేదానిపై మన ఆలోచనలు, కార్యాచరణ ఉండాలి. మనం ఏది సాధించాలని అనుకున్నా దానికో విజన్ ఉండాలి. ప్రతి విజయానికి ఒక విజన్ ఉంటుంది.  మీ అందరికీ ‘‘మెగా మైండ్ సెట్’’ ఉండాలి. భారతదేశం మెగా సూపర్ పవర్ గా ఎదిగేలా మీరంతా మెగా సూపర్ పవర్ గా ఎదగాలి.. ఇప్పుడు నడుస్తోన్న పారిశ్రామిక విప్లవం 4.0లో మీ భాగస్వామ్యంపై ఆలోచన చేయాలి. దీనికంటె ముందు 4 పారిశ్రామిక విప్లవాల వృద్ది పరిణామ క్రమం చూడాలి. 4వ పారిశ్రామిక విప్లవంలో అనూహ్య మార్పులు వచ్చాయి. మిషన్ టూల్స్, డేటా సెంటర్ వచ్చాయి. 

పర్యావరణ హిత వాతావరణం, ఆటోమోటెడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వృద్ది నేపథ్యంలో కాలుష్య రహిత సమాజం కోసం మీరంతా దృష్టి పెట్టాలి.  4.0పారిశ్రామిక విప్లవంలో సాంకేతికత, టూల్స్ వినియోగం అందిపుచ్చుకోవాలి. ఇంటర్నెట్ రాకముందు అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం పంపాలంటే 3, 4రోజులు పట్టేది. ఫోన్ లో మాట్లాడాలంటే వందల రూపాయల ఖర్చయ్యేది. అలాంటిది ఇంటర్నెట్ అభివృద్ది చెందాక ప్రపంచమే గ్లోబల్ విలేజిగా మారింది. గతంలో ఉపాధ్యాయులనుంచి పాఠాలు నేర్చుకునేవాళ్లం. ఇప్పుడు అధ్యాపకులకే పాఠాలు చెప్పే పరిస్థితిలో విద్యార్ధులు ఉన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గతంలో అక్షరాస్యులు, నిరక్షరాస్యులుగా ఉండే వర్గీకరణ ఇప్పుడు ఐటి లిటరేట్, ఐటి ఇల్లిటరేట్ గా మారింది.  ఒకప్పుడు రూ 14 ఉండే సోలార్ పవర్ యూనిట్ తర్వాత రూ 7కు, ఇప్పుడు  రూ 2.50కు వచ్చింది. భవిష్యత్తులో సోలార్ పవర్ యూనిట్ రూపాయి, రూపాయిన్నరకే వచ్చే అవకాశం. ప్రకృతే సహజ ఇంధన ఉత్పాదన వనరు..

సమాజంలో ఏవిధంగా వినూత్న మార్పులు వస్తున్నాయో ఇవే ప్రబల సాక్ష్యాలు. జలవిద్యుత్ సీజనల్ కాబట్టి, థర్మల్ పవర్ తప్ప మార్గాంతరం లేదని గతంలో భావించారు. ఇప్పుడు సోలార్ పవర్, విండ్ పవర్, సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరులు వచ్చాక థర్మల్ పవర్ తెరమరుగు అవుతోంది.

పర్యావరణహితంగా సమాజంలో వచ్చే మార్పులను స్వాగతించాలి, అనుసరించాలి.


ప్రతి రైతు ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదకుడిగా మారే పరిస్థితి.. వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ సెట్ నుంచి తమ పంటలకు కరెంటు పొందడమే కాకుండా గ్రిడ్ కు కూడా అమ్మే పరిస్థితి. ఉచిత విద్యుత్ తాను పొందడమే కాకుండా ఉత్పత్తి చేసిన విద్యుత్ ద్వారా రాబడి రైతు పొందే స్థితి. ఇకపై విద్యుత్ సరఫరా, పంపిణీ(టిఅండ్ డి) నష్టాలకు కాలం చెల్లే పరిస్థితి. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు కరెంటు ద్వారా నడిపే పరిస్థితి. విశాఖ విషయం చూడండి. ప్రి- హుద్ హుద్, పోస్ట్- హుద్ హుద్ గా విశాఖ అభివృద్ది ముఖచిత్రం మారిపోయింది. హుద్ హుద్ సృష్టించిన బీభత్సం తెలిసిందే. విపత్తులను మనం ఆపలేం గాని, మానవ ప్రయత్నంతో విపత్తు నష్టాలను తగ్గించగలం. 8రోజులు విశాఖలోనే మకాం వేసి పరిస్థితులను చక్కదిద్దాం. 

హైదరాబాద్, సికింద్రాబాద్ కు ధీటుగా సైబరాబాద్ నిర్మాణం చేశాం. హైదరాబాద్ లో 30ఇంజనీరింగ్ కళాశాలలను 300 చేశాం. ఇంజనీరింగ్ కాగానే వాళ్ల ఉపాధిపై దృష్టి పెట్టాం. అందుకే ఐటి అభివృద్దికి నాందిపలికాం. నాతో సమావేశానికి నిరాకరించిన బిల్ గేట్స్ 40నిముషాలు నాతో చర్చలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ బేస్ పెట్టాలనేది తప్ప మరొకటి కోరలేదు. ఇప్పుడదే మైక్రోసాఫ్ట్ కు సిఈవో ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడు కావడం విశేషం.  హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మించాలన్న ఆలోచన రాగానే, దేశవిదేశాల్లో 20ఎయిర్ పోర్టులు పరిశీలించాం, 20నమూనాలు రూపొందించాం. ఆ తర్వాతే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టాం.  అదే స్ఫూర్తితో అమరావతి అభివృద్దికి శ్రీకారం చుట్టాం. గ్యాస్, పవర్, ఫోన్, కేబుల్ కు ఐసిటి డక్ట్స్..సీవరేజ్ వాటర్ అండర్ గ్రవుండ్ పైపులైన్లతో రాజధాని నగర నిర్మాణానికి నాంది పలికాం. నదుల అనుసందానం కల నిజం చేశాం. కృష్ణా గోదావరి నదుల అనుసందానం చేశాం. గోదావరి పెన్నా అనుసందానికి నాంది పలికాం. పంచనదుల అనుసందానమే లక్ష్యంగా పెట్టుకున్నాం. జీరో బడ్జెట్ ఫార్మింగ్ ను ప్రోత్సహించాం. రసాయన ఎరువులు లేని సేంద్రియ పంట ఉత్పత్తుల వైపు రైతులను మళ్లించాం. సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పాదన వల్ల మన జీవన ఆయుర్దాయం మరింత మెరుగవుతుంది.సమాజంలో వచ్చే మార్పులకు మీరే చోదకుల్లాగా ఉండాలి. అందుకు తగిన నాయకత్వ సామర్ధ్యాన్ని పెంచుకోవాలి.ఆలోచన ఉండాలి, విజన్ ఉండాలి, కార్యాచరణ అనేది అతి ముఖ్యం.‘‘2050నాటికి భారతదేశంలో చోటుచేసుకున మార్పుకు నేను ఏవిధంగా దోహద పడగలను అనేది’’ ప్రతిరోజూ నిద్రించే ముందు ఒక నిముషం ఆలోచించాలి. ఆ విధమైన నిద్రలేని రాత్రులే మిమ్మల్ని ఈ మార్పుకు నాయకుడిగా తీర్చిదిద్దుతాయి.

ఓటమి భయం ఉండకూడదు.  రిస్క్ లను ముందే ఊహించి ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యం చేరాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ మానవీయ విలువలను కోల్పోరాదు. ఎప్పటికప్పుడు ప్రతిఒక్కరూ అప్ గ్రేడ్ కావాలి. మీ మైండ్ సెట్ ను మార్చుకోవాలి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత, పరికరాల వినియోగంపై పట్టు సాధించాలి. సాంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించాలి, దానిని ప్రోత్సహించాలి, పోటీతత్వంతో, నైపుణ్యాభివృద్దితో ముందడుగు వేయాలి. సరైన విజన్ ఉన్నప్పుడే మన లక్ష్యసాధన, దిశానిర్దేశం ఉంటుంది. మన జీవితానికి దిక్సూచి, లక్ష్య సాధన ద్వారా మన కలల సాఫల్యానికి శక్తి మన విజన్.  

మన కలలు నెరవేర్చే విజన్ ఉండాలి, దానికి తగిన కార్యాచరణ ఉండాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో అద్భుత నాయకుడిగా ఎదగగలరు.  తద్వారా మీ సాధికారతతోపాటు దేశ సాధికారత సాధ్యమయ్యేలా ఉభయతారకంగా మీ అందరి ఎదుగుదల ఉండాలి. మీ ఎదుగుదల కోసం ఒక విజన్ రూపొందించుకోండి. మెగా మైండ్ సెట్ ద్వారా దానిని చేరుకోండి. సూక్ష్మస్థాయిలో ప్లానింగ్ చేయండి, స్థూలంగా కార్యాచరణ చేయండి. అప్పుడే మీరు మీమీ రంగాల్లో అద్భుత నాయకుల్లాగా ఎదుగుతారు.

2050 వైపు మీ ప్రయాణంలో ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే,  ‘‘నేను కాలాన్ని మార్చగలనా, లేక కాలమే నన్ను మార్చుతుందా..?’’ అని...

ఇరవై ముప్పై ఇళ్లు ఉండే కుగ్రామంలో నేను పుట్టాను. రోడ్డు, కరెంటు వసతులు లేని పల్లె నుంచి నేను వచ్చా. మనం ఎక్కడనుంచి వచ్చినా, ఏ స్థాయికి చేరామన్నది మన కృషిని ప్రతిబింబిస్తుంది. 

సామాన్యుడైన అబ్దుల్ కలామ్ అసామాన్యుడిగా ఎదిగారు, దేశానికే స్ఫూర్తిదాయకుడు అయ్యారంటే అదే..

నాకే అన్నీ తెలుసు అనుకోరాదు. ప్రతి రోజూ నేను నేర్చుకుంటున్నా అనే భావంతో ముందుకెళ్లాలి.  పంపు సెట్ దగ్గరకు రైతు వెళ్లాల్సిన పనిలేకుండా ఇంటినుండే రైతు ఆపరేట్ చేసే స్థితి..

రాబోయే కాలంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు, పరికరాలు, ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడంలోనే మన సామర్ధ్యం, ఎదుగుదల ఆధారపడి ఉంటాయి.

డబ్బులేదనే చింత ఉండకూడదు. విజ్ఞానమే ధనం కన్నా మిన్న..100ఎకరాల భూమి ఇచ్చినా బిడ్డ అసమర్ధుడైతే నిలబెట్టుకోలేడు. అదే బిడ్డ విజ్ఞానవంతుడిని చేస్తే అతనికన్నా ధనికుడు ఉండరు.

ఏ కష్టానికి భయపడరాదు. సంక్షోభాన్ని అధిగమించడంలోనే సామర్ధ్యం. మీ అందరినీ ఉజ్వల భవిష్యత్తులో చూడాలన్నదే నా ఆకాంక్ష.మీ వ్యక్తిత్వం, మీ ఉద్యోగం, మీ విజ్ఞానం మీ ఎదుగుదలకే కాదు, సమాజాభివృద్దికి, దేశ ప్రగతికి దోహదం చేస్తుంది.యువ జనాభా అధికంగా ఉండటం, సాంకేతికతను అందిపుచ్చుకునే పరిజ్ఞానం పుష్కలంగా ఉండటం, గణితం, ఆంగ్లంలో అభినివేశం భారతదేశానికి ఎనలేని సానుకూలతలు..పోస్ట్ కోవిడ్ సానుకూలతలను భారతదేశం సద్వినియోగం చేసుకుంటుంది. 

ఏ రంగంలోనైనా నాయకులకు దీర్ఘదృష్టి ఉండాలి. భవిష్యత్ లో వచ్చే మార్పులను ఊహించగలగాలి.  రాబోయే రోజుల్లో వినూత్న ఆవిష్కరణలపై ఆలోచనలు చేయాలి. స్ఫూర్తిదాయక సమయంలో మనం ఉన్నాం. అభివృద్దే మనందరికి స్ఫూర్తి.తమ ప్రతిభా ఉత్పత్తులలో యువతరం మంచిపేరు పొందాలి. మన గొప్ప వారసత్వ సంపద నిలబెట్టాలని’’ చంద్రబాబు ఆకాంక్షించారు. 


వెబినార్ లో విద్యార్ధుల పలు ప్రశ్నలకు చంద్రబాబు జవాబిచ్చారు. ‘‘ సోషల్ మీడియా వచ్చాక ఫేక్ న్యూస్(అసత్య వార్తలు, తప్పుడు కథనాలు) పెరగడం ఆందోళనకరం. వాస్తవిక అభివృద్దిని ఇవి కొద్దికాలమే కనుమరుగు చేయవచ్చు. కానీ అభివృద్దిని ఎవరూ దాచిపెట్టలేరని’’ అన్నారు.

ప్రశ్నించిన విద్యార్ధి మురళి చింతమనేని స్వగ్రామం వాయల్పాడు నీటి కొరత గురించి చంద్రబాబు గుర్తు చేశారు.

‘‘అనంతపురంలో నీటి సమస్య గురించి కియా వాళ్లు ప్రస్తావించారు. నీళ్లు ఇచ్చాకే ఫ్యాక్టరీ పెట్టమన్నాను..కొద్దిరోజుల్లోనే గండికోట నుంచి నీళ్లిచ్చి చూపించాం, ఆ తర్వాతే కియా నెలకొల్పారు. ఇప్పుడు కియా కార్లు రోడ్లపై తిరుగుతుంటే ఆ సంతృప్తి వేరని’’  చంద్రబాబు పేర్కొన్నారు.

Oct 26, 2020

భార్య లేని భర్త పరిస్థితి

 భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు. అలుగుతారు. తిడతారు. కొందరు ప్రబుద్ధులైతే నానా ర‌కాలుగా చిత్ర‌హింస‌లు పెడ‌తారు.  అన్నింటినీ భరించే భార్యను ‘టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’గా తీసుకుంటారు!! ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం.. తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు! ‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం!! అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు.. ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.. అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు!!        

                                                                                                                                                     ‘‘నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు. ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని. ‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా?’ అనుకోకు. వుంటారు. నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం. ఉరిమితే భయం. మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు?’’...ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది!                                                 

   నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక  కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.                                                                                                                                                  ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం.. భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.                                                                                                                                                                                                        దాంపత్యం అంటే.:- రెండు మనసుల కలయిక. మరణం ఆ బంధాన్ని వేరు చేస్తే.. ఓ భాగస్వామి దూరమైతే.. మిగిలి ఉన్నవారి మనసు కకావికలమవుతుంది. స్త్రీ, పురుషులెవరికైనా ఆ బాధ ఒకటే. కానీ శేషజీవితాన్ని గడపడంలో మాత్రం తేడాలు కనపడతాయి. భర్త దూరమైనా భార్య తట్టుకుని జీవించగలదు. కానీ.. పురుషులు కుటుంబ సభ్యులతో కలిసిపోలేరు. మానసికంగా ఒంటరులైపోతారు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.   

కావాల్సింది సహకారం.. వ్యాపకం:- కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే భార్య గతించి ఏళ్లు గడిచినా ఉత్సాహంగా ఉన్నవారు ఉన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే.. ‘నా వయసు 90 ఏళ్లు. నా భార్య ఎన్నో ఏళ్ల క్రితమే మరణించింది. కొడుకు, కూతురు రమ్మన్నారు. కానీ, వెళ్లాలని అనిపించలేదు. అందుకే మా వూరిలో ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నా. ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతున్నాను. ఇప్పుడు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండటంతో అమ్మాయి ఇంటికి వచ్చేశా. ఆ భగవంతుడి పిలుపుకోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ఓ పెద్దాయన చెప్పుకొచ్చారు. 

‘నా వయసు 92 ఏళ్లు. భార్య పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి నా కోడలు నన్ను కన్న తండ్రిలా సాకుతోంది. సాయంత్రంపూట గుడికి వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తాను. ఖాళీగా ఉండకుండా పుస్తకాలు చదవుతుంటాను, రాస్తుంటాను’ అని చెప్పుకొచ్చారు రఘురామ్‌ అనే మరో వృద్ధుడు.                           

  అధ్యయనంలోనూ అదే తేలింది:-  2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. అదేంటంటే.. భర్తను కోల్పోయిన మహిళలతో పోలిస్తే, భార్యను కోల్పోయిన పురుషులు త్వరగా చనిపోయే అవకాశం 30 శాతం ఎక్కువని! భర్త చనిపోతే బాధ ఉంటుంది గానీ.. దాన్ని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం మహిళలకు ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు.  

ఇలా చేస్తే కొంత బెటర్‌:-

1.చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. వారి ఆటపాటలు.. చిలిపి చేష్టలు వయసు మళ్లిన వారికి ఆనందాన్ని కలిగించటమే కాదు.. తమ చిన్న తనం నాటి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చి మరింత హుషారుగా మార్చేస్తాయి.

 2. వయసు పెరుగుతున్న కొద్దీ తమకంటూ ఒక ప్రపంచం ఉండాలి. ఎందుకంటే ఓ వయసు వచ్చిన తరువాత బయట సంబంధాలు తగ్గిపోతాయి. కుటుంబంలో కూడా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఆఖరికి మనవళ్లు, మనవరాళ్లు కూడా వారి ప్రపంచంలో వారుంటున్నారు. అందుకే తమ దైన ప్రపంచం సృష్టించుకోవాలి. అది తమ అభిరుచులకు తగినట్లుగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన హాబీ ఉండి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల ఆ హాబీని మూలన పడేసి ఉండొచ్చు. దాన్ని పైకి తీస్తే కాలక్షేపం అవుతుంది. 

3. లాఫింగ్‌ క్లబ్‌ లాంటి వాటిలో చేరటం లేదా సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఫలితం ఉంటుంది. 

4. స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. కొత్త స్నేహాలకు చేయిచాచాలి. ఇలాంటి వాటివల్ల కాస్తంత ఉపశమనం కలిగి బాధ నుంచి తేరుకునే శక్తి వస్తుంది.       

ఆధారపడడమే కారణం:- సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని.. తాను తప్ప ఆమెకు దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భార్య దగ్గర ఉన్న స్వతంత్రం కొడుకు, కోడళ్ల వద్ద ఉండదు. దానికి తోడు వయోభారం. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అన్నీ కలిసి కుంగుబాటుకు దారితీస్తాయి. నాణేనికి మరోవైపు చూస్తే.. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తగ్గించుకోవడం కారణంగా ఆరోగ్యంగా పూర్తి జీవితాన్ని గడపగలుగుతారని విశాఖ జీజీహెచ్‌ మానసిక వైద్యులు మురళీ కృష్ణ విశ్లేషించారు.                                                            

మహిళలే స్వతంత్రులు:- స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురుచూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే... భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.- ప్రొఫెసర్‌ రాజు, ఏయూ, సైకాలజీ     

 భావోద్వేగ బలం ఆమెదే:- పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్త్రీ భావోద్వేగాలప రంగా  బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది.

Oct 23, 2020

ప్ర‌సిద్ధిగాంచిన ప‌దప‌ల్ల‌వాలు

తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలు- అవి రాసిన ర‌చ‌యిత‌లు


"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".(శ్రీకృష్ణదేవరాయలు)


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు 

నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

దేవులపల్లి కృష్ణ శాస్త్రి


2. ‘‘కప్పివుంచితే కవిత్వం 

విప్పి చెబితే విమర్శ’’

డా.సి.నారాయణరెడ్డి


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ 

ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

కాళోజి


4. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’ 

నన్నయ


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

సుబ్బారావు పాణిగ్రాహి


6. ‘‘రాజే కింకరుడగు 

కింకరుడే రాజగు’’ 

బలిజేపల్లి లక్ష్మీకాంతం


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న 

వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

బసవరాజు అప్పారావు


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

గుర్రం జాషువా


9. ‘‘అత్తవారిచ్చిన నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

కాళ్ళకూరినారాయణరావు


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

దాశరధి


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

నార్ల వెంకటేశ్వర రావు


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

తిరుపతి వెంకట కవులు


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

గురజాడ


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

గరిమెళ్ళ సత్యనారాయణ


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

శ్రీనాథుడు


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

పోతన


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

గద్దర్


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

శ్రీ శ్రీ


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 వెన్నలకంటి


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

కొనకళ్ల వెంకటరత్నం


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

అల్లసాని పెద్దన

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

చేమకూరి వేంకటకవి


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

త్యాగయ్య


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

ధూర్జటి


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు’’ 

బద్దెన


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

వేమన


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

కంచర్ల గోపన్న


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

సుద్దాల హనుమంతు


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

ఆరుద్ర


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

వేముల శ్రీ కృష్ణ


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

త్రిపురనేని రామస్వామి


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

బాలాంత్రపు రజనీ కాంతరావు


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

అడవి బాపిరాజు


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

కరుణశ్రీ

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

గుడ అంజయ్య


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

అలిసెట్టి ప్రభాకర్


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

సావిత్రి


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

ఖాదర్ మొహియుద్దీన్


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

బాలగంగాధర తిలక్


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

అన్నమయ్య


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

ఏనుగు లక్ష్మణ కవి


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

పాలగుమ్మి విశ్వనాథం


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

చలం


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

విమల

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

నండూరి సుబ్బారావు


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

అందెశ్రీ


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

చెరబండరాజు

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

కందుకూరి రామభద్రరావు


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

నందిని సిధారెడ్డి


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

మిట్టపల్లి సురేందర్



Oct 20, 2020

దసరా పాట

ఇది ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు..కానీ వెనకటి తరానికి ఒక మధురానుభూతి.


దసరా వచ్చేసింది కదండి.

నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట.

 దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారి వెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే ఈ మన పాట ఆనాటివారికి గుర్తుకు రావలసినదే...

ఇదే ఆ దసరా పాట

పల్లవి-

1

ఏదయా మీదయ మామీద లేదు!

ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!

దసరాకు వస్తిమని విసవిసల బడక!

చేతిలో లేదనక  ఇవ్వలేమనక !

ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!

రేపురా మాపురా మళ్ళి రమ్మనక!

శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

2

పావలా బేడైతె పట్టేది లేదు!

అర్థరూపాయైతె అంటేది లేదు!

ముప్పావలైతేను ముట్టేది లేదు!

రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!

హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

3

అయ్యవారికి చాలు ఐదు వరహాలు!

పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!

మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!

శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

దసరా పండుగను గిలకల పండగంటారు. చక్కగా కొత్త దుస్తులు ధరించి  వెదురుతో చేసిన విల్లం బులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ కొందరైతే పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.

పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుస ల్లో పాడుతూ ప్రతి వాకిటా ఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైనఆచార మిది.

లోగుట్టు

ఒక వ్యక్తి అభివృద్ధి గాని కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.  ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు. వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతక డానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు. దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు. పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు. ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు  విద్యార్ధులకు  ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో. దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు. ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే.అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు. ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది.

టీడీపీ నూతన కమిటీలు

తెలుగుదేశం పార్టీ  కొత్త కమిటీలను   ఆ పార్టీ  అధినేత చంద్రబాబు  ప్రకటించారు. ఏపీ టిడిపి నూతన అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు నియామకమయ్యారు. తెలంగాణ అధ్యక్షుడుగా ఎల్ రమణని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 25 మందితో పోలిట్ బ్యూరో, 27 మందితో కేంద్ర కమిటీ నియామకం  చేశారు. 

టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు:

ప్రతిభా భారతి

గల్లా అరుణ కుమారి

డీకే సత్యప్రభ

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

మెచ్చా నాగేశ్వరరావు

చిలువేరు కాశినాథ్

 టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శులు: 

నారా లోకేష్

వర్ల రామయ్య

రామ్మోహన్ నాయుడు

నిమ్మల రామానాయుడు

బీద రవిచంద్ర

కొత్తకోట దయాకర్ రెడ్డి

బిక్కని నర్సింహులు

కంభంపాటి రామ్మోహన్

 టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు: 

యనమల రామకృష్ణుడు

అశోక గజపతిరాజు

అయ్యన్నపాత్రుడు

కేఈ కృష్ణమూర్తి

చినరాజప్ప

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కాల్వ శ్రీనివాసులు

నందమూరి బాలకృష్ణ

వర్ల రామయ్య

కళా వెంకట్రావు

నక్కా ఆనందబాబు

బుచ్చయ్య చౌదరి

బోండా ఉమ

ఎన్ ఎండి ఫరూక్

గల్లా జయదేవ్

ఆర్ శ్రీనివాస్ రెడ్డి

పితాని సత్యనారాయణ

కొల్లు రవీంద్ర

వంగలపూడి అనిత

గుమ్మడి సంధ్యారాణి

రావుల చంద్రశేఖర్ రెడ్డి

అరవింద్ కుమార్ గౌడ్

Oct 18, 2020

56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, చైర్ పర్సన్ల ప్రకటన

బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల పాలక మండళ్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. బీసీ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు , డైరెక్టర్ల పేర్లను ఆదివారం తాడేపల్లిలో మంత్రులు వెల్లడించా. మొత్తం 139 బీసీ కులాలకు  ప్రస్తుతం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో కార్పొరేషన్  చైర్మన్ లేక చైర్ పర్సన్‌తో పాటు 12 మంది డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించారు.

కార్పొరేషన్‌ల పాలక మండళ్ల ప్రకటన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శంకర్‌ నారాయణ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు పథకాలు వేగంగా అందించేందుకు ఈ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్లు ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. గతకొంతకాలంగా దీనిపై కసరత్తు చేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


బీసీ కార్పొరేషన్ల  ఛైర్మన్లు


పద్మశాలీ: విజయలక్ష్మి (కడప)

దేవాంగ : సురేంద్రబాబు (ప్రకాశం)

తొగట కార్పొరేషన్‌: గడ్డం సునీత (అనంతపురం)

రజక కార్పొరేషన్‌: రంగన్న (అనంతపురం)

కురుబ కార్పొరేషన్‌: కోటి సూర్యప్రకాశ్‌ బాబు (అనంతపురం)

కుంచిటి వక్కలిగ: డా.నళిని(అనంతపురం)

వన్యకుల క్షత్రియ: కె. వనిత (చిత్తూరు)

పాల ఎకరి: టి. మురళీధర్ (చిత్తూరు)

ముదళియర్ : తిరుపతూర్ గోవిందరాజు సురేష్ (చిత్తూరు)

ఈడిగ : కె.శాంతి (చిత్తూరు)

గాండ్ల : భవాణీ ప్రియ (తూ.గో)

పెరిక : పురుషోత్తం గంగాభవానీ (తూ.గో)

అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూ.గో)

అయ్యారక: రాజేశ్వరం (తూ.గో)

షేక్ : షేక్ యాసీన్ (గుంటూరు)

వడ్డెర: దేవల్లి రేవతి (గుంటూరు)

కుమ్మరి శాలివాహన: పురుషోత్తం(గుంటూరు)

కృష్ణ బలిజ/పూసల: కోలా భవాణీ (గుంటూరు)

యాదవ: హరీష్‌కుమార్ (కడప)

నాయిబ్రాహ్మణ : సిద్దవటం యానాదయ్య (కడప)

నూర్ బాషా దూదేకుల: అప్సరి ఫకూర్‌బి (కడప)

సాగర ఉప్పర : గనుగపేట రమణమ్మ (కడప)

విశ్వ బ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్ (కృష్ణా)

గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)

వడ్డెలు: సైదు గాయత్రి సంతోష్ (కృష్ణా)

భట్రాజు: గీతాంజలి దేవి (కృష్ణా)

వాల్మీకి బోయ: డా.మధుసూదన్ (కర్నూలు)

కుమి/కరికల భక్తుల: శారదమ్మ (కర్నూలు)

వీరశైవ లింగాయత్: రుద్రగౌడ్ (కర్నూలు)

ముదిరాజ్: వెంకటనారాయణ (నెల్లూరు)

జంగం: ప్రసన్న (నెల్లూరు)

బొందిలి : కిషోర్ సింగ్ (నెల్లూరు)

ముస్లిం సంచార జాతుల: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు)

చట్టాడ శ్రీవైష్టవ: మనోజ్‌కుమార్ (ప్రకాశం)

ఆరెకటిక: దాడ కుమారలక్ష్మి(ప్రకాశం)

మేదర : లలిత నాంచారమ్మ(ప్రకాశం)

కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం)

కళింగ కోమటి/ కళింగ వైశ్య: సూరిబాబు (శ్రీకాకుళం)

రెడ్డిక: లోకేశ్వరరావు (శ్రీకాకుళం)

పోలినాటి వెలమ: కృష్ణవేణి (శ్రీకాకుళం)

కురకుల/పొండర: రాజపు హైమావతి(శ్రీకాకుళం)

శ్రీసైన: చీపురు రాణి( శ్రీకాకుళం)

మత్స్యకార : కోలా గురువులు (విశాఖ)

గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ)

నగరాల: పిల్లా సుజాత (విశాఖ)

యాత: పి.సుజాత (విశాఖ)

నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)

తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం)

కొప్పుల వెలమ: నెక్కల నాయుడు బాబు(విజయనగరం)

శిష్ట కరణం: మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం)

దాసరి: రంగుముద్రి రమాదేవి (విజయనగరం)

సూర్య బలిజ: శెట్టి అనంతలక్ష్మి (ప.గో)

శెట్టి బలిజ: తమ్మయ్య (ప.గో)

అత్యంత వెనుకబడిన వర్గాల: వీరన్న (ప.గో)

అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌రావు(ప.గో)


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...