Apr 26, 2023

విజయవాడ దూరదర్శన్ న్యూస్ హెడ్ గా డాక్టర్ జీకే

విజయవాడ,విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రాల ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ గుత్తికొండ కొండలరావు (జీకే) పదోన్నతిపై  విజయవాడ దూరదర్శన్ కేంద్రం న్యూస్ హెడ్(డిప్యూటీ డైరెక్టర్)గా నియమితులయ్యారు. జర్నలిజంలో డాక్టరేట్ పొందిన కొండలరావుకు  రోజుకు 16 గంటలు జర్నలిస్టుగా పని చేయడం హాబీ. అటువంటి వ్యక్తికి  దూరదర్శన్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గా ప్రమోషన్ లభించడం తగిన వ్యక్తి తగిన పోస్టుగా భావించవచ్చు. బాబాయి, మెకానికల్ మెరైన్ ఇంజనీర్ గుత్తికొండ సత్యనారాయణ, చిన్నక్క స్వర్ణలతల ప్రోత్సాహం, ప్రోద్భలంతో కొండలరావు ఈ స్థాయికి ఎదిగారు.ఆంధ్రవిశ్వవిద్యాలయంలో  ఆచార్య పి.బాబీవర్థన్  ప్రోత్సాహం, సహాయసహకారాలతో జర్నలిజంలో డాక్టరేట్ పూర్తి చేశారు. ఆకాశవాణి వార్తా విభాగం అధిపతిగా కొండలరావు అలుపెరగని శ్రామికుడు.


  పశ్చిమగోదావరి జిల్లా తిరుపతి పురంలో 1965 మార్చి 10వ తేదిన  గుత్తికొండ సత్తిరాజు, గుత్తికొండ వెంకట నాగరత్నం గార్లకు డాక్టర్ గుత్తికొండ కొండలరావు జన్మించారు. తెలుగు కథకు ప్రపంచ ఖ్యాతిని సాధించిన పాలగుమ్మి పద్మారావు స్వగ్రామం కూడా ఇదే.  కొండలరావు  ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తిరుపతిపురం, బల్లిపాడు, అత్తిలిలో జరిగింది. ఆంగ్ల సాహిత్యంలో బీఏ నర్సాపురంలోని వైఎన్ కళాశాలలో చదివారు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పోస్టు గ్రాడ్యుయేషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు. పీహెచ్‌డీ కోసం ఆయన రాసిన ‘ట్రైబల్ అండ్ ఇంటర్‌నెట్’ అనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. జీకే మొదట్లో కొద్దికాలం ఈనాడులో పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్)కు ఎన్నికయ్యారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)లో ముంబై, విజయవాడలలో పని చేశారు. క్షేత్రస్థాయి ప్రచార విభాగం( డైరెక్టరేట్ ఫీల్డ్ పబ్లిసిటీ)లో శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతాల్లో, మత్స్యకార గ్రామాల్లో పని చేశారు. క్షేత్రప్రచారాధికారిగా జీకే ఉత్తర కోస్తాలో ఎంతో సేవచేశారు.  ఆ తర్వాత ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సేవలందించారు. 

తర్వాత విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారు. జర్నలిజం పట్ల ఆసక్తితోపాటు ఆ రంగంలో డాక్టరేట్ సాధించిన అనుభవంతో పని రాక్షసుడిలా ఆకాశవాణి కోసం పని చేశారు.కరోనా సమయంలో ఆకాశవాణిలో ‘జింగిల్స్’ వంటి కొత్త ప్రయోగాలతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.  12వేలకు పైగా జింగిల్స్ ప్రసారం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కరోనాపై శ్రోతలకు అవగాహన కల్పించడంలో కూడా కొండలరావు క‌ృషి అద్వితీయం.జింగిల్స్ విషయంలో కొండలరావు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హిరిచందన్ కూడా కొండలరావును ప్రత్యేకంగా అభినందించారు. పలు విశ్వవిద్యాలయాల్లో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించిన సెమినార్లలో ఆయన పరిశోధనా పత్రాలను సమర్పించారు. 

శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు అనేకం జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. జీకే సేవలను గుర్తించిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా   ఏప్రిల్ 14న  విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో ‘విశిష్టసేవారత్న’ పురస్కారంతో సత్కరించింది. 

- శిరందాసు నాగార్జున

సీనియర్ జర్నలిస్ట్




Apr 25, 2023

బహుముఖప్రజ్ఞాశాలి కలిమిశ్రీకి ‘సాహితీ తపస్వి’ బిరుదు

                                

ప్రముఖ సాహితీవేత్త,నవమల్లెతీగ సాహిత్య పత్రిక సంపాదకుడు, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ (కలిమికొండ సాంబశివరావు) తెలుగు సాహిత్యానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా గుర్రం జాషువా స్మారక కళాపరిషత్  జాషువా పురస్కారం అందజేసింది. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణమండపంలో ఆదివారం జరిగిన దుగ్గిరాల వారి కళాపరిషత్ 35వ వార్షికోత్సవంలో బహుముఖప్రజ్ఞాశాలి కలిమిశ్రీని ‘సాహితీ తపస్వి’ బిరుదుతో సత్కరించారు. పలువురికి మహాకవి జాషువా పురస్కారాలు అందజేశారు.  గజల్ శ్రీనివాస్ ను విశిష్టపురస్కారంతో, ఘంటా విజయకుమార్ ను సాహిత్యకళాభూషణ్, డాక్టర్ కె.చక్రవర్తిని సేవారత్న బిరుదులతో సత్కరించారు.  అంతకు ముందు జాతీయ స్థాయి కవి సమ్మేళనం జరిగింది. వార్షికోత్సవ సంచికను ఆవిష్కరించారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి. రామచంద్రయ్య,  తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరి రావు, పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెద్దిటి యోహాన్, ఆర్.ఆర్. గాంధీ నాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.  

 

కలిమిశ్రీ మూడున్నర దశాబ్దాలుగా పత్రికారంగంలో కొనసాగుతున్నారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర పత్రికల్లో పని చేశారు. ఎన్నో ఏళ్లుగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహిత్యంలో కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్నారు.  2007 నుంచి ‘నవమల్లెతీగ’ మాసపత్రికకకు వ్యవస్థాపక సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. సాహితీ విలువలతో దానిని సమర్థవంతంగా తీసుకువస్తున్నారు. మల్లెతీగ అంటే  పత్రిక కాదు, అది ఒక సాహితీ సంస్థ. సాహితీవేత్తలందరికీ ‘మల్లెతీగ’ అనగానే కమిలిశ్రీ గుర్తుకు వచ్చేంతగా ఆయన దానిని తీర్చిదిద్దుతున్నారు. గత పదేళ్లుగా ఎంతోమంది కవుల్ని మల్లెతీగ పురస్కారంతో  ప్రోత్సహిస్తున్నారు. కవి సమ్మేళనాలు, కథ, కవిత, గజల్ ఇతర సాహిత్య ప్రక్రియలపై అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సాహిత్యరంగంలో ఉద్దండులైన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.శివారెడ్డి, ఆచార్య కొలకలూరి ఇనాక్, పాపినేని శివశంకర్, విహారి, గోరటి వెంకన్న, గజల్ శ్రీనివాస్, జి.లక్ష్మీనరసయ్య, రసరాజు, కొప్పర్తి, కీ.శే. డాక్టర్ అద్దేపల్లి రామమోహన్

రావు తదితర సాహితీమూర్తులతో ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. సాహిత్య కళా రంగాల్లో  కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు గత నవంబరులో మిత్రుల సహకారంతో విజయవాడలో ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించారు. పలువురి  ప్రశంసలు అందుకున్నారు. మల్లెతీగ ముద్రణ విభాగాన్ని నెలకొల్పి సొంతంగా పుస్తకాలు అచ్చేసుకోవాలన్న కవులు, రచయితల ఆకాంక్షలకు అనుగుణంగా తక్కువ ధరకే పుస్తకాల్ని అందంగా ముద్రిస్తున్నారు. కవులు, రచయితలు వారి రచనలను కాగితాలపై రాసి ఇస్తే చాలు, డీటీపీ, పేజీ మేకప్, ఆర్ట్ వర్క్, అందంగా ముద్రించడం, ఆ తరువాత వాటిని  ఆవిష్కరించడం వరకు అన్ని బాధ్యతలు ఆయనే స్వీకరిస్తారు. మొదటి నుంచి సాహిత్యానికి, పుస్తక ప్రచురణలకు ప్రసిద్ధిచెందిన  విజయవాడ పేరును ఆదే కోవలో కొనసాగిస్తూ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. సాహిత్య కార్యక్రమాల నిర్వాహణలో దిట్టగా  మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు.



ఇన్ని విశిష్ట లక్షణాలున్న కలిమిశ్రీ అసలు పేరు కలిమికొండ సాంబశివరావు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో కలిమికొండ బసవయ్య, దేవకమ్మలకు ఐదవ సంతానంగా కలిమిశ్రీ జన్మించారు.  మగ్గం నేసిన రోజే కడుపు నిండే అంతటి పేద చేనేత కుటుంబం వారిది. కొత్తరెడ్డిపాలెంలోనే ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత గుంటూరులో వారి పెద్దన్నయ్య ఇంట్లో ఉంటూ హిందూ కాలేజీలో డిగ్రీలో చేరారు. అయితే, చదువు మధ్యలోనే ఆపేశారు. ఆయన 10వ తరగతి చదివే రోజుల్లోనే తొలి కవిత రాసి, తొలి కార్టూన్ గీశారు. 1984 నుంచి విస్తృతంగా రాసేవారు. కార్టూన్లు వేసేవారు. అవి పత్రికలలో వస్తుండేవి. అప్పట్లో కవులు కలం పేరు పెట్టుకోవడం ఆనవాయితీ వచ్చేది. అలా తన కలం పేరు ‘కలిమిశ్రీ’గా పెట్టుకున్నారు. 1987లో ఆంధ్రపత్రికలో చేరారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర, విద్య, ధాన్యమాలిక, సహస్రార, వందేగోమాతరం, మహోదయ .. వంటి పత్రికల్లో పనిచేశారు. జ్యోతిచిత్ర కోసం చిత్రపరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని  అనేక మందిని, స్వాతి బలరామ్ నుంచి సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు వంటి పారిశ్రామికవేత్తలను ఇంటర్వ్యూ చేశారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉత్తమ జర్నలిస్టుగా సత్కరించారు. అనేక సాహితీ సంస్థలు ఆయనను సన్మానించాయి.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914





విధానపరమైన లోపాలతో చేనేతకు తీవ్ర నష్టం


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానపరమైన లోపాలతో చేనేత రంగానికి తీవ్రనష్టం వాటిల్లుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉపాధి కల్పనలో  చేనేత రంగం కీలకమైనదిగా ఉంది. దేశంలో వ్యవసాయ తర్వాత ఉపాధికి అవకాశాలున్న రెండవ అతి పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. అందులో చేనేత రంగం వాటా ఎక్కువ. అంతేకాకుండా దేశ వారసత్వ సంపదైన చేనేతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ, ఈ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రధాన్యం ఇవ్వడంలేదు. 

ఈ రంగంలో దేశ వ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రత్యక్షంగా, 15 కోట్ల మంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చేనేత రంగంపై దాదాపు 3 లక్షల మంది వరకు ప్రత్యక్షంగా, 8 లక్షల మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లేక అనుబంధంగా అంటే..నూలు తయారు చేయడం, వడకడం, అచ్చు అతకడం, పడుగులు చేయడం,చిలపలను కండెలుగా తయారు చేయడం, మగ్గాలు, డిజైన్ డాబీలు, రాట్నాలు, నాడెలు, పన్నెలు, పన్నెల్లో ఇత్తడి ఈనెలు... వంటివి తయారు చేయడం,  నూలుకు రంగులు అద్దడం, పట్టు, రేషన్ దారాలు తయారు చేయడం, ఆసు తోడటం వంటి పనుల ద్వారా ఉపాధి పొందడం. ఈ రంగంపై ఇంతమంది ఆధారపడి జీవిస్తున్నా,  ప్రభుత్వాల ప్రోత్సాహం కరువైంది.  దాంతో చేనేత రంగం అనేక వడిదుడుకులకు లోనవుతోంది. చేనేత కార్మికులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వీరు అసంఘటిత రంగంలో ఉండటం వల్ల పోరాటపఠిమలేక నానా అవస్థలు పడుతున్నారు. ఏమీ సాధించుకోలేని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వాలు కూడా వారి సమస్యలపట్ల శ్రద్ధ వహించడంలేదు. 

1985లో రూపొందించిన చేనేత రిజర్వేషన్‌ చట్టం సరిగా అమలు కావడంలేదు. ఈ విషయంలో  కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ కొరవడింది.  ఈ చట్టం ప్రకారం చేనేతను ప్రోత్సహించేందుకు 11 రకాల వస్త్రోత్పత్తులను చేనేతకు కేటాయించారు.  చేనేతకు రిజర్వు చేసిన వస్త్రాలలో  ముఖ్యమైనవి భారతీయ మహిళలు ధరించే చీరలు.   చేనేత రిజర్వేషను చట్టం అమలు బాధ్యత రాష్ట్రాలకు అప్పగించి అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేయాలి. చేనేతకు రిజర్వుచేసిన వస్త్రాలను పవర్ లూమ్స్ పై తయారు చేయకూడదు. అయితే, పలు రాష్ట్రాల్లో  పవర్‌లూమ్స్‌ యాజమాన్యాల ఆధిపత్యం వల్ల ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయ డం లేదు. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని  అమలు చేయవలసిన  కేంద్రం దానిని పట్టించుకోవడంలేదు. అంతేకాకుండా, పాఠశాలల పిల్లలకు చేనేత వస్త్రాలతో తయారు చేసిన యూనిఫాం ఇవ్వవలసిన పథకాన్ని అమలు చేయడంలేదు. ఆప్కో చైర్మన్లుగా చేనేత వర్గాలకు చెందినవారే వ్యవహరిస్తున్నారు. వారు చిత్తశుద్ధితో చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేయకపోవడం వల్ల కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. 

మన దేశంలో చేనేత వస్త్రాలకు, ముఖ్యంగా చీరలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మన దేశంలో తయారయ్యే చేనేత వస్త్రాలు నాణ్యమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా చేనేత చీరలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రసిద్ది పొందాయి.  చేనేత వస్త్రాలు ధరించడం ఆరోగ్యానికి మంచిదని అందరూ గ్రహిస్తున్నారు. దాంతో వాటికి డిమాండ్ పెరుగుతోంది. చేనేత కార్మికులకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల వారు తగిన ఫలితం పొందలేకపోతున్నారు. మార్కెటింగ్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలనే చేనేత కార్మికులూ ఎదుర్కొంటున్నారు.  స్వాతంత్య్రోద్యమంలో కూడా చేనేత కీలక భూమిక పోషించింది. చేతి వృత్తి అయిన చేనేత రంగంలో మన దేశంలో లక్షలాది మంది జీవిస్తున్నారు. అటువంటి చేనేత వస్త్రాలపై 5 శాతం  జీఎస్‌టీ విధించడం అత్యంత దారుణం. అంతే కాకుండా, చేనేతకు ఉపయోగించే నూలుకు వేసే రంగులు, రసాయనాపై 18 శాతం జీఎస్టీ విధించారు. దాంతో చేనేత వస్త్రాల ధరలు పెరిగిపోయాయి.  ప్రభుత్వ విధానాల వల్ల వస్త్రాల ధరలు పెరిగాయి గానీ, చేనేత కార్మికులకు మజూరీలు పెరగలేదు.    చేనేతను కుంగదీస్తున్న, చేనేత కార్మికులకు తీవ్రమైన పోటీ ఇస్తున్న పవర్ లూమ్ వస్త్రాలపై 6 శాతం మాత్రమే జీఎస్టీ విధించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను విధించడం అన్యాయం.  చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు అనేక ఉద్యమాలుచేశారు. చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టి  ప్రధానిమోదీకి లేఖలు రాశారు. చేనేతకార్మికులు అసంఘటితంగా ఉండటం వల్ల ఉద్యమాన్ని రైతులు మాదిరిగా బలంగా నిర్వహించలేకపోతున్నారు. 

ఏపీ బడ్జెట్ లో చేనేత రంగానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వైఎస్ఆర్ నేతన్న పథకానికి మాత్రం రూ.200 కోట్లు కేటాయించారు. అందులో రూ.3 కోట్లు వరకు ఉద్యోగుల జీతాలకు పోతాయి. రాష్ట్రంలో రెండు లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే 81,700 మందికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం వర్తించడానికి రూపొందించిన నిబంధనలు చాలా విచిత్రంగా ఉన్నాయి. సొంత ఇల్లు లేక అద్దెకు ఉండే ఇంట్లో మగ్గం ఉన్న కార్మికులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఇల్లు లేక మగ్గం కూడా పట్టే అంత ఇంటికి అద్దె చెల్లించలేక మగ్గాల షెడ్లలో నేత నేచుకుని అత్యంత దయనీయంగా బతికేవారికి మాత్రం ఈ పథకం వర్తించడంలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు  చేనేత రంగం గురించి తెలియకపోవడం, అధికార పార్టీ (ఏ పార్టీ అయినా సరే)లలోని చేనేత కులాలకు చెందిన నేతలకు పరిస్థితులు వివరించే అవకాశం రాకపోవడం లేదా అంతటి ధైర్యం చేయలేకపోవడమే.  

ఇక చేనేత సహకార సంఘాల విషయానికి వస్తే రాష్ట్రంలో 950 వరకు సంఘాలు ఉన్నాయి.వీటిలో బోగస్ సంఘాలు అనేకం ఉన్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిజమైన చేనేత కార్మికులు కాకుండా ఈ బోగస్ సంఘాలు ఏర్పాటు చేసినవారు నాబార్డు రుణాలు, ప్రభుత్వ రాయితీలు పొందడం ద్వారా  ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. వాటిని వదిలేసినా, మిగిలిన నిజమైన  సంఘాలకు ప్రభుత్వం నుంచి, ఆప్కో నుంచి రావలసిన బకాయిలు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోతున్నాయి. తెలంగాణలో 615 చేనేత సహకార సంఘాల వరకు ఉన్నాయి. నూలు, రంగులపై 40 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు.  నేతన్న బీమా, నేతన్నకు చేయూత తదితర పథకాలు అమలు చేస్తున్నారు. అయితే, తెలంగాణలో కూడా పవర్ లూమ్ పై తయారైన వస్త్రాలను  బతుకమ్మ చీరలుగా ఇస్తున్నారన్న విమర్శ ఉంది. 

 కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కొంతవరకు చేనేత రంగంపై శ్రద్ధ చూపుతున్నాయి. ముఖ్యంగా కేరళలలో చేనేత కార్మికులకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ సహకార సంఘాల వ్యవస్థ పఠిష్టంగా ఉంది. అక్కడి చేనేత కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మహిళా చేనేత కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. మన ప్రభుత్వంలోని చేనేత నాయకులు అక్కడి సౌకర్యాలను అధ్యయనం చేసి, ఇక్కడ అమలు చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణలో చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. బతకమ్మ చీరలను చేనేత రంగం నుంచే తీసుకుంటారు. చేనేత పార్కుల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోయిన సమాజం మనది.  మార్కెటింగ్  సౌకర్యం లేక కష్టపడి పండించే రైతులకు గిట్టు ధర రాదు.ఇంటెల్లపాది రాత్రి పగలు శ్రమించే చేనేత కార్మిక కుటుంబాలకు తగిన కూలి గిట్టదు. ప్రభుత్వాలు వారికి కావలసిన మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించలేకపోతున్నాయి. 

చేనేత కార్మికులకు, వినియోగదారునికి మధ్య ఉండే దళారీ వ్యవస్థను తొలగించి  ‘వీవర్ టు కస్టమర్’ విధానం ద్వారా అటు నేతన్నలకు, ఇటు వినియోగదారులకు  ఉపయోపడే వ్యవస్థను రూపొందించాలని చేనేత కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.  చేనేత వస్త్రాలను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్ర,స్నాప్​డీల్  వంటి ఆన్​ లైన్ మార్కెట్ లో  ఉంచాలని వారు కోరుతున్నారు. అలా నేరుగా చేనేత కార్మికుడే వ్యాపారం చేయడం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సాధ్యం కాదు.ఎందుకంటే జీఎస్టీ నెంబర్ లేనిదే ఆన్ లైన్ లో అమ్మడం వీలుకాదు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించవలసి ఉంది.  ప్రపంచ స్థాయిలో ఈ ఉత్పత్తులను మార్కెట్ చేసే అవకాశం ఉంది. చేనేత వస్త్రాల ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థాలు పత్తి ఉత్పత్తి నుంచి ఇతర అన్న వనరులు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి.  నైపుణ్యత కలిగిన శ్రామికులు ఉన్నారు.   నిర్వహణ, సాంకేతికత రెండింటిలోనూ అధిక శిక్షణ పొందిన మానవశక్తి ఉంది. అందువల్ల ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందిస్తే చేనేత కార్మికుల బతుకులు బాగుపడటమే గాక  ఎగుమతుల ద్వారా దేశం ఆర్థిక వ్యవస్థకు కూడా  ప్రయోజనం చేకూరుతుంది.  అందువల్ల చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో నిధులు  కేటాయించవలసిన అవసరాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించవలసిన అవసరం ఉంది.  

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్టు - 9440222914


Apr 10, 2023

గోలి మధు ‘సంఘర్షణ’ పుస్తక సమీక్ష


గోలి మధు కలానికి పదును, దూకుడు కూడా ఎక్కువే. ఆయన కవిత్వంలో   అక్షర, పద విన్యాసాలు కనిపిస్తాయి. పదాలలో  ఎంత పొదుపో, భావాలలో  విస్తృతి అంత ఎక్కువ. ఈ  విషయంలో   ఉపాధ్యాయురాలైన ఆయన అమ్మ గారి  ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అభ్యుదయ కవిగా పేరు గడించిన గోలి మధు ప్రగతిశీల కవిత్వం  రాయడంలో దిట్ట. భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021), గమనం(2021) వంటి కవితా సంకలనాలు అందించారు. పుస్తకాలకు కాలం చెల్లిందనుకుంటున్న రోజుల్లో 2020లో వచ్చిన ఆయన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి 2021లో రెండవ ముద్రణకు నోచుకుందంటే ఆయన కవిత్వంలో ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు.  అదే ఆవేశంతో, పదునెక్కిన ఆలోచనలతో తనలో తను ఘర్షణ పడి 47 లఘు, 38 మినీ మొత్తం 


85 కవితలతో ‘సంఘర్షణ’ అనే కవితా సంపుటి తెచ్చారు. సమాజంలోని రుగ్మతలను సరిదిద్దాలన్న మధు ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిందే ప్రగతిశీల కవిత్వం పేరుతో రాసిన ఈ ‘సంఘర్షణ’. 2020 నుంచి  2023 జనవరి వరకు రాసిన కవితలు ఇందులో ఉన్నాయి. 


అభ్యుదయ సాహితీవనంలో విరబూసిన ఎర్ర గులాబీ గోలి మధు. ఆయన  ఉవ్వెత్తున లేచే కెరటం. ఓ మెరుపు. మధు భాషా - భావం రెండూ పదునైనవే. అతి సాధారణ పదాలలో అద్భుతమైన భావం పలికించగల కవి మధు. ఉద్ధండులైన సాహితీవేత్తలను కూడా ఆశ్చర్యపరిచేవిధంగా కవిత్వం రాయగలిగిన స్రష్ట మధు. ఆయన కవిత్వంలోని సారాన్ని ఎవరికి వారు ఆస్వాదించవలసిందే.  మచ్చుకు ఓ కవితలోని రెండు లైన్లు...‘‘అక్షరానికి ఆవేశం చల్లారింది.అందుకే.. ప్రశ్నించడం మానేసింది.’’అన్నారు. ఇందులో నుంచి ఎన్ని అర్థాలు స్ఫురిస్తాయో ఆలోచించండి. ప్రశ్నించడం మానేసినా, ఆలోచించడం మానకూడదు. ‘‘అక్షరానికి పక్షపాతం ఆవహించింది, అందుకే పక్షవాతంతో కులమతాల చిచ్చులకు ఆజ్యమైంది’’ అని స్పష్టం చేశారు. మరోచోట ‘‘పీడితులే నా కలానికి ఆరాధ్యులు.దేశం గుండెఘోష నా సిరా.పీడకులపైనే నా కలం దాడి.దేశం గుండెల్లో, పీడితుల ఎదలో రగిలే జ్వాల ఈ సంఘర్షణ. అడుగడుగునా అంధకారం ఆవరిస్తే, అక్షరం దీపమై అడుగులు మొదలుపెట్టాలి’’ అంటాడు మధు. ఆ అడుగులే ఈ ‘సంఘర్షణ’. సంఘర్షణ అనేక రూపాలలో, అనేక అర్థాలలో ఉంటుంది. 

అక్షరాలు అరుణ వర్ణం కోల్పోయాయని, అవి తల్లక్రిందులవడంతో దేశ సంపద కొందరి చేతుల్లోకి వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య భారతదేశ సంపదంతా ప్రైవేటీకరణపేరుతో కార్పోరేట్ల కబంధ హస్తాల్లో ఒదిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ తెలిసిన నడుస్తున్న చరిత్ర ఇది. ‘‘సంక్షోభంలోకి దేశం దిగజారుతున్నా  పాలన మారనందుకు చోద్యంగా ఉంది’’అని ఆందోళన వ్యక్తం చేశారు. గగ్గోలు పెట్టారు. ‘‘చైతన్య రహితమైన సంఘాన్ని చూస్తే భయమేస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం ఎంత చైతన్యహీనంగా తయారైందో స్పష్టంగా చెప్పారు. 

‘‘గుండ్రని నా అక్షరం దొర్లుతూ వెళితే, 

పీడితుల పాదాలు తాకే పూల చెండు!

దూసుకెళితే పీడకులపై దాడిచేసే ఫిరంగి గుండు!’’

సమాజంలో ఉన్న అన్ని అంశాలపై ఆయన కవితలు రాశారు. రాస్తున్నారు. రాస్తారు. వాటిలో రైతుల వెతలు తప్పక ఉంటాయి. రైతు ప్రాధాన్యతను మధు అంతగా గుర్తించారు.  రైతంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ,అభిమానం. దేశ వెన్నెముక వెన్ను విరుస్తూ 700 మంది రైతుల బలిదానాలకు

కంట తడి చూపలేని అంధ దేశభక్తుడిని అని తనను తాను తిట్టుకున్నాడు. అదే సంఘర్షణ.బోధన విషయానికి వస్తే, ‘‘ లోకం పోకడ నేర్పక, మనసుకు జ్ఞానం ఇంకక, బట్టీపట్టే ర్యాంకుల పంటలే అగుపిస్తాయిక్కడ!’’ అని నేటి చదువుల తీరును ఎండగట్టారు. చిన్నప్పటి నుంచి పెట్టుకునే నుదుట బొట్టును ఆయన రాలిపోగానే తుడిచేస్తారెందుకు? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారున్నారా? ‘‘వాడెవడో మనువంట-మగడు మరణించాక-మగువకు మనుగడ ఎందుకంటూ మరణశాసనం రాశాడు’’ అని మండిపడ్డాడు. సమాజంలో మహిళల స్థానం, వారి ఆక్రోశం, ఆలోచన, ఆశలను చక్కగా, స్పష్టంగా తెలిపారు.పెరుగుతున్న నిత్యావసర వస్తువుల విషయంలో ‘‘గడపదాటి గద్దించండి, స్త్రీ శక్తితో అధికారానికి అసలు అర్ధం చెప్పండి’’అని మహిళలకు పిలుపునిచ్చాడు.  

చేవ చచ్చి, చైతన్యం లోపించి నీరుగారిపోతున్న పోరాటాలకు సరికొత్త ఒరవడి అద్దిన ఉద్యమరైతుని శ్లాఘించారు. అధికార మదాంధుల వెన్నులో వణుకు పుట్టించిన దేశం వెన్నెముకగా ఉద్యమ రైతుని పోల్చి సలాం చేశారు.75 ఏళ్లుగా నాయకులు ఇచ్చే స్థితిలోనే ఉన్నారని, ప్రజలు మాత్రం పుచ్చుకుంటూ ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని నేటి రాజకీయాలు, ఆ రాజకీయాల్లో ఓటర్ల తీరును చక్కగా వర్ణించారు.

పుస్తకం మొత్తం చదివితే కవి ఎవరెవరితో, ఏ రకమైన ఆలోచనలతో, సామాజిక పరిస్థితులతో, తనలోని తనతో....ఎన్నివిధాల సంఘర్షణ పడ్డాడో తెలుస్తుంది. ఎంత అంతర్మథనం పడ్డాడో అర్థమవుతుంది.  ఆ సంఘర్షణలో నుంచి మెరుపులు వచ్చాయి. ఉవ్వెత్తున పడిలేచే  కెరటాలొచ్చాయి. ఆవేశం, ఆక్రోశం వచ్చాయి. కొత్తకొత్త ఆలోచనలు వచ్చాయి. కొత్త కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. అలా ఈ  ‘సంఘర్షణ’ కవిత్వం పుట్టుకొచ్చింది. 

సమీక్షకులు: శిరందాసు నాగార్జున రావు, 

సీనియర్ జర్నలిస్టు.9440222914


సంఘర్షణ (కవితా సంపుటి)

కవి : గోలి మధు - 9989186883

పేజీలు : 110

వెల : రూ.80

తొలి ముద్రణ : ఫిబ్రవరి, 2023

ముద్రణ : యు.ఎస్.ఆర్. పబ్లికేషన్స్, నులకపేట, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా

ప్రతులకు : రేకా క‌ృష్ణారావు

ఎన్సీసీ రోడ్డు, మంగళగిరి- 522503

సెల్ నెం.:9848199098



అడ్రెస్:

S.Nagarjuna Rao,

203,Satyasai Nilayam

Ippatam Road

Beside Chamundeswari Temple

MANGALAGIRI -522503



 





అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...