Jun 25, 2023

వానల పేర్లు

 1. గాంధారివాన = కంటికి ఎదురుగా ఉన్నది  కనిపించనంత జోరుగా కురిసే వాన

2. మాపుసారివాన = సాయంత్రం కురిసే వాన

3. మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన

4. దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన

5. సానిపివాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన

6. సూరునీల్లవాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన

7. బట్టదడుపువాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన

8. తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన

8. సాలువాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన

10. ఇరువాలువాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన

11. మడికట్టువాన = బురదపొలం దున్నేటంత వాన

12. ముంతపోతవాన = ముంతతోటి పోసినంత వాన

13. కుండపోతవాన = కుండతో కుమ్మరించినంత వాన

14. ముసురువాన = విడువకుండా కురిసే వాన

15. దరోదరివాన = ఎడతెగకుండా కురిసే వాన

16. బొయ్యబొయ్యగొట్టేవాన = హోరుగాలితో కూడిన వాన

17. రాళ్లవాన = వడగండ్ల వాన

18. కప్పదాటువాన =  అక్కడక్కడా కొంచెం కురిసే వాన

19. తప్పడతప్పడవాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.

20. దొంగవాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన

21. కోపులునిండేవాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన

22. ఏక్దారవాన = ఏకధారగా కురిసే వాన

23. మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన

24. సాలేటివాన = భూమి తడిసేంత భారీ వాన

25. సాలుపెట్టువాన = దున్నేందుకు సరిపోయేంత వాన


Jun 20, 2023

బీసీ కులాల్లో రాజకీయ చైతన్యం




తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం


ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చినట్లే బీసీ వర్గాల్లో కూడా చైతన్యం మొదలైంది. ఎన్నికలొస్తే రాజకీయ పార్టీలు బీసీల జపం చేయడం అలవాటైపోయింది.  కులవృత్తులు చేసుకునే జనసమూహమే బీసీ వర్గాలైనందున జనాభాలో వారు అత్యధికంగా అంటే 50 శాతానికి పైగా ఉంటారు. దాంతో రాజకీయ పార్టీలు కూడా వారి ప్రాధాన్యతను గుర్తిస్తుంటాయి. అయితే, అనాదిగా వారిని ఓటు బ్యాంకుగా చూడటమే ఈ ప్రాతీయ పార్టీలకు అలవాటైపోయింది. దానికి తోడు శాసనసభ, లోక్ సభలలో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు వీరికి లేకపోవడం వల్ల కూడా వీరు తీవ్రంగా నష్టపోతున్నారు. సమతౌల్యంపేరుతో కొన్ని సీట్లు ఇచ్చినా, గెలిచినవారికి ప్రాధాన్యం తక్కువే. మంత్రి పదవులు కూడా లెక్కకే ఇస్తారు. అధికారం ఏమీ ఉండదు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నచోట బీసీ నేతలు మంత్రులైనా  వారి చేతిలో అధికారం నేతిబీరకాయ చందంగా ఉంటుంది. రాజకీయ అధికారం లేకుండా బీసీ వర్గాల అభివృద్ధి సాధ్యంకాదనేది బీసీ కులాలు తెలుసుకున్నాయి. జనాభాలో 50 శాతానికి పైగా తామున్నప్పటికీ తగిన ప్రాధాన్యత లేదన్న బాధ, వేదన వారిలో తీవ్రస్థాయిలో నెలకొంది. తమలో ఐకమత్యంలేకపోవడం వల్లే పరిస్థితి ఇలా ఉందని వారికి స్పష్టమైంది. రాజకీయ భాగస్వామ్యం కోసం వారు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.
బీసీ వర్గాలలోని ఉత్సాహవంతులైన యువత రాజకీయంగా ఎందగడానికి చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నారు.

 రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అన్ని విధాల వెనుకబడిన తాము ఏకం కాకపోతే మరో వందేళ్లైనా తమ బతుకుల్లో మార్పు రాదని వారికి అర్ధమైంది. ముఖ్యంగా బీసీ వర్గాలలోని మేథావులు, ఉద్యోగులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే, బీసీ కులాలన్నీ ఏకం కావడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలలో  నాయకత్వ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందు దానిని అదిగమించే ప్రయత్నంలో అన్ని జిల్లాల్లో యువతను ప్రోత్సహిస్తున్నారు.  బీసీలలో ఎవరి కులాలు వారివి, ఎవరి వాదాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి అభిప్రాయాలు వారివి. విభిన్న దృక్పధాలతో ఉన్న వారందరినీ కలపడానికి బీసీ అనే భావనతో ముందుకు వెళ్లడానికి మేథావి వర్గం ప్రయత్నిస్తోంది. ఆయా కుల సంఘాలు తమ ఉనికిని చాటుకుంటూనే, బీసీ వర్గాలుగా ఏకమవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.  

ఈ అంశాలను దృష్టిలోపెట్టుకుని ఈ నెల 11న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బీసీ డిక్లరేషన్-2023 మహాభ నిర్వహించారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్,  జస్టిస్ వి.ఈశ్వరయ్య, ప్రొఫెసర్ మురళీమనోహర్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి  జస్టిస్ వి.చంద్రకుమార్, బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చౌదరి వికాస్ పటేల్, ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి తదితరులు పాల్గొన్నారు. బీసీ ఉద్యమానికి మరింత ఊపునిచ్చేవిధంగా తెలంగాణలో బీసీ జర్నలిస్టులు కూడా రాజకీయంగా ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.  తెలంగాణలో బీసీలకు ప్రధాన్యత ఇస్తున్నట్లు బీఆర్ఎస్ చెప్పడమేగాక  బీసీలకు రూ.లక్ష సహాయం పథకం కూడా ప్రకటించింది. బీజేపీ ఏకంగా పలు అంశాలతో  బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ కూడా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపింది.  

ఈ నేపథ్యంలో బీసీ ముఖ్య నేతలు ఎండలను కూడా లెక్కచేయకుండా పట్టుదలతో తెలంగాణ, ఏపీలలో అన్ని జిల్లాలలో పర్యటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, బీసీలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో బీసీ సంక్షేమసంఘం జాతీయ నేతలు గుజ్జ కృష్ణ, డాక్టర్ నందకిషోర్, మల్లేశ్ తదితరులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.  ఏపీలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, ఆ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, యువజన విభాగం అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ యాదవ్, కన్నా మాస్టర్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, మరోవైపు  బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు, రాష్ట్ర కోఆర్డినేటర్ పరసా రంగనాథ్, మీనిగ ఆంజనేయులు, షేక్ ఆసిఫ్ పాషా, ఏలూరి విజయలక్ష్మి, తాతా కృష్ణారావు తదితరులు పర్యటిస్తూ బీసీలలో ఐక్యత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆగస్టు 7న తిరుపతిలో భారీ స్థాయిలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు  కేసన శంకరరావు ప్రకటించారు.  ఏపీలో ఇటు వైసీపీ, అటు టీడీపీ బీసీల జపం చేస్తున్నాయి. వైఎస్ జగన్ సీఎం కాగానే మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు బీసీలకు బాగా ఇచ్చారు. గతంలో ఇవ్వని కులాలకు కూడా కొన్ని పదవులు ఇచ్చారు. ఈ పదవుల వల్ల వారికి ఒరిగింది ఏమీలేదు. ఏవిధమైన అధికారంలేదు. అయినా, గుర్తించి పదవులు ఇచ్చారనే సంతృప్తి వారిలో కనిపిస్తోంది. టీడీపీ మొదటి నుంచి బీసీల పార్టీగా గుర్తింపు పొందింది. వాస్తవానికి ఎన్నో ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది బీసీలే. అయితే, గత ప్రభుత్వంలో పదవులు ఇవ్వడంలో న్యాయం చేయలేదన్న విమర్శ ఉంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవులు చివరి వరకు భర్తీచేయకుండా బీసీలకు అన్యాయం చేశారన్న భావన ఉంది. అయితే, పార్టీలో ఈ విషయమై చర్చ జరిగిందని,  ఇక ముందు అలా జరగదని ఆ పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈసారి ఇరు పార్టీలు పోటీపడి బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. దానిని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో బీసీ నేతలు ఉన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బీసీలు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వారికి మద్దతు ఇచ్చి గెలిపించాలని బీసీ నేతలు  ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు.  పోటీ పడే అభ్యర్థులందరూ బీసీలయితే ఏకాభిప్రాయంతో ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వాలని, అలా సాధ్యం కానిపక్షంలో తటస్థంగా ఉండటం మంచిదన్న ఆలోచన కూడా వారిలో ఉంది. ఆర్థికంగా స్థితిమంతులు, విద్యావంతులైన బీసీ యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుల వ్యవస్థ వేళ్లూనుకుపోయిన మన సమాజంలో ఇతర కులాల సహాయ, సహకారంలేకుండా రాజకీయంగా ఎదగడం ఎవరికీ సాధ్యం కాదు. అందువల్ల రాజకీయంగా అన్ని కులాలతో సఖ్యతగా ఉండాలన్న నిర్ణయంతో ఉన్నారు. అలాగే, ఆయా కులాల పెద్దలను కలిసి అన్ని బీసీ కుల, ఉద్యోగ, వృత్తి సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థికంగా కూడా తగిన స్థాయిలో తమ వర్గానికి చెందిన వ్యాపారులు, ఉద్యోగుల నుంచి నిధులు సేకరించడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ప్రతి జిల్లాలో భారీ స్థాయిలో బీసీ సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బీసీల బలం నిరూపించే  ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు.


 టీడీపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ అధికారంలోకి వచ్చాక తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. పది మందికి పైగా మంత్రి పదవులు ఇచ్చారు. అసెంబ్లీ స్పీకర్ కూడా బీసీనే. 56 కార్పొరేషన్లను బీసీలకు కట్టబెట్టారు. పలు కార్పొరేషన్ల డైరెక్టర్లుగా బీసీలకు పెద్దఎత్తున అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీలుగా కూడా వైసీసీ బీసీలకు అవకాశం ఇచ్చింది. రాజ్యసభ సభ్యులుగా బీసీలైన ఆర్.కృష్ణయ్య, పిల్లి సుభాశ్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తదితరులను ఎంపిక చేశారు. బీసీలంటే మొదట గుర్తొచ్చేది కృష్ణయ్యే. అలాంటి కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా తామే నిజమైన బీసీ పక్షపాతి అని చెప్పే ప్రయత్నం చేసింది వైసీపీ. అయితే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు కావడంతో ఉద్యమ ఊపు తగ్గింది. పదవిని అలంకరించినవారు ఉద్యమానికి క్రమక్రమంగా దూరం కావడం సహజం. అటువంటివారు  జనం నమ్మకం కూడా కోల్పోతారు. ఇప్పుడు టీడీపీ కూడా బీసీలకు ప్రధాన్యం ఇస్తామని చెబుతూ పంచుమర్తి అనురాధను ఎమ్మెల్సీగా గెలిపించుకుంది. బీసీలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, ఆచరణలో అది కనిపించడంలేదన్న విమర్శ ఉంది. వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమంది ఆధారపడే  బీసీ వర్గానికి చెందిన  చేనేతను టీడీపీ గుర్తించినట్లు కనిపించడంలేదని అంటున్నారు.  ఆ వర్గాల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ కనిపిస్తోంది.  టీడీపీలో అన్ని విభాగాలకు కార్యవర్గాలను నియమించారు. చేనేత విభాగానికి మాత్రం ఇప్పటి వరకు కార్యవర్గాన్ని నియమించలేదు. శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి, చీరాల, పెడన, వెంకటగిరి, తాడిపర్తి, కర్నూలు ... వంటి 45 స్థానాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో చేనేత వర్గం ఉంది. ఒక పక్క మంగళగిరిలో  టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఆ పార్టీ  ఎమ్మెల్సీని చేసింది. మంగళగిరికే చెందిన మరో నేత, మునిసిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి వైసీపీలో చేరిన వెంటనే ఆ పార్టీ చేనేత విభాగం అధ్యక్ష పదవి అప్పగించింది. ఆ తరువాత అతనికే ఆప్కో చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. ఓవైపు వైసీపీ  మంగళగిరిలో చేనేత వర్గానికి అంతటి ప్రాధాన్యం ఇస్తుంటే, టీడీపీ మాత్రం పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. మంగళగిరికి చెందిన  చేనేత నాయకుడు, టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే నమ్ముకుని, అంటిపెట్టుకుని  ఉన్న  సీనియర్ నేత గుత్తికొండ  ధనుంజయకు ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వలేదని ఆ వర్గం వారు విమర్శిస్తున్నారు.  గంజి చిరంజీవికి కుడిభుజంగా ఉన్న ధనుంజయ చిరంజీవి పార్టీ మారినా, తను మారకుండా ఉన్నాడు.  చేనేత విభాగం కార్యవర్గం ఏర్పాటు చేసి, ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తారని చేనేత వర్గాల వారు చాలా కాలంగా భావిస్తున్నారు.  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీచేసి ఓడిపోయారు. మళ్లీ ఇక్కడే పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో దాదాపు 36 శాతం మంది చేనేత వర్గాల ఓటర్లు ఉన్నా వారికి  తగిన గుర్తింపు ఇవ్వకపోవడం వెనుక మతలబు ఏమిటో అర్థంకావడంలేదు. టీడీపీ మాటలకు, చేతలకు పొంతనలేదన్న విమర్శ సర్వత్రా వినవస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ, లోకేష్ పోటీ చేసే నియోజకవర్గంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
             - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914







Jun 7, 2023

చేనేత వర్గాలకు పెరుగుతున్న ప్రాధాన్యం


ఆంధ్రప్రదేశ్ లో  చేనేత వర్గాల ఐక్యతకు తోడు రాజకీయ మార్పుల నేపథ్యంలో ఆ వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా  చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో పద్మశాలీయులతోపాటు 19 చేనేత కులాలకు


చెందిన వారు 75 లక్షలకుపైగా ఉన్నారు. వ్యవసాయం తరువాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది చేనేత రంగం. అయినా వారికి చట్ట సభలలో తగిన స్థానం కరువైంది. జనాభా ప్రాతిపదికన వారికి కనీసం 20 శాసనసభ స్థానాలు దక్కాలి. రాష్ట్రంలోని 175 మంది శాసనసభ్యుల్లో చేనేత కులాల నుంచి ఒక్కరు కూడా లేరు. 
రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన కులాలవారే పోటీ పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. శతాబ్దాలుగా చేనేతకు, చేనేత కులాలకు ప్రసిద్ధిచెందిన మంగళగిరి శాసనసభా స్థానం నుంచి కూడా గత ఎన్నికల్లో ఆ రెండు కులాలవారే పోటీపడ్డారు.  కర్నూలు నుంచి డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్ ఒక్కరే లోక్ సభ సభ్యులుగా  ఎన్నికయ్యారు. అంటే చేనేత వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దానికి ప్రధాన కారణం చేనేత కులాల మధ్య ఐక్యత లేకపోవడం, నాయకత్వం లోపం. ఈ కులాల నుంచి, ముఖ్యంగా చేనేత వృత్తికి  చెందినవారు ఎమ్మెల్యేలుగా లేకపోవడంతో చేనేతపై అవగాహనలేని ఇతర కులాలవారు చేనేత శాఖా మంత్రులు అవుతున్నారు.  అందువల్ల చేనేత రంగం  అభివృద్ధి కుంటుపడుతోంది. చేనేత కులాల వారు, చేనేత కార్మికులు ఆర్థికంగా, వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండాపోయింది. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టేవారులేరు. వారి సమస్యలను ఇతర కులాలు, వృత్తులకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ద్వారా పరిష్కరించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరి సమస్యల పరిష్కారం పట్ల వారు ఆసక్తి చూపించే అవకాశాలు చాలా తక్కువ. చేనేత వృత్తికి సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, సౌకర్యాలు.... వంటి సమస్యలు తెలుసుకోవడానికి వారికి సమయం ఉండదు. ఈ కారణంగా కూడా చేనేత సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతి కొద్దిమంది మాత్రమే ఈ రంగం నుంచి రాజకీయంగా ఎదిగారు. రాజకీయ, అధికార భాగస్వామ్యం కోసం చేనేత వర్గాల బలం ఇంకా పెరగవలసి ఉంది. ఆ విషయాన్ని చేనేత కులాలు గుర్తించాయి. అందరినీ ఏకంచేసి ఒక్కతాటిపైకి తీసుకురావడానికి చేనేత సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.    రాష్ట్రంలో పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుశాలి, సాలి, స్వకులశాలి, కురిమిసెట్టిశాలి,  సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు, తొగటశాలీలు, తొగుల వీరక్షత్రియ,  కరికాలభక్తులు, సాధనాసూరులు, అచ్చుకట్లవాళ్ళు, దూదేకుల, కైకాల,  కుర్ని, ఖత్రి,  నీలి, నీలకంఠి, కోష్ఠి, నక్కల, పట్కార్, కైకోలన్, సెంగుండం, సెంగుంతర్,  సాలివన్, నెస్సి మొదలైన  దాదాపు 19 కులాల వారు ఏపీలో ఉన్నారు. ఈ కులాల్లో అధిక కులాలు అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. కొన్ని కులాల వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. రాజకీయ నాయకులు పెద్దగా వారిపట్ల దయచూపరు. కొంతమంది ఉన్నతాధికారులు వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటారు. 

చేనేత నేతలు ప్రగడ కోటయ్య, దామర్ల రమాకాంతరావు, కొండాలక్ష్మణ్ బాపూజీ,పుచ్చల సత్యనారాయణ, గోలి వీరాంజనేయులు వంటి వారి తర్వాత ఈ రంగం కోసం పోరాడే నేతలు తగ్గిపోయారు. ఏపీలో నిమ్మల కిష్టప్ప, మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి వంటి వారికి తోడు బుట్టా రేణుక, డాక్టర్ శింగరి సంజీవ్ కుమార్, పోతుల సునీత, పంచుమర్తి  అనురాధ,చిల్లపల్లి మోహన రావు, జింకా విజయలక్ష్మి, బండారు ఆనంద ప్రసాద్, శల కోటివీరయ్య, విశ్వనాధ్, జగ్గారపు శ్రీనివాస్, ఆకాశపు స్వామి, గుత్తికొండ ధనుంజయ, రాజపంతుల నాగేశ్వరావు, పిల్లలమర్రి బాలకృష్ణ  వంటివారు తోడయ్యారు. అయితే, వీరిలో కొందరికి నేరుగా చేనేత రంగంతో సంబంధంలేదు. ముఖ్యంగా చేనేత వృత్తి, కార్మికుల సమస్యపట్ల అవగాహన కలిగి, పోరాట సామర్థ్యం కలిగినవారు తక్కువ మంది ఉన్నారు. చేనేత వర్గాల తరఫున బలంగా పోరాడే వారి సంఖ్య ఇంకా పెరగవలసిన అవసరం ఉంది.

చేనేత వర్గాల నుంచి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధిగా గెలవకపోతే ఏ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా చేయగలిగింది ఏమీలేదు.  చేనేత కులాల వారికి పరిస్థితి పూర్తిగా అర్ధమైంది.  తమ కులాల నుంచి శాసనసభ్యులను గెలిపించుకోకపోతే పరిస్థితి ఇంకా దిగజారుతుందని వారు గ్రహించారు. ఈ నేపథ్యంలో చేనేత కుల సంఘాలు పునరేకీకరణ అవసరాన్ని గుర్తించాయి. గతంలో క్రియాశీలకంగా ఉన్న  వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ తోపాటు  ఇతర చేనేత కుల సంఘాలను బలోపేతం చేయడం ద్వారా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజకీయాలకు అతీతంగా కలసి పనిచేయాలని తీర్మానించారు. అన్ని చేనేత కులాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రాజకీయ అధికారంలో భాగం చేజిక్కించుకోవడానికి  తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 35 చేనేత సంఘాలను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి తోడు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ కూడా చేనేత వర్గాలను, వారి ఓట్ల శాతాన్ని గుర్తించాయి. దాంతో గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ కేటాయించడంతో డాక్టర్ శింగరిసంజీవ్ కుమార్ కర్నూలు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మురుగుడు హనుమంతరావు, పోతుల సునీతలను వైసీపీ శాసన మండలి సభ్యులను చేసింది. అలాగే, చిల్లపల్లి మోహనరావుని, ఆ తర్వాత గంజి చిరంజీవిని ఆప్కో చైర్మన్లు గా చేసింది. మరో పక్క పంచుమర్తి అనురాధను  శాసనమండలి సభ్యురాలిగా టీడీపీ గెలిపించుకుంది. రాష్ట్రంలో 45 శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు-ఓటములు నిర్ణయించగల స్థితిలో చేనేత కులాల వారు ఉన్నారు. ఈ పరిస్థితులను గమనించి 2024 ఎన్నికల్లో ఇరు పార్టీలు పోటీపడి మరీ చేనేత వర్గాలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరికి వారు చేనేత వర్గాలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.  దీనిని సద్వినియోగం చేసుకుని రాజకీయంగా ఎదగాలన్న ప్రయత్నంలో చేనేత కులాలవారు ఉన్నారు.  కాగా,   15 శాసనసభ, 5 లోక్ సభ స్థానాలను  కేటాయించాలని వారు రాజకీయ పార్టీలను డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చేనేత వర్గాలు, కులాలు, సంఘాల  ఐక్యతను కొనసాగిస్తూ, ఎన్నికలలో పోటీ చేసే చేనేత కులాల వారికి పార్టీలతో సంబంధం లేకుండా సంపూర్ణ మద్దతు పలకడానికి,  ఆర్థిక సహాయం అందించడానికి కూడా ఆయా సంఘాలు సిద్ధంగా ఉన్నాయి.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Jun 1, 2023

సమాజానికి సహకార రంగమే ఆశాదీపం

* సహకారభూమి పక్షపత్రిక ఆవిష్కరణ సభలో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి


విజయవాడ, మే 31: సహకార రంగం ప్రస్తుతం చాలా చురుగ్గా పనిచేస్తోందని, సహకార రంగంలో ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి శ్రీ  కాకాణి గోవర్ధనరెడ్డి చెప్పారు. సహకారభూమి జర్నల్ సహకార సంఘం లిమిటెడ్ నెం.జి.3211 విజయవాడ ఆధ్వర్యంలో సహకార సంఘాల కోసం ప్రచురించే "సహకారభూమి" పక్ష పత్రికను మంత్రి బుధవారం నగరంలోని శ్యామ్ నగర్ ఎన్జీవో కాలనీలోని సహకారభూమి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి కాకాణి ముఖ్య అతిథిగా మాట్లాడారు. సహకార రంగం పటిష్టతకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఒకప్పుడు గౌరవాభిమానాలతో వెలిగిపోయిన సహకార వ్యవస్థ రానురానూ రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా మారిపోవడం దురదృష్టకరమన్నారు. తమ తండ్రి సహకార సంఘం నుంచి రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. సహకార వ్యవస్థపై చాలామందికి సరైన అవగాహన లేదని, అలాగనే అధికారులకు కూడా తగినంత పరిజ్ఞానం లేకపోవడం వల్ల సహకార వ్యవస్థ దెబ్బతిన్నదని మంత్రి అన్నారు. సహకార వ్యవస్థను పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 298 కోట్ల రూపాయలు నిధిని కేటాయించారని ఆయన చెప్పారు. అనుభవం ఉన్న సహకారవాదులు, జర్నలిస్టులు తీసుకొస్తున్న సహకారభూమి పత్రిక  విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వానికి, సహకార వ్యవస్థకు సహకారభూమి ఒక అస్త్రంగా నిలవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం, అలాగే సహకార మంత్రిత్వ శాఖ సహకారభూమి పక్షపత్రికకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కాకాణి ఈసందర్భంగా ప్రకటించారు. సహకార రంగ పటిష్టతకు సహకారభూమి లాంటి పత్రికలు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. సహకారం అంటే అపకారం కాదనీ, సహకార రంగంలో ఎందరు సభ్యులు ఉంటే అందరి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఈ రంగం పని చేస్తుందని కొనియాడారు. సహకార రంగంలో నెలకొన్న స్తబ్దతను పోగొట్టేందుకు సహకారభూమి పత్రిక, ఇతర సమాచార మాధ్యమాలు కృషి చేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. సహకార రంగంలో ఉపాధి లభించాలంటే ఆ రంగ పటిష్టతకు కృషి చేయాలని, సహకార రంగం ఆధునికీకరణకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనికి అందరూ కలిసిరావాలని ఆయన కోరారు. సహకార వ్యవస్థ అంటేనే సహకారభూమి పత్రిక గుర్తురావాలని, ఆవిధంగా మీ కృషి కొనసాగాలని మంత్రి కాకాణి ఆకాంక్షించారు. 

కేడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సహకార రంగంలో తమ బ్యాంకు సాధించిన ప్రగతిని వివరించారు. సహకారభూమి పక్ష పత్రికకు తాము అన్నివిధాలా సహకరిస్తామని చెప్పారు. తమ పరిధిలోని సహకార సంఘాలన్నీ ఈ పత్రికకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ సందేశమిస్తూ.. సహకార రంగంలో పత్రిక రావడం మూదావహమని, సీనియర్ జర్నలిస్టులు ఈ పత్రికను తీసుకురావడానికి సంకల్పించినందుకు అభినందించారు‌. సహకార రంగ పటిష్టతకు ఈ పత్రిక దోహదం చేయగలదని ఆకాంక్షించారు. సహకారభూమి వ్యవస్థాపకులు దాసరి కేశవులు మాట్లాడుతూ ఈ పత్రిక లక్ష్యాలను వివరించారు. చరిత్రలో సహకారభూమి ఒక మైలురాయిగా నిలవగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ఆదర్శవంతంగా నడుస్తున్న ఎలకుర్రు కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పత్రికాధిపతి దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి మనవడు కాశీనాథుని నాగేశ్వరరావుని ఘనంగా సన్మానించారు‌.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నాయకుడు పి. జమలయ్య, సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య, సహకారభూమి సంపాదకులు అక్బర్ పాషా, సహకారభూమి సొసైటీ కార్యదర్శి వీరమాచనేని రత్న ప్రసాద్, కోశాధికారి ఏ ఎల్లారావు, వ్యవస్థాపక సంపాదక మండలి సభ్యులు కెవి కృష్ణ, కె ఎస్ జ్యోతిశ్రీ, టీవీ నరసింహారావు, జివి రంగారెడ్డి, శిరందాసు నాగార్జున, డి.స్వాతి, మాధవి, రవీంద్ర రెడ్డి, సీతారామయ్య, వైద్య ప్రముఖులు, ప్రముఖ రచయిత డాక్టర్ జివి పూర్ణచంద్, సీనియర్ జర్నలిస్టులు, సహకార రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...